పితరులు ప్రవక్తలు

36/75

34—పన్నెండుమంది వేగులవారు

హోరేబు పర్వతం నుంచి బయల్దేరిని పదకొండు దినాలకి హెబ్రీ ప్రజలు పారాము అరణ్యంలోని కాదేషు చేరి అక్కడ శిబిరం ఏర్పాటు చేసుకొన్నారు. అది వాగ్రత్త భూమి అయిన కనానుకి దగ్గర్లో ఉన్నది. ఆదేశం ఎలాంటిదో తెలుసుకోటానికి వేగుల వారిని పంపాలని ప్రజలు ఇక్కడ ప్రతిపాదించారు. ఈ విషయాన్ని మోషే ప్రభువు ముందు పెట్టగా ప్రభువు అంగీకరించి ఆ కార్యాచరణకు ప్రతీ గోత్రం నుంచి ప్రధానుల్ని ఎంపిక చేయాల్సిందిగా ఆదేశించాడు. ప్రభువు ఆదేశం మేరకు వ్యక్తుల ఎంపిక జరిగింది. వారు బయల్దేరి వెళ్ళి ఆదేశాన్ని పరిశీలించి అది ఎలాంటి దేశమో, దాని స్థితిగతులేంటో, దాని వనరులేంటో అక్కడ నివసిస్తున్న ప్రజలెలాంటి వారో, వారు బలశాలులో దుర్బలులో, వారి సంఖ్య పెద్దదో చిన్నదో తెలుసుకోమని మోషే చెప్పాడు, ఆ దేశం నేల ఎలాంటిదో, అది సారవంతమైందో కాదో తెలుసుకోవాలని ఆ దేశంలో పండే పండ్లు కొన్ని తేవాలని ఆదేశించాడు. PPTel 379.1

దక్షిణ సరిహద్దు దాటి ఉత్తరాన దేశం చివరిదాకా వెళ్ళి ఆదేశామంతావారు పరిశీలించారు. నలభై దినాల అనంతరం తిరిగి వచ్చారు. ఇశ్రాయేలు ప్రజల్లో గొప్ప ఆశలు రేకెత్తాయి. ప్రజలు ఉత్కంఠంలో కని పెట్టుతున్నారు. గూఢచారులు తిరిగి వచ్చిన వార్త గోత్రంనుంచి గోత్రానికి పాకింది. ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. తాము చేప్పటిన ప్రమాదభరిత కార్యం ముగించుకొని క్షేమంగా తిరిగి వచ్చిన వేగులవారిని చూడటానికి ప్రజలు ఏరువాక సాగారు. ఆ దేశం భూములు ఎంత సారవంతమైనవో చూపించటానికి వారు కొన్ని పండ్లను మచ్చుకు తెచ్చారు. పెద్ద ద్రాక్షగెల ఒకటి తీసుకువచ్చారు. కర్రకు వేలాడగట్టి దాన్ని ఇద్దరు మనుషులు మోయాల్సి వచ్చింది. అంత పెద్దది అది. అక్కడ సమృద్ధిగా పండే అంజూరపు పండ్లను, దానిమ్మ పండ్లను కూడా తీసుకువచ్చారు. PPTel 379.2

అంతమంచి దేశాన్ని సొంతం చేసుకొనే భాగ్యం తమకు కలిగినందుకు ప్రజలు సంతోషానందాల్తో గంతులు వేశారు. ఆదేశాన్ని గూర్చిన నివేదికను మోషేకు సమర్పింస్తుండగా అందులో ఒక మాటకూడా పోకుండా వినాలన్న వాంఛతో ప్రజలు ఆసక్తిగా విన్నారు. మోషేతో వారిలా అన్నారు. “నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి. అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. దాని పండ్లు ఇవి”. ప్రజలు ఉత్సా హంతో ఉరకలు వేస్తున్నారు. దేవుని మాట ప్రకారం వెంటనే బయలుదేరి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోటానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే, ఆ దేశ సౌందర్యాన్ని భూసారాన్నీ వర్ణించిన తర్వాత ఇద్దరు మినహా వేగులవారందరూ ఇశ్రాయేలీయులు కనాన్ను జయించటానికి పూనుకొంటే వారికి ఎదురయ్యే కష్టాలు ప్రమాదాల్ని చిత్రీకరించారు. ఆ దేశం వివిధ ప్రాంతాల్లో ఉన్న శక్తివంతమైన రాజ్యాల్ని పేర్కొన్నారు. అక్కడి నగరాలు చుట్టూ బలమైన గోడలు కలిగిన మహానగరాలని అక్కడ నివసించే ప్రజలు బలశాలురని వారిని జయించటం అసాధ్యమని చెప్పారు. తాము ఆజాన బాహులైన అనాకీయుల్ని అక్కడ చూశామని ఆ దేశాన్ని సొంతం చేసుకొనే ప్రయత్నం వ్యర్థప్రయత్నమని హెచ్చరించారు. PPTel 379.3

ఇప్పుడు దృశ్యం మారింది. సాతాను ప్రేరేపంచిన, నిరుత్సాహంతో నిండిన, విశ్వాసం కోల్పోయిన హృదయాలతో గూఢచారులు వ్యక్తం చేసిన భావజాలం వల్ల నిరీక్షణ ఉద్రేకం స్థానంలో పిరికితనం నిస్పృహ చోటు చేసుకొన్నాయి. వారి అవిశ్వాసపు క్రీడ సమాజం మీద పడింది. తమ పక్షంగా తరచు దేవుడు ప్రదర్శించిన శక్తి ప్రభావాల్ని ప్రజలు మర్చిపోయారు. ప్రజలు నిలిచి ప్రశాంతంగా ఆలోచించలేదు. అంతవరకూ తమను విడిపించిన ప్రభువు తమకు ఆదేశాన్ని తప్పక ఇస్తాడని వారు హేతుబద్ధంగా ఆలోచించలేదు. సముద్రంలో తమకు మార్గం ఏర్పాటు చేసి వెనుక తరుముకొంటూ వస్తున్న తమ హింసకుడు ఫరో సైన్యాన్ని నాశనం చేసి దేవుడు తమను ఎలా రక్షించాడో స్ఫురణకు తెచ్చుకోలేదు. ఆ సమస్యతో దేవునికి సంబంధం లేదనట్లు, తమబహుబలం మీదే తాము ఆధారపడి పని చేయాలన్నట్లు వ్యవహరించారు. PPTel 380.1

తమ విశ్వాసం వల్ల వారు దేవుని శక్తిని పరిమితం చేశారు. క్రితంలో తమను సురక్షితంగా నడిపించిన హస్తాన్ని నమ్మలేకపోయారు. మోషే మీద అహరోను మీద సణగటమన్న తమ పూర్వపు తప్పిదాన్నే మళ్ళీ చేశారు. “మన ఆశలు నిరీక్షణలకు అంతం ఇదేనన్న మాట.సాధ్వీనం చేసుకోటానికి గాను మనం ఐగుప్తు నుంచి ప్రయాణించి వచ్చిన దేశం ఇదన్నమాట”అన్నారు. ప్రజల్ని మోసం చేసి ఇశ్రాయేలీయుల మీదికి శ్రమలు తెచ్చారంటూ నాయకుల్ని నిందించారు. ప్రజలు తీవ్ర ఆశాభంగానకి నిస్పృహకు గురి అయ్యారు. PPTel 380.2

గొణుగుకొంటున్న స్వరాల నడుమ వేదనతో కూడిన ఏడ్పు వినిపించింది. పరిస్థితిని కాలేబు అవగతం చేసు కొన్నాడు. దైవ వాక్యాన్ని సమర్థించటానికి ధైర్యంగా నిలబడి అపనమ్మకంగా ఉన్న తన సహచరుల దుష్ప్రభావాన్ని ప్రతిఘటించటానికి తన శక్తిమేరకు ప్రయత్నించాడు. ఆ దేశం గురించి నిరీక్షణను ధైర్యాన్ని పుట్టించే మాటలు వినటానికి ప్రజలు కొంతసేపు గొడవ చేయకుండా నిశ్శబ్దంగా ఉన్నారు. తనకు ముందు మాట్లాడిన వారి మాటల్ని కాలేబు ఖండించలేదు. గోడలు ఎత్తయినవే. కనానీయులు బలమైనవారే, అయితే నేమి? దేవుడు దాన్ని ఇశ్రాయేలీయులకి వాగ్దానం చేశాడు అన్నాడు. “మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాని స్వాదీన పరచుకొందుము, దాని జయించుటకు మన శక్తి చాలును” అంటూ కాలేబు విజ్ఞాపన చేశాడు. కాని తక్కిన పదిమందీ అతడికి అడ్డుతగిలి లోగడకన్నా మరింత భయంకర దృశ్యాన్ని చిత్రించారు. “ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలము.... దానిలో మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు....అక్కడ.....అనాకు వంశపు సెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి. వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి”. PPTel 380.3

తప్పుతోవ పట్టిన ఈ వ్యక్తులు కాలేబుకు యెహోషువాకు మోషేకి దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డారు. ప్రతీ ముందడుగూ వారిని మరింత దృఢచిత్తుల్ని చేసింది. కనానుని స్వాధీన పర్చుకోటానికి జరిగే కృషిని దెబ్బతీయటానికి వారు కృత నిశ్చయంతో ఉన్నారు. తమ దుష్ర్పభావన్ని కొనసాగించేందుకు సత్యాన్ని వక్రీకరించారు. ఆ దేశం “తన నివాసులను భక్షించుదేశము” అన్నారు. అది చెడ్డ సమాచారమేకాదు తప్పుడు సమాచారం కూడా. అది పొంతనలేని నివేదిక. అది పండ్లతో నిండి వృద్దిగాంచుతున్న దేశమని ప్రజలు ఉన్నత దేహులని వేగులవారు నివేదించారు. అది “తన నివాసులను భక్షించ్చేటంత అనారోగ్యకరమైన దేశమైతే ఆ అభివృద్ధి అసాధ్యం. మనుషులు తమ హృదయాల్లో అపనమ్మకానికి చోటిస్తే వారు సాతాను నియంత్రణ కింద ఉంటారని సాతాను వారిని ఎంతవరకూ తీసుకువెళ్తాడో అన్నది ఎవరూ చెప్పలేరు. PPTel 381.1

“అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి యెలుగెత్తి యేడ్చిరి” వెనువెంటనే తిరుగుబాటు, విద్రోహచర్యలు ప్రారంభమయ్యాయి. పరిస్థితి సాతాను నియంత్రణ కింద ఉన్నది. ప్రజలు ఆలోచనశక్తిని కోల్పోయారు. మోషేని ఆహరోనుని శపించారు. తమ దుష్ట ప్రసంగాల్ని మేఘ స్తంభంలోనుంచి దేవుడు వింటున్నాడని ఆ మేఘస్తంభంలో ఆసీనుడైన ఆయన సముఖపు దూత తమ కోపోద్రేకాల్ని వీక్షిస్తున్నాడని మర్చిపోయారు. “అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు? ఈ అరణ్యములో మేమేల చావలేదు”? అని కేకలు వేశారు. అనంతరం వారు దేవుణ్ని నిందించటం మొదలు పెట్టారు. “మేము కత్తి పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఏల తీసికొని వచ్చెను? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు. తిరిగి ఐగుప్తుకు పోవుట మాకు మేలు కదా? అని వారితో అనిరి. వారు - మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళుదమని ఒకనితో ఒకడు” చెప్పుకొన్నారు. తాము స్వాధీనం చేసుకోలేని దేశాన్ని వాగ్దానం చేయటం ద్వారా తమను మోసం చేశారని ఇలా వారు మో షేనే కాదు దేవుణ్ని సైతం నిందించారు. తామనుభవిస్తున్న శ్రమలనుంచి, బానిసత్వనుంచి సర్వశక్తిగల దేవుడు తన బాహుబలంచేత ఏ దేశంలో నుంచి తమను రక్షిచాడో ఆ ఐగుప్తుకి తమను తిరిగి నడిపించటానికి ఒక నాయకుణ్ని నియమించుకునేంత వరకు వారు వెళ్ళారు. PPTel 381.2

అంతట తీవ్రంగా క్షోభిస్తూ, వారి దుందుడుకు సంకల్పాన్ని మార్చటం ఎలాగో తెలియక దీనమనస్సుతో “మోషే”, ఆహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడిరి.” రెచ్చిపోతున్న ప్రజల్ని శాంతపర్చటానికి కాలేబు యెహోషువాలు ప్రయత్నించారు. సంతాపం, ఆగ్రహాలికి సూచనగా తమ బట్టలు చింపుకొని ప్రజలమధ్యకు వెళ్ళి తుఫానల్లే హోరు పెడున్న వారి విలాపాలకు పైగా వినిపించే స్వరంతో ఇలా అన్నారు. “మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మనయందు ఆనందించిన యెడల ఆదేశములో మనలకు చేర్చి దానిని మనకిచ్చును . అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి. ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు. వారి నీడ వారి మీదనుండి తొలగిపోయేను, యెహోవా మనకు తోడైయున్నాడు. వారికి భయపడకుడి.” PPTel 382.1

కనానీయులు దుర్నీతి దుర్మార్గతల కుంచం నిండింది. వారిని ప్రభువు ఇక సహించడు. దేవుడు తన కాపుదలను తొలగిస్తే వారిని జయించటం నల్లేరు పై బండినడకే. దేవుని నిబంధన ప్రకారం ఆ దేశం ఇశ్రాయేలీయులది. కాని వారు అపనమ్మకస్తులైన వేగులవారి తప్పుడు కథనాన్ని విశ్వసించారు. ఆవిధంగా ఆ సమాజమంతా మోసపోయింది. నమ్మకద్రోహులు తమ పని తాము చేశారు. ఇద్దరు మాత్రమే అబద్ధ నివేదిక సమర్పించి తక్కిన పదిమందీ ప్రభువు నామంలో ఆ దేశాన్ని స్వాధీన పర్చుకొందామంటూ ప్రజల్ని ప్రోత్సహించి ఉంటే, అప్పుడు కూడా తమ అవిశ్వాసం కారణంగా ఆ ప్రజలు ఆ యిద్దరి నివేదికనే అంగీకరించి ఉండేవారు. అయితే ఇక్కడ పదిమంది తిరుగుబాటు నెగళ్ళు ఎగదోస్తుండగా ఇద్దరు మాత్రమే నడుంకట్టి నిజానికి నిలబడ్డారు. PPTel 382.2

విశ్వసనీయతలేని ఆ పదిమింది వేగులవారూ కాలేబు యెహోషువాల్ని తీవ్రంగా ఖండిస్తూ వారిని రాళ్ళతో కొట్టి చంపమని కేకలు వేశారు. నిజాయితీ పరులైన ఆ ఇద్దరినీ రాళ్లు రువ్వి చంపటానికి ఉన్మాదులైన ఆ జనులు రాళ్ళు తీశారు. పిచ్చి కేకలు వేస్తూ ముందుకు వెళ్ళారు. అర్థంతరంగా వాళ్ళచేతుల్లోని రాళ్లు కింద పడ్డాయి. కోలాహలమంతా సద్దుమణిగింది. వారు భయంతో గజగజ వణుకు తున్నారు. వారు తల పెట్టిన అఘాయిత్యాన్ని ఆపటానికి దేవుడు కలుగజేసుకొన్నాడు. భగభగ మండే వెలుగులా ఆయన సన్నిధి ప్రకాశతతో గుడారం నిండింది. ప్రజలంతా ప్రభువు సూచనను కళ్లారా చూశారు. తమకన్నా ఎంతో బలమైన ప్రభువు తన్నుతాను ప్రత్యక్షపర్చుకొన్నాడు. ఇక ఎవరూ ప్రతిఘటించలేదు. అబద్ద నివేదికను తెచ్చిన గూడచారులు భయంతో నక్కి నెమ్మదిగా తమ గుడారాలికి వెళ్లిపోయారు. PPTel 382.3

మోషే లేచి గుడారంలోకి వెళ్ళాడు అప్పుడు ప్రభువు మోషేతో ఇలా అన్నాడు “నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులుచేత వారిని హతముచేసి, యీ జనముకంటే మహాబలముగల గొప్ప జనమునుపుట్టించెదను” అయితే తన ప్రజల పక్షంగా మోషే మళ్ళీ విజ్ఞాపన చేశాడు. వారు నాశనం కావటానికి తాను మహశక్తిగల రాజ్యంగా రూపొందటానికి మోషే సమ్మతించలేదు. కరుణించమని ఆర్థిస్తూ ఇలా ఉన్నాడు. “యెహోవా దీర్ఘ శాంతుడును, కృపాతిశయుడును...... నైయున్నావని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువు యొక్క బలము ఘనపరచబడునుగాక, ఐగుప్తులోనుండి వచ్చినది మొదలుకొని యిది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించియున్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుము”. PPTel 383.1

ఇశ్రాయేలీయుల్ని తక్షణ నాశనం నుంచి కాపాడ్డానని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే తమ అవిశ్వాసం, పిరికితనం కారణంగా వారు తమ శత్రువుల్ని జయించటానికి తన శక్తిని ప్రదర్శించనన్నాడు. అందుచేత వారు ఎర్రసముద్రం దిశగా తిరిగి వెళ్ళటమే తమకు క్షమమని చెప్పాడు. PPTel 383.2

తిరుగుబాటు ధోరణిని ప్రదర్శించిన తరుణంలో ప్రజలు ఉద్వేగంగా “ఈ అరణ్య ములో మేమేల చావలేదు?” అన్నారు. ఇప్పుడు ఆ ప్రార్థన నెరవేరనుంది. ప్రభువిలా అన్నాడు. “మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ యెడల చేసెదను. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును, మీ లెక్క మొత్తమును చొప్పున మీలో లెక్కింపబడిన వారందరు, అనగా ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయముగలిగి నాకు విరోధముగా సణిగిన వారందరు రాలిపోవుదురు...... అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆదేశము లోపలికి రప్పించెదను. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రిచకొనెదరు”. కాని కాలేబు గురించి ఆయన ఇలా అన్నాడు, “నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువుచేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశ పెట్టెదను. అతని సంతతికి దాని స్వాధీన పరుచుకొనును.” వేగులవారు ప్రయాణంలో నలభై దినాలు గడిపినట్లే ఇశ్రాయేలీయులు ఆ అరణ్యములో నలభై సంవత్సరాలు తిరుగుతారన్నాడు. PPTel 383.3

దైవ తీర్మానాన్ని మోషే ప్రజలకు తెలియపర్చినప్పుడు వారికోపం సంతాపంగా మారింది. తమ శిక్ష న్యాయమైందేనని వారుగుర్తించారు. అపనమ్మకంగా ఉన్న ఆ పదిమంది వేగులవారూ దేవుడు పంపిన తెగుళ్ళకుగురై ఇశ్రాయేలీయుల కళ్ళముందు మరణించారు. వారికి కలిగిన శిక్షను బట్టి తమ గతి ఏమి కానుందో ప్రజలు నిస్పష్టంగా గ్రహించారు. PPTel 384.1

తమ పాపవర్తనను గూర్చి వారు ఇప్పుడు యధార్థంగా పశ్చాత్తాపం పొందినట్లు కనిపించారు. తమ కృతఘ్నత, అవిధేయతల్ని గూర్చి కాక తమ దుష్కార్య పర్యవసానాన్ని గూర్చి వారు పశ్చాత్తాపపడ్డారు. తాను విధించిన శిక్షను ప్రభువు రద్దు చేయకపోవటంతో వారి ధిక్కార వైఖరి తిరిగి వచ్చింది. ప్రభువు చెప్పినట్లు అరణ్యంలోకి తిరిగి వెళ్ళం అని మొరాయించారు. తమ శత్రువుల దేశంలోనుంచి నిష్క్రమించాల్సిందంటూ ఆదేశించటంలో దేవుడు వారి కపట విదేయతను పరీక్షించాడు. అది వాస్తవమైంది కాదని ఆ పరీక్ష నిగ్గుతేల్చింది. దేవునికి విధేయులు కావలసిందిగా తమను బతిమాలిన ఇద్దరు వేగులవారిని దుందుడుకు తనంతో చంపజూడటం గొప్ప పొరపాటనివారు గుర్తించారు. తాము ఘోర అపరాధం చేశామని గుర్తించి భయకంపితులయ్యారు. దాని పర్యవసానం ప్రాణాంతకమని గుర్తించారు. వారి హృదయాలు మాత్రం మారలేదు. చిన్న సాకు దొరికితే మళ్ళీ అదే విధంగా వ్యవహరించటం ఖాయం. దేవుని ఆజ్ఞ మేరకు వారు తిరిగి అరణ్యంలోకి వెళ్ళాల్సిందిగా మోషే చెప్పినప్పుడు ఇదే జరిగింది. PPTel 384.2

నలభై ఏళ్ళ వరకు ఇశ్రాయేలీయులు కనాను దేశంలో ప్రవేశించటానికి లేదు అన్న దైవాజ్ఞ మో షేకి, అహరోనికి, కాలేబుకి, యెహోషువారి తీవ్ర ఆశాభంగం కలిగించింది. అయినా దైవ నిర్ణయాన్ని వారు అంగీకరించారు. కాగా దేవుడు తమతో వ్యవహరించిన తీరును గూర్చి అసంతృప్తి చెంది ఫిర్యాదులు చేస్తూ తిరిగి ఐగుప్తుకి వెళ్లిపోతామన్న ప్రజలు తాము తృణీకరించిన ఉపకారాన్ని తొలగించినప్పుడు ఎంతో దు:ఖించి గొణుగుకొన్నారు. కారణమేమీ లేకపోయినా వారు గొణిగేవారు. ఇప్పుడు దు:ఖించటానికి దేవుడు ఒక కారణం ఇచ్చాడు. తమ పాపం తమ దృష్టికి వచ్చినప్పుడు వారు దు:ఖించి ఉంటే ఈ శిక్ష కలిగేది కాదు. వారు తమ శిక్షను గురించి దు:ఖించారు. వారి దు:ఖం పశ్చాత్తాపం కాదు. కనుక అది తమకు కలిగించిన శిక్షను మార్చ లేకపోయింది. PPTel 384.3

వారు రాత్రంతా విలపించారు. ఉదయం రావటంతో నిరీక్షణ కలిగింది. తమ పిరికతనాన్ని విడనాడి ధైర్యంగా ముందుకు సాగాలని నిశ్చయించుకొన్నారు. వెళ్లి ఆ దేశాన్ని స్వాధీనపర్చుకోవాల్సిందిగా దేవుడు ఆదేశించినప్పుడు వారు నిరాకరించారు. ఇప్పుడు వెనక్కి వెళ్లమని దేవుడు ఆజ్ఞాపించగా వారు అదే విధంగా ఎదురు తిరిగారు. ఆ దేశాన్ని స్వాధీన పర్చుకోవాలని నిర్ధారించుకొన్నారు. ఆ కార్యాన్ని దేవుడు అంగీకరించి తమ విషయంలో ఆయన ఉద్దేశం మార్చుకొంటాడేమో అనుకొన్నారు. తాను నిశ్చయించిన సమయంలో కనానులో ప్రవేశించే ఆధిక్యతను విధిని దేవుడు వారికి ఇచ్చాడు. అయితే వారు కావాలని అశ్రద్ధ చేయటం ద్వారా ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నారు. వారిని కనానులో ప్రవేశించకుండా చేసి సాతాను తన లక్ష్యాన్ని సాధించాడు. కనానును స్వాధీన పర్చుకోటంలో తమతో పనిచేసే దేవుని శక్తిని వారు శంకించారు. ఇప్పుడు దేవుని సహాయం లేకుండా తమ సొంత శక్తిమీద ఆధారపడి ఆ కార్యాన్ని సాధించగలమని భావించారు. “మేము యెహోవాకు విరోధముగా పాపము చేసితిమి, మా దేవుడైన యెహోవా మాకాజ్ఞాపించిన మాటలన్నిటిననుసరించి మేము పోయి యుద్ధము చేసెదము” అని కేకలు వేశారు. ద్వితీ 1:41. తమ అతిక్రమం వల్ల వారు అంతగా అంధులయ్యారు. వారు “పోయి యుద్ధము” చేయాలని దేవుడు ఆదేశించలేదు. యుద్ధ తంత్రం ద్వారా వారు ఆదేశాన్ని స్వాధీనపర్చుకోవాలన్నది దేవుని ఉద్దేశం కాదు. వారు తన ఆజ్ఞల్ని నిష్టగా ఆచరించటం ద్వారా. PPTel 385.1

వేగులవారి నివేదిక విషయమై బుద్దిహీనంగా తిరుగుబాటు చేసి చేసిన పాపానికి హృదయాల్లో మార్పు చోటు చేసుకోకపోయినా దాని ఒప్పుకోటానికి వారు సంసిద్ధ మయ్యారు. తాము దుందుడుకుగా నిరాకరించిన దీవెన విలువను ఇప్పుడు గ్రహించగలిగారు. తమ అవిశ్వాసమే తమను కనానులో ప్రవేశించకుండా చేసిందని ఒప్పుకొన్నారు. “మేము పాపము చేసిన వారము” అని తప్పు తమదేగాని తమకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయాడంటూ తాము నిందించిన దేవునిది కాదని ఒప్పుకొన్నారు. వారి ఒప్పుకోలు యధార్థ పశ్చాత్తాపం వలన కలిగింది కాకపోయినా వారి విషయంలో దేవుడు తీసుకొన్న చర్య న్యాయమైనదని నిరూపించటానికి అది తోడ్పడింది. PPTel 385.2

తన న్యాయశీలత విషయమై మనుషులకు గుర్తింపు కలిగించటం ద్వారా తన నామాన్ని ఘనపర్చుకోటానికి ఇప్పుడు కూడా దేవుడు ఈ విధంగానే పనిచేస్తాడు. ఆయనను ప్రేమిస్తున్నామని చెబుతూనే ఆయనను గూర్చి ఫిర్యాదు చేసేవారు, ఆయన వాగ్దానాల్ని తృణీకరించేవారు, శోధనకు లొంగి దుష్ట దూతలతో చెయ్యి కలిపి దేవుని ఉద్దేశాల్ని వ్యతిరేకించేవారి సందర్భంలో ప్రభువు పరిస్థితుల్ని నిభాయించినందువల్ల వారు తమ పాపాన్ని గుర్తించి తమ దుర్మార్గతను ఒప్పుకొని తమతో దేవుడు వ్యవహరించిన తీరు న్యాయమైంది శ్రేయోదాయకమైంది అని అంగీకరించి తీరుతారు. చీకటి కార్యాల గుట్టురట్టు చేయటానికి కృషి చేసేందుకు దేవుడు ఇలా సాధనాల్ని స్థాపిస్తాడు. దుర్మార్గతకు జన్మనిచ్చిన స్వభావం పూర్తిగా మారకపోయినా ఈ ఒప్పుకోళు దేవుని ఘనపర్చటానికి, తప్పును గద్దించిన ప్రభువు నమ్మకమైన సేవకుల్ని సమర్థించటానికి ఉపకరించాయి. చివరగా దేవుని ఉగ్రత ప్రదర్శితమైనప్పుడు ఇలాగే ఉంటుంది. “అందరికి తీర్పు తీర్చుటకు... ప్రభువు తన వేవేల పరిశుద్దుల పరివారముతో” వచ్చేటప్పుడు భక్తిహీనులందరును వారి భక్తిహీన క్రియలన్నిటిని” ఆయన “ఒప్పింప” జేస్తాడు. యూదా 14, 15. ప్రతీ అపరాధి తనకు వచ్చిన శిక్ష న్యాయమైందని అంగీకరిస్తాడు. PPTel 385.3

దైవాదేశాన్ని లెక్కచేయకుండా ఇశ్రాయేలీయులు కనానుని జయించటానికి పూనుకొన్నారు. యుద్ధకవచాలు, ఆయుధాలు ధరించి యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని భావించారు. కాని దేవుని దృష్టిలోను దు:ఖిస్తున్న దైవ సేవకుల దృష్టిలోను వారిలో తీవ్రమైన లోటులున్నాయి. దాదాపు నలభై సంవత్సరాల అనంతరం ఎరికోను స్వాధీనపర్చుకోమని ప్రభువు ఆదేశించినప్పుడు వారితో వస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ధర్మశాస్త్రం నిక్షిప్తమై ఉన్న మందసాన్ని ఇశ్రాయేలు సైన్యానికి ముందు మోసుకొని వెళ్ళారు. ప్రజల చలనాన్ని దేవుడు నియమించిన నాయకుల పర్యవేక్షణ కింద నియంత్రించాల్సి ఉంది. ఆ విధంగా దేవుని నడుపుదల కింద వారికి ఎలాంటి హానీ సంభవించటానికి లేదు. మరి ఇప్పుడు, దేవుని ఆదేశానికి విరుద్ధంగా, తమ నాయకులు వద్దంటూ నిగ్రహిస్తుండగా, మందసం లేకుండా, మోషే లేకుండా శత్రు సేనల్ని ఎదుర్కోటానికి వారు బయలుదేరారు. PPTel 386.1

యుద్ధ హెచ్చరిక చేస్తూ బూరధ్వని వినిపించగా మోషే ఈ హెచ్చరిక చేస్తూ వారి వెంట వెళ్లాడు, “ఇది ఏమి? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యలేడు గనుక మీ శత్రువులయెదుట హతము చేయబడుదురు; మీరు సాగిపోకుడి. ఏలయనగా అమాలేకీయులు, కనానీయులు ముందుగా అక్కడికి చేరియున్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు”. PPTel 386.2

ఈ ప్రజల్ని కాపాడూ వస్తున్న అగోచర శక్తిని గూర్చి, వారి పక్షంగా దేవుడు చేసిన అద్భుతాల్ని గూర్చి కనానీయులు విన్నారు. ఇప్పుడు దాడి చేయనున్న ఈ ప్రజల్ని ఎదుర్కొనటానికి వారు గొప్ప సైన్యాన్ని సమకూర్చుకున్నారు. దాడి చేస్తున్న ఈ సైన్యానికి నాయకుడు లేడు. తమకు విజయం చేకూర్చమంటూ వీరిలో ఎవరూ ప్రార్థన చేయలేదు. తమ దుర్గతిని మార్చుకోవటమో లేదా రణరంగంలో మరణించటమో అన్న తెగింపు మాత్రమే వీరిలో కనిపించింది. యుద్ధ నైపుణ్యం లేకపోయినా వారిది ఆయుధాలు ధరించిన పెద్ద జనసమూహం. హఠాత్తుగా దాడి జరిపి తమ శత్రువుల్ని హతమార్చాలను కొన్నారు. తమ పై దాడి చేయటానికి చేవలేని శత్రువుకి వారు సవాలు విసిరారు. PPTel 386.3

కనానీయులు ఎత్తయిన పీఠభూమి పై స్థావరం ఏర్పాటు చేసుకొన్నారు. కష్టమైన కొండ సందులగుండా ప్రమాదకరమైన ఎత్తులకు ఎగబాకటం ద్వారా మాత్రమే ఆ ప్రదేశానికి వెళ్లటం సాధ్యం. విస్తారమైన తమ జన సంఖ్యే ఇశ్రాయేలు ప్రజల ఘోర పరాజయానికి కారణం కానుంది. ఆ పర్వత సందులు దాటుకొంటూ నెమ్మదిగా వారు తమ ప్రయాణం సాగిస్తున్న తరుణంలో పైనున్న శత్రువులకు సులభమైన గురి అయ్యారు. వారు పైనుంచి పెద్ద బండల్ని దొర్లించగా ఇశ్రాయేలీయుల మార్గం రక్తపు దారిగా మారింది. పైకి ఎక్కగలిగినవారు అలసిపోయినందువల్ల శత్రువుల చేతిలో ఓడిపోయి వెనుకంజ వేయాల్సి వచ్చింది. ఇశ్రాయేలీయుల సైన్యం సర్వనాశన మయ్యింది. తిరుగుబాటుతో జరిగిన ఆ ప్రయోగ ఫలితం మరణం, విధ్వంసం. PPTel 387.1

మిగిలి ఉన్నవారు చావుతప్పి కన్ను లొట్టపోయి “తిరిగివచ్చి యెహోవా సన్నిధిని యేడ్వగా “వారి మొర యెహోవా లక్ష్య పెట్టలేదు” ద్వితి. 1:45. గతంలో ఇశ్రాయేలీయుల రాకను గూర్చి విన్నప్పుడు భయంతో వణికిన కనానీయులు ఇప్పుడు తమ విజయంవల్ల ధైర్యం తెచ్చుకొని వారిని ప్రతిఘటించటం మొదలు పెట్టారు. తన ప్రజలైన ఇశ్రాయేలీయుల నిమిత్తం దేవుడు చేసినట్లు తాము విన్న అద్భుత కార్యాల్ని అబద్దాలని ఇప్పుడు వారు నమ్మారు. తాము భయపడాల్సిన పనిలేదని ధీమాగా ఉన్నారు. ఇశ్రాయేలీలయులకి కలిగిన ఆ మొదటి ఒటమి కనానీయుల్లో ధైర్యాన్ని, పట్టుదలను రగిలించింది. అందువల్ల ఇశ్రాయేలీయుల విజయానికి ఆటంకాలు, అడ్డంకులు అధికమయ్యాయి. గత్యంతరం లేక ఇశ్రాయేలీయులు తమ శత్రువుల దాడినుంచి తప్పించుకోటానికి మళ్లీ అరణ్యంలో సంచరించాల్సివచ్చింది. ఆ తరం వారంతా అరణ్యంలోనే గతించి పోతారన్న స్పృహతోనే మళ్లీ అరణ్యంలో ప్రవేశించారు. PPTel 387.2