పితరులు ప్రవక్తలు

7/75

5—పరీక్షించబడ్డ కయీను, హేబెలు

ప్రవర్తన విషయంలో ఆదాము కుమారులు కయీను హేబెలుల మధ్య ఎంతో వ్యత్యాసముంది. హేబెలు దైవ భక్తిపరుడు. పడిపోయిన మానవాళితో దేవుడు న్యాయంగా, దయగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించి రక్షణ నిరీక్షణను కృతజ్ఞతతో అంగీకరించాడు. కయీను తిరుగుబాటు భావాలతో నిండి ఉన్నాడు. ఆదాము చేసిన పాపం గురించి భూమిని మానవ సంతతిని శపించినందుకు దేవుని పై సణుగుతూ తిరుగుబాటు స్వభావంతో ఉన్నాడు. సాతాను పంథానే తాను అనుసరిస్తూ స్వీయ ఔన్నత్యాన్ని ఆశిస్తూ దేవుని న్యాయశీలతను అధికారాన్ని ప్రశ్నించాడు. PPTel 59.1

దేవుని మాట విని దాని ప్రకారం నడుచుకుంటారో లేదో ఆదాముకు మల్లే ఈ అన్నదమ్ములు కూడా పరీక్షించబడ్డారు. మానవుడి రక్షణకు ఏర్పాటైన మార్గాన్ని గూర్చి వారికి తెలుసు. దేవుడు స్థాపించిన బల్యర్పణ వ్యవస్థను గూర్చిన అవగాహన వారికున్నది. బలులు ఛాయరూపకంగా సూచించే రక్షకుని మీద ఈ అర్పణల ద్వారా తాము విశ్వాసాన్ని చూపించాలని, క్షమాపణకు తాము ఆయన పై పూర్తిగా ఆధారపడి ఉన్నామని, ఆ విధంగా తమ రక్షణకు దేవుని ప్రణాళికకు అనుగుణంగా ఉండటం ద్వారా తాము దేవుని చిత్తానికి విధేయంగా నివశిస్తున్నామని వారికి తెలుసు. రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలుగదు. తమ మందలో తొలిచూలు పుట్టినవాటిని బలి అర్పించటం ద్వారా వారొత్త ప్రాయశ్చిత్తంగా క్రీస్తు రక్తాన్ని విశ్వసిస్తున్నట్లు వారు చూపించాల్సి ఉన్నారు. ఇదిగాక పంటలో ప్రథమ ఫలాన్ని వారు ప్రభువుకి కృతజ్ఞతార్పణగా అర్పించాల్సి ఉన్నారు. PPTel 59.2

ఈ సోదరులిద్దరూ తమ తమ బలిపీఠాలు నిర్మించుకున్నారు. ఇద్దరూ తమ తమ అర్పణలు తెచ్చారు. ప్రభువు ఆదేశానుసారం హేబెలు తన మందలోనుంచి అర్పణను తెచ్చి అర్పించాడు. “యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్య పెట్టెను”. పరలోకంనుంచి అగ్ని వచ్చి ఆ బలిని దహించివేసింది. అయితే కయీను ప్రభువు ప్రత్యక్షంగాను స్పష్టంగాను ఇచ్చిన ఆజ్ఞను లెక్కచేయకుండా పండ్లు మాత్రమే తెచ్చి అర్పించాడు. దాన్ని అంగీకరించినట్లు పరలోకం నుంచి సూచనేమీ రాలేదు. దేవుడు ఆదేశించిన రీతిగా అర్పించమని హేబెలు అన్నను బతిమాలాడు. కయీను తన సొంత చిత్తాన్ని అనుసరించటానికే నిశ్చయించుకొన్నాడు. ఇంటిలో పెద్దవాడిగా తనకు సలహా అక్కరలేదని భావించాడు. హేబెలు సలహాను తోసిపుచ్చాడు. వాగ్దత్త బలిదానం గురించీ, PPTel 59.3

బలి అర్పణల ఆవశ్యకతను గురించీ సణుగుతూ, అవిశ్వాసం నిండిన హృదయంతో కయీను దేవుని సన్నిధికి వచ్చాడు. అతడి అర్పణ పాపపశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. దేవుడు నిర్దేశించిన ప్రణాళికను తు.చ. తప్పకుండా ఆచరించటం PPTel 60.1

వాగ్ధత్త రక్షకుడి ప్రాయశ్చిత్తం ద్వారా తన రక్షణ సాధ్యమవుతుందని నమ్మటం బలహీనతను అంగీకరించటమేనని నేడు అనేకులకు మల్లే కయీను భావించాడు. స్వీయ శక్తిమీదనే ఆధారపడ్డాడు. సొంత యోగ్యతలతోనే దేవుని వద్దకు రావటానికి నిర్ధారించుకొన్నాడు. గొర్రెపిల్లను తెచ్చి తన అర్పణతో దాని రక్తాన్ని కలిపే బదులు తన సొంత కృషి ఫలితంగా తాను సంపాదించిన ఫలాన్ని దైవ సన్నిధికి తేవాలని భావించాడు. దేవునికి ఉపకారం చేయటానికన్నట్లు, దానికి ఆయన సహృదయతను ఆశిస్తున్నట్లు అతడు తన అర్పణను దేవునికి సమర్పించాడు. బలిపీఠం కట్టటంలో అర్పణ తేవటంలో కయీను దేవుని మాట విన్నాడు. కాని అతడి విధేయత పూర్ణ విధేయత కాదు, పాక్షికమైనది. ముఖ్యభాగం రక్షకుడవసరమన్న గుర్తింపు. దాన్ని విడిచి పెట్టాడు. PPTel 60.2

జననం ఉపదేశం విషయాల్లో ఈ అన్నదమ్ములిద్దరిలో తేడా పాడాల్లేవు. ఇద్దరూ పాపులే. దేవుని పట్ల భయభక్తులు చూపాలని ఆయన ధర్మశాసనాల్ని గైకొనాలని ఇద్దరూ గుర్తించారు. కొంతమేరకు వారిద్దరి మతం ఒకేలాగ పైకి కనిపించింది. ఆ మీదట వీరిద్దరి మధ్య ఎంతో భేదం ఉన్నది. PPTel 60.3

“విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను” హెబ్రీ 11:4. హేబెలు రక్షణకు సంబంధించిన సూత్రాల్ని అవగాహన చేసుకొన్నాడు. తాను పాపినని తనకూ దేవునికీ మధ్య పాపం దాని పర్యవసానంగా వచ్చిన మరణం అడ్డుగోడగా నిలిచి దేవునితో తన సంబంధ బాంధవ్యాలకు అంతరాయం కలిగిస్తున్నాయని హేబెలు గుర్తించాడు. శుద్ధి పొందిన జీవితానికి చిహ్నమైన బలిని అర్పించి తాను అతిక్రమించిన దర్మశాస్త్ర విధుల్ని నెరవేర్చుతున్నట్లు ప్రదర్శించుకున్నాడు. ఆ బలి రక్తం చిందటం ద్వారా భవిష్యత్తులో కల్వరి సిలువలో క్రీస్తు చిందించాల్సి ఉన్న రక్తానికి ఎదురు చూస్తున్నట్లు, అప్పుడు ఆయన చేయాల్సి ఉన్న ప్రాయశ్చిత్తాన్ని విశ్వసించటం ద్వారా తాను నీతిమంతుడన్న తీర్పు పొందుతానన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. అతని అర్పణను దేవుడు అంగీకరించాడు. PPTel 60.4

ఈ సత్యాన్ని తెలుసుకొని అంగీకరించటానికి హేబెలుకున్న తరుణాలే కయీనుకీ ఉన్నాయి. అతడు ఒక నియంత హుకుములకు గురి అయిన బాధితుడు కాదు. ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకణ్ణి దేవుడు అంగీకరించటానికి ఒకణ్ణి నిరాకరించటానికి ముందే ఏర్పాటు కాలేదు. దేవుని విశ్వసించటానికి ఆయనకు విధేయుడై నివసించటానికి హేబెలు ఎంపిక చేసుకోగా కయీను ఆయన్ను శంకించటానికి ఆయన పై తిరుగుబాటు చేయటానికి ఎంపిక చేసుకొన్నాడు. చిక్కంతా ఇక్కడే ఉన్నది. PPTel 60.5

క్రీస్తు వచ్చేవరకు లోకంలో నివసించే రెండు తరగతుల ప్రజల్ని కయీను హేబెలులు సూచిస్తున్నారు. పాపానికి ప్రాయశ్చిత్తంగా ఏర్పాటైన బలిదానాన్ని ఒక తరగతి ప్రజలు అంగీకరిస్తే ఇంకో తరగతి ప్రజలు తమ స్వనీతి మీద ఆధారపడి ఉంటారు. వారి అర్పణ క్రీస్తు మధ్యవర్తిత్వం లేని అర్పణ. అందుచేత అది మానవుడికి దైవ సమ్మతిని అనుగ్రహాన్ని చేకూర్చలేదు. క్రీస్తు నీతిని బట్టి మాత్రమే మన అతిక్రమాలకు క్షమాపణ లభించగలదు. తమ పాపక్షమాపణకు క్రీస్తు రక్తం అవసరాన్ని గుర్తించనివాళ్లు, తమ స్వనీతిని బట్టి దేవుని అనుగ్రహాన్ని పొందగలమని భావించేవాల్లు కయీను చేసిన పొరపాటునే చేస్తున్నారు. పాపశుద్ధి కావించే రక్తాన్ని అంగీకరించకపోతే వారు శిక్షా విధికి లోనవుతారు. పాప బంధాల నుంచి వారిని విడిపించే మార్గం వేరొకటిలేదు. PPTel 61.1

కయీను మాదిరిని అనుసరించే తరగతి ప్రజలే ప్రపంచంలో ఎక్కువమంది ఉన్నారు. ఎందుకంటే మనుషుడు తన మంచి పనులను బట్టి రక్షణ పొందుతాడన్న ఈ సూత్రమే ప్రతీ తప్పుడు మతానికి పునాది. మానవజాతి తన్ను తాను సంస్కరించుకొని, మెరుగుపర్చుకొని, ఉజ్జీవంతో నింపుకోగలదు. దానికి అవసరమయ్యింది రక్షణ కాదు గాని అభివృద్ది అని కొందరు భావిస్తున్నారు. రక్తం చిందించని అర్పణ ద్వారా దేవుని ప్రసన్నతను పొందజూచిన కయీనుకు మల్లే వీరు కూడా వ్యక్తిగత పాపప్రాయశ్చిత్తం పొందకుండా మానవుల్ని దేవుని ప్రమాణానికి హెచ్చించటానికి చూస్తారు. దాని ఫలితమేంటో కయీను చరిత్ర’ స్పష్టం చేస్తూనే ఉన్నది. క్రీస్తును మినహాయించినప్పుడు మానవుడేమౌతాడో అది చెబుతున్నది. తమ్ము తాను పునరుజ్జీవింపజేసుకొనే శక్తి మానవులకు లేదు. PPTel 61.2

మానవులు దైవత్వ సాధన దిశగా పెరగరు. దుష్టత్వం దిశగా అదోగతికి దిగజారారు. క్రీస్తే మన నిరీక్షణ, మన ఆశాజ్యో తి. “మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను”. “ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము” అ.కా.4:12. PPTel 61.3

పూర్తిగా క్రీస్తుమీద ఆనుకొనే నిజమైన విశ్వాసం దేవుని ధర్మవిధులన్నిటినీ ఆచరించటంలో ప్రదర్శితమౌతుంది. ఆదామునాటి నుంచి నేటివరకూ సాగుతున్న మహాసంఘర్షణ దేవుని ధర్మశాస్త్రం గురించే. దేవుని ఆజ్ఞల్లో కొన్నింటిని నిరాకరిస్తున్నప్పటికీ ఆయన ప్రేమకు హక్కుదారులమని చెప్పుకొనేవారు అన్ని యుగాల్లోనూ ఉన్నారు. “క్రియల మూలముగా.... విశ్వాసము పరిపూర్ణ” మౌతుందని క్రియలు లేకపోతే విశ్వాసం “మృతమైనదగును” అని లేఖనాలు చెబుతున్నాయి. యాకోబు 2:22, 17. ఆయనను విశ్వసిస్తున్నానని చెప్పుకొంటూ “ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు. వానిలో సత్యములేదు” 1 యోహాను 2:4. PPTel 61.4

తన అర్పణను దేవుడు అంగీకరించనందుకు కయీను దేవుని మీద హేబెలు మీద కోపంతో ఉన్నాడు. తాను నిర్దేశించిన అర్పణకు మారుగా మానవుడి అర్పణను దేవుడు అంగీకరించనందున ఆయన పైన, తనతో ఏకం కాకుండా దేవుని మాట వినటానికి ఎంపిక చేసుకొన్నందున తన తమ్ముడి పైన కయీను కోపంతో ఉన్నాడు. PPTel 62.1

తన ఆజ్ఞను శిరసావహించకపోయినప్పటికీ దేవుడు కయీనుని విడిచి పెట్టెయ్యలేదు. అతడితో మాట్లాడటానికి ఆయన తన్ను తాను తగ్గించుకొన్నాడు. “నీకు కోపమేల ముఖము చిన్నబుచ్చకొని యున్నావేమి?” అన్నాడు. “నీవు సత్రియ చేసిన యెడల తలనెత్తికొనవా? సత్కియ చేయని యెడల వాకిట పాపము పొంచియుండును” తీర్మానం చేసుకోవాల్సింది తానేనని వాగ్ధత్త రక్షకుని నీతిని నమ్మిదేవుని ఆజ్ఞల్ని గైకొన్నట్లయితే ఆయన ప్రేమను పొందవచ్చునని కాని, తన అవిశ్వాస, అవిధేయ ధోరణినే కొనసాగిస్తే అతడి కోపానికి హేతువే లేదని, తాను అతణ్ణి విసర్జిస్తానని దేవుడు దూతద్వారా అతణ్ణి హెచ్చరించాడు. PPTel 62.2

అయినా తన పాపాన్ని ఒప్పుకొనే బదులు దేవుడు అన్యాయస్థుడని నిందిస్తూ హేబెలును ద్వేషిస్తూ ఉన్నాడు. కోపంతో తమ్ముడి వద్దకు వెళ్లి దేవుడు తమతో వ్యవహరిస్తున్న తీరును గురించి అతణ్ణి వాగ్వివాదంలోకి దింపటానికి ప్రయత్నించాడు. కాగా దేవుని న్యాయశీలతను దయాళుత్వాన్ని హేబెలు వినయంగా, నిర్భయంగా సమర్థించాడు. తన తప్పేంటో కయీనుకి తెలిపి పొరపాటు తనలోనే ఉందని తనను ఒప్పించటానికి ప్రయత్నించాడు. తమ తల్లిదండ్రులు పాపం చేసిన వెంటనే వారిని చంపకుండా దేవుడు వారిని బతకనిచ్చాడని, దేవుడు తమను ప్రేమిస్తున్నాడని అందుకే తమ పాపం తాలూకు శిక్షను బరించటానికి నిరపరాధి, పరిశుద్ధుడు అయిన తన కుమారుణ్ణి అనుగ్రహించాడని చెప్పి అతణ్ణి బతిమాలాడు. ఈ మాటలు కయీను కోపాగ్నిపై ఆజ్యం పోసినట్లయ్యాయి. హేబెలు చెప్పేది న్యాయమని అతడి అంతరాత్మ చెబుతున్నది. తాను చెప్పితే వినేవాడు ఇప్పుడు తనకు హితవు చెప్పుతున్నందుకు, తనతో విభేదిస్తూ తన తిరుగుబాటుకు మద్దతు పలకనందుకు ఉగ్రుడయ్యాడు. ఆ ఉద్రేకంలో కయీను తన తమ్ముణ్ణి చంపాడు. PPTel 62.3

కయీను తన తమ్ముణ్ణి ద్వేషించి చంపటం అతడు ఏదో తప్పుచేసినందుకు కాదు, “తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై యుండెను గనుక” 1 యోహాను 3:12. అలాగే యుగాల పొడవునా దుర్మార్గులు తమకన్నా మంచివార్ని ద్వేషిస్తూ వస్తున్నారు. హేబెలు జీవించిన విధేయమైన విశ్వాస సహితమైన జీవితం కయీనికి నిత్యమూ మందలింపుగా పరిణమించింది. “దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియులుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు”. యోహాను 3:20. దేవునికి నమ్మకంగా నివసించేవారి ప్రవర్తనల నుంచి ప్రకాశించే వెలుగు ఎంత కాంతివంతంగా ఉంటే దుర్మార్గుల క్రియలు అంత స్పష్టంగా కనిపిస్తాయి గనుక దుష్టులు మంచివార్ని నాశనం చెయ్యటానికి అంతపట్టుదలగా కృషిచేస్తారు. PPTel 63.1

సర్పానికి స్త్రీ సంతానానికి, సాతానుకి అతడి అనుచరులకు, క్రీస్తుకి ఆయన అనుచరులకు మధ్య ప్రబలుతుందని దేవుడు చెప్పిన వైరానికి హేబెలు హత్య ప్రప్రదమ సాదృశ్యం. మానవుడి పాపం వల్ల మానవ జాతి పై సాతానుకి అదుపు లభించింది. అయితే సాతాను అదుపును తొలగించుకోటానికి వారికి క్రీస్తు శక్తినిస్తాడు. దేవుని గొర్రెపిల్ల మీద విశ్వాసం ద్వారా ఎప్పుడైతే ఒక ఆత్మ పాపాన్ని విడిచి పెడుందో అప్పడు సాతాను కోపం రగుల్కంటుంది. PPTel 63.2

మానవుడు దైవ ధర్మశాస్త్రాన్ని గైకోటం అసాధ్యం అన్న సాతాను వాదన తప్పుడు వాదనని హేబెలు పరిశుద్ధ జీవితం చాటిచెప్పింది. సాతాను ప్రేరణ వల్ల హేబెలును అదుపులో ఉంచలేనని కయీను గుర్తించినప్పుడు కోపోద్రిక్తుడై అతణ్ని వధించాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నీతి జీవితం జీవించేవారు ఎప్పుడైతే కనిపిస్తారో అప్పుడు వారికి వ్యతిరేకంగా ఇదే స్వభావం ప్రదర్శితమౌతుంది. క్రీస్తు అనుచరులకు ఉరికంబాలు, సజీవ దహన కాండలు యుగాల పొడుగునా ఏర్పాటు చేసింది ఈ దుష్ట స్వభావమే. ఈ క్రూర దుష్కృత్యాల వెనుక సాతాను అతడి అనుచర్లూ ఉన్నారు. కారణం క్రీస్తు అనుచరులను వారు నియంత్రించలేకపోటమే. అతడిది ఓడిపోయిన ప్రత్యర్థి ఆగ్రహం. క్రీస్తు నిమిత్తం మరణించిన ప్రతీ హతసాక్షి విజయుడే. ప్రవక్త ఇలా అంటున్నాడు, “వారు గొట్టెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని (సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘటసర్పము) జయించియున్నారు. గాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించినవారు కారు” ప్రకటన 12:11, 19. PPTel 63.3

హంతకుడైన కయీను తన నేరానికి జవాబుదారి కావలసి వచ్చింది. “యెహోవా - నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీనునడుగగా అతడు - నేనెరుగను నా తమ్మునికి నేను కావలివాడునా అనెను”. దేవుని నిత్యసముఖాన్ని, ఆయన ఔన్నత్యాన్ని ఆయన సర్వజ్ఞతను గూర్చిన స్పృహను కోల్పోయేటంతగా కయీను పాపంలో కూరుకుపోయాడు. అందుచేత తన తప్పును కప్పిపుచ్చుకోటానికి అబద్ధమాడటానికి పూనుకొన్నాడు. ప్రభువు కయీనుతో మళ్లీ ఇలా అన్నాడు, “నీవు చేసిన పని యేమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలోనుండి నాకు మొర పెట్టుచున్నది” తన పాపాన్ని ఒప్పుకోటానికి కయీనుకి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. దాన్ని గురించి ఆలోచించటానికి అతనికి సమయముంది. తాను చేసిన అపరాధమేంటో దాన్ని కప్పిపుచ్చటానికి తాను చేసిందేంటో అతనికి బాగా తెలుసు. అయినా అతడింకా తిరుగుబాటు స్వభావంతోనే ఉన్నాడు. కనుక అతడికి తీర్పు వెంటనే వచ్చింది. బతిమాలుతూ, హితం చెప్పుతూ వచ్చి ఆ స్వరమే ఈ భయంకర తీర్పు ప్రకటించింది. “నీ తమ్ముని రక్తమును నీ చేతిలోనుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన యీ నేల మీద ఉండకుండ నీవు శపించబడినవాడవు. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇకమీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువు”. PPTel 64.1

తాను చేసిన నేరాన్ని బట్టి కయీను మరణానికి అర్హుడైనప్పటికీ కృపామయుడైన సృష్టికర్త అతడి ప్రాణం కాపాడి పశ్చాత్తాపపడేందుకు అతడికి అవకాశం ఇచ్చాడు. అయితే తన హృదయం కఠినపర్చుకోటానికి, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రోత్సహించటానికి, మార్పులేని పాపాత్ముల వంశానికి శిరస్సుగా ఉండటానికి మాత్రమే కయీను నివసించాడు. సాతాను నాయకత్వం కింద భ్రష్టుడైన ఈ ఒక్కడూ ఇతరుల పాలిట శోధకుడయ్యాడు. అతడి ఆదర్శ ప్రభావం దుష్టత్వాన్ని విస్తరించి లోకాన్ని దుర్నీతితోను దౌర్జన్యంతోను నింపినందువల్ల లోకాన్ని నాశనం చేయటం అవసరమయిన పరిస్థితి ఏర్పడింది. PPTel 64.2

మొట్టమొదటి హంతకుడి ప్రాణం కాపాడటం ద్వారా మహా సంఘర్షణకు సంబంధించిన ఒక పాఠాన్ని విశ్వం ముందుంచాలని దేవుడు ఉద్దేశించాడు. పాపి దేవుని పై తన తిరుగుబాటును కొనసాగిస్తూ నిరంతరం జీవించటం జరిగినట్లయితే దాని పర్యవసానం ఎలాగుంటుందో అనటానికి కయీను అతడి సంతతివారి దుష్టచరిత్ర ఒక సాదృశ్యం . PPTel 64.3

దేవుని దీర్ఘ శాంతం దుష్టులు తమ దుష్టత్వంలో మరింత రెచ్చిపోయి దేవుని ధిక్కరించటానికి తోడ్పడింది. కయీను పై దేవుని తీర్పు వెలువడ్డ పదిహేను శతాబ్దాలకి భూమిని వరదల్లే ముంచిన నేరం దుష్టత్వంలో కయీను ప్రభావ ఫలితాన్ని సర్వ విశ్వం కళ్ళారా చూసింది. మానవుడు దైవ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినందుకు కలిగిన మరణ శిక్ష న్యాయమైనది కృపాపూరితమైనది అని రుజువయ్యింది. మనుషులు పాపం చేస్తూ ఎంత ఎక్కువకాలం నివసిస్తే అంత మొండిగా పాపం కొనసాగించారు. అడ్డు అదుపు లేకుండా దుర్మార్గం దౌర్జన్యం కొనసాగిస్తూ తిరుగుబాటు స్వభావాన్ని ప్రబలం చేస్తున్న జనుల జీవితాల్ని అంతం చేస్తూ వారి చేతుల్లోనుంచి లోకాన్ని విడిపిస్తూ వెలువడ్డ దైవ శాసనం మానవుడికి మేలేగాని కీడుకాదు. PPTel 65.1

దైవ పరిపాలనను దేవుని ప్రవర్తనను వక్రీకరించి తప్పుగా చూపించటానికి వెయ్యి వేషాల్లో అనేక రకాలుగా సాతాను నిత్యమూ ప్రయత్నిస్తాడు. లోక ప్రజల్ని తన మోసాలతో తన అదుపులో ఉంచుకోటానికి క్రమబద్ధమైన ప్రణాళికల్ని రూపకల్పన చేసుకొని గొప్ప శక్తి నైపుణ్యాలతో అతడు పనిచేస్తున్నాడు. సర్వజ్ఞాని, నిత్యుడు అయిన దేవుడు ఆది నుంచి అంతం చూడగలిగినవాడు. పాపాన్ని పరిహరించే విషయంలో ఆయన ప్రణాళికలు దీర్ఘకాలికం సమగ్రం అయినవి. తిరుగుబాటును అంతం చేయటమే కాక దాని స్వభావ స్వరూపాల్ని విశ్వానికి చూపించాలన్నది ఆయన ఉద్దేశం. దేవుని ప్రణాళిక బయలు పడ్తున్నది. ఆయన న్యాయశీలతను కృపను అది ప్రదర్శిస్తున్నది. పాపాన్ని నివారించటంలో ఆయన జ్ఞానం నీతి నిజాయితీల్ని అది రుజువు పర్చుతున్నది. PPTel 65.2

లోకంలో చోటు చేసుకొంటున్న ఘటనల్ని ఇతర లోకాల్లోని పరిశుద్ధ ప్రజలు ఆసక్తితో పరిశీలిస్తున్నారు. క్రీస్తు అధికారాన్ని తోసిపుచ్చి, దైవ ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి లూసిఫర్ పరలోకంలో నెలకొల్పటానికి ప్రయత్నించిన పరిపాలన పర్యవసానాల ప్రతిబింబాన్ని జలప్రళయానికి ముందు భూమిమీద ప్రబలిన పరిస్థితిలో వారు స్పష్టంగా చూడగలిగారు. జలప్రళయానికి ముందున్న లోకంలో నివసించిన గర్వాంధులైన పాపుల్లో సాతాను ఆధీనంలో ఉన్న అనుచరుల్ని వారు చూశారు. మానవుల హృదయాలోచనలు ఎల్లప్పుడూ చెడ్డవిగా ఉన్నాయి. ఆది 6:.5. ప్రతీ భావోద్రేకం, ప్రతీ ప్రేరణ ప్రతీ ఆలోచన పవిత్రత, సమాధానం, ప్రేమ అన్నదైవ సూత్రాలకు వ్యతిరేకంగా పోరాటం సల్పాయి. దేవుడు సృజించిన ప్రజలు — నరులుగాని నీతిలోకాల వాసులుగాని - దైవ ధర్మశాస్త్ర నిబంధనలకు బద్దులు కాకూడదన్న వాదన సాతాను విధాన దుష్ప్రభావ ఫలితానికి ఒక ఉదాహరణ. PPTel 65.3

సాతాను అతడి అనుచరులూ వక్రీకరించి తప్పుడు అర్థం చెబుతున్న తన ప్రభుత్వ నియమ నిబంధనల్ని దేవుడు ఈ మహా సంఘర్షణ జరుగుతున్న కాలంలో బయలుపడే వాస్తవాల రూపంలో ప్రదర్శిస్తాడు. తిరుగుబాటుదారుల ఆలస్యం కారణంగా వారిని ఆయన రక్షించలేకపోయినా ఆయన న్యాయశీలతను యావత్ప్రపంచం గుర్తిస్తుంది. తన ప్రణాళిక అంచలంచలుగా సాగుతూ లక్ష్యసిద్ధికి చేరుకొంటుండగా దేవునికి యావత్ విశ్వం సానుభూతి సమ్మతి లభిస్తుంది. చివరగా తిరుగుబాటును నిర్మూలించటంలో కూడా ఈ సానుభూతి, సమ్మతి ఆయనకుంటాయి. దేవుని నిబంధనల్ని విసర్జించే వారందరూ క్రీస్తుతో జరిగే సంఘర్షణలో సాతాను పక్క ఉన్నట్లు వ్యక్తమవుతుంది. ఈ లోక ప్రభువైన సాతానుకి తీర్పు జరిగేటప్పుడు అతడితో కలిసి పనిచేసిన వారందరూ అతడితో పాటు శిక్ష అనుభవిస్తారు. ఆ తీర్పుకు సాక్షికానున్న సర్వ విశ్వం, “రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి. అని ప్రకటిస్తుంది. ప్రక 15:3. PPTel 66.1