పితరులు ప్రవక్తలు

56/75

54—సమ్సోను

విస్తరిస్తున్న మతభ్రష్టత మధ్య దేవునికి నమ్మకంగా నిలిచిన విశ్వాసులు ఇశ్రాయేలీయుల విమోచన కోసం దేవునితో విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు. అనుకూల ప్రతిస్పందన ఎక్కడా కనిపించకపోయినా, హింసకుల ప్రాబల్యం ఏఏటికాఏడు పెరుగుతున్నప్పటికీ కృపామయుడైన దేవుడు వారికి సహాయం సంసిద్ధం చేస్తున్నాడు. ఫిలిష్తియుల హింస ప్రారంభ సంవత్సరాల్లోనే శక్తిమంతులైన ఈ శత్రువుల్ని మట్టి కరిపించటానికి దేవుడు ఎంపిక చేసుకొన్న వ్యక్తి జన్మించాడు. PPTel 561.1

ఆ కొండ ప్రదేశపు పొలిమేరలో జొర్వా అనే చిన్న పట్టణం ఉంది. అక్కడ నుంచి ఫిలిప్తీయుల మైదానం చక్కగా కనిపించేది. జొర్యా పట్టణంలో దాను వంశానికి చెందిన మనోమ నివసించేవాడు. ఆ పట్టణం అంతటా వ్యాపించి ఉన్న భ్రష్టత నడుమ యెహోవాకు నమ్మకంగా నివసించే బహుకొద్ది కుటుంబాల్లో మనోహ కుటుంబం ఒకటి. సంతానం లేని మనోహ భార్యకు “యెహోవా దూత” ప్రత్యక్షమై తనకో కుమారుడు కలుగుతాడని అతడి ద్వారా దేవుడు ఇశ్రాయేలీయుల విడుదలను ప్రారంభించనున్నాడని చెప్పాడు. దీని దృష్ట్యా ఆమె అలవాట్లను గురించి, ఆ బిడ్డను చూడాల్సిన రీతిని గురించి దూత ఆమెకీ ఉపదేశం ఇచ్చాడు, “కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి, ద్రాక్షారసమునేగాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము”. బిడ్డ పెంపకం విషయంలో కూడా ఆది నుంచి ఇదే నిషేధాల్ని పాటించాల్సి ఉన్నది. అతడి వెంట్రుకలు కత్తిరించరాదన్నది అదనపు నిషేధం. కారణమేంటంటే తాను పుట్టించిన నాటి నుంచి ఆ బిడ్డ నాజీరుగా దేవునికి అంకితమయ్యాడు. PPTel 561.2

ఆ స్త్రీ తన భర్తను కలసి దూత తనకు అందించిన వర్తమానాన్ని విశదీకరించింది. దేవుడు తమకు నిర్దేశించిన కార్య నిర్వహణలో ఏదైనా పొరపాటు చోటు చేసుకొంటుందేమోనన్న భయంతో మనోహ ఇలా ప్రార్థన చేశాడు, “నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరల మా యొద్దకు వచ్చి, పుట్టబోవు ఆ బిడ్డను మేము ఏమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయుము”. దూత మళ్ళీ దర్శనమిచ్చినప్పుడు అతణ్ని మనోహ ఆతృతగా ఇలా అడిగాడు, “ఆ బిడ్డ ఎట్టి వాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుము”. తాను ముందు ఇచ్చిన ఉపదేశాన్నే దూత మళ్ళీ ఇచ్చాడు - “నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకొనవలెను, ఆమె ద్రాక్షారసమునైనను మద్యమైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైను తినకూడదు, నేను ఆమె కాజ్ఞాపించినందంతయు ఆమె చేయవలెను”. PPTel 561.3

మనోహ వాగ్దత్త కుమారుడు చేయాల్సిన ఒక ప్రత్యే కార్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ కార్యనిర్వహణకు అగత్యమైన అర్హతల్ని అతడికి సమకూర్చటానికే మాతా శిశువలు అలవాట్లను జాగ్రత్తగా నియంత్రించాల్సి ఉంది. “ద్రాక్షారసము నైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనను తినకూడదు. నేను ఆమెకాజ్ఞాపించిన దంతయు ఆమె చేసుకొనవలెను” అన్నది మనోహ భార్యకు దూత ఇచ్చిన ఉపదేశం. తల్లి అలవాట్లు బిడ్డను మంచివాడిగానో చెడ్డవాడిగానో తీర్చిదిద్దుతాయి. తల్లి నియమాలకు కట్టుబడి ఉండాలి. మితానుభావాన్ని ఆత్మోపేక్షను పాటించాలి. బిడ్డ సంక్షేమానికి ఇది అవసరం. బిడ్డ కోరే ప్రతీ కోర్కెను మనోగతాన్ని చెల్లించటం అవసరమని విజ్ఞత లేని సలహాదార్లు ప్రబోధిస్తారు. అది తప్పుడు ప్రబోధం, దురుద్దేశ పూరితం. దేవుడిచ్చిన గంభీర ఆదేశం ప్రకారం సంయమనంతో వ్యవహరించటం తల్లి బాధ్యత. PPTel 562.1

ఈ భాద్యతలో తండ్రులు తల్లులు పాలు పంచుకోవాల్సి ఉన్నారు. తల్లితండ్రి ఇరువురూ తమతమ మానసిక, శారీరక గుణలక్షణాల్ని మన: ప్రవృత్తుల్ని, రుచులు అభిరుచుల్ని తమ బిడ్డలకు అందిస్తారు. తల్లిదండ్రుల మితరహిత జీవిత విధానం వల్ల పిల్లల్లో తరచు శారీరక, మానసిక నైతిక శక్తి కొరవడుంది. సారా తాగేవారు, పొగాకు వాడేవారు తమ తీవ్ర వాంఛను, ఉద్రిక్తతకు గురిఅయిన తమ రక్తాన్ని, ప్రకోపించే తమ నాడీ వ్యవస్థను తమ బిడ్డలకు అందిస్తారు. వ్యభిచారులు తమ తమ పాప కోర్కెల్నీ హేయమైన వ్యాధుల్నీ తమ సంతానానికి వారసత్వంగా సంక్రమింపజేస్తారు. శోధనను ప్రతిఘటించే శక్తి తల్లిదండ్రుల్లో కన్నా పిల్లల్లో తగ్గుతుంది గనుక ప్రతీ తరంలోను అది క్రమక్రమంగా క్షీణిస్తుంది. పిల్లల ఆగ్రహావేశాలకూ, ఆవాంఛనీయ, వక్ర అభిరుచులకూ మాత్రమే గాక వేలాదిమంది పిల్లలు అవిటివాళ్ళు, చెవిటి వాళ్ళు, గుడ్డివాళ్ళు, వ్యాధిగ్రస్తులు మానసిక వికలాంగులుగా పుట్టటానికి అనేక సందర్భాల్లో తల్లిదండ్రులే బాధ్యులు. ప్రతీ తండ్రి ప్రతీ తల్లి పరిగణించాల్సిన అంశం ఇది, “మాకు పుట్టబోయే బిడ్డ విషయంలో PPTel 562.2

మేము చేయాల్సింది ఏమిటి?” బిడ్డల పై తల్లిదండ్రులు చూపే ప్రభావం ప్రాముఖ్యాన్ని గుర్తించని వారు చాలామంది ఉన్నారు. అయితే ఆ హెబ్రీ తల్లిదండ్రులకు దేవుడు ఉపదేశం పంపించి దాన్ని అతి స్పష్టమైన గంభీరమైన రీతిలో పునరుద్ఘాటించటం మనసృష్టికర్త ఈ విషయాన్ని ఎంత ముఖ్యమైందిగా పరిగణిస్తున్నాడో వ్యక్తం చేస్తున్నది. PPTel 562.3

వాగ్దత్త కుమారుడు తల్లిదండ్రుల నుంచి మంచి వారసత్వం అందుకోటం మాత్రమే చాలదు. దీనితో పాటు ఆచితూచి ఇవ్వాల్సిన శిక్షణ, సరైన అలవాట్లు నేర్పటం అవసరం. భవిష్యత్తులో న్యాయాధిపతిగాను, ఇశ్రాయేలీయుల విమోచకుడుగాను సేవ చేయాల్సి ఉన్న వ్యక్తి మితానుభవం పాటించే వ్యక్తిగా చిన్ననాటి నుంచి శిక్షణ పొందాలని దేవుడు సంకల్పించాడు. అతడు పుట్టినప్పటి నుంచి నాజీరుగా ఉండాల్సిన వాడు. ద్రాక్షారసానికి మధ్యానికి అతడు నిత్యం దూరంగా ఉండాల్సి ఉంది. మితానుభవం, ఆత్మ నిరసన, ఆత్మనిగ్రహం - వీటిని పిల్లకి తమ పసితనంనుంచే నేర్పాలి. PPTel 563.1

“అపవిత్రమైన దేనినైనను తినకూడదు” అని దూత చెప్పాడు. ఆహారం విషయంలో పవిత్రం అపవిత్రం అన్న వేర్పాటు కేవలం ఆచారానికో నోటి మాటకో సంబందించిన నిబంధన కాదు. అది పారిశుధ్య సూత్రాలకు సంబంధించి విషయం. యూదు ప్రజలు వేల సంవత్సరాలుగా గొప్ప శక్తి సామర్ధ్యాలకు ప్రసిద్ధి పొందటానికి హేతువు వారు ఈ ఏర్పాటును నిర్దిష్టంగా పాటించటమే. మితానుభవ సూత్రాల్ని సారాకే గాక ఇంకా అనేకమైన వాటికి వర్తింపజేయాల్సిన అవసరముంది. ప్రేరణ నిచ్చే ఆహారం , జీర్ణంకాని ఆహారం ఆరోగ్యానికి హానికరం. అనేక సందర్భాల్లో ఇవి తాగుబోతుతనానికి బీజం వేస్తాయి. వాస్తవమైన మితానుభవం హానికరమైన ప్రతి దాన్ని పూర్తిగా విసర్జించటానికి ఆరోగ్యకరమైన దాన్ని తెలివిగా ఉపయోగించ టానికి నడిపిస్తుంది. తమ ఆహారపు అలవాట్లు తమ ఆరోగ్యాన్ని వర్తనను, లోకంలో తమ ప్రయోజకత్వాన్ని, తమ భవిష్యత్ నిత్య జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో గుర్తించేవారు బహు కొద్దిమంది. ఆహార వాంఛ ఎల్లప్పుడూ నైతిక మానసిక శక్తులకు లోబడి ఉండాలి. శరీరం మనసుకు సేవ చేయాలి గాని మనసు శరీరానికి కాదు. PPTel 563.2

దేవుడు మనోహకు చేసిన వాగ్దానం నిర్దిష్ట కాలంలో కుమారుడి జననంతో నెరవేరింది. అతడికి సమ్సోనుఅనే పేరు పెట్టారు తల్లిదండ్రులు. బాలుడు పెరుగుతున్న కొద్దీ తనకు అసామాన్యమైన శారీరకబలం ఉన్నట్లు వ్యక్తమయ్యింది. సమ్సోనుకీ అతడి తల్లిదండ్రులికీ తెలిసిన విధంగా అది అతడి చక్కటి కండరాల మీద ఆధారపడింది కాదు. కాని అతడి నాజీరు స్థితి మీద ఆధారపడింది. తన నాజీరు స్థితికి మంగలి కత్తి పడని అతడి వెంట్రుకలు చిహ్నం. దేవుడిచ్చిన ఆదేశాన్ని తన తల్లిదండ్రులు ఎంత నమ్మకంగా ఆచరించారో అంత నమ్మకంగా సమ్సోను దేవుని ఆదేశాన్ని పాటించి ఉంటే అతడి భవిష్యత్తు ఉన్నతం గాను, ఆనందమయంగాను ఉండేది. అయితే విగ్రహారాధకులతో స్నేహం అతణ్ని పాడుచేసింది. జార్యా పట్టణం ఫిలిప్తీయుల దేశానికి సమీపంగా ఉండటంతో సమ్సోను ఆ ప్రజలతో స్నేహ బంధాలు పెంచుకొన్నాడు. ఈ రకంగా తన యౌవన దశలో సమ్సోను జీవితంలో అనుబంధాలు ఏర్పడ్డాయి. వాటి ప్రభావ పర్యవసానంగా అతడి భవిష్యత్తు చీకటిమయమయ్యింది. ఫిలిప్తీయుల పట్టణమైన తిమ్నాతులో నివసించే ఓ యువతి సమ్సోను మనస్సు దోచుకొన్నది. ఆమెను పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకొన్నాడు. అతడు తల పెట్టిన ఆ కార్యాన్ని ఆపటానికి దైవ భక్తులైన అతడి తల్లిదండ్రులకు సమ్సోను సమాధానం ఒకటే “ఆమె నా కిష్టమైనది”. చివరికి తల్లిదండ్రులు అతడి కోర్కెను అంగీకరించారు. వివాహం జరిగింది. సమ్సోను కౌమార్యం దాటి యుక్త వయసులో అడుగిడుతున్న తరుణంలో అనగా దేవుడు నియమించిన కర్తవ్యం నిర్వహించాల్సిన తరుణంలో అందరికన్నా మరెక్కువగా తాను దేవునికి నమ్మకంగా నిలవాల్సిన సమయంలో అతడు ఇశ్రాయేలీయుల శత్రువులతో జట్టు కట్టాడు. తాను ఎంచుకొన్న వ్యక్తితో జతపడున్నప్పుడు లేదా తన జీవితం ద్వారా నెరవేర్చాల్సిన దైవోద్దేశాన్ని నెరవేర్చలేని పరిస్థితిలోకి వెళ్తున్నప్పుడు దేవుని మహిమ పర్చుతున్నానా అని తన్నుతాను ప్రశ్నించుకోలేదు. మొట్టమొదటగా తన్ను సన్మానించేవారికి దేవుడు వివేకాన్ని వాగ్దానం చేస్తున్నాడు. కాని స్వీయ సంతుష్టిని అన్వేషించే వారికి ఏ వాగ్దానమూ లేదు. PPTel 563.3

సమ్సోను బాటలోనే పయనిస్తున్న వారు చాలామంది! భర్తను లేదా భార్యను ఎంపిక చేసుకోటంలో యిష్టం ప్రాధాన్యం వహించటం కారణంగా విశ్వాసులకు భక్తిహీనులకు మధ్య వివాహ బాంధవ్యాలు ఏర్పడటం ఎంత తరచుగా జరుగటం లేదు? పెళ్ళి చేసే పక్షాలు దేవుని సంప్రదించరు. ఆయనను మహిమపర్చాలన్న తలంపే వారి కుండదు. వివాహ బాంధవ్యాలపై క్రైస్తవ మతం నియంత్రణ ప్రభావం ప్రసరించాలి. కాగా ఈ బాంధవ్యానికి నడిపించే లక్ష్యాలు అనేక సందర్భాల్లో క్రైస్తవ సూత్రాలకు అనుగుణంగా ఉండేవి కానేకావు. తన ప్రజలతో మైత్రి సంబంధాలు ఏర్పర్చుకోటానికి దైవ ప్రజల్ని ప్రేరేపించటం ద్వారా వారి పై తన పట్టు బిగించటానికి సాతాను ప్రతి నిత్యం కృషి చేస్తున్నాడు. ఈ కార్యసాధనకు హృదయంలో అపవిత్ర ఉద్రేకాల్ని రెచ్చగొడ్తాడు. తన ప్రేమ ఎవరి హృదయాల్లో ఉండదో వారితో తన ప్రజలు జతపడకూడదని తన వాక్యంలో ప్రభువు తేటపరుస్తున్నాడు. “క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబందము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక?” 2 కొరింథీ 6:15, 16. PPTel 564.1

ఇశ్రాయేలీయుల దేవుని ద్వేషించే వారితో సమ్సోనుకు తన వివాహ విందులో సహవాసం ఏర్పడింది. అలాంటి బాంధవ్యాల్లోకి స్వచ్చందంగా ప్రవేశించేవారు తమ సన్నిహితుల అలవాట్లలోను ఆచారోల్లోను కొంత మేరకు పాలు పొందటం తప్పనిసరి అవుతుంది. అలా గడిచే సమయం శుద్ధ దండగ సమయం. అక్కడి తలంపులు మాటలు నియమాలకు నీళ్ళిదలటానికి ఆత్మదుర్గాన్ని బలహీన పర్చటానికి దోహదపడ్డాయి. PPTel 565.1

ఏ భార్యను సంపాదించటానికి సమ్సోను దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో ఆమె ఆ వివాహ విందు పూర్తికాక ముందే తన భర్త పట్ల నమ్మక ద్రోహానికి పాల్పడింది. ఆమె చేసిన మోసానికి ఆగ్రహించి సమ్సోను ఆమెను కొంతకాలం విడిచి పెట్టి జొర్వాలోని తన ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత మనసు మార్చుకొని తన భార్యకోసం తిరిగి వెల్ఫేటప్పటికి ఆమె ఒంకొకడికి భార్య అయినట్లు తెలుసుకొన్నాడు. ఫిలిప్తీయుల పంట పొలాలు ద్రాక్ష తోటలు ధ్వంసం చేయటం ద్వారా సమ్సోను ప్రతీకారం తీర్చుకోటంతో వారు కోపోద్రిక్తులై ఆమెను హత్య చేశారు. వాళ్ళు తనను బెదిరించినందువల్లే ఆమె మోసం చేయటానికి పూనుకొంది. ఆ సమస్య దానితోనే ప్రారంభమయ్యింది. ఒక కొదమ సింహాన్ని చంపటంలోను అష్కెలోనుకు చెందిన ముప్పయిమంది మనుషుల్ని హతమార్చటంలోను సమ్సోను అసాధారణ బలం నిరూపితమయ్యింది. ఇప్పుడు తన భార్యను హత్యచేసినందుకు ఉక్రోషంతో ఫిలిప్తీయుల మీదికి వెళ్ళి వారిని “బహుగా హతము చేసెను”. అనంతరం తన శత్రువుల నుంచి క్షేమంగా ఉండాలనుకొని యూదా గోత్రంలోని “ఏతాము బండ” సందులో నివసించాడు. PPTel 565.2

అతణ్ని పట్టుకోటానికి అతడి వెనుక పెద్ద దండు ఇక్కడకు వచ్చింది. ఆందోళన చెందిన యూదా ప్రజలు అతణ్ని తన శత్రువులికి అప్పగించటానికి ఒప్పందం కుదుర్చుకొన్నారు. దాని ప్రకారం యూదా నుంచి మూడు వందలమంది సమ్సోను వద్దకు వెళ్ళారు. అతడు తన దేశ ప్రజలకు ఎలాటి హానీ చేయడన్న దృఢనమ్మకం వారికి లేకపోతే అలాంటి పరిస్థితుల్లో కూడా అతడి వద్దకు వెళ్ళటానికి వారికి ధైర్యం చాలేది కాదు. వారు తనను కట్టి ఫిలిష్తియులికి అప్ప జెప్పటానికి సమ్సోను అంగీకరించాడు. కాని దానికి ముందు వారు తన పై దాడి చేయమన్న వాగ్దానం వారితో చెయ్యించుకొన్నాడు. ఎందుకంటే వారు తనపై దాడి చేయటం జరిగితే తాను స్వజనుల్ని నాశనం చేయాల్సి వస్తుంది. రెండు కొత్త వాళ్ళతో వారు తనను బంధించనిచ్చాడు. వెల్లివిరుస్తున్న సంతోషానందాల నడుమ వారు అతణ్ని శత్రుశిబిరంలోనికి నడిపించారు. వారి ఉత్సాహ ధ్వనులు కొండల్లో ప్రతిధ్వనిస్తుండగా “యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా”వచ్చాడు. అంతట బలమైన ఆ కొత్త తాళ్ళను నిప్పుతో కాల్చిన జనపనారల్లే దులిపేశాడు. ఆ మీదట తన చేతికందిన మొట్టమొదటి సాధనమైన గాడిద దవడ ఎముకతో ఫిలిప్తీయుల్ని మొత్తాడు. వారు భయంతో పరుగు తీశారు. ఆ దినాన సమ్సోను హతమార్చిన మనుషులు నెయ్యిమంది. సమ్సోను ఉపయోగించిన ఆదవడ ఎముక ఖడ్గం కన్నా, బళ్ళెంకన్నా శక్తిమంతంగా పనిచేసింది. PPTel 565.3

ఆ తరుణంలో ఇశ్రాయేలీయులు సమ్సోనుతో చేతులు కలపటానికి సిద్ధంగా ఉండి అతడి విజయాన్ని ఆసరా చేసుకొని సాగినట్లయితే తమను హింసిస్తున్న ఫిలిప్తీయుల అధికారం నుంచి స్వాతంత్ర్యం సాధించేవారు. వారు నిరుత్సాహం చెందారు. సాహసం చెయ్యలేకపోయారు. అన్యుల్ని తరిమివేయమని దేవుడిచ్చిన ఆదేశాన్ని అమలు పర్చకుండా అశ్రద్ధ చేసి వారి అన్యాచారాల్లో పాల్గొంటూ వారి క్రూర ప్రవర్తనతో సర్దుకుపోతూ, వారి అన్యాయాన్ని పట్టించుకోకుండా పోతూ వారితో మమేకమయ్యారు. తమ హింసకుల అధికారం కిందకు వచ్చినప్పుడు వారు ఎలాంటి ప్రతిఘటనాలేకుండా సిగ్గును అవమానాన్ని భరించారు. దేవునికి విధేయులై ఉన్నట్లయితే వీటిని తప్పించుకొని ఉండేవారు. తమను విమోచించేందుకు దేవుడు ఒక విమోచనకుణ్ని లేపినప్పటికీ వారు తరచు అతణ్ని విడిచి పెట్టి తమ శత్రువులతో చేయి కలిపేవారు. PPTel 566.1

సమ్సోను విజయం అనంతరం ఇశ్రాయేలీయులు అతణ్ని న్యాయాధిపతిగా ఎంపిక చేసుకొన్నారు. అతడు ఇశ్రాయేలీయుల్ని ఇరవై ఏళ్ళు పరిపాలించాడు. అయితే ఒక తప్పటడుగు ఇంకొక దానికి దారితీస్తుంది. ఫిలిప్తీయుల్లో నుంచి భార్యను ఎంపిక చేసుకోవటంలో తన అక్రమ కామకార్యాలకు తన బద్ద విరోధుల మధ్యకు మళ్ళీ వెళ్ళటంలో దేవుని ఆజ్ఞను సమ్సోను అతిక్రమించాడు. ఫిలిప్తీయులకు వెన్నులో చలిపుట్టించిన తన ప్రపంచ బలాన్ని నమ్ముకొని ఒక వేశ్యను కలవటానికి ధైర్యంగా గాజాకు వెళ్ళాడు. ఆ పట్టణంలో అతడి ఉనికిని గుర్తించిన పురజనులు ప్రతీకారానికి తహతహలాడున్నారు. తమ పట్టణాల్లో అత్యంత భద్రత గల పట్టణం గోడల మధ్య తమ శత్రువు ఇప్పుడు బందీగా ఉన్నాడు. తాము వేటాడే ప్రాణి ఇప్పుడే తమ వశంలోనే ఉన్నాడని తమ విజయం పరిపూర్తి కావటానికి తెల్లవారే వరకు వేచి ఉండాలని వారు భావించారు. మధ్యరాత్రిలో సమ్సోను మెళుకువ వచ్చింది. తన నాజీరు వ్రతాన్ని భగ్నం చేశానన్న సంగతి స్ఫురణకు వచ్చినప్పుడు తన మనస్సాక్షి తనను నిందించింది అతడి హృదయం పశ్చాత్తాపంతో నిండింది. అతడు పాపం చేసినప్పటికీ కృపగల దేవుడు అతణ్ని విడచి పెట్టలేదు. తన అపార బలం అతడికి చెర నుంచి విడుదల కలిగించింది. ఆ పట్టణ గుమ్మం వద్దకు వెళ్ళి దాని స్తంభాలు వాటిక్ను అడ్డకర్రలతో సహా ఎత్తుకొని పోయి వాటిని హెబ్రోను మార్గంలో ఉన్న కొండమీద పడేశాడు. PPTel 566.2

చావు తప్పి కన్ను లొట్టపోయినంత పని అయినా అతడి పంథా మారలేదు. ఫిలిప్తీయుల మధ్యకు వెళ్ళటానికి మళ్ళీ సాహసించలేదు. కాని తనను నానాటికీ దిగజార్చుతున్న శరీరానందలకు తెగబడటం మాత్రం మానలేదు. “అతడు శోరేకు లోయలోనున్న... స్త్రీని మోహిం”చాడు. ఆమె పేరు దెలీలా, “నానకారి”. PPTel 567.1

శోరేకు లోయ ద్రాక్షతోటలకు ప్రసిద్ధింగాంచింది. అస్థిరుడైన ఈ నాజీరుకి ఈ ద్రాక్షాతోటు పెద్ద శోధనయ్యా యి. అప్పటికే మద్యానికి అలవాడుపడి తద్వారా దేవునితో తన పవిత్ర బంధంలోని మరో పేటను తెంపుకొన్నడు. ఫిలిప్తీయులు అతడి కదలికల్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్నారు. అతడు ఏర్పర్చుకొన్న ఈ కొత్త సంబంధాన్ని ఆసరా చేసుకొని దెలీలా సాయంతో అతణ్ని నాశనం చెయ్యాలనుకొన్నారు. ఫిలిప్తీయుల సంస్థానాల్లో ఒక్కొక్క దాని నుంచి ఒక నాయకుణ్ని ఎంపిక చేసి ఒక ప్రతినిధి బృందాన్ని శోరేకు లోయకు పంపారు. తన పూర్తి బలంతో ఉన్న ప్పుడు సమ్సోనును బంధించటానికి వారికి ధైర్యం చాలలేదు. కాని సాధ్యమైతే అతడి బలం రహస్యం ఏంటో తెలుసుకోటానికి పూనిక వహించారు. దాన్ని తెలుసుకొని తమకు దాన్ని బయలుపర్చటానికి వారు దెలీలాను పెద్ద లంచంతో ప్రలోభ పెట్టారు. PPTel 567.2

ఆ నమ్మక ద్రోహి సమ్సోనుకు ఎన్నో ప్రశ్నలు వేయగా ఫలానా పనిచేస్తే ఇతర పురుషులబలహీనత తనకూ కలుగుతుందని చెప్పి ఆమెను వంచించాడు. ఆమె ఆ ప్రక్రియను పరీక్షించినప్పుడు మోసం బయలుపడింది. తన పట్ల అతడు కపటంగా వ్యవహరిస్తున్నాడంటూ ఇలా నిందించటం మొదలు పెట్టింది, “నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో నున్నదో నాకు తెలుపకపోతివి”. తనను నాశనం చేసేందుకు ఫిలిప్తీయులు తన కపట ప్రియురాలుతో కుమ్మ క్కయ్యారనటానికి అతడికి మూడుసార్లు నిదర్శనం లభించింది. తాననుకొన్నది జరగనప్పుడు అది తమాషాకు చేసిన పని అని ఆమె చెష్టం అతడు దాన్ని గుడ్డిగా నమ్మి నిర్భయంగా ఉండటం జరిగింది. PPTel 567.3

రోజూ దెలీలా వేధించటంతో అతడు “ప్రాణము విసిగి చావగోరెను”. అయినా ఏదో ఓ అవ్యక్తమైన శక్తి అతణ్ని ఆమె పక్కనే ఉంచింది. చివరికి సమ్సోను చేతులెత్తేసి తన రహస్యాన్ని ఆమెకు చెప్పేశాడు. “నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడనైయున్నాను. నా తల మీదికి మంగలి కత్తి రాలేదు. నాకు ఛైరము చేసిన యెడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యులవలె అవుదును”. జాప్యం లేకుండా వెంటనే రావలసిందిగా ఫిలిప్తీయులు అధిపతులకు ఆమె వర్తమానం పంపించింది. ఆ వీరుడు నిద్రలో మునిగి ఉండగా అతడ తల వెంట్రుకల్ని గొరిగివేసింది. ఆ మీదట, ముందు మూడు పర్యాయాలు అన్నట్లు “సమ్సోనూ, ఫిలిప్తీయులు నీ మీద పడుచున్నారు” అన్నది. సంసోను మేల్కొని మునుపటిలాగే తన బలాన్ని ఉపయోగించి వారిని హత మార్చాలనుకొన్నాడు. శక్తి కోల్పోయిన అతడి హస్తాలు అతడి ఆదేశాన్ని నెరవేర్చటానికి నిరాకరించాయి.“యెహోవా తనను ఎడబా సెనని” అతడు గ్రహించాడు. అతడికి ఛైరం చేసిన తర్వాత దెలీలా అతణ్ని ఇబ్బంది పెట్టటం ప్రారంభించింది. ఇలా అతడి బలానిన పరీక్షించింది. ఎందుచేతనంటే అతడిబలం పోయిందన్న నమ్మకం కలిగేంతవరకూ ఫిలిప్తీయులు అతడి దగ్గరకు రావటానికి భయపడ్డారు. అప్పుడు వారు సమ్సోన్ని బంధించి రెండు కళ్ళూ పొడిచేసి గాజాకు తీసుకు వెళ్ళారు. ఇక్కడ అతణ్ని సంకెళ్ళతో బంధించి, చెరసాలలో వేసి అతడితో కఠినమైన పని చేయించారు. PPTel 568.1

ఇశ్రాయేలీయుల న్యాయాధిపతీ వీరుడూ అయిన సమ్సోను జీవితంలో ఎంత గొప్ప మార్పు చోటుచేసుకొంది! అతడు ఇప్పుడు బలహీనుడు, ఆంధుడు, బందీ అతినికృష్ణ సేవ చేసే బానిస! పవిత్రమైన తన పిలుపుకు సంబంధించిన షరతుల్ని కొంచెం కొంచెంగా ఉల్లంఘించాడు. దేవుడు అతడి పట్ల చాలాకాలం సహనం కనపర్చాడు. కాని పాపం ప్రాబల్యానికి అంతగా లొంగి తన రహస్యాన్ని చెప్పేంత వరకు రావటంతో అతణ్ని దేవుడు విడిచి పెట్టాడు. అతడి పొడవాటి తల వెంట్రుకల్లో మహాత్మ్యం ఏమీ లేదు. అది అతడు దేవునికి విశ్వాసంగా ఉండటానికి గుర్తు. కాగా కామోద్రేకంలో అతడు ఆ చిహ్నానేన కాదన్నప్పుడు ఏ దీవెనలకు అది గుర్తుగా ఉన్నదో వాటిని పోగొట్టుకొన్నాడు. PPTel 568.2

బాధను అవమానాన్ని అనుభవిస్తూ ఫిలిప్తీయులకు వినోదం సమకూర్చుతున్న తరుణంలో తన బలహీనతను గురించి క్రితంలో కన్నా ఎంతో ఎక్కువగా సమ్సోను నేర్చుకొన్నాడు. తనకు కలిగిన శ్రమలు అతణ్ని పశ్చాత్తాపానికి నడపించాయి. ఇక అతడి శత్రువుల మాటకొస్తే వారు అతణ్ని సంకెళ్ళతో నిస్సహాయ స్థితిలో ఉన్నవాడిగా పరిగణించి నిర్భయంగా ఉన్నారు. PPTel 568.3

తమ దేవతలే తమకు విజయం చేకూర్చారని ఫిలిప్తీయులు చెప్పుకొన్నారు. ఉత్సాహంతో ఉప్పొంగుతూ వారు ఇశ్రాయేలీయుల దేవుణ్ని హేళన చేస్తూ ధిక్కరించారు. సముద్రాన్ని పరిరక్షించే” మత్స్యదేవత దాగోను గౌరవార్థం పండుగ ఏర్పాటు చేశారు. పట్టణాల నుంచి పల్లె ప్రాంతాల నుంచి ఫిలిప్రియ ప్రజలు సర్దారులు అందరూ సమావేశమయ్యారు. దేవాలయం దాని పై భాగాన ఉన్న స్థలం భక్తజన సమూహాలతో క్రిక్కిరిసిపోయింది. అది కనులకు విందుగొలిపే ఉత్సవ దృశ్యం. బలి అర్పణ బహు ఆడంబరంగా జరిగింది. దాని వెనుక సంగీతం ఆ తర్వాత విందు భోజనం. ఆ తర్వాత దాగోను శక్తికి ఉత్కృష్ఠ చిహ్నంగా సమ్సోనుని తీసుకొని వచ్చారు. అతడు కనిపించిన వెంటనే ప్రజలు ఉత్సాహంంతో కేకలు వేశారు. ప్రజలు అధికారులు సమ్సోను దుర్గతిని గూర్చి ఎగతాళి చేస్తూ తమ “దేశమును పాడుచేసిన వానిని పడదోసిన తమ దేవతను పూజించారు. కొంత సేపు అయ్యాక అలసి పోయినట్లుగా నటించి దేవాలయం రెండు స్తంభాలకు జేరబడ నిమ్మని సమ్సోను విజ్ఞప్తి చేశాడు. అనంతరం నిశ్శబ్దంగా ఇలా ప్రార్థన చేశాడు, “యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసికొనుము. దేవా దయచేసి యీసారి మాత్రమే నన్ను బలపర్చుము.. ఫిలీప్రియులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్ము”. ఈ మాటలతో ఆ స్థంబాన్ని కౌగిలించుకొని “నేనును ఫిలీప్రియులను చనిపోదుము”. అని అరుస్తూ కిందకు వంగాడు. అప్పుడు ఆలయం కుప్పకూలి ఆ జనులందరిని ఒక్కసారిగా నాశనం చేసింది. “మరణకాలము అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపినవారి కంటే ఎక్కువాయెను”. PPTel 569.1

విగ్రహం దాన్ని పూజించేవారు, యాజకుడు, శ్రామికుడు, వీరుడు అధిపతి అందరూ దాగోను ఆలయ శిధిలాల కింద సమాధి అయ్యారు. తన ప్రజల్ని విమోచించేందుకు దేవుడు ఎన్నుకున్న వ్యక్తి బ్రహ్మాండమైన శవం కూడా వారి మధ్య ఉన్నది. ఆ భయాంకర నాశనాన్ని గూర్చిన వార్త ఇశ్రాయేలీయులికి అందింది. సమ్సోను బంధువులు తమ పర్వత ప్రాంతాల నుండి వచ్చి అతడి దేహాన్ని తీసుకుపోయారు. వారిని అడ్డుకొన్నవారెవరూ లేరు వారు అతణ్ణి “జొర్యాకును ఎప్లొయోలుకును మధ్యనున్న అతని తండ్రియైన మనోహ సమాధిలో అతని పాతి పెట్టిరి. PPTel 569.2

“సమ్సోను ద్వారా షిలీప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపమొదలు “పెడ్తానని దేవుడు చేసిన వాగ్దానం నెరవేరింది. దేవునికి గర్వకారణంగాను దేశానికి మహిమకరంగాను ఉండాల్సిన అతడి జీవిత చరిత్ర ఎంత నిరాశాజనకంగా ఎంత భీబత్సంగా ముగిసింది! సమ్సోను దేవుని పిలుపు మేరకు నమ్మకంగా నివసించినట్లయితే దేవుడు ఉద్దేశించిన కార్యం సిద్ధించేది. అతడికి ప్రతిష్ఠ ఔన్నత్యం లభించేవి. అయితే సమ్సోను శోధనకు లొంగి దేవునికి నమ్మకద్రోహం చేసాడు. పరాజయం, దాస్యం మరణంలోనే అతడి కర్తవ్యం సిద్దించింది. PPTel 570.1

శారీరకంగా సమ్సోను లోకంలో మిక్కిలి బలాఢ్యుడు. కాని ఆత్మ విగ్రహం, విశ్వసనీయత, నిశ్చయత విషయాల్లో మిక్కిలి బలహీనుల్లో ఒకడు తీవ్రమైన ఆవేశాల్ని బలమైన ప్రవర్తన అని చాలమంది తప్పుగా భావిస్తారు. నిజానికి అవేశాలకు బానిస అయిన వ్యక్తి బలహీనుడు. ఒక వ్యక్తి గొప్పతననానికి కొలమానం అతడు ఏ మేరకు తన భావోద్వేగాల్ని అదుపు చేయగలడన్నదేగాని అవి ఏ మేరకు అతణ్ణి అదుపు చేయగలనన్నది కాదు. ఏ కార్యసాధన నిమిత్తం సమ్సోనును దేవుడు పిలిచాడో దాన్ని పూర్తి చేయటానికి అతడు సిద్ధపడేందుకు గాను ఆయన అతణ్ణి సంరక్షించాడు. శారారీక మానసిక బలాన్ని, నైతిక పవిత్రతత ప్రోది చేసేందుకు అనువైన పరిస్థితులు జీవత అరంభములోన సమ్సోను చుట్టు ఉన్నాయి. దుష్ట స్నేహతుల ప్రాబల్యం వల్ల దేవుని పట్ల ప్రేమ సన్నగిల్లింది. దుర్మార్గత ఉప్పెనవలె వచ్చి అతణ్ణి ముంచింది. దైవ కార్యం నిర్వర్తిస్తున్న తరుణంలో పరీక్షల్ని ఎదుర్కొనేవారిని దేవుడు నిశ్చయంగా కాపాడారు. కాకపోతే మనుషులు కావాలని శోధనలోకి నడిచి వెళ్లే వారు పడిపోవటం ఖాయం. ఒక ప్రత్యేక కార్యంలో తన సాధానాలుగా దేవుడు ఎవర్నయితే ఉపయో గించుకోవాలని చూస్తాడో వారిని తప్పుదోవ పట్టించటానికి సాతాను తన సర్వశక్తుల్ని ఒడ్డుపడతాడు. మన బలహీనతల్ని సొమ్ము చేసుకొని మన పై దాడి చేస్తాడు. మన ప్రవర్తనలోని లొసుగుల్ని చేసుకొని మనల్ని సంపూర్తిగా అదుపు చేస్తాడు. ఈ లోపాన్ని మనం ప్రేమించినంత కాలం అతడు మనపై విజయం సాధిస్తూనే ఉంటాడు. అలాగని ఎవరు ఓడిపోవాల్సిన అవసరం లేదు. తన సొంత బలహీనప ప్రయత్నాలతోనే దుష్టశక్తి ఎదుర్కొనేందుకు మానవుణ్ణి దేవుడు విడిచి పెట్టడు. సహాయం అర్ధించే ప్రతీవారికి సహాయం అందుబాటులో ఉంటుంది. అది లభిస్తుంది కూడా. దర్శనంలో యాకోబు చూసిన నిచ్చెన పై నిత్యం ఎక్కుతూ దిగుతూ ఉండే దూతలు పరలోకానికి ఎక్కడానికి ఆకాంక్షించేవారికి ఎక్కేందుకు చేయూతనిస్తారు. PPTel 570.2