పితరులు ప్రవక్తలు

33/75

31—నాదాబు అబీహుల పాపం

గుడార ప్రతిష్ఠత జరిగినప్పుడు యాజకుల్ని తమ పవిత్ర పరిచర్యకు అంకితం చేయటం జరిగింది. ఈ కార్యం ప్రత్యేకాచారాలతో ఏడు రోజుల పాటు సాగిన మీదట ఎనిమిదోనాడు యాజకులు తమ పరిచర్యను ప్రారంభించారు. కుమారుల సహాయంతో అహరోను దేవుడు కోరిన బలులు అర్పణలు అర్పించి చేతులు పైకెత్తి ప్రజల్ని ఆశీర్వదించాడు. దేవుడు ఆజ్ఞాపించినట్లే సమస్తం జరగ్గా దేవుని మహిమ ప్రదర్శితమయ్యింది. ప్రభువు సన్నిధినుంచి అగ్ని దిగివచ్చి బలిపీఠం మీది బలిని దహించింది. విచిత్రమైన ఈ శక్తి ప్రదర్శనను ప్రజలు భక్తి శ్రద్ధలతో తిలకించారు. అందులో దేవుని మహిమకు కృపకు సూచనలు చూసి ప్రభువు ప్రత్యక్ష సన్నిధిలో ఉన్నట్లు సాష్టాంగపడి నమస్కరించారు. PPTel 348.1

అయితే అర్థాంతరంగా ప్రధాన యాజకుడి కుటుంబం విషాదానికి గురి అయ్యింది. దైవారాధన జరుగుతున్న సమయంలో ప్రజల ప్రార్థనలు స్తోత్రగానాలు పైకి లేస్తున్న తరుణంలో అహరోను ఇద్దరు కుమార్లు ధూపారులు పట్టుకొని ప్రభువుకి పరిమళ ధూపం అర్పించే ప్రక్రియలో “వేరొక అగ్నిని” తెచ్చి ప్రభువు ఆజ్ఞను అతిక్రమించారు. ధూపం వేయటానికి దేవుడు వెలిగించిన పరిశుద్ధాగ్నినిగాక వారు సామాన్య అగ్నిని ఉపయోగించారు. ఆ పరిశుద్దాగ్నిని మాత్రమే ఉపయోగించాలన్నది దేవుని ఆదేశం. ఈ పాపానికి శిక్షగా దేవుని సన్నిధి నుంచి అగ్ని బయలుదేరి ప్రజలు చూస్తుండగా వారిని దహించివేసింది. PPTel 348.2

ఇశ్రాయేలు ప్రజల మధ్య మోషే అహరోన్లు తర్వాత, నాదాబు, అబీహులది ఉన్నత స్థానం. పర్వతం మీద డబ్బయిమంది పెద్దలతోపాటు వీరిని కూడా తన మహిమను వీక్షింపనిచ్చి ప్రభువు వీరిని సన్మానించాడు. కనుకనే వారి అతిక్రమం క్షమించరానిది. ఇదంతా వారి పాపాన్ని భయంకర పాపంగా రూపొందించింది. మనుషులికి గొప్ప వెలుగు వచ్చింది గనుక, వారు ఇశ్రాయేలీల రాకుమారులల్లే పర్వతం ఎక్కటానికి, దేవునితో మాట్లాడటానికి, ఆయన మహిమలో నివసించటానికి విశిష్టావకాశం పొందారు గనుక తాము పాపం చేసి శిక్ష తప్పించుకోవచ్చునని, తమను దేవుడు సన్మానిస్తున్నాడు గనుక తమను శిక్షించడని ఊహించటానికి లేదు. ఇది గొప్ప మోసం. PPTel 348.3

దేవుడు అనుగ్రహించిన గొప్ప వెలుగు, విశేషావకాశాలు వెలుగుకు తగిన నీతిని, పరిశుద్ధతను తిరిగి కోరుతున్నాయి. ఇందులో ఏ కొంచెం కొదవనూ దేవుడు అంగీకరించడు. గొప్ప దీవెనలు గొప్ప ఆధిక్యతలు భద్రతను గాని అజాగ్రత్త భావాన్నిగాని కలిగించకూడదు. అవి పాపానికి అనుమతి కాకూడదు. దేవుడు తమతో ఖచ్చితంగా వ్యవహరించడన్న అభిప్రాయం అవి వారిలో పుట్టించకూడదు. దేవుడు చేసే ఉప కారాలన్నీ, ఆత్మకు ఉత్తేజాన్ని కృషికి ఉత్సాహాన్ని, ఆయన చిత్తం నెరవేర్పుకు శక్తిని సమకూర్చే సాధనాలు. PPTel 349.1

నాదాబు అబీహులు తమ యౌవనకాలంలో ఆత్మ నిగ్రహాన్ని పాటించలేదు. తండ్రి మెతక స్వభావం, నీతి విషయంలో అతడి బలహీన వైఖరి అతడు తన పిల్లల్ని క్రమశిక్షణలో పెంచటం అశ్రద్ధ చేయటానికి దారి తీశాయి. అహరోను తన పిల్లల్ని విచ్చలవిడిగా ప్రవర్తించనిచ్చాడు. ఎంతోకాలంగా అలవాటు పడ్డ దురభ్యాసానికి వారు బానిసలయ్యారు. అతి పవిత్రమైన బాధ్యతలు కూడా ఈ దురభ్యాసాల్ని మాన్పలేక పోయాయి. వారు తండ్రిని గౌరవించటం నేర్చుకోలేదు. అందుచేత దైవ నిబంధనల్ని నిష్కర్షగా ఆచరించాల్సిన విధిని గుర్తించలేదు. కుమారులపట్ల అహరోను తప్పుడు ఆప్యాయత దేవుని తీర్పుకు గురికావటానికి వారిని సిద్ధం చేసింది. PPTel 349.2

ప్రజలు తన సన్నిధిలోకి బయంతోను భక్తిభావంతోను తాను నిర్దేశించిన తీరుగాను రావాలని నేర్పించాలన్నది దేవుని ఉద్దేశం. ఆయన పాక్షిక విధేయతను అంగీకరించడు. ఈ పరిశుద్ధ ఆరాధన సమయంలో ఆయన ఆదేశించినట్లు దాదాపు అంతా జరగటం చాలదు. తన ఆజ్ఞల్ని పాటించినవారి పై సామాన్యమైన వాటికి పరిశుద్ధమైనవాటికి మధ్య వ్యత్యాసం చూపించనివారి పై దేవుడు శాపం ప్రకటించాడు. PPTel 349.3

ప్రవక్త ద్వారా ఆయనిలా ప్రకటించాడు, “కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొనువారికి శ్రమ... తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ యెన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకొను వారికి శ్రమ......వారు....... నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడ చేయుదురు. సైన్యములకధి పతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు” యెషయా 5:20-24. PPTel 349.4

దేవుని ఆజ్ఞల్లో ఒక భాగం ప్రాముఖ్యమైంది కాదని లేదా తాను ఆజ్ఞాపించిన దాని స్థానే ప్రత్యామ్నాయాన్ని ఆయన అంగీకరిస్తాడని భావిస్తూ ఎవరూ మోసపోకుందురుగాక. యిర్మీయా ప్రవక్త ఇలా అంటున్నాడు, “ప్రభువు సెలవులేనిది మాట యిచ్చి నెరవేర్చగలవాడెవడు?” విలాపవాక్యములు 3:37. మనుషులు తమ ఇష్టాన్ని బట్టి ఆచరించటం అతిక్రమించటం చేసి దాని పర్యవసానాన్ని తప్పించుకొనేందుకు ఎలాంటి ఆజ్ఞనూ తన వాక్యంలో దేవుడు పెట్టలేదు. సంపూర్ణ విధేయత మార్గాన్ని తప్ప వేరే మార్గాన్ని మనుషులు ఎన్నుకుంటే “తుదకు అది మరణమునకు త్రోవతీయును” సామెతలు 14:12. PPTel 349.5

“అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియాజరు ఈ తామారును వారితో మీరు చావకుండునట్లు... మీరు తల విరియబోసుకొనకూడదు. బట్టలు చింపుకొనకూడదు... యెహోవా అభిషేక తైలము మీ మీద నున్నది” అన్నాడు. ఆ మహానాయకుడు దేవుడన్న ఈ మాటల్ని అన్నకు జ్ఞాపకం చేశాడు, “నా యొద్ద నుండు వారియందు నేను నన్ను పరిశుద్ధ పరచుకొందును, ప్రజల యెదుట నన్ను మహిమ పరచుకొందును” అహరోను మౌనంగా ఉండిపోయాడు. భయంకరమైన పాపపర్యవ సానంగా తన కుమారులు మరణించటం హెచ్చరిక లేకుండా రాలిపోవటం అతడి హృదయాన్ని చీల్చివేసింది. అయినా అతడు తన బాధను వెల్లగక్కలేదు. పాపం విషయంలో సానుభూతి చూపిస్తున్నాడన్న భావనను ఎలాంటి దు:ఖ సూచన ద్వారాను అతడు కలిగించకూడదు. ప్రజలు దేవుని గురించి సణుగు కొనేటట్లు చెయ్యకూడదు. PPTel 350.1

తల దిద్దుబాటు న్యాయమైనదన్న గుర్తింపు తన ప్రజలకు కలిగించి తన్మూలంగా ఇతరులకు భయం కలిగించటం దేవుని ఉద్దేశం. దేవుని సహనాన్ని ఇలాగే ఆసరాగా చేసుకొని చివరికి తాము కూడా తమ భవిష్యత్తును నాశనం చేసుకొనేవారు ఇశ్రాయేలీయుల్లో ఎందరో ఉన్నారు. ఈ భయంకర తీర్పు వారి విషయంలో ఒక హెచ్చరికగా పనిచేసి వారిని కాపాడవచ్చు. పాపి పాపాన్ని లెక్కచేయని ఈ తప్పుడు సానుభూతిని దేవుడు ఖండిస్తున్నాడు. పాపానికి నైతిక దృష్టిని మసకబార్చే ప్రభావం ఉన్నది. అందుచేత పాపి తన అతిక్రమ తీవ్రతను గుర్తించడు. పరిశుద్దాత్మ శక్తి వల్ల కలిగే స్పృహలేకపోతే పాపి తన పాపం విషయంలో పాక్షికంగా గుడ్డివాడవుతాడు. అపరాధాలు చేస్తూపోతున్న వారి ముందున్న ప్రమాదాన్ని వారికి చూపించటం క్రీస్తు సేవకుల విధి. PPTel 350.2

పాపం తాలూకు నీచత్వాన్ని గూర్చి దాని పర్యవసానాన్ని గూర్చి అపరాధులకు అంధత్వం కలిగించటం ద్వారా హెచ్చరికల ప్రభావాన్ని నాశనం చేసేవారు ఆ క్రియ ద్వారా ప్రేమను కనపర్చుతున్నామని హెచ్చులు పలుకుతుంటారు. అయితే వారు పరిశుద్ధాత్మ చేస్తున్న పనిని ప్రత్యక్షంగా వ్యతిరేకించి అడ్డుకొంటున్నారు. నాశనం పొలిమేరలో పాపిని నిద్రపుచ్చుతున్నారు. పాపి అపరాధంలో పాలు పంచుకొని అతడు మారుమనసు పొందకుండా తప్పుదారి పట్టటానికి బాధ్యులవుతున్నారు. మోసపూరితమైన ఈ తప్పుడు సానుభూతి కారణంగా అనేకమంది నాశనమవుతున్నారు. PPTel 350.3

నాదాబు, అబీహులు మొట్టమొదటగా తాగి మత్తిల్లకుండా ఉన్నట్లయితే ఆ ప్రాణాంతక పాపాన్ని చేసి ఉండేవారు కాదు. దేవుని సన్నిధి ప్రదర్శితమయ్యే గుడారంలో నిలబడకముందు తాము అతి జాగ్రత్తగా సిద్ధపడాలని వారికి తెలుసు. అయితే తాము ఆ పరిశుద్ధ బాధ్యతకు అర్హులంకామని మారుమనస్సు పొందని తమ హృదయాల్ని బట్టి నిరూపించుకొన్నారు. వారి మనసులు గలిబిలి అయ్యాయి. వారి నైతిక స్పృహ మందగిల్లింది. అందుచేత పరిశుద్ధమైన దానికి సామాన్యమైన దానికి మధ్య తేడా గుర్తించలేకపోయారు. అహరోనుకి మిగిలిన తన కుమారులికి ఈ హెచ్చరిక వచ్చింది, “మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చునప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులును ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకూడదు. మీరు ప్రతిష్టింపబడినదాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైనదాని నుండి పవిత్రమైనదానిని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ.” మద్యపానం దేహాన్ని బలహీనపర్చుతుంది, మనసును గలిబిలి పర్చి నైతికంగా దిగజార్చుతుంది. PPTel 351.1

మనుషులు పరిశుద్ధ విషయాల పవిత్రతను గుర్తించకుండా లేక దైవ ధర్మశాసనాలను ఆచరించకుండా అడ్డుతగులుతుంది. పరిశుద్ద బాధ్యతలు నిర్వహించేవారందరూ తమ మనసులు మంచి చెడులను గుర్తించేందుకు తాము ధృఢనియమాలకు నిబద్దులై నివసించేందుకు, న్యాయం జరిగించి కనికరం చూపేందుకు నిర్మలమైన మనసులు కలిగి ఉండేందుకు మితానుభవం నిష్కర్షగా పాటించాల్సి ఉన్నారు. PPTel 351.2

ఇదే విధిని ప్రతీ క్రైస్తవుడు నిర్వహించాలి. అపొస్తలుడైన పేతురిలా అంటున్నాడు, “మీరు... ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునైయున్నారు” 1 పేతురు 2:9, మన సృష్టికర్తకు అంగీకారమైన సేవ చేసేందుకుగాను మన సామర్థ్యాలన్నింటిని అత్యుత్తమ స్థితిలో ఉంచాల్సిందిగా దేవుడు కోరుతున్నాడు. మత్తు పదార్థాల్ని సేవించినప్పుడు ఇశ్రాయేలు యాజకుల విషయంలో చోటు చేసుకొన్న ఫలితాలే సంభవిస్తాయి. పాపం విషయంలో మనస్సాక్షి స్పందన మందగిల్లుతుంది. PPTel 351.3

దుర్మార్గం పట్ల అలసత్వం క్రమక్రమంగా బలపడి చివరికి పరిశుద్ధమైన వాటికి సామాన్యమైన వాటికి మధ్య వ్యత్యాసం ఏమీ కనిపించదు. అయితే దైవ శాసనాలు కోర్తున్న ప్రమానాన్ని మనమెలా చేరగలం? “మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్దాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తుకారు. విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి” 1 కొరింథీ 6:19, 20. PPTel 352.1

“కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి” 1 కొరింథీ 10:31. అన్నియుగాల్లోనూ ఉన్న క్రీస్తు సంఘానికి ఈ భయంకర హెచ్చరిక వస్తున్నది, “ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసిన యెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై యున్నారు” 1 కొరింథీ 3:17. PPTel 352.2