పితరులు ప్రవక్తలు

26/75

24—పస్కా పండుగ

ఇశ్రాయేలీయుల్ని విడుదల చేయవలసిందిగా ఐగుప్తు రాజును మొట్టమొదటగా కోరినప్పుడే మిక్కిలి భయంకరమైన తెగులను గురించిన హెచ్చరిక కూడా చేయటం జరిగింది. ఫరోతో ఈ విధంగా చెప్పమని దేవుడు మోషేని ఆదేశించాడు, “ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. నన్ను సేవించునట్లు నా కుమారుని పొమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంవనొల్లని యెడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠ పుత్రుని చం పెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుము”, నిర్గమ కాండము 4: 22, 23. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయల్ని తృణీకరించినా వారిని దేవుడు సన్మానించాడు. వారిని తన ధర్మశాస్త్రానికి ధర్మకర్తలుగా ప్రత్యేకించాడు. తమ ప్రత్యేక దీవెనలు, ఆధిక్యతల మూలంగా కుటుంబంలో జ్యేష్ఠ పుత్రుడికిమల్లే లోక ప్రజలందరిలోను వారిది విశిష్ఠస్థానం. PPTel 263.1

ఏ తెగుల్ని గురించి ఐగుప్తు మొదట్లో హెచ్చరిక పొందిందో అదే వారి మీదికి రానున్న చివరి తెగులు. దేవుడు దీర్ఘశాంతం గలవాడు, కృపా సంపూర్ణుడు., తన స్వరూపంలో సృష్టి పొందిన నరులపట్ల ఆయనకు శ్రద్ధాసక్తులు మెండు. తమ పంటలు, పశువులు, మేకలు, గొర్రెల మందల నష్టం ఐగుప్తీయులకు పశ్చాత్తాపం కలిగిస్తే వారి పిల్లలు మెత్తబడేవారు కాదు. కాని ఆ ప్రజలు దేవుని ఆజ్ఞనను మూర్ఖంగా ప్రతిఘటించారు. ఇప్పుడు వారి చివరి తెగులువారిమీద పడటానికి సిద్ధంగా ఉన్నది. PPTel 263.2

తన ముఖం ఇక చూడవద్దని చూసిన రోజు తాను తప్పక మరణిస్తాడని ఫరో మోషేని హెచ్చరించాడు. అయితే దేవుని వద్దనుంచి చివరి వర్తమానాన్ని తిరుగుబాటు చేస్తున్న రాజుకి మోషే అందించాల్సి ఉంది. అందుకు మోషే మళ్లీ అతడి ముందుకు వచ్చి ఈ భయంకర ప్రకటన చేశాడు, “యెహోవా సెలవిచ్చున దేమనగా - మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశములోనికి బయటకు వెళ్లెదను. అప్పుడు సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలి పిల్ల మొదలుకొని తిరగలి విసురు దాని తొలిపిల్లవరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరును చచ్చెదరు. జంతువుల లోను తొలి పిల్లలన్నియు చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందంతట మహా ఘోష పుట్టును. అట్టి ఘోష అంతుకుముందు పుట్టలేదు. అట్టిది ఇకమీదట పుట్టదు. యెహోవా ఐగుప్తీయులను, ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడునట్లు మనుష్యులమీదగాని, జంతువులమీదగాని ఇశ్రాయేలీయులలో ఎవరిమీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. అప్పుడు PPTel 263.3

నీ సేవకులైన వీరందరు నా యొద్దకు వచ్చి నాకు నమస్కారము చేసి - నీవును నిన్ను ఆశ్రయించియున్న ఈ ప్రజలందరును బయలు వెళుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్లెదను”. PPTel 264.1

ఈ తీర్పు అమలుకు ముందు తాము ఐగుప్తును విడిచివెళ్లటం గురించి మరీ ముఖ్యంగా రానున్న తెగులు నుంచి తమ పరిరక్షణ గురించి మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులికి సూచనలిచ్చాడు. ప్రతీ కుటుంబం దానంతట అది గాని ఇంకో కుటుంబంతో కలిసిగాని “నిర్దోషమైన” ఒక గొర్రెపిల్లను గాని మేకపిల్లను గాని చంపి దాని రక్తాన్ని, హిస్సోపుతో ద్వార బంధం పైకమ్మికి రెండు నిలువు కమ్ములకు రాయాల్సి ఉన్నారు. మధ్యరాత్రిలో రానున్న మరణదూత ఆ గృహంలో ప్రవేశించడు. దాని మాంసాన్ని, నిప్పులమీద కాల్చి దాన్ని పులియని రొట్టెలతోను, చేదు కూరతోను రాత్రివేళ తినాలి. మోషే ఇలా చెప్పాడు, “మీ నడుములు కట్టుకొని చెప్పులు తొడుగుకొని మీ కజ్జలు చేతపట్టుకొని త్వరపడుచు దాని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి”. ప్రభువిలా అన్నాడు : “ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి, ఐగుప్తు దేశమందలి మనుష్యులలోనే గాని, జంతువులలోనేగాని తొలి సంతతి యంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికి తీర్పు తీర్చెదను. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటి పోయెదను. నేను ఐగుప్తు దేశమును పాడుచేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీమీదికి రాదు”. PPTel 264.2

భవిష్యత్తులో ఇశ్రాయేలీయులందరూ ఈ విమోచన జ్ఞాపకార్థం ఒక పండుగను ఏటేటా ఆచరించాల్సి ఉన్నారు. “కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. తరతరములకు నిత్యమైన కట్టడగా దాని నాచరింపవలెను”. భవిష్యత్తులో ఈ పండుగను ఆచరించేటప్పుడు వారు తమ పిల్లలకు ఈ గొప్ప విమోచన కథను వల్లించాల్సి ఉన్నారు. వారిని మోషే ఇలా ఆదేశించాడు, “ఈ ఆచారమేమిటని మిమ్మును అడుగునప్పుడు మీరు - ఇది యెహోవాకు పస్కాబలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన యిండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల యిండ్లను విడిచి పెట్టెను అనవలెను”. PPTel 264.3

అంతేగాక మనుషుల్లోనేమి, జంతువుల్లోనేమి తొలి సంతానం ప్రభువుకి చెందాల్సి ఉంది. ఐగుప్తులోని ప్రథమ సంతానం నశించగా ఇశ్రాయేలీయుల తొలి సంతానం అద్భుత రీతిగా కాపుదల పొందినా ప్రాయశ్చిత్తార్థ బలి రక్తం లేకపోతే అది కూడా అదే అపాయంలో ఉండటానికి గుర్తింపుగా ఆయన దాన్ని క్రయధనంతో కొనాల్సి ఉంది. “ఐగుప్తు దేశములో నేను ప్రతి తొలి చూలును, సంహరించిననాడు మనుష్యుల తొలిచూలులనేమి, పశువుల తొలి చూలులనేమి ఇశ్రాయేలీయులలో అన్నిటిని నాకొరకు ప్రతిష్ఠించుకొంటిని. వారు నావారైయుందురు”. సంఖ్యాకాండము 3:13. గుడార సేవలు ప్రారంభమైనప్పుడు ప్రభువు ఆ సేవల నిమిత్తం ప్రజల్లోని మొదటి సంతానాన్ని కాక లేవీ గోత్రాన్ని ఎంపిక చేసుకొన్నాడు”. ఇశ్రాయేలీయులలో వారు నా వశము చేయబడినవారు; తొలి చూలియైన ప్రతివానికిని, అనగా ఇశ్రాయేలీయులలో ప్రథమ సంతానమంతటికిని ప్రతిగా వారిని నేను తీసికొనియున్నాను”. సంఖ్యా 8:16. PPTel 264.4

జ్ఞాపకార్థంగానే గాక ఛాయరూపకంగా కూడా పస్కాను ఉద్దేశించాడు దేవుడు. అది వెనుక ఐగుప్తు విడుదలనేగాక ముందు ప్రజలకు పాప దాస్యం నుంచి క్రీస్తు అనుగ్రహించనున్న విమోచనను కూడా సూచిస్తున్నది. ఎవరి పై మన రక్షణ ఆధారపడి ఉన్నదో ఆ “దేవుని గొట్టెపిల్ల”ను బలిపశువు సూచిస్తున్నది. “క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను” అని పౌలు అంటున్నాడు. 1 కొరింథీ 5:7. పస్కా పశువును వధించటమే చాలదు. దాని రక్తాన్ని ద్వార బంధాల మీద రాయాలి. అలాగే క్రీస్తు రక్తపు యోగ్యతను ఆత్మ సొంతం చేసుకోవాలి. క్రీస్తు లోకం కోసం మరణించాడని నమ్మటమే గాక వ్యక్తిగతంగా మనకోసం మరణించాడని మనం నమ్మాలి. తన మరణం ద్వారా క్రీస్తు ప్రాయశ్చిత్తాన్ని మనం స్వీకరించాలి. PPTel 265.1

ద్వారబంధాలపై రక్తాన్ని రాయటానికి ఉపయుక్తమైన హిస్సోపు శుద్ధీకరణ చిహ్నం. కుష్ఠ రోగుల్ని శుభ్రం చేయటానికి శవాన్ని ముట్టుకోవటం ద్వారా అపవిత్రులైన వారిని శుభ్రం చేయటానికి సాంకేతికంగా హిస్సోపును ఉపయోగించేవారు. కీర్తనకారుడి ప్రార్థనలో కూడా దాని ప్రాధాన్యం కనిపిస్తుంది : “నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటె నేను తెల్లగానుండునట్లు నీవు నన్ను కడుగుము” కీర్తనలు 51:7. PPTel 265.2

ఒక్క ఎముకకూడా విరుగగొట్టకుండా మొత్తం గొర్రెపిల్లను వారు సిద్ధం చేయాల్సి ఉన్నారు. అలాగే మనకోసం మరణించాల్సి ఉన్న దేవుని గొర్రెపిల్లలో ఒక్క ఎముకనైనా విరగకొట్టడం జరగలేదు. యోహాను 19:36. క్రీస్తు త్యాగం పరిపూర్ణతకు ఇది చిహ్నం. PPTel 265.3

దాని మాంసాన్ని భుజించాలి. పాప క్షమాపణ నిమిత్తం క్రీస్తును నమ్మటం మాత్రమే చాలదు. విశ్వాసం ద్వారా వాక్యం నుంచి ఆధ్యాత్మిక శక్తిని పోషణను మనం నిత్యము పొందాలి. క్రీస్తు ఇలా అన్నాడు, “మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనేగాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు”. యోహాను 6: 53, 54. తన మాటల్ని వివరిస్తూ ఆయన ఇలా అన్నాడు, “నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై యున్నవి” 63వ వచనం, యేసు తన తండ్రి ధర్మశాస్త్ర స్పూర్తిని ప్రదర్శించాడు. తన హృదయంలోని ధర్మశాస్త్ర శక్తిని ప్రదర్శించాడు. యోహాను ఇలా అంటున్నాడు, “ఆ వాక్యము శరీర ధారియై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రివలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి”. యోహాను 1:14. క్రీస్తు అనుచరులు ఆయన అనుభవాన్ని పంచుకోవాలి. వారు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసి దాన్ని జీర్ణించుకోవాలి. అది వారి మనుగడకు కార్యాలకు ప్రేరణ కావాలి. క్రీస్తు శక్తి ద్వారా వారు ఆయన స్వరూపంలోకి మార్పు పొంది దైవ గుణాల్ని ప్రతిబింబించాలి. వారు దైవ కుమారుని శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగితేనేగాని వారిలో జీవముండదు. క్రీస్తు స్పూర్తి క్రీస్తు పరిచర్య క్రీస్తు శిష్యుల స్ఫూర్తి పరిచర్య కావాలి. PPTel 265.4

గొర్రెపిల్లను చేదు కూరతో తినాలి. ఇది ఐగుప్తు దాస్యపు చేదు అనుభవాన్ని సూచిస్తుంది. అలాగే మనం క్రీస్తును భుజించేటప్పుడు మన పాపాల నిమిత్తం విరిగి నలిగిన హృదయంతో భుజించాలి. పులియని రొట్టెలు భుజించటంలోనూ విశేషముంది. ఆ పండుగ జరుగుతున్న కాలంలో వారి గృహాల్లో పులిసిన పిండి ఉండకూడదన్నది పస్కా నియమం. ఈ నియమాన్ని యూదులు నిష్టగా పాటించారు. అలాగే క్రీస్తు వద్దనుంచి జీవాన్ని, శక్తిని పొందగోరేవారందరూ తమ జీవితాల్లోన్నుంచి పాపమనే పులుపు పిండిని తీసివేసుకోవాలి. క్రైస్తవ సంఘానికి పౌలు ఇలా రాస్తున్నాడు, “మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. అంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు, దుష్టత్వమునను, పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము” 1 కొరింథీ 5:7, 8. PPTel 266.1

స్వేచ్చ పొందకముందు ఈ బానిస ప్రజలు తమకు లభించనున్న విమోచన పై తమకున్న విశ్వాసాన్ని ప్రదర్శించాల్సి ఉన్నారు. తమ ఇళ్లపై రక్తం గుర్తును ప్రదర్శించాలి. ఐగుప్తీయులనుంచి వేరై తమ కుటుంబాల్ని వేరు చెయ్యాలి. వారు తమ గృహాల్లోనే ఉండాలి. దేవుడిచ్చిన ఉపదేశాన్ని ఏ చిన్న వివరణలోనైనా ఇశ్రాయేలీయులు మీరి ఉంటే అనగా తమ బిడ్డల్ని ఐగుప్తీయుల్లోంచి విడదీయకుండా ఉంటే గొర్రె పిల్లను వధించినా దాని రక్తాన్ని ద్వారబంధాలకి రాయటం అశ్రద్ధ చేసి ఉంటే లేదా ఎవరైనా తమ ఇళ్లలో నుంచి బయటికి వెళ్లి ఉంటే వారికి భద్రత ఉండేది కాదు. చేయాల్సిందంతా చేశామని వారు యధార్థంగా నమ్మి ఉండవచ్చు. అయినా తమ యధార్థత వారిని రక్షించేది కాదు. దేవుడిచ్చిన ఆదేశాన్ని బేఖాతరు చేసిన వారందరు తమ ప్రథమ సంతానాన్ని కోల్పోయారు. PPTel 266.2

ప్రజలు క్రియాచరణ ద్వారా తమ విశ్వాసాన్ని కనపర్చాల్సి ఉన్నారు. క్రీస్తు రక్తంలోని యోగ్యతల్ని బట్టి రక్షణను ఆశించే వారందరు అలాగే స్వీయ రక్షణకు తాము నిర్వహించాల్సిన పాత్ర కూడా ఉన్నదని గుర్తించాలి. అతిక్రమ శిక్ష నుంచి మనల్ని కాపాడేవాడు కేవలం క్రీస్తే కాగా మనం పాపం నుంచి వైదొలగి విధేయులం కావాలి. మానవుడు విశ్వాసమూలంగా రక్షణ పొందాల్సి ఉన్నాడు. క్రియల మూలంగా కాదు. అయినా క్రియల ద్వారా అతడు తన విశ్వాసాన్ని కనపర్చాల్సి ఉన్నాడు. తన కుమారుడు ప్రాయశ్చిత్తంగా మరణించటానికి దేవుడు ఆయనను అనుగ్రహించాడు. ఆయన వసతులు, ధర్మశాస్త్ర విధులు, ఆధిక్యతలు ఇచ్చాడు. మానవుడు వాటిని అభినందించి వినియోగించుకోవాలి. దేవుని విధులన్నిటిని విశ్వసించి ఆచరించాలి. తమ విడుదలకు దేవుడు చేసిన ఏర్పాటుల్ని మోషే ఇశ్రాయేలీయులకి విషాదం చేస్తున్నప్పుడు “ప్రజలు తలలు వంచి నమస్కరించిరి”. స్వేచ్ఛను గూర్చిన ఆశాభావం, తమను హింసించిన వారికి రానున్న తీర్పును గూర్చిన జ్ఞానం, తమ రక్షణ ప్రయాణానికి సంబంధించిన సాధకబాధకాలు వీటన్నిటిని రక్షకుడి పట్ల పెల్లుబికిన కృతజ్ఞత ముంచివేసింది. అనేకమంది ఐగుప్తీయులు హెబ్రీయుల దేవుడే నిజమైన దేవుడని విశ్వసించి మరణ దూత దేశంలో సంచరించినప్పుడు తమ గృహాల్లో ఆశ్రయమివ్వాల్సిందిగా ఇశ్రాయేలీయుల్ని వేడుకొన్నారు. ఇశ్రాయేలీయులు వారిని స్వాగతించారు. ఇక నుంచి యాకోబు దేవుని సేవించి ఆయన ప్రజలతో కలిసి ఐగుప్తును విడిచి వెళ్లిపోయేందుకు ప్రయాణం అయ్యారు. PPTel 267.1

ఇశ్రాయేలీయులు దేవుడిచ్చిన ఆదేశాన్ని పాటించారు. వెళ్లిపోవటానికి చురుకుగా అతి గోప్యంగా సిద్ధపడ్డారు. కుటుంబాల్ని పోగుజేసుకొన్నారు. పస్కా పశువుని వధించారు. దాని మాంసాన్ని మంటపై కాల్చారు. పులియని రొట్టెలు చేదు కూరలు సిద్ధం చేసుకొన్నారు. గృహ యాజకుడైన తండ్రి ద్వార బంధాలమీద రక్తం పామాడు. అనంతరం ఇంట్లోని తన కుటుంబంతో కూర్చున్నాడు. వారు పస్కా గొర్రె పిల్లను నిశ్శబ్దంగాను త్వరత్వరగాను తినాలి. మొదటి సంతానం ప్రజలు అప్రమత్తులై పరిశు ధ్ర భయభక్తులతో ప్రార్థించారు. గుండె బలశాలి మొదలుకొని చిన్నపిల్ల వరకూ చెప్పలేనంత భయంతో మొదటి సంతానం గుండె వేగంగా కొట్టుకొంటుంది. ఆ రాత్రి తొలిచూలి సంతానం పై పడనున్న వేటు గురించిన భయంతో తండ్రులు, తల్లులు తమ తొలి బిడ్డల్ని గట్టిగా కౌగిలించుకొని ఉన్నారు. కాగా నాశన దూత ఇశ్రాయేలీయుల గృహాన్ని దర్శించలేదు. రక్తం గుర్తు - రక్షకుని సంరక్షణ గుర్తు - వారి తలుపులు మీద ఉన్నది. నాశన దూత వారి గృహాల్లోకి ప్రవేశించలేదు. PPTel 267.2

మధ్యరాత్రిలో “శవములేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను”. “సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో నున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరిని పశువుల తొలి పిల్లలన్నిటిని” నాశన దూత చంపాడు. ఐగుప్తు దేశమంతటా కుటుంబానికి అతిశయమైన జ్యేష్ఠ సంతానం మరణించి ప్రతీ కుటుంబం కుంగిపోయింది. బిడ్డల్ని కోల్పోయిన వారు కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. ఆ భీభత్సాన్ని చూసి రాజు అతడి ఆస్థానికులు గజగజ వణుకుతూ అవాక్కయి నిలిచిపోయారు. “నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనీయను” అని తానన్న మాటలు ఫరోకి గుర్తొచ్చాయి. ఇప్పుడు దైవాన్ని ధిక్కరించిన అతడి గర్వం మట్టి కరిసింది. “రాత్రివేళ ఫరో మోషే అహోరోనులను పిలిపించి మీరును ఇశ్రాయేలీయులును లేచి నా ప్రజల మధ్యనుండి బయలువెళ్లుడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను, మీ పశువులను తీసికొని పోవుడి. నన్ను దీవించుడని చెప్పెను”. రాజు సలహాదారులు ప్రజలు కూడా “మనమందరము చచ్చినవారమనుకొని తమ దేశములోనుండి” ఇశ్రాయేలీయులను “పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి”. PPTel 268.1