పితరులు ప్రవక్తలు

31/75

29—ధర్మశాస్త్రంపట్ల సాతాను వైరుధ్యం

దైవధర్మశాస్త్రాన్ని కూలదొయ్యటానికి సాతాను దేవదూతల మధ్య చేపట్టిన మొట్టమొదటి ప్రయత్నం జయప్రదమైనట్లు ఆదిలో కనిపించింది. దేవదూతలు చాలామంది మోసపోయారు. తనకు విజయంలా కనిపించిన కార్యం అతడి అపజయానికి దేవుని నుంచి వేరైపోటానికి పరలోకం నుంచి బహిష్కరణకు కారణ మయ్యింది. PPTel 320.1

ఆ సంఘర్షణ లోకంలోనూ కొనసాగనారంభించినప్పుడు సాతాను జయిస్తున్నట్లు మళ్లీ కనిపించింది. అతిక్రమం వల్ల మానవుడు సాతానుకి బానిస అయ్యాడు. మానవుడి రాజ్యం తిరుగుబాటుదారుడి హస్తగతమయ్యింది. ఇప్పుడు సాతాను ఒక స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేసుకొని దేవుని అధికారాన్ని ఆయన కుమారుని అధికారాన్ని ధిక్కరించటానికి మార్గం ఏర్పడింది. అయితే మానవుడు మళ్లీ దేవునితో సమానంగా నివసించటం, ఆయన ధర్మశాస్త్ర విధుల్ని ఆచరించటం తుదకు మానవులూ భూమి సాతాను శక్తి నుంచి విమోచన పొందటం రక్షణ ప్రణాళిక వల్ల సాధ్యపడింది. PPTel 320.2

సాతానుకి మళ్లీ ఓటమి సంభవించింది. అతడు తన అపజయాన్ని విజయంగా మార్చుకొనేందుకు మళ్లీ మోసగించటం మొదలు పెట్టాడు. పడిపోయిన మానవుల మధ్య తిరుగుబాటు లేపటానికిగాను మానవుడు తన ధర్మశాసనాన్ని అతిక్రమించటానికి అనుమతించిన దేవుడు అన్యాయస్థుడని ప్రచారం చెయ్యటం మొదలు పెట్టాడు. “ఫలితమేంటో తనకు తెలిసినప్పుడు మానవుడు పాపం చేస్తాడో లేదో దేవుడు పరీక్షించటం దేనికి? లోకంలోకి మరణం దు:ఖం తేవటం దేనికి?” అని శోధకుడు ప్రశ్నించాడు. మానవుడికి తిరుగుబాటువల్ల పరలోక రాజు చేయాల్సి ఉన్న త్యాగం ఎంతో భయంకరమైందనీ మానవుడి పట్ల కనికరంతో అతడికి మరో తరుణాన్ని దేవుడు ఇచ్చిన సంగతి విస్మరించి ఆదాము కుమారులు శోధకుడి వల్ల బొల్లికబుర్లకు చెవినిచ్చి సాతాను నాశనకర శక్తినుంచి తమను రక్షించగల ఒకే ఒక ప్రభువు మీద సణగటం మొదలు పెట్టారు. PPTel 320.3

దేవునిమీద ఇదే ఫిర్యాదు చేస్తున్న ప్రజలు ఈనాడు వేలాదిమంది ఉన్నారు. మానవుడికి ఎంపిక శక్తి లేకుండా చేయటం జ్ఞానంగల మనిషిగా అతడికుండాల్సిన ఆధిక్యతను తీసివేసి అతణ్ని కేవలం ఒక యంత్రంగా మార్చటమేనని వారు గుర్తించరు. మనిషి చిత్తాన్ని బలవంతం చెయ్యటం దేవుని సంకల్పం కానేకాదు. ఆయన మానవుణ్ని స్వేచ్ఛాపరుడుగా సృజించాడు. ఇతరలోకాల నివాసులమల్లే మానవుడు కూడా విశ్వాస పరీక్షకు గురికావలసిందే. కాని దుర్మార్గతకు లొంగిపోటం అవసరం అన్న పరిస్థితికి అతణ్ని ఎన్నడూ తేలేదు. తాను ప్రతిఘటించలేని శోధననుగాని భరించలేని శ్రమనుగాని మానవుడికి రావటానికి ఆయన ఎన్నడూ అనుమతించలేదు. సాతానుతో సాగే పోరాటంలో మానవుడు ఓడిపోకుండా ఉండటానికి దేవుడు కావలసినన్ని ఏర్పాట్లు చేశాడు. PPTel 320.4

భూమిపై జనసంఖ్య పెరిగినప్పుడు దాదాపు లోకమంతా తిరుగుబాటులో పాల్గొన్నది. సాతాను విజయం సాధించినట్లు మరొకసారి కనిపించింది. కాని సర్వశక్తిగల దేవుడు దుష్టశక్తిని మరోసారి నిలువరించాడు. భూమిని నింపిన దుష్టత్వాన్ని ఆయన జలప్రళయంతో శుద్ధి చేశాడు. PPTel 321.1

ప్రవక్త ఇలా అంటున్నాడు, “నీ తీర్పులు లోకమునకు రాగా లోకనివాసులు నీతిని నేర్చుకొందురు. దుష్టులు దయచూపించినను వారు నీతిని నేర్చుకొనరు...యెహోవా మహత్మ్యమును ఆలోచింపక అన్యాయము చేయుచుందురు” యెషయా 26:9, 10. జలప్రళయం తర్వాత లోకం పరిస్థితి ఇది. దేవుని తీర్పుల నుంచి విడుదల కలిగిన అనంతరం లోక ప్రజలు మళ్లీ దేవునిమీద తిరుగుబాటు చేశారు. దేవుని నిబంధనను ధర్మవిధుల్ని ప్రజలు రెండుసార్లు తిరస్కరించారు. జలప్రళయానికి ముందున్న ప్రజలు, నోవహు సంతతివారు దేవుని అధికారాన్ని తోసిపుచ్చారు. అప్పుడు దేవుడు అబ్రాహాముతో నిబంధనను చేసుకొని తన ధర్మశాస్త్రానికి ధర్మకర్తలుగా వ్యవహరించటానికి ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు. ఈ ప్రజల్ని భ్రష్టులు చేసి నాశనం చేయటానికి సాతాను ఉచ్చులు పన్నటం మొదలు పెట్టాడు. అన్యులతో వివాహబంధాలు ఏర్పర్చుకొని వారి విగ్రహాల్ని పూజించటానికి యాకోబు సంతతివారిని శోధించాడు. అయితే యోసేపు దేవునికి నమ్మకంగా నిలిచాడు. అతడి విశ్వాసపాత్ర నిజమైన విశ్వాసానికి నిత్యసాక్షిగా ఉన్నది. ఈ వెలుగును ఆర్పివేయటానికి సాతాను యోసేపు అన్నల్లో ద్వేషం రగిలించి అతణ్ని ఒక అన్యప్రజల దేశంలో బానిసగా అమ్మివేయటానికి వారిని నడిపించాడు. తన్ను గూర్చిన జ్ఞానం ఐగుప్తీ దేశ ప్రజలకు అందే నిమిత్తం దేవుడు పరిస్థితుల తీరుతెన్నుల్ని మార్చాడు. ఫోతీఫరు ఇంట్లోను చెరసాలలోను యోసేపు విద్యను శిక్షణకు పొందాడు. ఆ శిక్షణ అతడి దైవభక్తి రెండూ కలిసి అతణ్ని ఆ దేశం ప్రధాన మంత్రి పదవికి సిద్ధం చేశాయి. ఫరోల రాజభవనం నుంచి దేశం నలుమూలలా అతని ప్రభావం ప్రసరించింది. ఐగుప్తులోని ఇశ్రాయేలీయులు వృద్ధి గాంచి ధనవంతులయ్యారు. దేవునికి నమ్మకంగా నివసించినవారు గొప్ప ప్రభావాన్ని చూపించారు. కొత్తమతం ప్రబలమవ్వటం చూసి విగ్రహారాధక యాజకులు ఆందోళన చెందారు. అపవాది సాతాను ప్రోత్సాహంతో వారు సత్యజ్యోతిని ఆర్పివేయటానికి ఉద్యమించారు. ఐగుప్తు సింహాసనానికి వారసుడి విద్యాబాధ్యత యాజకులిది. దేవునికి ప్రతికూలంగా విగ్రహారాధనకు అనుకూలంగా ఉన్న ఈ స్వభావం భవిష్యత్తు రాజు ప్రవర్తనను రూపుదిద్ది హెబ్రీయులపట్ల అతడి క్రూరత్వానికి హింసకు అంకురార్పణ చేసింది. PPTel 321.2

ఐగుప్తు నుంచి మోషే పారిపోయిన నలభై సంవత్సరాల్లోను విగ్రహారాధన గెలుపొందినట్లు కనిపించింది. ఏయేటికాయేడు ఇశ్రాయేలీయుల ఆశలు అడియాస లయ్యాయి. రాజేంటి ప్రజలేంటి తమకున్న శక్తి గురించి ఏటేటా అతిశయించి ఇశ్రాయేలీయుల దేవుణ్ని ఎగతాళి చేసేవారు. ఇది పెరుగుతూ వచ్చి మోషే ఫరోని ఎదుర్కొన్నకాలంలో పరాకాష్ఠకు చేరుకుంది. “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా” వర్తమానంతో మోషే రాజు ముందుకు వచ్చినప్పుడు “నేను అతని మాటవిని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను” అని అతనికి సమాధానం ఇవ్వటానికి అతణ్ని ప్రోత్సహించింది నిజమైన దేవున్ని గూర్చిన అజ్ఞానం కాదు. ఆయనపట్ల తిరస్కార భావం. PPTel 322.1

ఐగుప్తీయులు ఎంతో కాలంగా దేవుని గూర్చిన జ్ఞానాన్ని విసర్జిస్తూ వచ్చినప్పటికీ పశ్చాత్తాపపడటానికి దేవుడు వారికింకా తరుణం ఇచ్చాడు. యోసేపు కాలంలో ఇశ్రాయేలీయులికి ఐగుప్తు ఆశ్రయంగా ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలకు దయ చూపించటం ద్వారా ఐగుప్తీయులు దేవుని గౌరవించారు. దీర్ఘ శాంతం గలవాడు, త్వరగా కోప్పడనివాడు, దయామయుడు అయిన ప్రభువు ఇప్పుడు ప్రతీ తీర్పుదాని పని అది చేయటానికి సమయం ఇచ్చాడు. తాము పూజిస్తున్న దేవతారూపాల ద్వారానే శిక్షణ పొందుతున్న ఐగుప్తీయులకు యెహోవా శక్తిని గూర్చిన నిదర్శనాలు కనిపించాయి. దేవున్ని వెంబడించాలని కోరుకొన్నవారందరూ దేవునికి తమ్మును తాము అప్పగించుకొన్నట్లయితే ఆ తీర్పులు తప్పించుకోగలిగేవారు. రాజు మత దురాభిమానం, మంకుతనం దేవుని గూర్చిన జ్ఞానం విస్తరిల్లటానికి సాధనాలయ్యాయి. అనేకమంది ఐగుప్తీయులు దేవున్ని అంగీకరించి ఆయన సేవచేయటానికి తోడ్పడ్డాయి. అన్యులతో సంబంధ బాంధవ్యాలు పెంచుకొని వారి విగ్రహారాధనను అనుకరించటానికి ఇశ్రాయేలీయులు సుముఖంగా ఉన్నందువల్ల వారు ఐగుప్తు వెళ్లడానికి దేవుడు అనుమతించాడు. అక్కడ యోసేపు ప్రభావం ప్రబలంగా ఉండటంచేత వారు ప్రత్యేక జనాంగంగా నివసిచంటానికి పరిస్థితులు అనుకూలించాయి. ఇక్కడ కూడా ఐగుప్తీయుల విగ్రహారాధన, పరదేశులుగా తాము ఐగుప్తులో ఉన్నకాలంలో ఆ ప్రజలు చూపించిన కాఠిన్యం, పెట్టిన శ్రమలు వారు విగ్రహారాధనను మరింత అసహ్యించుకొని తమ తండ్రుల దేవుడైన యెహోవాను ఆశ్రయించటానికి నడిపించాల్సింది. అయితే సాతాను ఈ అవకాశాన్ని తన ఉద్దేశాల నెరవేర్పుకు ఉపయోగించుకొన్నాడు. ఇశ్రాయేలీయుల మనసుల్ని మలినపర్చి అన్యులైన తమ యజమానుల ఆచారాల్ని అభ్యాసాల్ని అనుకరించటానికి వారిని నడిపించాడు. జంతువులపట్ల ఐగుప్తీయులకు మూఢనమ్మకాలతో కూడిన భక్తివల్ల ఇశ్రాయేలీయులు తమ దాసత్వకాలంలో బలులర్పించటానికి వల్లపడలేదు. కనుక ఈ సేవ క్రీస్తు చేయనున్న మహాత్యాగానికి వారి మనసుల్ని ఆకర్షించలేదు. అందువల్ల వారి విశ్వాసం బలహీనమయ్యింది. ఇశ్రాయేలీయుల విడుదలకు సమయం వచ్చినప్పుడు ఇరవై లక్షలకు మించి ఉన్న ఆ మహాజనాన్ని అజ్ఞానంలోను మూఢవిశ్వాసంలోను ఉంచటానికి సాతాను కృతనిశ్చయంతో పనిచేశాడు. ఏ ప్రజల్ని ఆశీర్వదించి విస్తారమైన జనంగాను ఈ లోకంలో ఒక శక్తిగాను రూపొందించి వారి ద్వారా తన చిత్తాన్ని బయలుపర్చాలని దేవుడు ఉద్దేశించాడో - తన ధర్మశాస్త్రానికి ధర్మకర్తలుగా వ్యవహరించాల్సి ఉన్న ప్రజలు - ఆ ఇశ్రాయేలీయుల మనసుల్లోనుంచి దేవుని గూర్చిన జ్ఞానాన్ని తుడిచివేయాలన్న ఉద్దేశంతో వారిని చీకటిలోను దాస్యంలోను బంధించి ఉంచటానికి సాతాను కృషిచేశాడు. PPTel 322.2

మోషే అహరోనులు రాజు ముందు సూచక క్రియలు చేసినప్పుడు వాటి ప్రభావాన్ని నిరర్థకం చేసి దేవుని ఔన్నత్యాన్ని ఫరో గుర్తించి ఆయనకు విధేయుడు కాకుండా చేసేందుకోసం సాతాను తన శక్తి కొద్దీ కృషి చేశాడు. దాని ఫలితమేంటంటే దేవుని శక్తి మహిమలు మరెక్కువగా ప్రదర్శితమవ్వటానికి, ఇశ్రాయేలీయులికి ఐగుప్తు ప్రజలకి దేవుని ఉనికిని ఆయన సర్వాధికారాన్ని మరెక్కువ స్పష్టంగా వెల్లడి కావటం జరిగింది. PPTel 323.1

మహాశక్తి ప్రదర్శనల నడుము ఐగుప్తు దేవతల పై తన తీర్పుల కుమ్మరింపుతో దేవుడు ఇశ్రాయేలీయుల్ని విమోచించాడు. “ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పర్చుకొన్నవారిని ఉత్సాహ ధ్వనితోను వెలుపలికి రప్పించెను. తన ధర్మశాస్త్ర విధులను ఆచరించునట్లును అన్యజనుల భూములను ఆయన వారికప్పగించెను” కీర్తనలు 105:43-45. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల నుంచి కాపుదల పొంది తన రెక్కల కింద నివసించగల మంచి దేశానికి అనగా వారికి ఆశ్రయపురంగా తాను సిద్ధం చేసిన కనానునుకు వారిని తీసుకొని వచ్చేందుకు దాసత్వం నుంచి దేవుడు వారిని విమోచించాడు. ఆయన వారిని తన వద్దకు తెచ్చుకొని తన కౌగిటలో ఉంచు కొంటాడు. తన ప్రేమానురాగాలకు అనుకూలంగా స్పందిస్తూ వారు ఇతర దేవతలను మొక్కకుండా ఉండి లోకంలో ఆయన నామాన్ని ఘనపర్చాలని ఆయన కోరాడు. PPTel 323.2

ఐగుప్తులో దాసులుగా ఉన్న కాలంలో అనేకమంది ఇశ్రాయేలీయులు దేవుని ధర్మవిధుల్ని మర్చిపోయారు. వాటిని అన్యుల ఆచారాలు సంప్రదాయాలతో కలగలిపి ఆచరించారు. ఇశ్రాయేలీయుల్ని దేవుడు సీనాయి పర్వతం వద్దకు తీసుకొని వచ్చి అక్కడ తన ధర్మశాస్త్రాన్ని తన సొంత స్వరంతో వారికి ప్రకటించాడు. PPTel 324.1

సాతాను అతడి దుష్టదూతలు అక్కడ ఉన్నారు. దేవుడు తన ధర్మశాస్త్రాన్ని తన ప్రజలకు ప్రకటిస్తున్న సమయంలో సయితం వారిని పాపంలోకి నడిపించటానికి శోధిస్తున్నాడు. దేవుడు ఎన్నుకొన్న ఈ ప్రజల్ని దేవుని సమక్షంలోనే తన వశం చేసుకోవాలని చూశాడు. వారిని విగ్రహారాధనలోకి నడిపించటం ద్వారా ఆరాధన ముఖ్యోద్దేశాన్ని అర్థరహితం చెయ్యటానికి కృషి చేశాడు. తనకన్నా ఉన్నతంకాని దాన్ని పూజించటం ద్వారా, తన సొంత హస్తకృత్యానికి సంకేతమైన వస్తువు ద్వారా మానవుడు ఎలా ఉన్నత స్థాయికి చేరగలుగుతాడు? మానవులు దేవుని ఔన్నత్యాన్ని మహిమను చూడలేనంత గుడ్డివారై ఆయనను విగ్రహం రూపంలో జంతువు రూపంలో లేదా పాకే ప్రాణి రూపంలో సూచిస్తే, సృష్టికర్త రూపంలో సృష్టి పొంది ఆ బాంధవ్యాన్ని విస్మరించి హేయమైన నిర్జీవమైన వస్తువుల్ని మానవులు పూజిస్తుంటే దురాచారాలకు స్వేచ్ఛ లభిస్తుంది. మనసులో చెడు కోర్కెలు చెలరేగటానికి మార్గం ఏర్పడుంది. సాతానుకి సంపూర్ణాధిపత్యం చేజిక్కుతుంది. PPTel 324.2

దైవధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేయటానికి తన ప్రణాళిక అమలును సాతాను సీనాయి పర్వతంవద్దే ప్రారంభించాడు. పరలోకంలో తాను ప్రారంభించిన పనిని కొనసాగించ టానికి ఈ రకంగా ప్రయత్నించాడు. పర్వతం పై మోషే దేవునితో ఉన్న నలభయి దినాల్లోనూ సందేహాలు పుట్టించటంలో మత భ్రష్టత కలిగించటంలో తిరుగుబాటు రేపటంలో సాతాను తలమునకలై ఉన్నాడు. తన నిబంధన ప్రజలైన ఇశ్రాయేలీయులకి అందజేసేందుకు దేవుడు తన ధర్మశాస్త్రాన్ని రాస్తున్న తరుణంలో యెహోవాను విశ్వసించవద్దని బంగారు దేవతలు ప్రజల్ని కోర్తున్నారు! ఏదైవ విధుల్ని ఆచరిస్తామని ప్రజలు ప్రమాణం చేశారో వాటితో దైవ సన్నిధి నుంచి మోషే కిందికి దిగి వచ్చేసరికి దైవాజ్ఞకు ప్రతికూలంగా ప్రజలు బంగారు విగ్రహానికి సాగిలపడి మొక్కుతున్నారు. PPTel 324.3

ఇలా దైవ దూషన చెయ్యటానికి దేవున్ని అవమానించటానికి ఇశ్రాయేలీయుల్ని నడిపించటం ద్వారా వారిని నాశనం చేయాలని సాతాను సంకల్పించాడు. వారు అథోగతికి దిగజారిపోయినట్లు నిరూపించుకొన్నందువల్ల, దేవుడిచ్చిన ప్రత్యేక హక్కుల్ని దీవెనల్ని వారు లెక్కచేయనందువల్ల, నమ్మకంగా ఉంటామంటూ దేవునికి వారు పదే పదే చేసిన వాగ్దానాల్ని విస్మరించినందువల్ల దేవుడు వారిని విసర్జించి నాశనం చేయటం ఖాయమని సాతాను నమ్మాడు. దేవుని గూర్చిన జ్ఞానాన్ని వార్దత్త సంతతి కాపాడుతుందో, సాతానుని జయించే నిజమైన సంతానం అయిన క్రీస్తు ఏ సంతతి నుంచి రానున్నాడో ఆ అబ్రాహాము సంతతి నాశనాన్ని ఇలా సాధించాలని అతడు భావించాడు. మొండిగా సాతాను పక్కనిలిచిన వారందరినీ దేవుడు నాశనం చేశాడు. కాగా పశ్చాత్తాపం పొందిన వారందరినీ క్షమించాడు. విగ్రహారాధన అపరాధానికి శిక్షగా, దేవుని న్యాయశీలతకు దీర్ఘశాంతానికి, కృపకు నిత్యసాక్ష్యంగా ఈ పాపం తాలూకు చరిత్ర నిలవాల్సి ఉన్నది. PPTel 325.1

సీనాయి దృశ్యాన్ని విశ్వమంతా వీక్షించింది. ఈ రెండు వర్గాల పనితీరులో దైవ ప్రభుత్వానికి సాతాను ప్రభుత్వానికి మధ్యగల వ్యత్యాసం ప్రస్ఫుటంగా కనిపించింది. సాతానువల్ల కలిగిన భ్రష్టత ఫలితాల్ని ఇతర లోకాల్లోని పాపరహిత నివాసులు చూశారు. సాతానుకి పరలోకంలో తన రాజ్యాన్ని స్థాపించే అవకాశం ఉండి ఉంటే ఎలాంటి ప్రభుత్వాన్ని స్థాపించేవాడో గ్రహించారు. PPTel 325.2

రెండో ఆజ్ఞను మీరటానికి ప్రజల్ని నడిపించటం ద్వారా దైవాన్ని గూర్చి వారికి తక్కువ అభిప్రాయం కలిగించటం సాతాను ధ్యేయం. నాల్గో ఆజ్ఞను తొలగించటం ద్వారా మనుషులు దేవుని మర్చిపోయేటట్లు చేస్తున్నాడు. మానవులు ఇతర దేవతల్ని గాక తనను ఘనపర్చి పూజించాలన్న దైవాజ్ఞ ఆయన సృష్టికర్త అన్నదాని మీద సర్వప్రాణుల ఉనికికీ ఆయనే ఆధారం అన్నదాని మీద ఆధారపడి ఉన్నది. బైబిలులో ఇలాగున్నది. ఇర్మియా ప్రవక్త ఇలా అంటున్నాడు, “యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు... ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమిమీదనుండకుండును ఆకాశము క్రింద నుండకుండను నశించును. ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను.” “తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమునొందుచున్నాడు. అతడు పోతపోసినది మాయారూపము, అందులో ప్రాణమేమియులేదు. అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు. విమర్శకాలములో అవి నశించి పోవును. యాకోబుకు స్వాస్థ్యమగువాడు వాటివంటివాడు కాడు. ఆయన సమస్తమును నిర్మించువాడు” యిర్మీయా 10:10-12, 14-16. దేవుని సృజన శక్తికి జ్ఞాపకార్థ చిహ్నమైన సబ్బాతు ఆయనను భూమ్యాకాశాల సృష్టికర్తగా పేర్కొంటున్నది. కనుక సబ్బాతు దేవుని ఉనికిని నిత్యం జ్ఞాపకం చేస్తుంది. ఆయన ఔన్నత్యాన్ని, వివేకాన్ని ప్రేమను నిత్యం చాటుతుంది. సబ్బాతును నిత్యం పరిశుద్ధంగా ఆచరించటం జరిగి ఉంటే ఒక్క నాస్తికుడుగాని విగ్రహారాధకుడుగాని ఉండేవాడు కాదు. PPTel 325.3

ఏదెనులో ప్రారంభమైన సబ్బాతు వ్యవస్థ లోకమంత పురాతనమైంది. సృష్టి నాటి నుంచి నివశిస్తూ వచ్చిన పితరులు సబ్బాతును ఆచరించారు. ఐగుప్తులోని దాసత్వకాలంలో కార్యనియామకుల వత్తిడివల్ల ఇశ్రాయేలీయులు సబ్బాతును మీరి చాలామట్టుకు సబ్బాతు పవిత్రతను గూర్చి మర్చిపోయారు. దేవుడు సీనాయి పై నుంచి పది ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని ప్రకటించినప్పుడు నాల్గో ఆజ్ఞ మొట్టమొదటి మాటలు “విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము” అన్నవి. సబ్బాతు ఆ సమయంలో స్థాపితమైంది కాదని ఈ మాటలు సూచిస్తున్నాయి. సబ్బాతు ప్రారంభానికి మనం సృష్టి ఆరంభానికి వెళ్లాలి. మనుషుల మనసుల్లోంచి దేవున్ని తుడిచివేసేందుకు సాతాను ఈ పరిశుద్ధ వ్యవస్థను రూపుమాపాలని పెట్టుకొన్నాడు. మనుషులు సృష్టికర్తను మర్చిపోయేటట్లు చేస్తే వారు దుర్మార్గతను ప్రతిఘటించరు. అప్పుడు మనుషులు సాతాను వశంలో ఉంటారు. PPTel 326.1

దైవ ధర్మశాస్త్రం పట్ల సాతాను వ్యతిరేకత పది ఆజ్ఞల్లో ప్రతీ ఒక్కదానిమీద పోరాటం జరపటానికి అతణ్ని వత్తిడి చేసింది. దేవుని ప్రేమించి ఆయనకు నమ్మకంగా ఉండ టమన్న నియమంతో దగ్గర సంబంధమున్న నియమం తల్లిదండ్రుల్ని ప్రేమించి వారికి విధేయంగా నివసించటమన్నది. తల్లిదండ్రుల అధికారం విషయంలో ద్వేషం దేవుని అధికారాన్ని ద్వేషించటానికి నడుపుతుంది. అందుచేత ఐదో ఆజ్ఞ ఆచరణను బలహీనపర్చటానికి సాతాను కృషి చేస్తాడు. ఈ ఆజ్ఞ నిర్దేశించే నియమాన్ని అన్యులు ఆచరించరు. కొన్ని దేశాల్లో పిల్లలు తల్లిదండ్రుల్ని విడిచి పెట్టేస్తారు. లేదా తమంతట తాము పనులు చేసుకోలేని స్థితికి వచ్చినప్పుడు వారిని చంపేస్తారు. కుటుంబంలో తల్లిని మర్యాదగా చూడరు. తండ్రి మరణిస్తే తల్లి పెద్ద కుమారుడి అధికారానికి లొంగి ఉండాలి. బిడ్డలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలన్నది మోషే ఆదేశం. కాని ఇశ్రాయేలీయులు దేవుని విడిచి పెట్టి దూరంగా వెళ్లిపోయారు గనుక తక్కిన వాటితో పాటు ఐదో ఆజ్ఞను కూడా లెక్కచెయ్యలేదు. PPTel 326.2

సాతాను “ఆది నుండి... నరహంతకుడు” (యోహాను 8:44). మానవ జాతి పై అధికారం సంపాదించిన అనంతరం మనుషులు పరస్పరం ద్వేషించి చంపుకొనేటట్లు వారిని నడిపించటమేగాక వారు దేవుని అధికారాన్ని ధిక్కరించి ఆరో ఆజ్ఞ అతిక్రమాన్ని తమ మతంగా అనుసరించేటట్లు చేశాడు. PPTel 327.1

దైవ లక్షణాల విషయంలో అన్యులలో చెడు అభిప్రాయాలు పుట్టించి తమ దేవతల దయ సంపాదించటానికి నరబలి అవసరమని వారిని నమ్మించాడు. ఆయా రకాల విగ్రహారాధనలో మిక్కిలి క్రూరకార్యాల్ని ప్రజలు ఆచరించేవారు. తమ బిడ్డల్ని తమ దేవతలముందు అగ్నిగుండంలో నడిపించటం అందులో ఒకటి. ఆ నడక ఆ బిడ్డకు హాని కలుగకుండా సాగితే తమ బిడ్డను దేవతలు అంగీకరించినట్లు ప్రజలు నమ్మేవారు. అలా విజయం సాధించిన వ్యక్తిని దైవానుగ్రహం పొందిన వాడిగా పరిగణించి అతడికి ఎన్నో ఉపకారాలు చేసి అతణ్ని ఘనపర్చేవారు. అతడు ఎన్ని నేరాలు చేసినా అతణ్ని శిక్షించేవారు కాదు. కాని అగ్నిగుండంలో నడిచేటప్పుడు ఎవరైనా కాలిపోతే అతడు దురదృష్టవంతుడు, దేవతలు కోపగించారని ఆ కోపం ఆ వ్యక్తి బలిద్వారానే చల్లార్లుందని ప్రజలు నమ్మేవారు.అలాగే అతణ్ని బలి ఇవ్వటం జరిగేది. మతభ్రష్టత సంభవించిన కాలంలో ఈ హేయ కార్యాలు ప్రబలాయి. కొంతవరకూ ఇవి ఇశ్రాయేలీయుల మధ్య కూడా చోటుచేసుకొన్నాయి. PPTel 327.2

మతం పేరుతో పూర్వం ఏడో ఆజ్ఞ అతిక్రమం జరిగేది. అన్యమతారాధనలో మిక్కిలి అనైతిక, జుగుప్సాకర ఆచారాలుండేవి. ప్రజలు తమ దేవుళ్లనే అపవిత్రులుగా చిత్రించేవారు. వారిని ఆరాధించేవారు అతినీచమైన శరీరేచ్చలు తీర్చుకోటానికి ఎగబడే వారు. అస్వాభావికమైన పాపాలు జరిగేవి. మత సంబంధమైన పండుగలు అన్నిచోట్ల అతి నీచ పాపకార్యా లతో నిండి ఉండేవి. PPTel 327.3

బహుభార్యాచారం ఆ దినాల్లోనే ప్రారంభమయ్యింది. జలప్రళయ పూర్వ ప్రపంచం మీద దేవుని ఉగ్రతకు కారణమైన పాపాల్లో ఇదొకటి. జలప్రళయం అనంతరం ఈ పాపం మళ్లీ ప్రబలమయ్యింది. వివాహ వ్యవస్థ విధుల్ని నిరర్థకం చేసి దాని పరిశు ద్రతను తగ్గించటానికి వివాహాన్ని పక్కదారి పట్టించటం సాతాను ఎత్తుగడ. ఎందుకంటే మానవుడిలో దేవుని స్వరూపాన్ని తుడిచివేసి దు:ఖాలకు దుర్నీతికి తలుపు తెరవటానికి ఇదే మంచి మార్గం. PPTel 327.4

దేవుని ప్రవర్తనను తప్పుగా చిత్రించి ఆయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా తిరుగు బాటు లేపటం మహాసంఘర్షణ ఆరంభం నుంచి సాతాను చేస్తున్నపనే. ఈ పని జయప్రదమవుతున్నట్లు కనిపిస్తుంది కూడా. వేవేల ప్రజలు సాతాను మోసాల్ని నమ్మి PPTel 327.5

దేవునికి ఎదురు తిరుగుతారు. కాగా ప్రబలుతున్న దుర్మార్గత మధ్య దేవుని ఉద్దేశాలు వాటి లక్ష్యసాధన దిశలో ముందుకి సాగుతూనే ఉంటాయి. తన న్యాయశీలతను దయాళుత్వాన్ని తాను సృజించిన మనుషులకు ఇతరలోక నివాసులకు దేవుడు ప్రదర్శిస్తున్నాడు. సాతాను శోధనలవల్ల మానవజాతి యావత్తు దైవ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించింది. అయితే దేవుని కుమారుని ప్రాణత్యాగం ద్వారా మానవులు తిరిగే దేవుని వద్దకు వచ్చే మార్గం ఏర్పాటయ్యింది. క్రీస్తు కృపనుబట్టి వారు దేవుని ధర్మశాస్త్రాన్ని ఆచరించటానికి సదుపాయం కలిగింది. ఇలా భ్రష్టత తిరుగుబాట్ల మధ్య ప్రతీ యుగంలోను తనకు నమ్మకంగా నిలిచే ప్రజల్ని తన “బోధన హృదయ మందుంచుకొన్న” ప్రజల్ని దేవుడు పోగుచేస్తాడు. యెషయా 51:7. PPTel 328.1

సాతాను దూతల్ని మోసం చేసి వారిని భ్రష్టుల్ని చేశాడు. అతడు ఇలాగే అన్ని యుగాల్లోను మనుషుల మధ్య పనిని సాగించాలి. చివరి వరకు ఇదే విధానాన్ని కొనసాగిస్తాడు. అతడు దేవునికీ ఆయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బాహాటంగా పనిచేస్తే మనుషులు జాగ్రత్తపడవచ్చు. కాని అతడు వేషాలు మార్చి నిజం కొంత అబద్దం కొంత చెబుతూ ప్రజల్ని మోసగిస్తాడు. కొంచెం నిజంతో కలిసిన అబద్దాలు ప్రమాద భరితమైన అబద్దాలు. ఆత్మను ఆకట్టుకొని నాశనం చేసే అసత్యాల్ని ఈ విధంగానే మనుషులు అంగీకరించటం జరుగుతుంది. ఈ విధంగానే సాతాను లోకాన్ని తన పక్కకు తిప్పుకోగలుగుతున్నాడు. కాని ఈ విజయం ఒక్కసారే కుప్పకూలే సమయం వస్తున్నది. PPTel 328.2

తిరుగుబాటు విషయంలో దేవుడు చేపట్టే చర్య ఫలితంగా ఎంతోకాలంగా ముసుగు వెనక సాగిన పని బట్టబయలవుతుంది. సాతాను పరిపాలన ఫలితాలు, దైవ ధర్మవిధుల నిరాకరణ ఫలాలు ఇతర లోకాల నివాసులు పరిశీలించేందుకు వారి ముందుంచుతాడు దేవుడు. దైవ ధర్మశాస్త్రం న్యాయమైందని అందరూ ఒప్పుకొంటారు. దేవుడు చేసిందంతా తన ప్రజల శ్రేయస్సుకోసం తాను సృజించిన లోకాల శ్రేయస్సుకోసం చేశాడని తేటతెల్లమవుతుంది. దేవుని ప్రభుత్వం న్యాయబద్ధమైందని ఆయన ధర్మశాస్త్రం నీతివంతమైందని విశ్వనివాసులముందు స్వయాన సాతానే ఒప్పుకొంటాడు. PPTel 328.3

అవమానానికి గురి అయిన తన అధికారాన్ని దేవుడు నిరూపించుకొనే కాలం ఎక్కువ దూరంలో లేదు. “వారి దోషమునుబట్టి భూనివాసులకు శిక్షించుటకు యెహోవా తన నివాసమునుండి వెడలి వచ్చుచున్నాడు” యెషయా 26:20. “అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు?” మలాకి 3:2 ప్రచండమైన దైవ సన్నిధి ప్రభావం వల్ల తాము దగ్ధంకాకుండేందుకు పాపులైన ఇశ్రాయేలు ప్రజలు దేవుడు దిగిరావాల్సి ఉన్న పర్వతాన్ని సమీపించకూడదన్న ఆదేశం పొందారు. దైవ ధర్మశాస్త్ర ప్రకటనకు ఎంపికైన స్థలం విషయంలో అలాంటి మహశక్తి ప్రదర్శన జరిగితే ఈ ధర్మశాసనాలు అమలయ్యే ఆయన న్యాయపీఠం ఇంకెంత భయంకరంగా ఉంటుందో! ఆయన అధికారాన్ని కాలరాసిన ప్రజలు ఆయన చివరి తీర్పునాడు ఆయన ప్రచండ మహిమను ఎలా తాళగలుగుతారు? సీనాయి పై చోటుచేసుకొన్న ఘటనలు ప్రజలకు తీర్పు దృశ్యాన్ని కళ్ళకు కట్టటానికి ఏర్పాట య్యాయి. దేవునితో సమావేశానికి ప్రజలు బూరధ్వని ద్వారా పిలుపుపొందారు. తమ న్యాయాధిపతి ముందు సమావేశం కావలసిందిగా భూమి నలుదిశలనుంచి జీవించి ఉన్నవారికి మరణించినవారికి ప్రధాన దూత శబ్దం, దేవుని బూరధ్వని పిలుపునిస్తాయి. తండ్రి కుమారులు దూతలతో పాటు ఆ పర్వతం మీదికి వస్తారు. ఆ మహా తీర్పు దినాన క్రీస్తు “తన తండ్రి మహిమగలవాడై తన దూతలతో కూడా రాబోవుచున్నాడు.” మత్తయి 16:27. అప్పుడు ఆయన తన మహిమా సింహసనం మీద ఆసీనుడవుతాడు. ఆయన ముందు సకల జాతుల ప్రజలు సమావేశమవుతారు. PPTel 328.4

సీనాయి పర్వతం పై దైవ సముఖం ప్రదర్శితమైనప్పుడు చూస్తున్న ఇశ్రాయేలీయులకి దేవుని మహిమ దహించే అగ్నిలా కనిపించింది. అయితే క్రీస్తు తన దూతలతో తన మహిమలతో వచ్చినప్పుడు ఆయన సముఖపు ప్రచండ మహిమతో భూమండలం యావత్తు ధగధగ ప్రకాశిస్తుంది. “మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనముగానుండును. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టు ప్రచండ వాయువు విసరుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుట....... నాభక్తులకు నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు” కీర్తనలు 50:3-6. ఆయన సన్నిధినుంచి. అగ్ని ప్రవహిస్తుంది. ప్రచండమైన ఆ వేడికి పంచభూతాలు లయమైపోతాయి. భూమి కరిగిపోతుంది. అందులోని సమస్తం కాలిపోతుంది. “ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడ పరలోకమునుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన” చేస్తాడు 2 థెస్స 1:6-8. PPTel 329.1

సీనాయి పర్వతం మీది నుంచి దేవుడు తన ధర్మశాసనం ప్రకటించినప్పుడు జరిగిన దైవశక్తి ప్రదర్శన మానవ సృష్టి జరిగిన నాటినుంచి మరెన్నడూ జరగలేదు. “భూమి వణకెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెన” కీర్తనలు 68:8. ప్రకృతి బీభత్సం మధ్య PPTel 329.2

మేఘంలోనుంచి దేవుని స్వరం తుఫాను ధ్వనిలా వినిపించింది. పర్వతం అడుగునుంచి శిఖరంవరకూ కంపించింది. ఇశ్రాయేలు ప్రజలు భయంతో వణకుతూ సాష్టాంగపడ్డారు. భూమిని కంపింపజేసిన ఆయన స్వరం ఇలా ప్రకటించింది. “నేనింకొకసారి భూమిని మాత్రమేకాక ఆకాశమునుకూడా కంపింపజేతురు”. హెబ్రీ 12:26. లేఖనం ఇలా చెబుతున్నది, “ఉన్నత స్థలములోనుండి యెహోవా గర్జించుచున్నాడు”, “భూమ్యా కాశాములు వణకుచున్నవి”. యిర్మీయా 25:30, యావేలు 3:16. రానున్న ఆ మహా దినాన ‘ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథమువలె” తొలగిపోతుంది. ప్రకటన 6:14 పర్వతాలు, ద్వీపాలు తమ స్థానాలనుంచి తొలగిపోతాయి. “భూమి మత్తునివలె కేవలము తూలుచున్నది, పాకవలె ఇటు అటు ఊగుచున్నది. దాని అపరాధము దానిమీద భారముగా ఉన్నది. అది పడి ఇకను లేవలేదు”. యెషయా 24:20. PPTel 330.1

“అందుచేత బాహువులన్నియు దుర్బలమగును”, ముఖాలన్నీ “ఎఱ్ఱ బారును”, “ప్రతివాని గుండె కరిగిపోవును, జనులు విభ్రాంతి నొందుదురు. వేదనలు, దుంఖములు వారికి కలుగును”. లోకుల చెడుతనమును బట్టియు, దుష్టుల దోషమును బట్టియు నేను వారిని శిక్షింపబోవుచున్నాను”, ఆహంకారుల అతిశయమును మాన్పించెదను, బలాత్కారుల గర్వమును అణచివేసెదను” యెషయా 13:7,8, 11; యిర్మీయా 30:6. PPTel 330.2

శాసనములుగల పలకలు పట్టుకొని పర్వతం మీది దైవ సముఖం నుంచి మోషే కిందికి దిగి వచ్చినప్పుడు అపరాధులైన ఇశ్రాయేలీయులు అతడి ముఖంపై ప్రకాశిస్తున్న వెలుగును చూడలేకపోయారు. తన ధర్మశాస్త్రాన్ని అతిక్రమించేవారికి, తన ప్రాయశ్చితార్థ బలిదానాన్ని విసర్జించేవారికి తీర్పు తీర్చటానికి దైవ కుమారుడు పరలోక వాసులతో తండ్రి మహిమతో వచ్చినప్పుడు అపరాధులు ఆ ప్రచండ మహిమను తాళటం ఇంకెంత కష్టమవుతుంది! దైవ ధర్మశాస్త్రాన్ని తృణీకరించి క్రీస్తు రక్తాన్ని కాలరాసిన “భూరాజులును, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను,బలిష్టులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను, బండల సందులలోను దాగుకొని” కొండలతోను, బండలతోను “సింహసనాసీనుడైయున్నవాన్ని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహదినము వచ్చెను. దానికి తాళజాలినవాడెవడు? మీరు మామీద పడి ఆయన సన్నిధికిని గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయండి” అంటారు. ప్రకటన 6:15-17. “ఆ దినము...ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మహాత్మ్యము నుండియు కొండ గుహలలోను, బండబీటలలోను దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను ఎలుకలకును, గబ్బిలములకును పారవేయుదురు” యెషయా 2:20,21 PPTel 330.3

దేవుని పై సాతాను తిరుగుబాటు తనకు, తన నాయకత్వాన్ని ఎంపిక చేసుకొన్న వారికి నాశనం కలిగిస్తుందని అర్థమవుతుంది. తమ అతిక్రమ ఫలితంగా గొప్ప మేలు ఒనగూడుందని సాతాను ప్రచారం చేశాడు. అయితే “పాపమువలన వచ్చు జీతము మరణము” అని తెలుస్తుంది. “ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. కొలిమి కాలునట్లు అది కాలును; గర్విష్ఠులందరును, దుర్మార్గులందరును కొయ్య కాలువలె ఉందురు. వారిలో ఒకనికిని వేరైనను చిగురైనన లేకుండా రాబోవు దినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు” మలాకీ 4:1. ప్రతీ పాపానికే సాతాను వేరు. అతడి దుష్ట పరివారం చిగుళ్లు. వీరందరూ నాశనమవుతారు. పాపం అంతమొందుతుంది. దాని పర్యవసానంగా వచ్చిన దు:ఖం, మరణం ఇక ఉండవు. కీర్తన రచయిత ఇలా అంటున్నాడు. “నీవు అన్య జనులను గద్దించియున్నావు. దుష్టులను నశింపజేసియున్నావు. వారి పేరు ఎన్నటికిని నుండకుండ తడుపు పెట్టయున్నావు. శత్రువులు నశించిరి, వారు ఎప్పుడు నుండకుండ నిర్మూలమైరి” కీర్తనలు 9:5,6. PPTel 331.1

కాగా దేవుని తీర్పు తుఫాను మధ్య దేవుని ప్రజలకు భయమేమీ ఉండదు. “యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగానుండును”. యావేలు 3:16. దైవ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించేవారికి భయాన్ని, మరణాన్ని తెచ్చే ఆ దినం ఆయనకు విధేయులైన వారికి “చెప్పనశక్యమును, మహిమాయుక్తమునైన సంతోషము” తెస్తుంది. “బల్యర్పణచేత నాతో నిబంధనచేసి కొనిన నా భక్తులను నాయొద్దకు సమకూర్చుడి... దేవుడు తానే న్యాయకర్తయైయున్నాడు. ఆకాశమును ఆయన నీతిని తెలియజేయుచున్నది” అని ప్రభువు సెలవిస్తున్నాడు. PPTel 331.2

“అప్పుడు నీతిగలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించువారెవరో ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు”.మలాకీ 3:18.“నీతి అనుసరించు వారలారా, నా మాట వినుడి. నా బోధన హృదయమందుంచుకొన్న జనులారా, ఆలకించుడి”. “ఇదిగో తూలిపడజేయు... పాత్రను నీ చేతిలో నుండి తీసివేయుచున్నాను. నీవిక దానిలోనిది త్రాగవు”. “నేను నేనే మిమ్మునోదార్చువాడను” యెషయా 51:7, 22, 12. “పర్వతములు తొలగిపోయినను మెట్ట తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు” యెషయా 54:10. PPTel 331.3

రక్షణ ప్రణాళిక లోకాన్ని దేవునితో మళ్లీ సమాధాన పర్చుతుంది. పాపంవల్ల నశించిందంతా పునరుద్దరణ పొందుతుంది. మానవుడు మాత్రమే కాదు నీతిమంతులకు నిత్య నివాసమయ్యేందుకు ఈ భూమికూడ పునె ఉద్దరణ పొందుతదంది. భూమిని సృజించటంలో ఆదిలో దేవునికున్న ఉద్దేశం ఇప్పుడు సఫలమవుతుంది. “మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. వారు యుగయుగములు యుగ యుగాంతము వరకు రాజ్యమేలుదురు” దానియేలు 7:18. PPTel 331.4

“సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయమువరకు యెహోవా నామము స్తుతి నొందదగినది” కీర్తనలు 113:3. “ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలుపబడును”. ” యెహోవా సర్వలోకమునకు రాజైయుండును” జెకర్యా 14:9. ” యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది”. “ఆయన శాసనములన్నియు నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపించబడి యున్నవి” కీర్తనలు 119:89, 111:7, 8. ఏ ధర్మ శాసనాల్ని సాతాను ద్వేషించి నిర్మూలం చేయటానికి ప్రయత్నించాడో అవి పాపరహిత విశ్వమంతటా ఆదరణ, ఆచరణ పొందుతాయి. “భూమి మొలకను మొలిపించునట్లుగదాను తోటలో విత్తబడిన వాటిని అవి మొలిపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జనుల యెదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయును”. యెషయా 61:11. PPTel 332.1