అపొస్తలుల కార్యాలు
8—సహెడ్రి సభ ముందు
అవమానం హింసల సాధనమైన ఆ సిలువే లోకానికి నిరీక్షణను రక్షణను తెచ్చింది. శిష్యులు సామాన్య సాదాసీదామనుషులు. ఆస్తిపాస్తులు వెనకలేనివారు. వారికున్న ఆయుధం ఒక్కటే. అది దేవుని వాక్యం. అయినా పశువుల తొట్టి సిలువ కథ చెప్పడానికి, సకల వ్యతిరేకతను జయించడానికి క్రీస్తు శక్తితో వారు బయలు దేరారు. లోక ప్రతిష్ఠ గుర్తింపులేకపోయినా విశ్వాసంలో వారు వీరులు. వారి నోటివెంట వస్తున్న పరిశుద్ధ వాగ్దాటి లోకాన్ని కుదిపివేసింది. AATel 56.1
తీవ్ర దురాభిప్రాయం తిష్టవేసిన యెరూషలేములో, అపరాధిగా సిలువ మరణం పొందిన ప్రభువును గూర్చి అస్పష్ట అస్తవ్యస్త అభిప్రాయాలు ప్రబలుతున్న యెరూషలేములో శిష్యులు నిత్యజీవాన్నిచ్చే వాక్యాన్ని నిర్భయంగా ప్రబోధిస్తూ క్రీస్తు సేవను ఆయన చేపట్టిన కర్తవ్యాన్ని ఆయన సిలువను పునరాత్థానాన్ని ఆరోహణాన్ని యూదులకు తేటతెల్లం చేస్తున్నారు. శిష్యులిస్తున్న స్పష్టమైన నిర్భయమైన సాక్ష్యాన్ని యాజకులు అధిపతులు విన్నారు. తిరిగి లేచిన రక్షకుని శక్తి వాస్తవంగా శిష్యుల మీదకి వచ్చింది. వారి పరిచర్య రోజుకు రోజు సూచనలు సూచకక్రియతో నిండడంతో విశ్వాసుల సంఖ్య దినదినం పెరిగింది. శిష్యులు వెళ్లాల్సివున్న వీధుల పొడుగునా ప్రజలు వ్యాధిగ్రస్తుల్ని తెచ్చి పేతురునీడ “వారిలో ఎవనిసదనైనను... పడవలెనని మంచములమీదను పరుపులమీదను వారిని ఉంచిరి.” అపవిత్రాత్మలతో బాధపడున్న వారిని కూడా అక్కడికి ప్రజలు తెచ్చారు. ప్రజలు వారి చుట్టూ మూగే వారు స్వస్తత పొందినవారు దేవునికి స్తోత్రాలర్పిస్తూ కేకలు వేసి రక్షకుని మహిమపర్చేవారు. AATel 56.2
యాజకులు ప్రధానులు తమకన్నా క్రీస్తు హెచ్చించబడడం చూశారు. పునరుత్థానాన్ని నమ్మని సద్దూకయ్యులు క్రీస్తు పునరుత్థానుడయ్యాడని శిష్యులు బోధించడాన్ని విన్నప్పుడు కోపోద్రిక్తులయ్యారు. పునరుత్థానుడైన రక్షకుణ్ణి గూర్చి అపొస్తలులు ప్రసంగించడం ఆయన నామాన సూచక క్రియలు చేయడం కొనసాగనిస్తే పునరుత్థానం లేనే లేదన్న తమ సిద్ధాంతాన్ని అందరూ నిరాకరించడం సద్దూకయ్యుల తెగ అంతరించడం తధ్యమని వారు గుర్తించారు. శిష్యుల బోధ యూదుల ఆచారాల్ని బల్యర్పణల్ని దెబ్బతీసే ధోరణిలో సాగుతున్నదని పరిసయ్యులు ఆగ్రహంతో ఉన్నారు. AATel 56.3
ఈ నూతన సిద్ధాంతాన్ని అణచివేయడానికి ఇంతవరకు జరిగిన ప్రయత్నాలు వ్యర్థమయ్యాయి. కాని ఇప్పుడు సద్దూకయ్యులు పరిసయ్యులు ఇరు వర్గాలు శిష్యుల బోధలు తాము యేసు మరణం విషయంలో నేరస్తులమని నిరూపిస్తున్నందున వాటిని ఆపుచేయాలని కృత నిశ్చయులయ్యారు. యాజకులు దురాగ్రహంతో నిండి పేతురు యోహానుల పై చెయ్యిచేసుకొని వారిని చెరసాలలో వేశారు. AATel 57.1
తాను ఎంపిక చేసుకొన్న ప్రజలకోసం దేవుని సంకల్పాన్ని నెరవేర్చడంలో యూదు నాయకులు ఘోరంగా విఫలమయ్యారు. దేవుడు ఎవరిని తన సత్యానికి నిలయంగా ఏర్పాటుచేశాడో ఆ ప్రజలు ఆయనకు నమ్మకంగా నిలవలేదు. ఆ పనికి దేవుడు ఇతర ప్రజల్ని పిలిచాడు. తమ గుడ్డితనంలో ఈ నాయకులు తమకు ప్రియమైన సిద్ధాంతాలను తోసిపుచ్చుతున్నవారిపై విరుచుకుపడ్డారు. తాము వాక్యాన్ని సరిగా అవగాహన చేసుకోకపోయే అవకాశమున్నదనిగాని లేఖనాల పై తప్పు వ్యాఖ్యానం చేశామనిగాని తప్పుగా లేఖనాల్ని అన్వయించామనిగాని వారు అంగీకరించలేదు. వారు యుక్తాయుక్త విచక్షణను కోల్పోయిన వ్యక్తుల్లా వ్యవహరించారు. మేము ప్రజలకు బోధించిన సిద్ధాంతాలకు విరుద్దంగా బోధించే హక్కు పల్లెవారైన ఈ బోధకులకు ఎక్కడిది? ఈ అభిప్రాయాలు వ్యక్తం చేసే బోధలను అణచివేయాలని తీర్మానించుకొని ఆ బోధకుల్ని చెరసాలలో వేశారు. AATel 57.2
నాయకుల ఈ ప్రవర్తనకు శిష్యులు భయపడలేదు. నిరుత్సాహం చెందలేదు. క్రీస్తు పలికిన ఈ మాటల్ని పరిశుద్ధాత్మ వారి మనసులకు తెచ్చాడు: “దాసుడు తన యజమానికంటె గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకముంచు కొనుడి. లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడా హింసింతురు; నామాట గైకొనిన యెడల మీ మాట కూడా గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరుగనుక నా నామము నిమిత్తము వీటన్నిటిని మికు చేయుదురు.” “వారు మిమ్మును సమాజమందిరములలోనుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది.” “అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితినని వారు జ్ఞాపకము చేసుకొనులాగున యీ సంగతులు మీతో చెప్పుచున్నారు.” యెహాను 15:20,21;16:2,4. AATel 57.3
పరలోకమందున్న దేవుడు మహాశక్తిగల విశ్వపరిపాలకుడు చెరసాలలోవున్న శిష్యుల విషయాన్ని తన చేతుల్లోకి తీసుకొన్నాడు. ఎందుకంటే మనుషులు తన సేవకు వ్యతిరేకంగా పోరాటం సల్పుతున్నారు. రాత్రివేళ ప్రభువు దూత చెరసాల తలుపులు తెరిచి శిష్యుల్లో ఇలా అన్నాడు: “మీరు వెళ్లి దేవాలయములో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నియు ప్రజలతో చెప్పుడి.” ఈ ఆనతి యూదునాయకులిచ్చిన ఆజ్ఞకు విరుద్ధం. అధికారుల్సి సంప్రదించి వారి అనుమతి పొందే వరకు వెళ్లలేమని అపొస్తలులు వెనకాడారా? లేదు; “మీరు వెళ్లండి” అని దేవుడు ఆదేశించగా వారు ఆ ఆజ్ఞపాలించారు. “తెల్లవారగానే దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండిరి.” AATel 57.4
పేతురు యోహాన్ల మధ్య నిలబడి కావలికాస్తున్న భటుల మధ్యనుంచి తమను దేవదూత బైటికి ఎలాతీసుకువచ్చి తాము ఆపు చేసిన పనిని మళ్లీ ప్రారంభించి కొనసాగించమని ఎలా ఆదేశించాడో వారికి వివరించినప్పుడు సహోదరులు ఆశ్చర్యపడి ఆనందించారు. AATel 58.1
అప్పుడు ప్రధానయాజకుడు అతనితో ఉన్నవారు “మహాసభ వారిని ఇశ్రాయేలీయుల పెద్దలందరిని పంపిం చారు. తిరుగుబాటు ప్రయత్నం, అననీయ, సప్పీరాల్ని హత్య చేయడం, ప్రధాన యాజకుల అధికారం లేకుండా చేయడం అన్న ఆరోపణలు శిష్యుల మీద మోపడానికి ప్రధాన యాజకులు అధికారులు నిర్ణయించుకొన్నారు. ఇలా ప్రజల్ని రెచ్చగొట్టి ఆ సమస్యను చేపట్టి యేసుతో వ్యవహరించినట్లు శిష్యులతో వ్యవహరించాలని వారు భావించారు. క్రీస్తు బోధనల్ని అంగీకరించని అనేకులు యూదు అధికారుల నిరంకుశ పరిపాలన విషయంలో అసంతృప్తి చెంది మార్పుకోరుతున్నారన్నది వారికి తెలుసు. అసంతృప్తితోవున్న ఈ ప్రజలు అపొస్తలులు ప్రకటిస్తున్న సత్యాల్ని అంగీకరించి యేసును మెస్సీయాగా గుర్తిస్తే ప్రజల ఆగ్రహం మతనాయకుల మీదకు మళ్లుతుందని క్రీస్తుహత్యకు తాము జవాబుదార్లు కావాల్సివస్తుందని వారు భయపడ్డారు. AATel 58.2
ఖైదీల్చి తమముందుకు తీసుకురావలసిందని వారు ఆదేశించినప్పుడు చెరసాల తలుపులు మూసి ఉండగా వాటిముందు కావలికాసే భటులు నిలిచివుండగా ఖైదీలు మాత్రం మాయమయ్యారన్న వార్త వారికి విభ్రాంతి కలిగించింది. AATel 58.3
త్వరలోనే సమాచారం వచ్చింది. “ఒకడు వచ్చి ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుష్యులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని తెలుపుగా అధిపతి బంట్రోతులతో కూడా పోయి, ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి, బలాత్కారము చేయకయే వారిని తీసుకొని వచ్చెను.” AATel 58.4
అపొస్తలులు చెరసాలనుంచి అద్భుత రీతిగా విడుదల పొందినప్పటికీ వారు విచారణకూ శిక్షకూ అతీతులు కారు. తమతో ఉన్న దినాల్లో క్రీస్తు వారిని ఇలా హెచ్చరించారు, “మిమ్మును గూర్చి మిరే జాగ్రత్తపడుడి. వారు మిమ్మును సభల కప్పగించెదరు.” మార్కు 13:9. తమను విడుదల చేయడానికి దూతను పంపడంద్వారా తన ప్రేమను గూర్చి వారితో తన సముఖాన్ని గూర్చి దేవుడు వారికొక సూచన నిచ్చాడు. తాము ఎవరి సువార్తను ప్రకటిస్తున్నారో ఆ ప్రభువు నిమిత్తం బాధననుభవించడం ఇప్పుడు వారి వంతు. AATel 58.5
ప్రవక్తలు అపొస్తలుల చరిత్రలో దేవునికి నమ్మకంగా నిలిచినవారి సాదృశ్యాలు చాలా ఉన్నాయి. క్రీస్తు సాక్షులు దేవుని ఆజ్ఞల్ని మీరడం కన్నా చెరసాలను హింసను మరణాన్ని ఎన్నుకొన్నారు. పేతురు యోహానుల వెనుకవున్న సాహసగాధ సువార్త యుగంలోని ఏ సాహస చరిత్రకూ తీసిపోనిది. తమ నాశనాన్ని కోరి పనిచేస్తున్న ఆ వ్యక్తుల ముందు వారు రెండోసారి నిలబడ్డప్పుడు వారి మాటల్లోగాని వైఖరిలోగాని భయంగాని ఊగిసలాటగాని కనిపించలేదు. ప్రధాన యాజకుడు, “మీరు ఈ నామమునుబట్టి బోధింపకూడదని మేము మీకు ఖండింతముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి యీ మనుష్యుని హత్య మామీదికి తేవలెనని ఉద్దేశించున్నారు అన్నప్పుడు, “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా?” అని పేతురు బదులు పలికాడు. పరలోకంనుంచి వచ్చినదూతే వారిని చెరసాలలోనుంచి విడిపించి ఆలయంలో బోధించమని ఆదేశించాడు. ఆ ఆదేశాన్ని అమలుపర్చడంలో వారు దేవుని ఆజ్ఞను శిరసావహిస్తు న్నారు. తమకు ఏమి సంభవించినా వారు దేవునికి విధేయులై ఉండాల్సిందే. AATel 59.1
అంతట శిష్యులమీదికి ఆత్మావేశం వచ్చింది; నిందితులే ఆరోపణలు చేయడం మొదలయ్యింది. ఆ సభలోని సభ్యులే క్రీస్తు హత్యకు బాధ్యులని వారు ఆరోపించారు. ” మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారుమనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలముచేత హెచ్చించియున్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైయున్న వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమైయున్నాము”అని పేతురు వెల్లడించాడు. AATel 59.2
ఆ మాటలు విన్నప్పుడు యూదులు ఆవేశకానేషాలో చిందులు వేశారు. చట్టం చేతుల్లోకి తీసుకొని విచారణ లేకుండా రోమా అధికారుల అనుమతి లేకుండా ఆ ఖైదీల్ని సంహరించాలనుకొన్నారు. క్రీస్తు రక్తంతో చేతులు తడిసివున్న ఆ మనుషులు ఇప్పుడు ఆయన శిష్యుల రక్తంతో మరకలు చేసుకోవాలని చూస్తున్నారు. AATel 59.3
కాగా శిష్యుల మాటల్లో దైవస్వరాన్ని గుర్తించిన వ్యక్తి ఆ సభలో ఒకడున్నాడు. ఆ వ్యక్తి గమలీయేలు. అతను పరువు ప్రతిష్ఠలున్న పరిసయ్యుడు. విద్యాంసుడు; హోదాగలవాడు. ప్రధాన యాజకులు యోచిస్తున్న చర్య భయంకర పర్యవసానాలకు దారితీస్తుందని అతను గుర్తించాడు. అక్కడ పోగుపడ్డవారితో మాట్లాడకముందు ఖైదీల్ని అక్కడనుంచి పంపివేయాల్సిందిగా కోరాడు. తాను ఎవరితో తలపడుతున్నదీ గమలీయేలుకు బాగా తెలుసు. క్రీస్తు హంతకులు తాము తల పెట్టిన కార్యాన్ని సాధించడానికి సందేహించరని కూడా అతనికి తెలుసు. AATel 59.4
ఆ తర్వాత ప్రశాంతంగా అతను ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయులారా, యీ మనుష్యుల విషయమై మీరేమి చేయబోవుచున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు థూదా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను: ఇంచుమించు నన్నూరుమంది మనుష్యులు వానితో కలిసికొనిరి వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరును చెదరి వ్వరు లైరి. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడ తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడినవారందరును చెదరిపోయిరి. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా- ఈమనుషుల జోలికిపోక వారిని విడిచి పెట్టుడి. ఈ కార్యమైనను మనుష్యుల వలన కలిగిన దాయెనా అది వ్యర్థమగును. దేవుని వలన కలిగిన దాయెనా వారు వారిని వ్యర్థపరచలేరు. మీరొకవేళ దేవునితో పోరాడువారగుదురు సుమి.” AATel 60.1
గమలీయేలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు సవ్యమైనవేనని గుర్తించి ప్రధానయాజకులు అతనితో ఏకీభవించారు. అయినా వారి దురాభిప్రాయం ద్వేషం అదుపుతప్పాయి. శిష్యుల్ని కొట్టి యేసు పేర బోధించవద్దని బోధించడం తమ ప్రాణాలకు హాని అని హెచ్చరించి వారిని అయిష్టంగా విడిచి పెట్టారు. “ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషించుచు మహాసభ యెదుట నుండి వెళ్లిపోయి ప్రతి దినము దేవాలయము లోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించు చుండిరి.” AATel 60.2
తన సిలువ మరణానికి కొంచెం ముందు తన శాంతిని తన చిరాస్తిగా క్రీస్తు తన శిష్యులకు విడిచి పెట్టాడు. “శాంతి మీకనుగ్రహించుచున్నాను. లోక మిచ్చునట్లుగా నేను మీకనుగ్రహించుటలేదు; నా హృదయమును కలవరపడనియ్య కుడి, వెరవనియ్యకుడి.” యోహాను 14:27. ఈ శాంతి లోకంతో మమేకవవ్వడం వలన వచ్చే శాంతికాదు. దుష్టితో రాజీపడడం ద్వారా క్రీస్తు ఎన్నడూ శాంతిని సంపాదించలేదు. క్రీస్తు తన శిష్యులకు విడిచివెళ్లిన శాంతి బాహ్యామయ్యింది కాదు, అంతర్గతమైన శాంతి. శ్రమల్లోను పోరాటంలోను తన భక్తులతో ఉండే శాంతి అది. AATel 60.3
తన్ను గురించి క్రీస్తు ఇలా అన్నాడు: ‘నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునేగాని సమాధానమును పంపుటకు నేను రాలేదు.” మత్తయి 10:34. సమాధానాధిపతి అయినా ఆయన విభజనకు కారకుడయ్యాడు. శుభవార్త ప్రకటించడానికి, మానవ హృదయాల్లో నిరీక్షణను ఆనందాన్ని నెలకొల్పడానికి వచ్చిన ఆ ప్రభువు మానవ హృదయాల్లో తీవ్ర సంఘర్షణను తీవ్ర ఉద్రేకాన్ని ప్రారంభించాడు. “లోకములో మీకు శ్రమ కలుగును.” ” వారు మిమ్మును బలత్కారముగా పట్టి, నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసికొనిపోయి, సమాజమందిరముల కును చెరసాలకును అప్పగించి హింసింతురు.” “తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు.; వారు మిలో కొందరిని చంపింతురు.” యోహాను 16:33; లూకా 21:12,16. AATel 60.4
ఈ ప్రవచనం కచ్చితంగా నెరవేరింది. మానవ మనసుల్లో సాతాను పుట్టించే నానా రకాల పరాభవం, అపవాదు క్రూరత్వం క్రీస్తు అనుచరుల పట్ల ప్రదర్శిత మయ్యింది. మళ్లీ కచ్చితంగా ప్రదర్శితం కానుంది. ఎందుచేతనంటే శరీరానుసారమైన హృదయం దైవ ధర్మశాసనానికి వ్యతిరేకం. అది దైవాజ్ఞలకు లోబడదు. లోకం అపొస్తలుల కాలం క్రీస్తు సూత్రాలకు అనుగుణంగా జీవించలేదు. ఇప్పుడూ జీవించదు. “వానిని సిలువ వేయుము” అని ప్రజలచే కేకలు వేయించిన ద్వేషమే, ఆయన శిష్యుల్ని హింసించటానికి ప్రేరేపించిన ద్వేషమే అవిధేయ ప్రజల్లో నేడూ పనిచేస్తున్నది. చీకటి యుగాల్లో స్త్రీలను పురుషులను చెరసాలలో వేయించి చంపించిన ద్వేషమే, న్యాయ విచారణ ముసుగులో హింసాకాండ కొనసాగించిన ద్వేషమే, భక్తుడు బర్తలో మియను హత్య చేయించిన ద్వేషమే, స్మిత్ ఫీల్డ్ మంటల్ని రగిలించిన ద్వేషమే మారుమనుసు పొందని హృదయాల్లో ఇంకా పనిచేస్తున్నది. సత్యం తాలూకు చరిత్ర సత్యానికి అసత్యానికి మధ్య జరిగే పోరాటాన్ని గూర్చిన రికార్డు అనవచ్చు. వ్యతిరేకత, అపాయం, నష్టం బాధ మధ్య ఈ లోకంలో సువార్త ప్రచారం కొనసాగుతున్నది. AATel 61.1
క్రీస్తు నిమిత్తం గతంలో హింసననుభవించిన వారి శక్తి ఎలాంటిది? అదే దేవునితో ఒకటవ్వడం, పరిశుద్ధాత్మతో ఒకటవ్వడం, క్రీస్తుతో ఒకటవ్వడం వలన కలిగే శక్తి. నింద, హింస లోక స్నేహితులునుంచి దూరంచేస్తాయి కాని క్రీస్తు ప్రేమనుంచి ఎన్నడూ దూరం చేయలేవు. శ్రమ అనే తుఫానుకు గురిఅయిన ఆత్మ సత్యం నిమిత్తం నింద భరిస్తున్నప్పుడు ఆ ఆత్మను యేసు అమితంగా ప్రేమిస్తాడు. “నేను.... వానిని ప్రేమించి వానికి నన్ను కనపరచుకొందును.” అంటున్నాడు క్రీస్తు. యోహాను 14:21. సత్యం నిమిత్తం విశ్వాసి లోక న్యాయస్థానాల్లో నిలబడ్డప్పుడు ఆ విశ్వాసి పక్క క్రీస్తు నిలబడివుంటాడు. అతను చెరసాలలో బందీ అయివున్నప్పుడు క్రీస్తు తన్నుతాను అతనికి కనపర్చుకొని తన ప్రేమతో అతని హృదయాన్ని తెప్పరిల్లజేస్తాడు. అతను క్రీస్తు నిమిత్తం మరణించవలసి వచ్చినప్పుడు వాళ్లు శరీరాన్ని చంపవచ్చుగాని ఆత్మకు హాని చేయలేరు అని రక్షకుడు అతనితో చెబుతాడు. “ధైర్యం తెచ్చుకొనుడి నేను లోకమును జయించియున్నాను “నీకు తోడైయున్నాను భయపడకుము. నేను నీ దేవుడనైయున్నాను. దిగులుపడకుము. నేను నిన్ను బలపరతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ” యోహాను 16:33; యెషయా 41:10. AATel 61.2
“యెహోవాయందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెనుందురు. యెరూషలేము చుట్టు పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టు ఉండును.” “కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును.” కీర్తనలు 125:1-3;72:14. AATel 62.1
“సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని కాపాడును... నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నములవలె నున్నారు గనుక కాపరి తనమందను రక్షించునట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. ” జెకర్యా 9:15,16. AATel 62.2