ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు
యంత్రాంగంలో అడ్డుపడ్తుంది
(1870) 2T 412,413 CDTel 96.4
157. సహోదరుడా, నీవు నేర్చుకోవలసింది ఎంతో వుంది. నీ శరీర వ్యవస్థ మంచి రక్తంగా మార్చగలిగిన దానికన్నా ఎక్కువ ఆహారం తినటం మూలంగా భోజన ప్రియుడవవుతున్నావు. ఆహారం వాసి విషయంలో అభ్యంతరం లేకపోయినా రాశి విషయంలో మితం పాటించకపోటం పాపం. మాంసం, ముతక అనుచిత ఆహార పదార్థాలు తినక పోతే తాము సామాన్యాహారం తింటూ చివరికి సరిగా తినలేని పరిస్థితికి రావచ్చని అనేకులు భావిస్తారు. ఇది పొరపాటు. ఆరోగ్య సంస్కర్తలుగా చెలామణి అయ్యే అనేకులు వట్టి తిండిబోతులు. వారు జీర్ణమండల అవయవాల పై ఎంత భారం మోపుతారంటే దాన్ని నివారించే కృషిలో శరీర వ్యవస్థకు సంబంధించిన జీవశక్తి తీవ్రంగా అలసిపోతుంది. అది బుద్ధిని మందగిల్లజేసే ప్రభావాన్ని కూడా చూపిస్తుంది. ఎందుకంటే అన్నకోశపు పనిలో మెదడు నరాల శక్తి సహాయం అగత్యమౌతుంది. మిక్కిలి సామాన్యాహారం కూడా అతిగా తనటం మెదడు తాలూకు సున్నితమైన నరాల్ని మొద్దుబార్చి జీవశక్తిని బలహీనపర్చుతుంది. అతి తిండి అమిత శ్రమకన్నా శరీర వ్యవస్థను ఎక్కువ దెబ్బతీస్తుంది. అతి తిండి అతి శ్రమకన్నా ఆత్మశక్తుల్ని ఎక్కువ భ్రష్టం చేస్తుంది. CDTel 96.5
తినే ఆహారం పరిమాణ పరంగాను వాసి పరంగాను జీర్ణమండల అవయవాల పై భారం మోపకూడదు. దాన్ని వినియోగించుకోటానికి శరీర వ్యవస్థ ఎంతో శ్రమపడాల్సి ఉంటుంది. శరీర వ్యవస్థ మంచి రక్తంగా మార్చగలిగిన దానికన్నా కడుపు తీసుకునే అదనపు ఆహారం శరీర యంత్రాంగానికి అడ్డుపడుతుంది. ఎందుకంటే దాన్ని మాంసంగాగాని రక్తంగాగాని మార్చటానికి సాధ్యం కాదు. దాని ఉనికి కాలేయానికి భారమతుంది. అది శరీర వ్యవస్థను రోగగ్రస్తం చేస్తుంది. దాన్ని పరిష్కరించే ప్రయత్నంలో కడుపు ఎక్కువ పనిచెయ్యాల్సి వస్తుంది. ఫలితంగా అలసట మందకొడితనం ఏర్పడ్డాయి. ఇది ఆకలిగా అర్థమౌతుంది. జీర్ణమండల అవయవాలు చేయాల్సి వచ్చిన శ్రమనుంచి విశ్రాంతి పొంది తమ శక్తిని తిరిగి సంపాదించుకోటానికి వ్యవధి లేకుండా పెద్దమొత్తంలో మరింత ఆహారం కడుపులో వేసుకోటం అలసిపోయిన శరీర యంత్రాంగానికి మళ్ళీ పని కల్పించటమౌతుంది. పెద్ద మొత్తంలో తీసుకున్న ఆహారం నుంచి - అది సరిఅయిన నాణ్యత గలది అయినా శరీరానికి తక్కువ పోషక పదార్థం లభిస్తుంది. ఇది తక్కువ మొత్తంలో క్రమబద్ధంగా తీసుకున్న ఆహారం సమకూర్చే పోషక పదార్థం కన్నా తక్కువగా ఉంటుంది. CDTel 97.1