అపొస్తలుల కార్యాలు
58—విజయం సాధించిన సంఘం
అపొస్తలులు తమ సేవా బాధ్యతలు విరమించి విశ్రాంతిలోకి ప్రవేశించింది లగాయతు పద్దెనిమిది శతాబ్దాలకు పై చిలుకు కాలం గడిచింది. అయితే క్రీస్తు నిమిత్తం వారు చేసిన అవిశ్రాంతి సేవ, త్యాగాలు సంఘం భద్రంగా దాచుకుంటున్న అమూల్య భాగ్యంలో భాగంగా సంఘ చరిత్రలో మిగిలివున్నాయి. పరిశుద్ధాత్మ మార్గనిర్దేశం కింద రచించటం జరిగిన ఈ చరిత్ర, ప్రతీయుగం లోను క్రీస్తు అనుచరులు స్ఫూర్తిని పొంది ఆయనకు ఇతోధిక సేవచేసేందుకు దాఖలయ్యింది. AATel 426.1
శిష్యులు క్రీస్తు ఇచ్చిన ఆదేశాన్ని నెరవేర్చారు. ఈ సిలువ దూతలు సువార్త ప్రకటించటానికి బయలుదేరినప్పుడు మనుషుడు ఎన్నడూ చూడని మహిమా ప్రదర్శన చోటుచేసుకుంది. పరిశుద్ధాత్మ సహకారంతో అపొస్తలులుచేసిన సేవ లోకాన్ని కుదిపివేసింది. కేవలం ఒక్క తరంలోనే వీరు ప్రతీ జాతికి సువార్త అందించటం జరిగింది. AATel 426.2
అపొస్తలుల సువార్త పరిచర్య గొప్ప ఫలితాల్ని సాధించింది. సువార్త సేవ ప్రారంభంలో వారిలో కొందరు అక్షరజ్ఞానం లేనివారు. అయినా వారు తమ ప్రభువు సేవకు తమ్మునుతాము పూర్తిగా, మినహాయింపులు లేకుండా అంకితం చేసుకున్నారు. తమకు అప్పగించబడ్డ మహోన్నత పరిచర్యకు ప్రభువు ఉపదేశం సిద్ధబాటును సమకూర్చింది. కృప, సత్యం వారి హృదయాల్ని నింపాయి. వారి ఆశయాల్ని ఉత్తేజపర్చి వారి క్రియల్ని నియంత్రించాయి. వారి జీవితాలు క్రీస్తుతో కూడ దేవునియందు దాచబడివున్నాయి. స్వార్థం ఇకలేదు. అది అనంత ప్రేమ అగాధంలో మునిగి పోయింది. AATel 426.3
శిష్యులు ఎలా మాట్లాడాలో, ఎలా ప్రార్థించాలో ఎరిగినవారు. ఇశ్రాయేలు బలమైన ప్రభువుతో పోరాడగలిగిన మనుషులు వారు. వారు దేవుని పక్కనే నిలబడి తమ వ్యక్తిగత గౌరవాన్ని ఆయన సింహాసనానికి ముడి పెట్టారు. యెహోవా వారికి దేవుడు. ఆయన గౌరవమే వారి గౌరవం. ఆయన సత్యం వారి సత్యం. సువార్తపై ఏదైనా దాడి జరిగితే అది వారి ఆత్మను లోతుగా నరికినట్టుగా ఉండేది. క్రీస్తు సేవ నిమిత్తం వారు తమ పూర్ణశక్తితో పోరాడారు. వారు జీవవాక్యాన్ని ఆచరించగలిగారు ఎందుకంటే వారు దైవాత్మను పొందారు. వారు ఆశించింది ఎక్కువ. అందుకే వారు ఎక్కువగా కృషిచేశారు. క్రీస్తు తన్నుతాను వారికి బయలుపర్చుకున్నాడు. వారు మార్గనిర్దేశం కోసం ఆయనమీద ఆధారపడ్డారు. సత్యం విషయంలో వారి అవగాహన, వ్యతిరేకతను ప్రతిఘటించటంలో వారి శక్తి దేవుని చిత్తం నెరవేర్చటంలో వారి విధేయత నిష్పత్తిలో ఉన్నాయి. దేవుని వివేకం, శక్తి, అయిన యేసు క్రీస్తే ప్రతీ ప్రసంగాంశం. ఆయన నామాన్ని -- ఆకాశం కింద మనుషుల్లో రక్షణ ఇవ్వగల ఒకే నామం — వారు ఘనపర్చారు. వారు తిరిగిలేచిన క్రీస్తు సంపూర్ణత్వాన్ని ప్రకటించిన ప్పుడు వారి మాటలు ప్రజల హృదయాల్ని కదిలించాయి. స్త్రీలేంటి పురుషులేంటి అనేకులు సువార్త సత్యాన్ని అంగీకరించారు. రక్షకుని నామాన్ని ఎగతాళి చేసి ఆయన శక్తిని తృణీకరించిన పలువురు ఇప్పుడు సిలువను పొందిన యేసు శిష్యులమని సాక్ష్యమిచ్చారు. AATel 426.4
అపొస్తలులు తాము సాధించిన అద్భుత సేవను సజీవ దేవుని శక్తి ద్వారానే గాని తమ సొంత శక్తివలన సాధించలేదు. వారి కర్తవ్యం సులభమమైంది కాదు. క్రైస్తవ సంఘం తాలూకు ఆరంభ సేవ కష్టాలు దు:ఖాలతో కూడుకున్నది. శిష్యులు తమ సేవలో లేమిని, అపనిందను, హింసను నిత్యం ఎదుర్కొన్నారు. అయినా వారు తమ ప్రాణాల్ని ప్రేమించక, క్రీస్తు నిమిత్తం శ్రమలనుభవించేందుకు తమకు పిలుపు వచ్చినందుకు ఆనందించారు. మెతక వైఖరి, అనిర్ణయం, బలహీనాశయం • వీటికి వారి సేవలో తావులేదు. వారు కష్టించి సేవచెయ్యటానికి, సేవచేస్తూ మరణించటానికి సైతం సిద్ధమే. తమ మిదవున్న బాధ్యతను గూర్చిన స్పృహవారి అనుభవాన్ని శుద్ధిపర్చి పరిపుష్టం చేసింది. క్రీస్తుకోసం వారు సాధించిన విజయాల్లో దైవకృప వెల్లడయ్యింది. సర్వశక్తిగల దేవుడు తన మహాశక్తితో వారిద్వారా పనిచేసి సువార్తకు విజయం చేకూర్చాడు. AATel 427.1
స్వయంగా క్రీస్తు వేసిన పునాదివిద అపొస్తలులు దేవుని సంఘాన్ని నిర్మించారు. సంఘాన్ని నిర్మించటం సందర్భంగా, గుడార నిర్మాణ ఛాయారూపకొన్ని లేఖనాలు తరచుగా ఉపయోగించటం కనిపిస్తుంది. ప్రభువు మందిరాన్ని నిర్మించే చిగురుగా క్రీస్తును జెకర్యా ప్రస్తావిస్తున్నాడు. ఆ పనిలో అన్యజనులు సహాయం చేస్తారని అంటున్నాడు: “దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు.” జెకర్యా 6:12,15; యెషయా 60:10. AATel 427.2
ఈ ఆలయ నిర్మాణం గురించి రాస్తూ పేతులిలా అంటున్నాడు. ” మనుషుల చేత విసర్జింపబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువు నొద్దకు వచ్చినవారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, నారును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.” 1 పేతురు 2:4,5. AATel 427.3
యూదులు అన్యజనుల రాళ్లగనుల్లో పనిచేసి పునాది వెయ్యటానికి అపొస్తలులు రాళ్లు తవ్వారు. ఎఫెసులోని విశ్వాసులికి రాసిన ఉత్తరంలో పౌలిలా అన్నాడు “కాబట్టి మీరిక మీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవునియింటివారునైయున్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాది మీద మీరు కట్టబడియున్నారు. ప్రతికట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడ ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై యుండుటకు కట్టబడుచున్నారు.” ఎఫెసీ 2:19,22. AATel 428.1
కొరింథీయులికి ఇలా రాశాడు: ” దేవుడు నాకనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాది వేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగుకట్టుచున్నాడో జాగ్రత్తగా చూచు కొనవలెను. వేయబడినది తప్ప మరియొకపునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగలరాళ్లు, కర్రగడ్డి కొయ్యకాలు మొదలైనవాటితో కట్టినయెడల, వానివాని పని కనబడును; ఆ దినము దానిని తేటపరచును. అది అగ్నియే పరీక్షించును.” 1కొరింథీ 3:10-13. AATel 428.2
అపొస్తలులు నిశ్చయమైన పునాదిమీద అనగా యుగయుగాల శిలమిద నిర్మించారు. ఈ పునాదికి ప్రపంచం రాళ్ల గనుల్నుంచి రాళ్లు తెచ్చారు. నిర్మాణకుల పని ఆటంకాలు లేకుండా సాగలేదు సుమా! క్రీస్తు విరోధులు వ్యతిరేకించటంతో వారి పని కష్టభరితమయ్యింది. నకిలీ పునాది మీద నిర్మిస్తున్న వారి దురాభిమానం, దురాభిప్రాయం, ద్వేషంతో వారు పోరాడాల్సి వచ్చింది. సంఘ నిర్మాణకులుగా పనిచేసిన అనేకుల్ని నెహెమ్యా దినాల్లో గోడను కట్టిన వారితో పోల్చవచ్చు. వారివి గురించి ఇలా ఉంది: ” గోడ కట్టువారును బరువులు మోయువారును బరువులు ఎత్తువారును, ఒక్కొక్కడు ఒక చేతితో పనిచేసి ఒకచేతితో ఆయుధము పట్టుకొని యుండిరి.” నెహెమ్యా 4:17. AATel 428.3
రాజులు, గవర్నర్లు, యాజకులు, ప్రధానులు దేవుని ఆలయాన్ని ధ్వంసం చెయ్యటానికి ప్రయత్నించారు. కారాగారం, హింస, మరణం సంభవించినా నమ్మకమైన దైవ సేవకులు తమ సేవను కొనసాగించారు. నిర్మాణం వృద్ధి చెందింది. అది సుందరంగా తయారయ్యింది. కొన్నిసార్లు పనివారు తమ చుట్టూ వున్న మూఢనమ్మకాల పొగమంచు వల్ల దాదాపు గుడ్డివారయ్యేవారు. ఏమైనా వారు అచంచల విశ్వాసంతోను, ధైర్యంతోను తమ కార్యాచరణలో ముందుకు సాగారు. AATel 428.4
నిర్మాణకుల్లో అగ్రగణ్యులు ఒకరి తర్వాత ఒకరు శత్రువు కూహకాలకు బలైపోయారు. సైఫనును రాళ్లతో కొట్టి చంపారు. యాకోబును ఖడ్గంతో సంహరించారు. పౌలు శిరస్సును ఛేదించారు. పేతురుని సిలువవేశారు. యోహానుని దేశంనుంచి బహిష్కరించారు. అయినా సంఘం వృద్ధి చెందింది. మరణించినవారి స్థానాల్ని నూతన కార్యకర్తలు ఆక్రమించారు. రాతికి రాయిచేర్చి నిర్మాణాన్ని కొనసాగించారు. ఈ రకంగా దేవుని సంఘం అనే ఆలయం నెమ్మదిగా పైకి లేచింది. AATel 429.1
క్రైస్తవ సంఘం స్థాపితమైన తర్వాత శతాబ్దాల కొద్దీ సంఘం తీవ్ర హింసకు గురి అయ్యింది. అయినా దేవుని ఆలయ నిర్మాణం తమ ప్రాణాలకన్నా ప్రియమైనదని ,పరిగణించిన వ్యక్తులకు కొరతలేదు. అలాంటివారిని గూర్చి ఇలాగుంది: “మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను. మరి బంధకములను ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి. రంపములతో కోయబడిరి, శోధించబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొట్టే చర్మములను, మేక చర్మములను వేసికొనిరి, దరిద్రులైయుండి శ్రమలు పడి హింసపొందుచు, అడవులలోను కొండలమీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు.” హెబ్రీ 11:36-38. AATel 429.2
తన నిర్మాణకులకు ప్రభువు అప్పగించిన పనిని ఆపుచెయ్యటానికి సాతాను విశ్వ ప్రయత్నం చేశాడు. అయినా దేవుడు “తన్నుగూర్చి సాక్ష్యము లేకుండ చేయలేదు.” అ.కా. 14:17. మునుపు పరిశుద్ధులకు అందిన విశ్వాసాన్ని సమర్ధంగా కాపాడుకోగల కార్యకర్తలు లేచారు. ఈ మనుషుల ధైర్య సాహసాలు గురించి చరిత్ర దాఖలాలు సాక్షమిస్తున్నాయి. అపొస్తలుల మాదిరిగానే వీరిలో అనేకమంది తమ విధి నిర్వహణలో నేలకొరిగారు. అయినా ఆలయ నిర్మాణం ఆగలేదు. అది నెమ్మదిగా కొనసాగింది. పనివారు కత్తివాత బడ్డారు కాని పని ముందుకుసాగింది. వాల్డెన్ సీలు, జాబ్స్క్లిఫ్, హస్, జెరోయ్, మార్టిన్ లూథర్, జ్యింగ్ లీ, క్రామర్, లాటిమర్, నాక్స్, హూజినోలు, జాన్ వెస్లీ, చాల్స్ వెస్లీ ఇంకా అనేకులు నిత్యం నిలిచే సామాగ్రిని తెచ్చి పునాదిని పటిష్టం చేశారు. అనంతర కాలంలో దేవుని వాక్యాన్ని ప్రచురపర్చటంలో శ్రమించిన మహనీయులు అన్యుల దేశాల్లో తమ పరిచర్య ద్వారా చివరిగొప్ప వర్తమాన ప్రకటనకు మార్గం సుగమం చేస్తున్నవారు - వీరుకూడా ఆలయ నిర్మాణాభివృద్ధికి దోహదం చేస్తున్నారు. AATel 429.3
అపొస్తలుల కాలం నుంచి గడిచిన యుగాలన్నిటిలోనూ దేవుని ఆలయ నిర్మాణం ఎన్నడూ ఆగలేదు. మనం వెనకటి శతాబ్దాల్ని పరిశీలించవచ్చు. ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన సజీవమైన రాళ్లు, అసత్యం, మూఢవిశ్వాసం అనే చీకటిలో ధగధగ మెరిసే కాంతి పుంజంలా ప్రకాశించటం చూస్తాం. నిత్యత్వంలోని కాలమంతా ఈ అమూల్యమైన మణులు అధికమౌతున్న కాంతితో ప్రకాశిస్తూ దేవుని సత్యానికున్న శక్తిని చాటి చెపుతాయి. సానపట్టిన ఆ రాళ్ల కాంతి, వెలుగుకి చీకటికి సత్యమనే బంగారానికి అబద్ధమనే మైలకు మధ్యగల భేదాన్ని వెల్లడి చేస్తుంది. AATel 429.4
పౌలు, ఇతర అపొస్తలులు, అప్పటినుంచి నివసించిన నీతిమంతులందరూ ఆలయ నిర్మాణంలో తమతమ బాధ్యతల్ని నిర్వర్తించారు. అయినా ఆలయం ఇంకా పూర్తికాలేదు. ఈ యుగంలో నివసిస్తున్న మనం నిర్వహించాల్సిన పాత్రవుంది. అగ్ని పరీక్షలో నిగ్గుతేలే సామాగ్రిని, “నగరునకై చెక్కబడిన మూల కంబములవలె ఉన్న” (కీర్త144:12) బంగారం, వెండి, మణుల్ని మనం పునాదికి తేవలసి ఉన్నాం. ప్రభువుకు ఇలా నిర్మించే వారిని ఉద్దేశించి పౌలు ఈ మాటల్లో ధైర్యం చెబుతూ హెచ్చరిక చేస్తున్నాడు, ‘పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన యెడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడునుగాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్లు రక్షింపబడును.” 1 కొరింథీ 3:14,15. సత్యాన్ని నమ్మకంగా బోధించి పరిశుద్ధతకు సమాధానానికి దారితీసే మార్గంలో స్త్రీలను పురుషుల్ని నడిపించే క్రైస్తవుడు చిరకాలం నిలిచే సామాగ్రిని పునాదికి తెస్తున్నాడు. అతడు దేవుని రాజ్యంలో వివేకంగల నిర్మాణకుడుగా సన్మానం పొందుతాడు. AATel 430.1
అపొస్తలుల గురించి ఇలా ఉంది, ” వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడైయుండి వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియలవలన వాక్వమును స్థిరపరచుచుండెను.” మార్కు 16:20. ఆనాడు క్రీస్తు తన శిష్యుల్ని లోకంలోకి పంపినట్లు ఈనాడు ఆయన తన సంఘ సభ్యుల్ని పంపుతున్నాడు. అపొస్తలుల కున్న శక్తీ సభ్యులకూ ఈనాడు ఉంటుంది. వారు దేవున్ని తమ బలంగా ఎంపిక చేసుకుంటే ఆయన వారితో కలిసి పనిచేస్తాడు. అప్పుడు వారి సేవ వ్యర్ధమవ్వదు. తాము నిర్వహిస్తున్న సేవమిద ప్రభువు తన దృష్టిని నిలిపాడన్న విషయాన్ని వారు గుర్తింటం అవసరం. దేవుడు యిర్మీయాతో ఈ మాటలన్నాడు, “నేను బాలుడననవద్దు: నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలెను. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను.” అప్పుడు ప్రభువు తన చెయ్యి చాపి తన సేవకుడి నోటిని ముట్టి ఇలా అన్నాడు,” “ఇదిగో నేను నీనోట నామాటలు ఉంచియున్నాను.” యిర్మీయా 1:7-9. పరిశుద్ధుడైన ప్రభువు మన పెదవుల్ని ముట్టుకున్నట్లు భావించి ఆయన మనకిచ్చే మాటల్ని చెప్పటానికి బయలుదేరి వెళ్లాల్సిందిగా ఆయన మనల్ని ఆదేశిస్తున్నాడు. AATel 430.2
సంఘానికి క్రీస్తు పవిత్ర బాధ్యతను అప్పగించాడు. దేవుడు తన కృపా భాగ్యనిధుల్ని అనగా శోధింపనలవిగాని క్రీస్తు ఐశ్వర్యాన్ని లోకానికి చేరవేసే సాధనంగా ప్రతీ సభ్యుడూ ఉండాలి. లోకానికి తన స్ఫూర్తిని తన ప్రవర్తనను కనపర్చే ప్రతినిధుల కోసం రక్షకుడు ఆశిస్తున్నంతగా మరిదేని విషయం ఆయన ఆశించటంలేదు. మనుష్యుల ద్వారా రక్షకుని ప్రేమ ప్రదర్శితం కావటమే లోకానికున్న గొప్ప అవసరం. క్రైస్తవ మతంలోని శక్తిని మనుషులద్వారా లోకానికి ప్రదర్శించటానికి దేవుడు పురుషులకోసం స్త్రీలకోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు. AATel 430.3
సత్యాన్ని ప్రకటించటానికి దేవుడు ఎంపికచేసుకున్న వ్యవస్థ సంఘం. ప్రత్యేక సేవచేయటానికి సంఘానికి దేవుడు అధికారం దఖలుపర్చాడు. అది ఆయనకు నమ్మకంగా నిలిచి ఆయన ఆజ్ఞలన్నిటిని ఆచరించినట్లయితే సంఘంలో దైవకృప అద్భుతమైన రీతిలో చోటుచేసుకుంటుంది. సంఘం తన విశ్వాసానికి నమ్మకంగా నిలిచి నివసిస్తే, ఇశ్రాయేలు దేవున్ని ఘనపర్చినట్లయితే దానికి వ్యతిరేకంగా ఏ శక్తీ నిలువజాలదు. AATel 431.1
దేవుని పట్ల ఆయన సేవపట్ల శిష్యులకున్న ఉత్సాహోద్రేకాలు, వారు ప్రబలశక్తితో సువార్త ప్రబోధించటానికి వారిని చైతన్య పర్చాయి. రక్షకుని ప్రేమను, ఆయన పొందిన సిలువను గూర్చిన కథను చెప్పటానికి అలాంటి ఉద్రేకం, అలాంటి ఉత్సాహం మన హృదయాల్లో మండనవసరంలేదా? రక్షకుని రాకకోసం ఎదురు చూడటమే కాదు దాన్ని వేగిరిపర్చటం కూడా మన ఆధిక్యతే. AATel 431.2
సంఘం లోకంతో తాను పెట్టుకున్న సంబంధాల్ని విడిచి పెట్టి క్రీస్తు నీతివస్త్రాన్ని ధరించటానికి కుతూహలంగా ఉంటే, దాని ముందు ఉజ్వలమైన, ప్రభావాన్వితమైన దినం ఉంది. సంఘానికి దేవుడు చేసిన వాగ్దానం ఎన్నటికీ మారదు. నిత్యం నిలిచివుంటుంది. దాన్ని నిత్యం ఉత్కృష్టమైందిగాను, అనేక తరాలకు ఆనందంగాను ప్రభువు రూపుదిద్దుతాడు. సత్యాన్ని తృణీకరించి విసర్జించేవారిని అది దాటిపోయి విజయం సాధిస్తుంది. కొన్ని సార్లు మందకొడిగా సాగినట్లు కనిపించినా దాని ప్రగతి ఎన్నడూ ఆగలేదు. దైవ వర్తమానానికి వ్యతిరేకత ఏర్పడప్పుడు అది అధిక ప్రభావం ప్రసరించేందుకు ఆయన ఆ వర్తమానానికి అధిక శక్తినిస్తాడు. దైవ శక్తిని సంత రించుకుని అది బలమైన ప్రతిబంధకాల్ని ఛేదించుకుని విజయంతో ముందుకు సాగుతుంది. AATel 431.3
కఠోరశ్రమలు త్యాగంతో నిండిన జీవితం జీవించిన దైవకుమారుణ్ని పడిపోకుండా నిలబెట్టింది ఏంటి? ఆయన తన హృదయం అనుభవించిన వేదన ఫలితాన్ని చూసి సంతృప్తి చెందాడు. నిత్యకాలంలోకి చూస్తూ, తన అవమానం ద్వారా, ధైర్యంద్వారా, పాపక్షమాపణ, నిత్యజీవం పొందినవారి ఆనందాన్ని ఆయన వీక్షించాడు. రక్షణ పొందినవారు ఆనందంతో వేసిన కేకలు ఆయన చెవిని పడ్డాయి. విమోచనపొందిన ప్రజలు పాడుతున్న మోషే కీర్తన గొర్రెపిల్ల కీర్తన ఆయన విన్నాడు. AATel 431.4
. భవిష్యత్తును గూర్చి, పరలోక ధన్యతను గూర్చి మనం దర్శనాన్ని చూడవచ్చు. భవిష్యత్తులోని మహిమ గురించిన దర్శనాలు బైబిలులో వెల్లడయ్యాయి. అవి దేవుని హస్తం చిత్రించిన సన్నివేశాలు. ఇవి ఆయన సంఘానికి ఎంతో ప్రాణం. మనం విశ్వాసమూలంగా ఆ నిత్యపట్టణ ద్వారంలో నిలబడి, ఈ జీవితంలో ఆయన నిమిత్తం శ్రమలనుభవించటం గొప్ప గౌరవంగా భావించి ఆయనతో సహకరించిన వారిని ఆయన సాదరంగా స్వాగతించటం వినవచ్చు. “నా తండ్రి చేత ఆశీర్వదించ బడినవారలారా, రండి” అన్నమాటలు ఆయన అన్నప్పుడు వారు తమ కిరీటాల్ని రక్షకుని పాదాల వద్ద పెట్టి, “వధింపబడిన గొఱ్ఱపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును, మనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడు.... సింహాసనాసీనుడైయున్నవానికిని గొఱ్ఱపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక.” అంటారు. మత్తయి 25:34; ప్రకటన 5:12,13. AATel 431.5
విమోచన పొందినవారు తమను రక్షకుని వద్దకు నడిపించినవారిని అక్కడ కలుసుకుంటారు. మానవులు దేవునిలా నిరంతరం జీవించేందుకు తన ప్రాణత్యాగం చేసిన ఆ ప్రభువును స్తుతించటంలో అందరూ ఏకమౌతారు. పోరాటం అంత మయ్యింది. శ్రమలు పోరాటం అంతమయ్యాయి. వధింపబడి తిరిగి జీవిస్తున్న గొర్రెపిల్ల మాత్రమే అర్హుడు అంటూ విమోచన పొందిన ప్రజలు పాడున్న విజయగీతాలతో పరలోకం మారుమోగుతుంది. AATel 432.1
“నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతివంశములోనుండియు ప్రజలలోనుండియు ఆయా భాషలు మాట్లాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱపిల్ల యెదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.” ప్రకటన 7:9,10. AATel 432.2
“వీరు మహాశ్రమలనుండి వచ్చినవారు; గొట్టె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు; సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొట్టెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గయొద్దకు వారిని నడిపించును, దేవుడేవారి కమ్మలనుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును.” “ఆయన వారి కన్నుల ప్రతి భాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను వేదనయైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను.” ప్రకటన 7:14-17;21:4. AATel 432.3