అపొస్తలుల కార్యాలు
56—పత్మాసు ద్వీపం
క్రైస్తవ సంఘం వ్యవస్థీకృతమై అర్థ శతాబ్దికి పైచిలుకు కాలం గడిచింది. ఆ కాలంలో సువార్త ప్రచారానికి నిత్య ప్రతిఘటన ఎదురవుతూ వచ్చింది. సువార్త వ్యతిరేకులు తమ వ్యతిరేకతను ఎన్నడూ సడలించలేదు. తుదకు క్రైస్తవులకు వ్యతిరేకంగా రోమా చక్రవర్తి మద్దత్తును కూడగట్టుకోటంలో విజయం సాధించారు. AATel 408.1
ఆ తర్వాత చోటుచేసుకున్న దారుణ హింసలో విశ్వాసుల విశ్వాసాన్ని ధ్రువపర్చి పటిష్ఠ పర్చటంలో అపొస్తలుడు యోహాను గణనీయంగా సేవచేశాడు. ప్రత్యర్థులు కాదనలేని విధంగా అతడు తన సాక్ష్య సేవను చేశాడు. సహోదరులు తమకు వచ్చిన శ్రమలను బాధలను ధైర్యంగా ఎదుర్కొని నమ్మకంగా నిలవటానికి ఇది వారికి కొండంత బలాన్నిచ్చింది. భీకర వ్యతిరేకత వలన క్రైస్తవుల విశ్వాసం సడలుతున్నట్లు కనిపించి వారు నమ్మకమైన ఈ వృద్ద భక్తుణ్ని కలిసినప్పుడు సిలువను పొంది తిరిగి లేచిన రక్షకుని కథను అతడు గొప్ప శక్తితోను, వాగ్దాటితోను వారికి పునరుద్ఘాటించేవాడు. యోహాను తన విశ్వాసాన్ని దీక్షతో పట్టుదలతో కాపాడు కున్నాడు. అతని నోటివెంట ఎల్లప్పుడూ ఈ సువర్తమానమే వినిపించేది: “జీవ వాక్యమును గూర్చినది, ఆదినుండి ఏదియుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయు చున్నాము.” 1 యోహాను 1:1-3. AATel 408.2
యోహాను చాలా పెద్దవయసు వరకూ జీవించాడు. యెరూషలేము నాశనాన్ని దేవాలయం శిధిలమవ్వటాన్ని చూశాడు. బతికి ఉన్న శిష్యుల్లో యోహాను ఆఖరివాడు రక్షకునితో ఆత్మీయత సాన్నిహిత్యం ఉన్నవాడు. యేసు మెస్సీయా విమోచకుడు అన్న వాస్తవాన్ని పటిష్ఠపర్చటంలో అతని వర్తమానం గొప్ప ప్రభావాన్ని ప్రసరించింది. అతని నీతి నిజాయితీల్ని ఎవరూ శంకించలేకపోయారు. అతని బోధలవల్ల అనేకులు అవిశ్వాసాన్ని విడిచి పెట్టటానికి మార్గం ఏర్పడింది. AATel 408.3
యోహాను క్రీస్తు సేవను అచంచల విశ్వాసంతో నిర్వహిస్తున్నందుకు యూదు ప్రధానులు తీవ్ర ద్వేషంతో నిండి ఉన్నారు. యోహాను వర్తమానం ప్రజల చెవుల్లో మోగుతున్నంతకాలం క్రైస్తవమతానికి వ్యతిరేకంగా తాము చేస్తున్న కృషి వ్యర్థమని , ప్రకటించారు. యేసు చేసిన అద్భుతాలు యేసు బోధనలు ప్రజలు మర్చిపోవాలంటే ఈ గుండె తీసిన బంటు యోహాను నోరు నొక్కెయ్యటం అవసరం. AATel 408.4
తన విశ్వాసం నిమిత్తం విచారణను ఎదుర్కోడానికి యోహానుని రోముకి పిలిచారు. ఇక్కడ అధికారులు ముందు ఈ అపొస్తలుని సిద్ధాంతాల్ని తప్పుగా నివేదించారు. రాజద్రోహకరమైన భిన్న సిద్ధాంతాలు బోధిస్తున్నాడంటూ ఆరోపణలు మోపి అబద్ధ సాక్షుల్ని తెచ్చారు. ఈ ఆరోపణల మూలంగా ఈ శిష్యుడికి మరణ శిక్షపడేటట్లు చేయాలని అతని ప్రత్యర్థులు నిరీక్షించారు. AATel 409.1
యోహాను తన పక్షంగా సమాధానమిచ్చాడు. ఆ సమాధానం స్పష్టంగా నమ్మకం కలిగించేదిగా ఉంది. అది నిరాడంబరంగా నిజాయితీగా ఉండటంతో అతడు పలికిన మాటలు శక్తిమంతంగా ఉన్నాయి. శ్రోతలు అతని జ్ఞానానికి వాగ్దాటికి విస్మయం చెందారు. అయితే అతని సాక్ష్యం ఎంత నమ్మదగిందిగా ఉంటే అతని ప్రత్యర్థుల ద్వేషం అంత తీవ్రమయ్యింది. డొమీషియన్ చక్రవర్తి ఉగ్రుడయ్యాడు. అతడు ఈ నమ్మకమైన క్రీస్తు మత ప్రబోధకుడితో హేతుబద్దంగా తర్కించలేకపోయాడు. సత్య ప్రకటనలో యోహాను శక్తిమంతమైన మాటలకు ధీటుగా చక్రవర్తి మాట్లాడలేక పోయాడు. అయినా ఆ భక్తుని స్వరాన్ని మూగపుచ్చాలని అతడు కృత నిశ్చయు డయ్యాడు. AATel 409.2
యోహాన్ను కాగుతున్న నూనె కాగులో వేశారు. కాని ప్రభువు అగ్నిగుండంలో నుంచి ఆ ముగ్గురు హెబ్రీయుల్ని కాపాడినట్లే తన ఈ సేవకుణ్ని కాపాడాడు. యోహాను ఈ మాటలన్నాడు: ఆ మోసగాణ్ని నమ్మిన వారందరూ ఇలా నాశనమౌతారు. నా ప్రభువు, నజరేయుడైన యేసుక్రీస్తు తనను సిగ్గుపర్చి హింసించటానికి సాతాను అతడి దుష్ట దూతలు ఏర్పాటు చేసిన సమస్తానికి తన్నుతాను అప్పగించుకున్నాడు. లోకాన్ని రక్షించటానికి ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన నిమిత్తం శ్రమలనుభవించటానికి నన్ను అనుమతించటం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. నేను బలహీనుణ్ని, పాపిని, క్రీస్తు పరిశుద్ధుడు, నిరపాయుడు, అపవిత్రత లేనివాడు. AATel 409.3
ఈ మాటలు వాటి ప్రభావాన్ని ప్రసరించాయి. యోహాన్ను సలసలకాగే ఆ నూనె కాగులోనుంచి బయటికి తీశారు. ఎవరు అందులో వేశారో వారే అతణ్ని బయటికి తీశారు. AATel 409.4
హింసాహస్తం యోహాను పై మళ్ళీ బలంగా పడింది. చక్రవర్తి ఆజ్ఞ మేరకు యోహానును “దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును” (ప్రక 1:9) నేరస్తుడుగా తీర్చి దేశం నుంచి బహిష్కరించి పత్మాసు ద్వీపానికి పంపారు. ఇక్కడ అతని ప్రభావం ఏమాత్రం ఉండదని, కష్టాలకు వేదనకు గురి అయి చివరికి అతడు మరణిస్తాడని వారు భావించారు. AATel 409.5
పత్మాసు ఏజియన్ సముద్రంలో చెట్టూ చేమలేని రాతిబండలతో నిండిన ద్వీపం. నేరస్తుల్ని బహిష్కరించటానికి తగిన స్థలంగా రోమా ప్రభుత్వం ఈ ద్వీపాన్ని ఎన్నకున్నది. అయితే దైవ సేవకునికి ఈ చీకటి ప్రదేశం పరలోక ద్వారమయ్యింది. జీవిత దృశ్యాలకు, గత సంవత్సరాల్లో జరిగిన సేవకు దూరంగా ఉంటున్న అతనికి ఇక్కడ దేవుడు, క్రీస్తు దేవదూతలు స్నేహితులు. భవిషత్కాలమంతా సంఘానికి కావలిసిన ఉపదేశాన్ని యోహాను వీరినుంచి పొందాడు. ఈ లోక చరిత్ర చివరి కాలంలో సంభవించనున్న ఘటనలు అతనికి వివరించటం జరిగింది. దేవుడు పంపగా తాను చూసిన దర్శనాన్ని అతడు అక్కడ రచించాడు. తాను ప్రేమించి సేవించిన ఆ ప్రభువునుగూర్చి తన స్వరంతో సాక్ష్యం ఇవ్వటానికి లేకపోయినప్పుడు ఆ నిర్జన అరణ్య ప్రదేశంలో దేవుడు తనకిచ్చిన వర్తమానాలు మండుతున్న దివిటీలా లోకంలోనికి వెళ్ళి ప్రతీ జాతికోసం ఆయన సంకల్పాన్ని ప్రకటించాల్సి ఉన్నాయి. AATel 410.1
పత్మాసు ద్వీపంలోని రాళ్ళు బండలు కొండల నడుమ యోహాను తన సృష్టికర్తతో మాట్లాడేవాడు. తన గత జీవితాన్ని నెమరు వేసుకునేవాడు. తాను పొందిన దీవెనల్ని గురించి తలంచినప్పుడు అతని హృదయం శాంతితో నిండింది. అతడు క్రైస్తవుడి జీవితం జీవించాడు. కనుక ఇలా చెప్పగలిగాడు. “మనము... మరణములోనుండి జీవములోనికి దాటియున్నామని యెరుగుదుము.” 1 యోహాను 3:14. తనను బహిష్కరించిన చక్రవర్తి స్థితి ఇదికాదు. అతడు వెనక్కు తిరిగి యుద్ధరంగాల్ని, నరమేధాన్ని నిర్జన గృహాల్ని రోదిస్తున్న విధవరాండ్రు అనాధల్ని మాత్రమే చూడగలడు. ప్రాబల్యం, పలుకుబడి కోసం అతడి దురాశ ఫలించిన ఫలాలివి. AATel 410.2
ప్రకృతి గ్రంథంలోను, దైవావేశపూరిత గ్రంథంలోను దాఖలైన దైవశక్తి ప్రదర్శనల్ని తన ఒంటరి గృహంలో యోహాను ముందెన్నటికన్నా మరింత నిశితంగా అధ్యయనం చెయ్యగలిగాడు. ఈ మహాసృష్టిపై ధ్యానించటం, సృష్టి రూపకర్తను పూజించటం అతనికి అమితానందాన్నిచ్చింది. వెనకటి సంవత్సరాల్లో అడవులతో నిండిన కొండలు, పచ్చని లోయలు, ఫలవృక్షాలతో కళకళలాడే భూములు అతడికి కనువిందు చేసేవి. సుందరమైన ప్రకృతిలో సృష్టికర్త వివేకాన్ని నైపుణ్యాన్ని పరిశీలించి ఆనందించేవాడు. కాని అనేకులకు నిరుత్సాహంగా, నిరాసక్తంగా కనిపించే దృశ్యాలు ఇప్పుడు తన చుట్టూ ఉన్నాయి. అయితే యోహానుకి అవి అలాలేవు. పరిసరాలు నిర్జన ప్రదేశం ఎడారి భూమి అయినా తాను ఎంతో ప్రేమించిన యెరూషలేము పై ఉన్న అందమైన నీలి ఆకాశమే ఇక్కడా వంగి తన వంక చూస్తూ ఎంతో అందంగా కనిపించింది. కరుకైన ఆ నల్లని రాతిబండల్లో, అగాధ సముద్రజాల మర్మాల్లో, తేజోవంతమైన అంతరిక్షంలో అతడు ప్రాముఖ్యమైన పాఠాలు చదువుకున్నాడు. వాటన్నిటిలోను దేవుని శక్తి మహిమల వర్తమానం దాఖలై ఉంది. AATel 410.3
భూనివాసులు దైవ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించటానికి సాహసించినందువల్ల లోకాన్ని ముంచిన జలప్రళయానికి తన చుట్టూ ఉన్న సాక్ష్యాల్ని అపొస్తలుడు వీక్షించాడు. ప్రళయ జలాలు భూమిలోనుంచి సముద్రంలోనుంచి పైకి తన్నుకుంటూ వస్తూ విసరిన బ్రహ్మాండమైన రాతి బండలు దేవుని ఉగ్రత కుమ్మరించిన బీభత్సాన్ని అతనికి జ్ఞాపకం చేశాయి. ఆ అగాధ జలాల స్వరంలో ప్రవక్త దేవుని స్వరాన్ని విన్నాడు. గాలుల దాటికి తల్లడిల్లుతున్న సముద్రం కించపర్చబడ్డ దేవుని ఆగ్రహానికి చిహ్నంగా అతనికి కనిపించింది. భయంకర ఘోష చేస్తూ ఉవ్వెత్తుగా లేచే, అదృశ్యహస్తం అదుపులో ఉంచే సముద్ర తరంగాలు ఒక అనంత శక్తిని సూచించాయి. దీనికి భిన్నంగా మానవ మాత్రులు మట్టిలోని పురుగులే అయినా తమ జ్ఞానాన్ని బలాన్ని చూసుకుని అతిశయిస్తూ, దేవుడు తమవంటివాడా అన్నట్లు విశ్వపాలకుడైన ఆయనను వ్యతిరేకించటానికి పూనుకుంటారని అపొస్తలుడు గుర్తించాడు. రాళ్ళు క్రీస్తును గుర్తుచేశాయి. ఆయనే అతని బలం. ఆయన నీడనే అతడు నిర్భయంగా ఆశ్రయం పొందవచ్చు. రాళ్ళమయమైన ఆ పత్మాసు ద్వీపంలో బహిష్కృతుడై ఉన్న ఆ అపోస్తలుడినుంచి ఆత్మ ఆవేదనను విన్నవించుకొంటూ మనఃపూర్వక ప్రార్థనలు దేవుని వద్దకు వెళ్ళాయి. AATel 411.1
వృద్ధులైన తన సేవకుల్ని దేవుడు ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతాడు అన్న దానికి యోహాను చరిత్ర ఒక చక్కని ఉదాహరణ. యోహానుని బహిష్కరించి పత్మాసు ద్వీపానికి పంపినప్పుడు అతడు ఇక సేవ చెయ్యటానికి పనికిరాడని, వృద్ధుడు, బలహీనుడు అని ఏక్షణంలోనైన రాలిపోవచ్చునని అనేకులు తలంచారు. కాని ప్రభువు అతణ్ని ఉపయోగించటం అవసరమనుకున్నాడు. లోగడ తాను పనిచేసిన తావులనుంచి బహిష్కృతుడైనప్పటికీ అతడు సత్యాన్ని ప్రకటించటం మానలేదు. పత్మాసులో సయితం మిత్రుల్ని విశ్వాసుల్ని సంపాదించాడు. అతని వర్తమానం సంతోషానందాల వర్తమానం. ఆ వర్తమానం మృత్యువునుంచి లేచిన రక్షకుణ్ని, తిరిగివచ్చి తన ప్రజల్ని తీసుకు వెళ్ళేవరకు తన ప్రజల కోసం పరలోకంలో విజ్ఞాపన చేస్తున్న రక్షకుణ్ని ప్రకటిస్తుంది. సేవచేస్తూ ఉన్న కాలం అంతటిలో కన్నా, సేవ చేసి వృద్ధుడై ఉన్న కాలంలోనే యోహాను ఎక్కువ దైవ సందేశాల్ని అందుకున్నాడు. AATel 411.2
జీవితమంతా తమ ఆశలు ఆసక్తులు దేవుని సేవపై నిలిపి పనిచేసిన వారి విషయంలో సానుభూతి గౌరవం కలిగి ఉండాలి. ఈ వృద్ద సేవకులు తుఫానులు శ్రమల మధ్య నమ్మకంగా నిలిచి పని చేసినవారు. వారు బలహీనులేకావచ్చు. కాని దేవుని సేవలో తమ స్థానంలో నిలవటానికి వారికి అర్హత నిచ్చేవరాలు వారికింకా ఉన్నాయి. వృద్ధులవ్వటం చేత యువజనుల కుమల్లే భారమైన బాధ్యతలు వహించలేకపోయినప్పటికీ వారివ్వగల హితవు చేయగల సూచనలు ఎంతో విలువైనవి. AATel 411.3
వారు పొరపాట్లు చేసి ఉండవచ్చు. అయితే ఆ పొరపాట్లనుంచి తప్పుల్ని అపాయాల్ని తప్పించుకోటం వారు నేర్చుకున్నారు. కనుక వారు తెలివైన సూచనలు ఇవ్వటానికి సమర్థులు కారా? వారు పరీక్షలకు శ్రమలకు నిలబడ్డారు. కొంత శక్తిని కోల్పోయినప్పటికీ వారిని ప్రభువు పక్కన పెట్టడు. ప్రభువు వారికి ప్రత్యేక కృప, వివేకం ఇస్తాడు. AATel 412.1
పని. కష్టంగా ఉన్నప్పుడు తమ ప్రభువుకు సేవచేసేవారు, సత్యానికి నిలబడేవారు బహుకొద్దిమందే ఉన్నప్పుడు పేదరికాన్ని తట్టుకుని నమ్మకంగా ఉండేవారు గౌరవవాదరాలకు అర్హులు. వారిని సన్మానించాలి. నమ్మకమైన ఈ సేవకులతో సహవాసంద్వారా యువ సేవకులు జ్ఞానం, బలం, పరిణతి సముపార్జించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. తమ మధ్య అలాంటి పనివారిని ఉంచటం వల్ల దేవుడు తమకు గొప్ప మేలు చేశాడని యువ సేవకులు గుర్తించాలి. తమ సభలలో యువ సేవకులు ఆ వృద్ధ పనివారికి గౌరవ స్థానాన్ని ఇవ్వాలి. AATel 412.2
క్రీస్తు సేవలో తమ జీవితాల్ని గడిపిన వారు తమ సేవ అంతిమ దశకు చేరుకొనే కొద్దీ దైవ సేవలో తమకు కలిగిన అనుభవాల్ని వివరించటానికి పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపిస్తాడు. తన ప్రజలతో ఆయన వ్యవహరించిన తీరు, శ్రమలనుంచి వారిని విడిపించటంలో ఆయన దయాళుత్వం - వీటిని వారు విశ్వాసంలోకి కొత్తగా వచ్చినవారికి వివరించాలి. అనుభవజ్ఞులైన వృద్ధ సేవకులు తమస్థానంలోనే నిలిచి, బలమైన దుర్మార్గత ప్రవాహం స్త్రీలను పురుషులను అదోగతికి తుడిచివేయకుండా వారిని కాపాడటానికి తమ వంతు కృషి చెయ్యాలని దేవుడు కోరుతున్నాడు. వారు తమ యుద్ధ కవచాన్ని తీసి కింద పెట్టాల్సిందిగా దేవుడు ఆదేశించేంత వరకు దాన్ని ధరించి ఉండాలని ఆయన కోరుతున్నాడు. AATel 412.3
హింసకు గురి అయిన అపొస్తలుడు యోహాను అనుభవంలో క్రైస్తవునికి అద్భుతశక్తి ఓదార్పుగల పాఠం ఉంది. దుష్టుల కుట్రలను దేవుడు నివారించడు. కాని కష్టాల్లోను సంఘరణల్లోను తమ విశ్వాసాన్ని విశ్వసనీయతను కాపాడుకునే వారికి మేలు జరిగేటట్లుగా దేవుడు వాటిని మల్చుతాడు. తరచు సువార్త సేవకుడు తన పనిని భీకరహింస, తీవ్ర వ్యతిరేకత, అన్యాయపు నిందల నడుమ నిర్వహిస్తుంటాడు. శ్రమలు బాధల కొలిమిలో గడించాల్సిన అనుభవం తాను పడ్డ శ్రమకు తగ్గ విలువగలదని అట్టి సమయాల్లో అతడు జ్ఞాపకముంచుకోవాలి. తమ బలహీనతలు బలాలు వారికి చూపించేందుకు దేవుడు తన బిడ్డల్ని ఈ రీతిగా తన దగ్గరకు తెచ్చుకుంటాడు. తనపై ఆనుకోవలసిందిగా వారికి ఉద్బోధిస్తాడు. అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కోటానికి, బాధ్యతల్ని వహించటానికి, తమకు ఏ ఉద్దేశాల నెరవేర్పుకు తమకున్న సామర్థ్యాలు దఖలు పడ్డాయో ఆ ఉద్దేశాల్ని నెరవేర్చటానికి ఈ విధంగా ఆయన వారిని సమాయత్తపర్చుతాడు. AATel 412.4
అన్ని యుగాల్లోను దేవుడు ఎంపిక చేసుకున్న తన సేవకులు సత్యం నిమిత్తం నిందలకు హింసకు తమ్మును తాము గురిచేసుకున్నారు. యోసేపు తన నీతి ప్రవర్తనను విశ్వసనీయతను పరిరక్షించుకున్నందుకు అపఖ్యాతి పాలయ్యాడు. దేవుడు ఎన్నుకొన్న సేవకుడు దావీదును శత్రువులు అడవిజంతువును వేటాడినట్లు వేటాడారు. దేవునికి నమ్మకంగా నిలిచినందుకు దానియేలును సింహాలబోనులో వేశారు. యోబు లోక సంపదల్ని కోల్పోయాడు, బంధువులు మిత్రులు అసహ్యించుకొనేంతగా శారీరక వ్యాధిననుభవించాడు. అయినా అతడు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. మాట్లాడమని దేవుడు తనకిచ్చిన మాటల్ని మాట్లాడకుండా యిర్మీయాను ఏ శక్తీ ఆపలేకపోయింది. అతడి వర్తమానం రాజుకి ప్రధానులికి ఆగ్రహం పుట్టించటంతో అతణ్ని ఒక హేయమైన గుంటలో వేశారు. స్తెఫను సిలువను పొందిన క్రీస్తునుగూర్చి బోధించినందుకు అతణ్ని రాళ్ళతో కొట్టిచంపారు. పౌలు అన్యులకు నమ్మకమైన దైవ సేవకుడుగా సేవచేసినందుకు అతణ్ని చెరసాలలో వేశారు, ఇనుపచువ్వలతోను రాళ్ళతోను కొట్టారు, చివరికి అతణ్ని చంపారు. “దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును” యోహాను పత్మాసు ద్వీపానికి బహిష్కృతుయ్యాడు. AATel 413.1
మానవ స్థయిర్యాన్ని గూర్చిన ఈ ఉదాహరణలు దేవుడు మనతో తన సన్నిధిని ఉంచటాన్ని గూర్చి ఆయన కృప మనల్ని బలపర్చటాన్ని గురించి చేసిన వాగ్దానాల విషయంలో నమ్మకంగా ఉంటాడనటానికి సాక్ష్యాలు. లోక అధికారాల అధికార దుర్వినియోగాన్ని ప్రతిఘటించే శక్తి విశ్వాసానికున్నదని అవి సాక్ష్యామిస్తున్నాయి. ఎన్ని ఇక్కట్లు శ్రమలు వచ్చినా, మిక్కిలి నిరాశాజనకమైన ఘడియలో మన తండ్రి పైనున్నాడని గుర్తించటం విశ్వాసమూలంగా జరిగే పని. కాలానికి పైగా ఉన్న విషయాల్ని చూడగలిగే విశ్వాస నేత్రం మాత్రమే నిత్య ఐశ్వర్యం విలువను సరిగా అంచనా వేయగులుగుతంది . AATel 413.2
లోక సంబంధమైన గౌరవ ప్రతిష్ఠల్ని ఐశ్వర్యాన్ని, కష్టాలు లేని జీవితాన్ని ఇస్తానన్న నిరీక్షణను యేసు తన శిష్యులకివ్వటం లేదు సరిగదా ఆత్మోపేక్ష, నిందలతో కూడిన మార్గాన తన ను వెంబడించాల్సిందంటూ ఆయన పిలుపునిస్తున్నాడు. లోకాన్ని విమోచించేందుకు వచ్చిన ఆయనను సంయుక్త దుష్టశక్తుల పరివారం వ్యతిరేకించింది. దుర్మార్గులు దుష్టదూతలు దయదాక్షిణ్యాలు లేని కూటమిగా ఏర్పడి శాంతి సమాధానాల ప్రభువుకు వ్యతిరేకంగా మోహరించారు. ఆయన ప్రతీ మాట ప్రతీ చర్య ఆయన కారుణ్యాన్ని వెల్లడి చేస్తుంది. ఆయన లోకుల్లా లేకపోవటం తీవ్ర వైరుధ్యాన్ని రేపింది. AATel 413.3
క్రీస్తుపై భక్తి విశ్వాసాలు కలిగి నివసించేవారి విషయంలోనూ అలాగే ఉంటుంది. క్రీస్తు స్ఫూర్తిని కలిగి ఉన్నవారందరికోసం హింస, నిందలు వేచి ఉన్నాయి. హింస . తీరు తెన్నులు కాలంతోపాటు మారుతూ ఉంటాయి. కాని దాని నియమం అనగా దాని వెనక ఉన్న ఉద్దేశం మాత్రం అదే. అంటే హేబెలు దినాలనుంచి ప్రభువు ఎన్నుకున్న వారిని ఏ నియమం చంపుతూ వచ్చిందో అదే. AATel 414.1
ఎంపికైన భక్తుల్లో దేవుని మహిమ ఆయన ప్రవర్తన శ్రమల్లోను హింసలోను వెల్లడయ్యింది. లోకం ద్వేషించి హింసించిన క్రీస్తు భక్తులు క్రీస్తు పాఠశాలలో విద్యను క్రమశిక్షణను నేర్చుకున్నారు. లోకంలో వారు ఇరుకైన మార్గంలో నడుస్తారు. శ్రమల కొలిమిలో శుద్ధి పొందుతారు. తీవ్ర సంఘర్షణలలో క్రీస్తును వెంబడిస్తారు. తమ్మును తాము ఉపేక్షించుకుంటారు. ఆశాభంగాలు ఎదుర్కొంటారు. వారు పాపం తాలూకు దోషిత్వాన్ని దు:ఖాన్ని ఈ రీతిగా గ్రహిస్తారు. పాపాన్ని అసహ్యించుకుంటారు. క్రీస్తు శ్రమల్లో పాలుపంచుకుంటూ “మన యెడల ప్రత్యక్షము కాబోవు మహిమ యెదుట ఇప్పటికాలపు శ్రమలు ఎన్నతగినవికావని యెంచుచున్నాను” (రోమా 8:18) అంటూ చీకటికి పైగా ఉన్న మహిమను చూడగలుగుతారు. AATel 414.2