పితరులు ప్రవక్తలు

48/75

46—దీవెనలు, శాపాను

ఆకాను ఆ రీతిగా హతుడైన తర్వాత మళ్లీ సైన్యాన్ని సమాయత్త పర్చి హాయి పట్టణం పై దాడి చేయాల్సిందిగా యెహోషువని దేవుడు ఆదేశించాడు. తన ప్రజలకు దేవుడు తోడుగా ఉన్నాడు. కనుక కొద్దికాలంలోనే ఆ పట్టణం వారి వశమయ్యింది. PPTel 495.1

ఇశ్రాయేలీయులు ఒక గంభీరమైన మతాచారాన్ని నిర్వహించేందుకు సైనిక కార్యకలాపాలు నిలుపు చేశారు. కనానులో స్థిర నివాసాలు స్థాపించుకోవాలని ప్రజలు ఆతృతగా ఉన్నారు. వారికింకా ఇళ్లుగాని వారి కుటుంబాలకు భూములు గాని లేవు. వీటిని సంపాదించుకోటానికి వీరు కనానీయుల్ని తరిమి వేయటం అవసరం. కాని వారు వెంటనే నిర్వహించాల్సిన మరింత ఉన్నత భాద్యత ఉండటం వల్ల ముఖ్యమైన ఈ కార్యచరణ వాయిదా పడింది. PPTel 495.2

తమ వారసత్వాన్ని స్వాధీనం చేసుకోకముందు దేవుని పట్ల విశ్వసనీయత నిబంధనను వారు నవీకరించుకోవాల్సి ఉన్నది. దైవ ధర్మశాస్త్రాన్ని గుర్తించేందుకు గాను షెకెములోని ఏబాలు, గిరిజీము కొండలపై గోత్రాలు సమావేశం కావలసిందిగా మోషే తన చివరి ఉపదేశంలో రెండుసార్లు సూచించాడు. ఈ ఆదేశాల మేరకు ప్రజలందరూ పురుషులేగాక “స్త్రీలును, పిల్లలును వారి మధ్య నుండు పరదేశు లును” గిల్గాలులోని తమ శిబిరం విడిచి పెట్టి తమ శత్రువుల దేశం గుండా సాగి వెళ్లి ఆ దేశం మధ్యలో వున్న షెకెము లోయను చేరారు. తాము ఇంకా జయించని శత్రువులు తమ చుట్టూ ఉన్నప్పటికీ దేవునికి నమ్మకంగా ఉన్నంత కాలం వారు ఆయన కాపుదలకింద క్షేమంగా ఉంటారు. యాకోబు కాలంలోలాగ “దేవుని భయము వారి చుట్టున్న పట్టణముల మీద నుండెను” (ఆది 35:5). కనుక హెబ్రీయుల్ని ఎవరు తొందర పెట్టలేదు. PPTel 495.3

ఈ గంభీర ఆధ్యాత్మిక కార్యచరణకు ఏర్పాటైన స్థలం వారి తండ్రుల నాటి నుంచిపవిత్రమైందిగా చరిత్రలో గుర్తింపు పొందిన స్థలం.కనాను దేశంలో అబ్రాహాము మొట్టమొదటగా బలిపీఠం కట్టింది ఇక్కడే. అబ్రాహాము, యాకోబు ఇద్దరు గూడారాలు వేసింది ఇక్కడే. యాకోబు ఇక్కడే పొలం కొన్నాడు. అందులోనే ఇశ్రాయేలు గోత్రాల వారు యోసేపు ఆస్థికల్ని పాతి పెట్టాల్సి ఉంది. యాకోబు తవ్విన బావీ,తన కుటుంబ విగ్రహాల్ని ఏ చెట్టు కింద పాతి పెట్టాడో ఆ మస్తకి వృక్షం ఇక్కడే ఉన్నాయి. PPTel 495.4

వారు ఎంపిక చేసుకొన్న స్థలం పాలస్తీనా అంతటిలోనూ మిక్కిలి సుందరమైన స్థలం. చోటు చేసుకోనున్న ఆ ఉదాత్తమైన గంభీరమైన కార్యానికి అది యోగ్యమైన స్థలం. మధ్యమధ్య ఒలీవ చెట్లున్న పచ్చని పొలాలు, వాటిని తడుపుతున్న ఊటలు, మణుల్లా మెరిసే అడవి పువ్వులతో పచ్చని పొలాలు, ఊటలు, మణుల్లా మెరిసే అడవి పువ్వులతో సుందరంగా కొండల మధ్య ఉన్న లోయ ఆహ్వానం పలుకుతున్నది. ఏబాలు, గిరిజీము కొండలు లోయకు ఎదురెదురుగా ఒకదానికొకటి సమీపంగా నిలిచి ఉన్నాయి. వాటి అడుగు భాగం ఒక స్వాభావిక ప్రసంగ వేదికలా ఉంది. ఒక కొండపై మాట్లాడిన మాట రెండో కొండపై స్పష్టంగా వినిపించేది. ఈ కొండల అడుగుభాగాలు లోపలికి చొచ్చుకుపోవటంతో పెద్ద సమావేశానికి సరిపోయేంత విశామైన స్థలం ఏర్పడి ఉంది. మోషే ఇచ్చిన సూచనల ప్రకారం ఏబాలు కొండ పై రాళ్లతో ఒక స్మారక స్తంభం నిర్మించారు. ఆ రాళ్ల పై దైవ ధర్మశాస్త్రాన్ని చెక్కారు. సీనాయి కొండ పైనను దేవుడు మాట్లాడి రాతి పలకల పై రాసిన పది ఆజ్ఞలే కాక దేవుడు మోషేకి అందించగా మోషే గ్రంథంలో రాసిన ధర్మ శాసనాల్ని చెక్కారు. ఈ స్తంభం పక్క శిలా బలిపీఠం నిర్మించారు. ఆ బలిపీటం పై దేవునికి బలులర్పించారు. శాపగ్రస్తమైన ఏబాలు కొండపై బలిపీఠం కట్టటం విశేషం దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన కారణంగా ఇశ్రాయేలీయులు దేవుని ఉగ్రతకు గురి అయ్యారని క్రీస్తు ప్రాయశ్చిత్తం చేయపోతే వారు వెంటనే ఆ ఉగ్రతవల్ల నశించటం జరుగుతుందని దాని అర్థం. క్రీస్తు ప్రాయశ్చిత్తానికి ఆ బలిపీఠం చిహ్నం. PPTel 496.1

ఆరు గోత్రాలు - వారందరూ లేయూ రాహేలు సంతతి వారే - గెరిజీము కొండను ఆక్రమించగా దాసీల సంతతివారు, రూబేను, జెబులూను సంతతివారు ఏబాలు కొండను ఆక్రమించారు. బూర ధ్వనితో అంతా నిశ్శబ్దం అయ్యింది. ఆ నిశ్శబ్ద వాతావరణంలో విస్తారమైన ఆ సభ ముందు, పరిశుద్ధ మందసం పక్క నిలబడి దేవుని ధర్మ శాస్త్రానికి విధేయులు కావటం వల్ల కలిగే ఆశీర్వాదాల్ని యెహోషువ చదివి వినిపించాడు. గిరిజీము మీది గోల వారు “ఆమెతో” స్పందించారు. ఆ తర్వాత యెహోషువ శాపాల్ని చదివి వినిపించాడు. ఏబాలు మీది గోత్రాల వారు అదే రీతిగా తమ సమ్మతిని తెలిపారు. గంభీరమైన ఆ ప్రతిస్పందనలో వేవేల స్వరాలు సమ్మిళితమై ఒకే కంఠంలా వినిపించింది. ఆ తర్వాత దైవ ధర్మశాస్త్రాన్ని, మోషే ద్వారా దేవుడు వారికిచ్చిన కట్టడల్ని, తీర్పుల్ని చదివి వినిపించాడు. PPTel 496.2

సీనాయి కొండపై నుంచి ప్రత్యక్షంగా దేవుని నోటి నుంచే ఇశ్రాయేలీయులికి దైవ ధర్మశాస్త్రం వచ్చింది. తన స్వహస్తంతో ఆయన రాసిన పరిశుద్ధ ధర్మసూత్రాలు ఆ మందసంలో చెక్కు చెదరకుండా ఇంకా ఉన్నాయి. ఇప్పుడు అందరూ చదవగలిగేటట్లు దాన్ని ఆ రాళ్లమీద రాయటం జరిగింది. ఏ నిబంధన కింద కనాను తమ స్వాధీనంలో ఉంటుందో దాని షరతుల్ని చూసే తరుణం అందరికీ లభించింది. నిబంధన షరతులకు విధేయులై దీవెనల్ని పొందటానికి లేదా వాటిని నిర్లక్ష్యం చేసి శాపాల్ని పొందటానికి అందరూ తమ అంగీకారాన్ని వ్యక్తం చేయాల్సి ఉన్నారు. జ్ఞాపకార్థపు రాళ్ల మీద ధర్మశాస్త్రాన్ని రాయటం మాత్రమే గాకుండా ప్రజలందరూ వినేటట్లు యెహోషువ దాన్ని చదివి వినిపించాడు. ద్వితియోపదేశకాండం పుస్తకాన్ని ప్రసంగాల రూపంలో మోషే ప్రజలకు ఇచ్చి ఎన్నో వారాలు గతించలేదు. అయిన ధర్మశాస్త్రాన్ని యెహోషువ ఇప్పుడు మళ్లీ చదివి వినిపించాడు. PPTel 496.3

ఇశ్రాయేలీయుల పురుషులు మాత్రమే కాదు “స్త్రీలును, పిల్లలును” ధర్మశాస్త్రాన్ని చదవగా విన్నారు. ఎందుకంటే వారు కూడా తమ విధులేంటో తెలుసుకొని వాటిని నిర్వహించటం అవసరం.తనకట్టడలను గురించి దేవుడు ఇశ్రాయేలీయులకు ఈ విధంగా ఆజ్ఞాపించాడు: “కాబట్టి మీరు నా మాటలను మీ హృదయములోను, మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండ వలెను... వాటిని మీ పిల్లలకు నేర్పి నీ యింటి ద్వారముల మీదను, నీ గవునుల మీదను వాటిని వ్రాయవలెను. అలాగు చేసిన యెడల యెహోవా మీ పితరుల కిచ్చెదనని ప్రమాణము చేసిన దేశము మీ దినములును మీ సంతతివారి దినములును భూమికి పైగా ఆకాశము నిలుచునంత కాలము విస్తరించును”. ద్వితి 11:18-21. PPTel 497.1

మోషే ఇలా ఆదేశించిన ప్రకారం ఏడు సంవత్సారాల కోసారి ఇశ్రాయేలీయుల సర్వసభలో సంపూర్ణ ధర్మశాస్త్రాన్ని చదవవలసి ఉన్నది, “ప్రతి యేడవ సంవత్సరాం తమున, అనగా నియమింపబడిన గడువు సంవత్సరము నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమందు ఇశ్రాయేలీయులందరు ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించునప్పుడు ఇశ్రాయేలీయులందరి యెదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపించవలెను. మీ దేవుడైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని ఆచరించి నడుచుకొనునట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి నీ పురములోనున్న పరదేశులేమి ఆలాగు నేర్చుకొనిన యెడల దాని నెరుగని వారి సంతతి వారు దానిని విని, మీరు స్వాధీనపరచుకొనుటకు యోర్డానును దాటబోవుచున్న దేశమున మీరు బ్రదుకు దినములన్నియు మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు”. ద్వితి 31:10-13. PPTel 497.2

మనసుకు గుడ్డితనం కలిగించి అవగాహనము మసకబార్చి ఆరీతిగా మనుషుల్ని పాపంలోకి నడిపించేందుకు దేవుడన్నది జరగకుండా చేయటానికి సాతాను నిరంతరం కృషి చేస్తున్నాడు. అందు చేతనే ఎవరూ పొరపడకుండేందుకు దేవుడు తన ధర్మవిధులేంటో స్పష్టంగా తెలుపుతున్నారు. క్రూరమైన, మోసపూరితమైన తన శక్తి ప్రభావాల్ని సాతాను ప్రజలపై ప్రయోగించకుండేందుకు వారిని తన కాపుదలకిందకి తీసుకోటానికి దేవుడు సర్వదా ప్రయత్నిస్తున్నాడు. స్వయంగా తాను గొంతెత్తి వారితో మాట్లాడటానికి, తన స్వహస్తంతో జీవవాక్యం రాయటానికి ఆయన తన ఉన్నత స్థాయి నుంచి దిగివచ్చాడు. జీవంతో నిండి సత్యంతో ప్రకాశించే వాక్యం నిర్దుష్ట మార్గదిర్శగా ఉండేందుకు దాన్ని మానవులకిచ్చాడు. దేవుని వాగ్దానాలు విధుల నుంచి తప్పించి మానవ మనసుల్ని తప్పుదారి పట్టించటానికి సాతాను సమాయత్తమై ఉన్నాడు గనుక ఆయన మాటల్ని మనసులో స్థిరంగా ఉంచుకోటానికి మరింత శ్రద్ధ అవసరం. PPTel 498.1

ప్రజలకు బైబిలు చరిత్ర వాస్తవాల్ని బోధించటం పై దేవుని హెచ్చరికల్ని అందించి విధుల్ని నేర్పించటం పై మత ప్రబోధకులు దృష్టి పెట్టాలి. వీటిని చిన్న పిల్లలకు అర్థమయ్యే రీతిలో సామాన్య భాష ఉపయోగించి బోధించాలి. బాలలకు లేఖనాలు ఉపదేశించటం తల్లిదండ్రులు బోధకులు తమ బాధ్యతలో భాగంగా పరిగణించాలి. PPTel 498.2

పరిశుద్ధ గ్రంథంలోని వివిధ రకాల జ్ఞానం పై తల్లితండ్రులు తమ చిన్నారులకు అనురక్తి పుట్టించవచ్చు. అయితే దైవవాక్యం పట్ల తమ పిల్లలకు ఆసక్తి పెంచాలంటే ముందు తల్లిదండ్రులకు ఆ అనురక్తి ఉండాలి. దైవ వాక్య బోధనలు వారికి కొద్దీ గొప్పో తెలియాలి. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఆదేశించినట్లు “నీవు నీ యింట కూర్చుండునప్పుడు త్రోవను నడుచున్నప్పుడు, లేచినప్పుడు” వాటిని గూర్చి మాట్లాడాలి. ద్వితి. 11:19. తమ బిడ్డలు దేవుని ప్రేమించి గౌరవించాలని కోరుకొనేవారందరూ దైవ వాక్యంలోను సృష్టికార్యాల్లోను ప్రకటితమైన ఆయన దయాళుత్వం, ఔన్నత్యం, శక్తిని గూర్చి మాట్లాడాలి. PPTel 498.3

బైబిలులోని ప్రతి అధ్యాయంలో ప్రతి వాక్యంలో దేవుని వద్ద నుంచి మానవులికి వస్తున్న సందేశం ఉంది. దాని సూక్తుల్ని సూచనలుగా చేతులకు, బాసికాలుగా నొసళ్లకు కట్టుకోవాలి. దైవ జనులు ఆయన వాక్యాన్ని పఠించి దానికి విధేయులై నివసిస్తే పగలు మేఘ స్తంభం ద్వారా రాత్రి అగ్నిస్తంభం ద్వారా ఇశ్రాయేలీయుల్ని నడిపించిన రీతిగా వారిని కూడా దేవుడు నడిపిస్తాడు. PPTel 498.4