పితరులు ప్రవక్తలు

39/75

37—కొట్టబడిన బండ

హోరేబు వద్ద బండను కొట్టగా జీవాధారమైన నీళ్ళు ప్రవహించాయి. ఆ నీళ్ళ తాగి ఇశ్రాయేలీయులు అరణ్యంలో సేదతీరారు. తమ అరణ్య సంచారమంతటా ఎక్కడెక్కడ అవసరం ఏర్పడితే అక్కడ దేవుని అద్భుత కార్యం వల్ల వారికి నీరు సరఫరా అయ్యేది. హోరేబు వద్ద నుంచి నీరు ప్రవహించటం కొనసాగలేదు. తమ ప్రయాణాల్లో వారు ఎక్కడ నీరు కావాలని కోరారో అక్కడ రాతి బండల్లోనుంచి వారి శిబిరం పక్క నుంచి నీళ్ళు ప్రవహించాయి. PPTel 405.1

క్రీస్తు తన మాట ప్రభావం ద్వారా ఇశ్రాయేలీయుల నిమిత్తం సేద తీర్చే జలాలను ప్రవహింపజేశాడు. “అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే” 1 కొరింధీ 10:4 సమస్త లౌకిక, ఆధ్యాత్మిక దీవెనలకు మూలం ఆయనే. క్రీస్తే నిజమైన బండ. వారి ప్రయాణం అంతటిలోనూ వారితో ఆయనే ఉన్నాడు. “ఎడారి స్థలములో ఆయన వారిని నడిపించెను వారు దప్పి గొనలేదు. రాతి కొండలో నుండి వారికొరకు ఆయన నీళ్ళు ఉబుక జేసెను. ఆయన కొండను చీల్చగా నీళ్ళు ప్రవాహముగా బయలుదేరెను.” “ఎడారిలో అవి యేరులై పారెను.” యెషియా 48:21, కీరనలు 105:41. PPTel 405.2

కొట్టబడిన బండ క్రీస్తుకు ముంగుర్తు. ఈ చిహ్నం ద్వారా ప్రశస్త ఆధ్యాత్మిక సత్యాల్ని నేర్చుకొంటున్నాం. కొట్టబడిన బండలోనుంచి ప్రాణాధారమైన నీళ్ళు ప్రవహించినట్లే “మన యతి క్రమ క్రియలను బట్టి ... గాయపరచబడిన” “మనదోషములను బట్టి నలుగగొట్టబడిన” (యోషయా 53:4,5) “దేవుని వలన బాధింపబడిన” “క్రీస్తు” అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడ” వలసివున్నాడు. హెబ్రీ 9:28. మన రక్షకుడు రెండోసారి బలిదానం కానవసరంలేదు. ఆయన కృపాదీవెనలు కోరేవారు మారుమనసుతో కూడిన ప్రార్థన ద్వారా తమ హృదయ వాంఛల్ని యేసు నామంలో విన్నవించుకోటం చాలు. అట్టి ప్రార్థన యేసు పొందిన గాయాల్ని సైన్యాలకు అధినాయకుడైన యెహోవా ముందుంచుతుంది. అంతట వాటి నుంచి జీవాన్నిచ్చే రక్తం తాజాగా ప్రవహిస్తుంది ఇశ్రాయేలీయులు తాగేందుకు ప్రవహించిన జీవజలం ఆ రక్తానికి సంకేతం. PPTel 405.3

ఇశ్రాయేలు ప్రజలు కనానులో స్థిరపడిన అనంతరం అరణ్యంలో బండ నుంచి నీళ్ళు ప్రవహించిన ఘటనను జ్ఞాపకం చేసుకొంటూ ఉత్సవం జరుపుకొన్నారు. ఈ ఉత్సవం క్రీస్తు దినాల్లో ఎంతో వైభవంగా జరిగేది. అది పర్ణశాలల పండుగ సమయంలో జరిగేది. ఆ పండుగకు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు యెరుషలేములో సమావేశమయ్యేవారు. ఆ పండుగ ఏడు దినాలు జరిగేది. ప్రతీరోజూ సిలోయము ఏరు నుంచి బంగారు పాత్రలతో నీళ్ళు తేవటానికి యాజకులు సంగీతంతోను లేవీయుల గానబృందతోనూ వెళ్ళేవారు. “మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు.” (యెషయా 12:3) అని పాడుతూ భక్తుల సమూహాలు వారి వెంట వెళ్ళి ఆ ఏరువద్దకు వెళ్ళి నీళ్ళు తాగేవారు. అప్పుడు బూర ధ్వని మధ్య, “యోరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచున్నది.” అన్న కేకల మధ్య యాజకులు తాము ఏటి నుంచి తెచ్చిన నీళ్ళను దేవాలయం వద్దకు మోసుకువచ్చేవారు. కీర్తనలు 122:2 ఆ నీటిని వారు దహన బలిఫీరం పై పోస్తున్నప్పుడు కృతజ్ఞతాగీతాలు పాడేవారు. జన సమూహాలు వారితో గొంతు కలపగా సంగీత వాద్యాలు మోగేవి. బూరధ్వనులు వినిపించేవి. PPTel 406.1

సంకేతాత్మకమైన ఈ ఆచారాన్ని ఉపయోగించుకొని మనుషులకు తాను ఇవ్వటానికి వచ్చిన దీవెనల మీదికి ప్రజల మనసుల్ని తిప్పిటానికి ప్రయత్నించాడు రక్షకుడు. “ఆ పండుగ మహాదినమైన అంత్యదినమున” ఆలయావరణంలో ఆయన చెప్పిన ఈ మాటలు వినిపించాయి,” ఎవడైనను దప్పిగొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును.” తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాటలు చెప్పెను.” అని యోహానన్నాడు. యోహాను 7:37-39. ఎండి బీడైన ఆ ప్రదేశంలో సేదతీర్చే నీళ్ళు పుట్టి నశిస్తున్న జీవులకు ప్రాణాన్నివ్వటమన్నది క్రీస్తు మాత్రమే ఇవ్వగల దైవ కృపకు చిహ్నం . జీవాన్నిచ్చే నీరుగా అది ఆత్మను పరిశుద్ధపరచి, తెప్పరిల్లజేసి బలో పేతం చేస్తుంది. ఏ వ్యక్తిలో క్రీస్తు నివసిస్తాడో అతడిలో ఎన్నడూ అంతంకాని కృప, శక్తి ప్రవహిస్తాయి. తనను అన్వేషించే వారి జీవితాన్ని యేసు ఆనందంతో నింపి వారి మార్గాన్ని ప్రకాశవంతం చేస్తాడు. హృదయం ఆయన ప్రేమతో నిండి ఉండి అది సత్కియులకు నిలయమౌతుంది. ఆ సత్కియలు నిత్యజీవానికి దారిదీస్తాయి. ఆ ప్రేమ వ్యక్తికి ధన్యుణ్ని చేయటమే కాదు అతని చుట్టూ దప్పిగొని వున్నవారిని తెప్పరిల్లజేయటానికి అతడి మాటలు నదివలె ప్రవహిస్తాయి. యాకోబు బావివద్ద సమరయ స్త్రీతో మాటాలాడినప్పుడు క్రీస్తు ఇదే చిహ్నాన్ని ఉపయోగించాడు. “నేనిచ్చునీళ్ళు త్రాగువాడెవడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండును. “యోహాను 4:14. ఈ రెండు చిహ్నాలూ క్రీస్తునే సూచిస్తున్నాయి. బండ ఆయనే, జీవజలం ఆయనే. PPTel 406.2

సుందరమైన ఇవే చిహ్నాలు బైబిల్ అంతటా కనిపిస్తాయి. క్రీస్తు జననానికి కొన్ని శతాబ్దాలు ముందే ఆయనను ఇశ్రాయేలు రక్షణ శైలముగా మోషే వర్ణించాడు. (ద్వితి 32:15) నా విమోచకుడు, “నా బలమైన ఆశ్రయ దుర్గము”, నేను ఎక్కలేనంత ఎత్తయిన కొండ”, “నాకు ఎతైన కోట” అంటూ కీర్తనకారుడు ఆయన్ని కొనియాడాడు. దావీదు తన కీర్తనలో దివ్య గొర్రెల కాపరి కృపను తన మందకు పచ్చికబయళ్ళు నడుమ ప్రవహించే “శాంతికరమైన జలములు” గా చిత్రించాడు. ఇంకా అతడిలా అంటున్నాడు, “నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊటకలదు.” కీర్తనలు 19:14,62:7, 61:2, 71:3, 73:26, 94:22, 23:2, 36:8,9. ఆయన మాటలు “నదీప్రవాహము వంటివి జానపు ఊటవంటివి” అంటున్నాడు జ్ఞాని. సామెతలు 18:4 ఇర్మీయాకు క్రీస్తు “జీవజలముల ఊట”, జెకర్యాకు “పాపమును అపవిత్రతను పరిహరించుటకై తియ్యబడిన” “ఊట”, యిర్మీయా 2:13, జెకర్యా 13:1. ఆయనను “యుగయుగాల శిల” గా “గాలివానకు మరుగైన చోటుగా” యెషయా వర్ణిస్తునానడు. యెషయా 26:4 (మార్జిన్), 32:2, ఇశ్రాయేలీయుల కోసం ప్రవహించిన నీరును గుర్తుచేస్తూ అతడు ఈ ప్రశస్త వాగ్దానాన్ని నమోదు చేశాడు, “దీనదరిద్రులు నీళ్ళు వెదకుచున్నారు. నీళ్ళు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను. ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను.” “నేను దప్పిగల వాని మీద నీళ్ళను ఎండిన భూమి మీద ప్రవాహజలమును కుమ్మరించెదను.” “అరణ్యములో నీళ్ళు ఉడను. అడవిలో కాలువలు పారును.” “దప్పిగొనినవారలారా, నీళ్ళ యొద్దకు రండి” అంటూ ఆయన ఆహ్వానిస్తున్నాడు. యోషయా 41:17, 44:3, 35:6, 55:1. పరిశుద్ధ వాక్యం చివరి పుటల్లో ఈ వాగ్దానం ప్రతిధ్వనిస్తుంది. దేవుడూ, గొర్రెపిల్లా సింహాసనం నుంచి “స్పటికవలె మెరయు” జీవజలాల నది ప్రవహిస్తుంది. “ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము” అన్న పిలుపు యుగాల పొడవునా వినిపిస్తూ ఉంది. ప్రకటన 22:17. అనేక సంవత్సరాలుగా తమ శిబిరం పక్క నుంచి గలగల ప్రవహించిన ఏరు ఇశ్రాయేలు ప్రజలు కాదేషు చేరటానికి కొంచెం ముందు ఎండిపోయింది. తన ప్రజల్ని మళ్ళీ పరీక్షించాలని ప్రభువు ఉద్దేశించాడ. తమ పోషణకర్తగా వారు ఆయనను నమ్ముకొంటారో లేక తమ తండ్రుల మాదిరిగా అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తారో నిగ్గుతేల్చనున్నాడు. PPTel 407.1

కనాను కొండలు ఇప్పుడు వారి కనుచూపు మేరలోనే ఉన్నాయి. కొన్ని దినాల ప్రయాణం అనంతరం వారు వాగ్దాత్త దేశం పొలిమేరలు దాటనున్నారు. వారు ఏశావు సంతతి వారికి చెందిన ఎదోముకు కొద్ది దూరంలో వున్నారు. కనానుకి వారు వెళ్లాల్సిన మార్గం ఎదోము గుండా ఉన్నది. దేవుడు మోషేకిచ్చిన ఆదేశం ఇది “ఉత్తర దిక్కుకు తిరుగుడి మరియు నీవు ప్రజలతో ఇట్లనుము - శేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరులు పొలమేరను దాటి వెళ్ళబోవుచున్నారు, వారు మీకు భయపడుదురు.. మీరు రూకలిచ్చివారి యొద్ద ఆహారము కొని తినవచ్చును. రూకలిచ్చి వారి యొద్ద నీళ్ళు సంపాదించుకొని త్రాగవచ్చును.” ద్వితి 2:3-6. వారి నీటి సరఫరా ఎందుకు ఆగిపోయిందో వివరించేందుకు ఈ ఆదేశాలే చాలు. మంచి నీటి సదుపాయం ఉన్న సారవంతమైన దేశంలో నుంచి వారు ప్రయాణం చేయాల్సి ఉన్నారు. అది నేరుగా కానానుకు వెళ్ళే మార్గం. ఎదోములో నుంచి వారికి సుఖ ప్రయాణాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. అందరికి సరిపోయేంత ఆహారం నీళ్ళు కొనుగోలు చేసుకొనే అవకాశం కూడా వారికిచ్చాడు. నీటి సరఫరా నిలిపివేత వారికి ఆనందోత్సాహాలు కలిగించాల్సిన అంశం అరణ్య సంచారం సమాస్తమయ్యిందన టానికి అంది సంకేతం. తమ అవిశాస్వం మూలంగా వారు అంధులు కాకుండా ఉంటే దీన్ని గ్రహించేవారే. అయితే వాగ్దాన నెరవేర్పుకు నిదర్శనం కావాల్సివున్న విషయాన్ని వారు సంశయానికి సణుగుడికి కారణంగా తయారు చేశారు. దేవుడు తమకు కనాను ఇస్తాడు అన్న ఆశాభావాన్ని ప్రజలు కోల్పోయినట్లు కనిపించింది. అందుచేత అరణ్యవాసమే తమకు మేలని భావిస్తున్నట్లు కనిపించింది. PPTel 408.1

వారు కనానులో అడుగు పెట్టకముందు దేవుని వాగ్దానాన్ని విశ్వస్తున్నామని నిరూపించికోవాల్సి ఉన్నారు. వారు ఎదోము చేరకముందే నీటి సరఫరా నిలిచి పోయింది. కంటి చూపును బట్టే కాక విశ్వాసాన్ని బట్టి కొద్ది సేపు నడిచే అవకాశం వారికి ఇక్కడ అభించింది. అయితే తమ తండ్రులు ప్రదర్శించిన తిరుగుబాటు స్వభావం, కృతఘ్నత వారిలోనూ ఉన్నవని ఆ మొదటి పరీక్షలోనే తేలింది. నీటి నిమిత్తం శిబిరంలో గగ్గోలు బయల్దేరిన మరుక్షణమే ఎన్నో ఏళ్ళుగా తమను నడిపిస్తూ తమ అవసరాల్ని తీర్చుతూవున్న హస్తాన్ని ప్రజలు మరచిపోయారు. సహాయం నిమిత్తం దేవున్ని అభ్యర్థించే బదులు ఆయన మీద సణగనారంభించారు. నిరాశతో ఇలా విలపించారు. “అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన యెడల ఎంతో మేలు!” (సంఖ్యా 20:1-13). అంటే కోరహూ తిరుగుబాటులో తాము కూడా ఉండి ఉంటే బాగుండేదన్నది వారి కోరిక. PPTel 408.2

వారు మోషేకి అహరోనుకి వ్యతిరేకంగా కేకలు వేశారు. “మేమును మా సమాజమును ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేల తెచ్చితిరి? ఈ కానిచోటికి మమ్మును తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మును ఏల రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు. అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటక ళ్ళేలేవు.” PPTel 409.1

నాయకులు గుడార ద్వారం వద్దకు వెళ్ళి నేలపై సాగిలపడ్డారు. మళ్ళీ “యెహోవా మహిమ వారికి కనబడెను.” అంతట యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చాడు, “నీవు నీ కట్టను తీసికొని, నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగుజేసి వారి కన్నుల యెదుట బండతో మాటలాడుము. అది నీళ్ళనిచ్చును. నీవు వారి కొరకు నీళ్ళను బండలో నుండి రప్పించి... త్రాగుటకిమ్ము.” PPTel 409.2

ఆ సోదరులిద్దరూ సమాజం ముందుకు వెళ్ళారు. మోషే చేతిలో దేవుని కర్ర ఉంది. ఇప్పుడు వారు మహావృద్ధులు. ఇశ్రాయేలీయుల తిరుగుబాటును మంకుతనాన్ని దీర్ఘకాలం నుంచి భరిస్తూ వచ్చారు. చివరిలో ఇప్పుడు మోషే సహనం సైతం మాయమయ్యింది. “ద్రోహులారా, వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్ళు రప్పింపవలెనా?” అని అన్నాడు. దేవుని ఆదేశం మేరకు బండతో మాట్లాడే బదులు తన కర్రతో ఆ బండను రెండు సార్లు కొట్టాడు. PPTel 409.3

జనులు తాగి సేదతీరేంత సమృద్ధిగా నీరు ప్రవహించింది. కాని గొప్ప అపచారం జరిగింది. మోషే మాటల ఆగ్రహావేశాల్లో దొర్లాయి. దేవుని కించపర్చినందు వల్ల కలిగే పరిశుద్ద ఆగ్రహానికి బదులు అతడి మాటలు మానవ కోపతాపాల్ని ఆవేశకావేషాల్ని వెళ్ళగక్కాయి. ఇశ్రాయేలీయుల తిరుగుబాటుకు వారిని నాశనం చేస్తానని దేవుడు మోషేతో అన్నప్పుడు ఆ మాటలు మో షేకి బాధాకరంగా ఉన్నాయి. ప్రజలూ వాటిని భరించలేకపోయారు. అయినా ఆ వర్తమానాన్ని అందించటంలో దేవుడు అతడికి చేయూతనిచ్చాడు. కాగా వారిని నిందించటానికి తానే పూను కొన్నప్పుడు మోషే దేవుని ఆత్మను దు:ఖపర్చి ప్రజలకేహాని చేశాడు. అతడు సహనాన్ని ఆత్మ నిగ్రహాన్ని కోల్పోయినట్లు స్పష్టమయ్యింది. గతంలో అతడిచ్చిన ఆదేశాలు దేవుడిచ్చినవేనా అని ప్రశ్నించటానికి, తమ పాపాలు పాపాలే కావని కొట్టిపారెయ్య టానికి ప్రజలకు ఇది ఊతమిచ్చింది. ప్రజలూ మోషే ఇరువురూ దేవుని నొప్పించారు. అతడి వ్యవహార శైలి ఆది నుంచి విమర్శకు తావిస్తూనే వచ్చిందని ప్రజలు ఆరోపించారు. తన సేవకుడు మోషే ద్వారా దేవుడు పంపిన మందలింపుల్ని తోసిపుచ్చ టానికి ఇప్పుడు ఆ ప్రజలకు ఒక సాకు దొరికింది. PPTel 409.4

మోషే దేవుని పై అవిశ్వాసాన్ని ప్రదర్శించాడు. “మేము... మీ కొరకు నీళ్ళు రప్పింపవలెనా?” అని ప్రశ్నించాడు ప్రభువు తాను వాగ్దానం చేసింది చేయడన్నట్లు. “మీరు ఇశ్రాయేలీయుల కన్నుల యెదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్మకు పోతిరి” అని సహోదరులిద్దరితోను ప్రభువు అన్నాడు. నీళ్ళ సరఫరా ఆగి నప్పుడు దేవని వాగ్దానాల నెరవేర్పు విషయంలో ప్రజల విశ్వాసం సడలి సణుగుతూ తిరుగుబాటు చేశారు. తమ అవిశ్వాసం వల్ల మొదటి తరం ప్రజలు అరణ్యంలో మరణించటమనే దండన పొందారు. అదే స్వభావం వారి పిల్లల్లోనూ చోటు చేసుకొంది. వీరు కూడా వాగ్దాన నెరవేర్పును పోగొట్టు కొంటారా? అలసిపోయి నిస్పృహ చెంది ఉన్న మోషే అహరోనులు రెచ్చిపోతున్న ప్రజల్ని ఆపటానికి ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. వారు దేవుని పై అచంచల విశ్వాసం ప్రదర్శించి ఉంటే విషయాన్ని సరైన రీతిని ప్రజల ముందు పెట్టి ఆ పరీక్షలో నెగ్గేటట్లు ప్రజలకు తోడ్పడగలిగే న్యాయాధికారులుగా తమకు దఃఖలు పడ్డ అధికారాన్ని ఉపయోగించి ఉంటే వారు ప్రజలు సణుగుడు ఆపగలిగేవారు. తమకు సహాయమందించమంటూ దేవునికి విజ్ఞప్తి చేయక ముందు విషయాల్ని చక్క బెట్టటానికి వారు తమ శక్తి మేరకు కృషి చేయటం వారి విధి. కాదేషులోని గొణుగుడు వెంటనే ఆపని ఉంటే వారికి ఎంతో కీడు తప్పేది. PPTel 410.1

మోషే వల్ల జరిగిన దుందుడుకు కార్యం దేవుడు ఉద్దేశించిన పాఠం ప్రయోజనాన్ని రద్దు పరిచింది. క్రీస్తుకు చిహ్నమైన బండను ఒకసారి మాత్రమే. రెండోసారి బండతో మాట్లాడటం సరిపోతుంది. ఎందుకంటే మనం యేసు పేరట దీవెనలు యాచించాల్సి ఉన్నాం. బండను రెండోసారి కొట్టటం వల్ల క్రీస్తుకు సుందరమైన ఈ ప్రతీక అర్థరహితమయ్యింది. PPTel 410.2

అంతేకాదు, మోషే అహరోన్లు దేవునికి మాత్రమే చెందిన అధికారాన్ని చెలాయించారు. దేవుడు కలుగజేసుకోవాల్సిన అవసరం ఏర్పడటం ఆ తరుణానికి గొప్ప ప్రాముఖ్యాన్నిచ్చింది. ఇశ్రాయేలీయుల నేతలు దాన్ని ఆసరా చేసుకొని దేవుని పట్ల ప్రజల భయభక్తుల్ని మెరుగుపర్చి ఆయన శక్తి పైన దయాళుత్వం పైన వారి విశ్వాసాన్ని పటిష్ఠ పర్చాల్సింది. “మేము ఆ బండలో నుండి మీ కొరకు నీళ్ళు రప్పింపవలెనా?” అని కోపంగా అనటంలో, మానవ దౌర్బల్యాలు భావోద్రేకాలు గల తమకు శక్తి ఉన్నదన్నట్లు వారు దేవుని స్థానాన్ని ఆక్రమించారు. అనునిత్యం ప్రజల గొణుగుడు తిరుగుబాటులతో వేగిపోతున్న మోషే సర్వశక్తి గల సహాయకుణ్ని విస్మరించాడు. దైవశక్తి లేని అతడు మానవ బలహీనతను ప్రదర్శించి తన మంచి పేరు చెడగొట్టుకున్నాడు. చివరి వరకు తన కర్తవ్యం పరిశుద్ధంగా ధృడంగా స్వార్థహితంగా నిర్వహించగలిగిన వ్యక్తి చివరికి పరాజితుడయ్యాడు. దేవుని మహిమ పరచి ఘనపర్చటం పోయి ఆయన్ను ఇశ్రాయేలీయులముందు కించపర్చాడు. PPTel 410.3

మోషే అరహోనుల్ని బహుగా విసిగించిన దుష్టుల్ని దేవుడు ఈ సమయంలో శిక్షించలేదు. నాయకుల్నే అయన మందలించాడు. దైవ ప్రతినిధులుగా సమాజంలో చెలామణి అయినవారు దేవుని గౌరవించలేదు. మోషే అహరోనులు తామే బాధితలమని భావించారు. ప్రజలు తమ పై సణుగుకోలేదని, వారి సణుగుడు దేవుని పైనే అని వారు విస్మరించారు. తమను గూర్చి ఆలోచించటం లోనే, తమకోసం సానుభూతి సంపాదించుకోటంలోనే వారు పాపంలో పడ్డారు. తమ అపరాధాన్ని ప్రజలముందు దేవుని ముందు ఉంచలేక విఫలులయ్యారు. PPTel 411.1

దాని వెనువెంటనే వెలవడ్డ దైవ తీర్పు బహు దుఃఖకరమైంది. సిగ్గుకరమైంది కూడా. “అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల యెదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ము కొనక పోతిరి గనుక ఈ సమాజామును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను.” తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీయులతో పాటు వారు యోర్దాను దాటకముందు మరణించాల్సి ఉన్నారు. మోషే అహరోనులు ఆత్మాభిమానాన్ని పెంచుకొని దేవుడు తమను మందలిస్తున్నప్పటికీ దురుసుగా వ్యవహరించి ఉంటే వారి అపరాధం మరింత ఘోరమయ్యేది. వారిది ఉద్దేశపూర్వకంగా చేసిన పాపంకాదు. హఠాత్తుగా కలిగిన శోధనకు లొంగి పాపం చేశారు. వెంటనే పశ్చాత్తాప పడ్డారు. ప్రభువు వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. వారి పాపం ప్రజలకు చేయగల హానిని దృష్టిలో ఉంచుకొని ప్రభువు వారి పాప శిక్షను రద్దు చేయలేకపోయాడు. PPTel 411.2

దేవుడు తనకిచ్చిన తీర్పును మోషే దాచి పెట్టలేదు. తాను దేవునికి మహిమ చెల్లించని కారణంగా తమను వాగ్దత్త దేశంలోకి నడిపించటానికి అర్హుణ్ని కానని మోషే ప్రజలకు వెళ్లడించాడు. తనకు వచ్చిన కఠిన శిక్షను గుర్తించి తనకు సణుగుళ్ళను దేవుడు ఎలా పరిగనిస్తాడో ఆలోచిచుకోవాల్సిందిగా మోషే ప్రజల్ని ఉద్భోధించాడు. తాము చేసిన పాపాల వల్ల తమ మీదికి తామే తెచ్చుకొన్న తీర్పులు మానవ మాత్రడైన తన పైకి ఎలా వచ్చాయో గుర్తుంచుకోమన్నాడు. తన శిక్ష రద్దుకు దేవుని ఎలా బతిమాలి వేడుకొన్నదీ కాని ఆయన తన వినతిని ఎలా తిరస్కరించింది మోషే ప్రజలకు వివరించాడు. “యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను” అని చెప్పాడు. ద్వితీ 3:26. PPTel 411.3

తాము కష్టాలు శ్రమలకు గురి అయిన ప్రతీ సందర్భంలోను తమను ఐగుప్తు నుంచి తీసుకురావటంలో దేవునికి ఎలాంటి పాత్ర లేనట్లు ఇశ్రాయేలీయులు మోషే మీద విరుచుకుపండటనికి సంసిద్ధమయ్యేవారు. మార్గంలో ఎదరైన శ్రమల గురించి ఫిర్యాదు చేసి ప్రజలు గొణుగుకొన్నప్పుడు తమ ప్రయాణమంతటిలోను మోషే వారికి ఇలా హెచ్చరిస్తూ ఉండేవాడు, “మీరు దేవుని మీద సణుగుతున్నారు. మీకు విడుదల కలిగించింది నేను కాదు దేవుడే?” “మేము .... నీళ్ళు రప్పింప వలెనా?” అవని ఆ బండముందు అతడన్న దుందుడుకు మాటల్ని బట్టి వారి ఆరోపణను ఒప్పుకొన్నట్లే. ఇది వారి అపనమ్మకాన్ని ధ్రువపర్చి వారి సణుగుడులో తప్పులేదని నిరూపించింది. వాగ్దత్త దేశంలో మోషే ప్రవేశాన్ని నిషేదించటం ద్వారా ఈ దురభిప్రాయాన్ని వారి మనసుల్లో నుంచి దేవుడు నిరంతరంగా తొలగించాడు. తమ నాయకుడు కాదని, ప్రభువుదూతయేనని ఈ మాటల్లో వ్యక్తమైనదని తెలపటానికి ఇది తిరుగులేని నిదర్శనం, “ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాటవినవెలను.... నా నామము ఆయనకున్నది”. నిర్గమ కాండము 23:20,21. PPTel 412.1

“యెహోవా మిమ్మునుబట్టి నా మీద కోపపడెను” అన్నాడు మో షే, ఇశ్రాయేలీయుల కళ్ళన్నీ మోషే మీదే ఉన్నాయి. అతడి పాపం దేవునికి చెడ్డ పేరు తెచ్చింది. తాను ఎన్నుకొన్న ప్రజలకు దేవుడు అతణ్ని నాయకుడు చేశాడు. ఆ అతిక్రమం శిబిరమంతా తెలిసింది. ఆ పాపాన్ని పట్టించుకోకుండా విడిచి పెట్టేస్తే రెచ్చగొట్టే పరిస్థితులు ఎదురైనప్పుడు బాధ్యతలు వహించే వ్యక్తులు అవిశ్వాసం అసహనం ప్రదర్శించవచ్చునన్న అభిప్రాయం బలపడేది. కాని ఆ ఒక్క పాపం గురించి మోషే అహరోనులు కనానులో ప్రవేశించరని ప్రకటించినప్పుడు దేవుడు పక్షపాతికాడని అపరాధిని తప్పక శిక్షిస్తాడని ప్రజలు గ్రహించారు. భావి తరాల ప్రజలకు జ్ఞానోదయం కలిగేందుకు గాను ఇశ్రాయేలీయుల చరిత్ర గ్రంధాలకు ఎక్కాల్సి ఉన్నది. ప్రజలందరూ గ్రహించాలి. పాపం అతి భయంకరమైందని గుర్తించేవారు బహు కొద్దిమంది. దేవుడు ఎంతో మంచివాడు గనుక అపరాధిని శిక్షించాడని పొంగిపోతూ చెప్పే మనుషులున్నారు. కాగా దేవుడు తన మంచితనాన్ని ప్రేమను బట్టి విశ్వశాంతికి ఆనందనికి పాపాన్ని ప్రాణాంతకమైన ముప్పుగా పరిగణించి వ్యవహరిస్తాడని బైబిలు చరిత్ర చాటి చెబుతున్నది. PPTel 412.2

మోషే ప్రదర్శించిన చిత్తశుద్ది, విశ్వసనీయత తన అపరాధానికి శిక్షను రద్దు చేయలేకపోయాయి. ప్రజలు చేసిన ఘోర దోషాల్ని దేవుడు క్షమించాడు. కాని ప్రజల పాపాల విషయంలో తాను వ్యవహరించినట్లు ప్రజల్ని నడిపించే నాయకుల దోషాల విషయంలో దేవుడు వ్యవహరించలేకపోయాడు. లోకంలోని మనుషులందరి కన్నా మో షేని దేవుడు ఎక్కువగా ఆదరించాడు. మో షేకి తన మహిమను కనపర్చాడు. మో షేకి ఎక్కువ వెలుగు, జ్ఞానం ఉండటం వల్లే అతడి పాపం మరింత ఘోరపాపమయ్యింది. ఒక తప్పిదాన్ని గతంలోని విశ్వసనీయత పరిహరించలేదు. ఒక వ్యక్తికి ఎంత ఎక్కువ వెలుగు ఎన్ని ఆధిక్యతలు ఉంటే అతడి వైఫల్యం అంత హీనంగాను అతడి శిక్ష అంత కఠినంగా ఉంటాయి. మోషే చేసింది పెద్ద నేరం కాదని మనుషులు భావిస్తారు. అది సాధారణంగా జరిగేదే అంటారు. “అతడు తన పెదవులతో కాని మాట పలికెను” అంటాడు కీర్తనకారుడు. కీర్తనలు 106:33. మానవ దృష్టికి ఇది చిన్న విషయంగా కనిపించవచ్చు. తాను ఎంతో అభిమానించిన, తన నమ్మకమైన సేవకుడి పాపాన్ని కఠినంగా శిక్షిస్తే ఇతరులు చేసినప్పుడు ఆయన దాన్ని ఉపేక్షించడు. ఆత్మసుత్తి, పరనింద దేవునికి హేయం. వీటికి పాల్పడేవారు దైవ సేవ విషయంలో సందేహాలు పుట్టించి నాస్తికుల అపనమ్మకానికి సాకునిస్తారు. వ్యక్తి హోదా ఎంత ఉన్నతమైందైతే అతడి ప్రాబల్యం అంత ఎక్కువగా ఉంటుంది. అతడు సహనాన్ని, అణకువను పెంపొందించుకోటం అంత అగత్యమౌతుంది. PPTel 413.1

దైవ ప్రజల్ని, ముఖ్యంగా బాధ్యత గల హోదాల్లో ఉన్నవారిని, దేవునికి మాత్రమే చెందే మహిమను తమ సొంతం చేసుకోటానికి నడిపించగలిగితే సాతాను ఆనందిస్తాడు. అతడు విజయం సాధించాడు. ఈ విధంగానే అతడు పతనమయ్యాడు. నాశనం కావటానికి ఇతరుల్ని జయప్రదంగా శోధించటంలో అతడు దిట్ట, అతడి పన్నాగాల విషయంలో మనల్ని జాగృతం చేసేందుకు ఆత్మస్తుతి తెచ్చే ముప్పును గురించి తన వాక్యంలో దేవుడు మనకు ఉపదేశమిచ్చాడు. మన ఆలోచనలు, మన భావాలు లేక మన హృదయ వాంఛలు క్షణక్షణం దేవుడికి దేవుడిచ్చే దీవెనేగాని అతడికి రావటానికి దేవుడనుమతించే కష్టమే గాని అదేదైనా, ఆత్మను శోధించటానికి, దాన్ని బాధించి నాశనం చేయటానికి సాతాను ఆ అవకాశాన్ని వినియోగించు కొంటాడు. అందుచేత ఒక వ్యక్తికి ఉన్న వెలుగు ఎంత గొప్పదైనా, దేవుని ప్రసన్నత దీవెనలు ఎంతటివైనా దేవుని ముందు అతడు వినయంగా నడుచుకోవాలి. తన ప్రతీ ఆలోచనననూ, ప్రతీ భావోద్రేకాన్ని అదుపులో ఉంచాల్సిందిగా దేవున్ని వేడుకోవాలి. PPTel 413.2

దేవుని పట్ల భక్తి ఉన్నదని చెప్పేవారందరూ కోపం పుట్టించే పరిస్థితుల్లో తమ క్రైస్తవ స్ఫూర్తిని కాపాడుకోవటం, ఆత్మ నిగ్రహాన్ని పాటించటం తమ పవిత్ర ధర్మంగా భావించాలి. మోషే మీద ఉన్న బాధ్యతలు బరువైనవి. అతడికి వచ్చిన శ్రమలు బహు కొద్దిమందికి మాత్రమే వస్తాయి. అయినా అతడి పాపానికి అవి సాకుకావు. దేవుడు తన ప్రజలకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తాడు. వారు ఆయన మీద ఆధారపడితే వారు పరిస్థితి ఆట వస్తువలు కాబోరు. బలమైన శోధన పాపం చేయటానికి సాకుకాదు. ఆత్మ ఎంతటి ఒత్తిడికి గురి అయినా అతిక్రమం మన చర్య. ఒత్తిడి చేసి ఎవరితోనైనా పాపం చేయించగల శక్తి లోకమంతటిలోనూ ఎవరికీ లేదు. మనం సాతానుకి లొంగనవసంరం లేదు. అతడి దాడి ఎంత అర్థాంతరంగా వచ్చినా దేవుడు మనకు సహాయం అందిస్తాడు. ఆయన శక్తితో మనం విజయం సాధించవచు PPTel 414.1