అపొస్తలుల కార్యాలు
46—విడుదల
రోములో పౌలు కృషి ఫలితంగా అనేకులు క్రైస్తవ విశ్వాసాన్ని స్వీకరించటం విశ్వాసులికి బలం ప్రోత్సాహం చేకూర్చటం జరుగుతుండగా, పౌలు ప్రాణాల్నే కాదు సంఘం ప్రగతిని కూడా ప్రమాద మేఘాలు కమ్ముతున్నాయి. పౌలు రోముకు చేరిన తర్వాత అతణ్ని రాజభటుల అధికారి అజమాయిషీ కింద ఉంచారు. ఆ అధికారి న్యాయవంతుడు, నిజాయితీపరుడు. అతడి మంచితనంవల్ల పౌలు సువార్త సేవచేసుకోటానికి చాలామట్టుకు స్వేచ్ఛ లభించింది. కాగా పౌలుకి రెండేళ్ళ చెర పూర్తికాకముందే ఆ అధికారికి స్థానచలనం వచ్చి కొత్త అధికారి రావటం జరిగింది. ఇతణ్నుంచి పౌలు ప్రత్యేక ఉపకారాలకు ఎదురుచూడలేదు. AATel 347.1
పౌలును వ్యతిరేకించటంలో యూదులు క్రితంలో కన్నా ఇప్పుడు ఎక్కువ క్రియాశీలంగా ఉన్నారు. నీరో చక్రవర్తి తన రెండో భార్యగా తీసుకున్న ఒక వ్యభిచారిణిలో వారు తమకు గొప్ప సహాయకురాలుని చూశారు. ఆమె యూదు మతానికి మారిన స్త్రీ కావటంతో ఈ క్రైస్తవమత వీరుణ్ని మట్టు పెట్టాలన్న కుట్రలకు తన సహాయ సహకారాల్ని అందించింది. AATel 347.2
తాను ఎవరికైతే మనవి చేసుకున్నాడో ఆ కైసరు తనకు న్యాయం చేస్తాడన్న నమ్మకం పౌలుకి లేదు. నీరో నైతికంగా మరింత దిగజారిపోయిన వ్యక్తి. దుష్ప్రవర్తనలో అధికుడు. అంతేకాదు, అతడు తనకు ముందు పరిపాలించిన చక్రవర్తుల్ని తలదన్నిన క్రూరుడు. ఇతడికన్నా క్రూరంగా కర్కశంగా ప్రజల్ని పరిపాలించే నియంత ఇంకొకడుండడు. సింహాసనానికి వారసురాలైన తన యువ మారుటి కుమార్తెను నీరో తన రాజ్యపాలన మొదటి ఏడాది విషప్రయోగం చేసి చంపాడు. దుర్మార్గతలోను నేరంలోను లోతుగా కూరుకుపోతూ చివరికి అతడు సొంత తల్లిని ఆ మీదట సొంత భార్యను హత్యచేశాడు. అతడు చెయ్యని దురంతం లేదు. పాల్పడని నీచక్రియలేదు. మంచివారి హృదయాల్లో అతడిపట్ల అసహ్యం, ధిక్కారమే మిగిలాయి. AATel 347.3
అతడి ఆస్థానంలో చోటు చేసుకున్న అకృత్యాల వివరాలు నీచాతినీచమైనవి, ఘోరాతిఘోరమైనవి. వర్ణనాతీతమైనవి. హద్దుమీరిన అతడి దుర్మార్గత, అతడి నేరాల్లో పాలుపంచుకున్నవారికి ‘సైతం విసుగు ఏవగింపు కలిగించాయి. ఇంకా ఘోరమైన ఏ నేరాలకు పాల్పడమంటాడోనని వారు సర్వదా గుండెలు చేత పట్టుకొని ఉండేవారు. అయినా నీరో ఒడిగట్టుకొన్న తీవ్రనేరాలు కూడా అతడి నుంచి ప్రజల్ని విడదీయలేక పోయాయి. నాగరిక ప్రపంచమంతా అతణ్ని ఏకవ్యక్తి నియంతగా గుర్తించింది. అంతేకాదు ప్రజలు అతణ్ని ఘనపర్చి దేవుడుగా పూజించారు. AATel 347.4
మానవ దృక్పథంనుంచి చూస్తే అలాంటి న్యాయాధికారిచే పౌలు దోషిగా ప్రకటితం కావటం తథ్యం. అయితే, తాను దేవునికి నమ్మకంగా ఉన్నంతకాలం భయపడాల్సిన పనిలేదని పౌలు భావించాడు. గతంలో తనను కాపాడినవాడు యూదుల దురాలోచనలు ద్వేషం నుంచి, కైసరు జులుంనుంచి తనను ఇంకా కాపాడగలడని పౌలు విశ్వసించాడు. AATel 348.1
అలాగే దేవుడు తన సేవకుణ్ని కాపాడాడు. పౌలు పై జరిపిన విచారణలో అతనిపై మోపిన నేరాలు రుజువుకాలేదు. ప్రజలు ఊహిస్తున్న దానికి విరుద్ధంగా, తన స్వభావానికే పూర్తిగా విరుద్ధమైన న్యాయసూత్రాలకు అనుగుణంగా పౌలు నిర్దోషి అని నీరో తీర్పు ఇచ్చాడు. పౌలు సంకెళ్లు విప్పారు. పౌలు మళ్లీ స్వతంత్రు డయ్యాడు. AATel 348.2
అతని విచారణ ఇంకా ఆలస్యమై ఉంటే లేదా ఏదో కారణంవల్ల అతడు మరుసటి ఏడుదాకా రోములోనే ఉండి ఉంటే ఆ సమయంలో చోటుచేసుకున్న హింసలో పౌలు మరణించేవాడు. పౌలు ఖైదులో ఉన్న కాలంలో క్రైస్తవ విశ్వాసుల సంఖ్య విపరీతంగా పెరిగినందువల్ల అధికారులు వారిపట్ల ద్వేషాన్ని, వైరుధ్యాన్ని పెంచుకున్నారు. తన సొంత గృహంలోని వాళ్ళే క్రైస్తవ విశ్వాసాన్ని స్వీకరించటం చక్రవర్తికి ఆగ్రహం పుట్టించింది. కనుక కొద్ది కాలంలోనే చక్రవర్తి ఈ విషయాన్ని సాకుగా తీసుకుని క్రైస్తవుల్ని క్రూరంగా శిక్షించాడు. AATel 348.3
దాదాపు ఇదే సమయంలో రోములో తీవ్ర అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలో దాదాపు సగం భాగం కాలిపోయింది. నిప్పంటించడానికి నీరోనే ఏర్పాట్లు చేశాడన్న వదంతి ఉంది. కాని ఎవరికీ అనుమానం రాకుండేందుకు నిర్వాసితులకు దిక్కులేనివారికి ఎంతో ఉదారంగా సహాయమందిస్తున్నట్లు నటించాడు. అయినా ఆ నేరానికి పాల్పడింది అతడేనన్న ఆరోపణ వచ్చింది. ప్రజలు ఉద్వేగభరితులై కోపంతో రెచ్చిపోయారు. తాను నిర్దోషి అని నిరూపించుకునే ఉద్దేశంతోను, తాను ద్వేషిస్తూ భయపడున్న ఒక తరగతి ప్రజల్ని ఆ నగరంలో లేకుండా చేయాలన్న తలంపుతోను నీరో ఆ నిందను క్రైస్తవుల మీదకు నెట్టాడు. అతడి పథకం ఫలించింది. వేలాది క్రైస్తవ విశ్వాసుల్ని - పురుషులు, స్త్రీలు, పిల్లల్ని - నిర్దయగా చంపారు. AATel 348.4
ఈ భయంకర హింసనుంచి పౌలు తప్పించుకున్నాడు. ఎందుకంటే, విడుదలైన వెంటనే పౌలు రోము నుంచి వెళ్ళిపోయాడు. తనకు లభించిన చివరి విరామ సమయంలో స్వేచ్ఛా సమయంలో సంఘాల్లో సేవచేసి సంఘాల్ని వృద్ధిపర్చాడు. గ్రీకులకు తూర్పు సంఘాలకు మధ్య పటిష్ఠమైన ఐక్యత స్థాపించటానికి ప్రయత్నించాడు. విశ్వాసాన్ని భ్రష్టపర్చటానికి సంఘంలోకి ప్రవేశిస్తున్న తప్పుడు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఏశ్వాసుల మనసుల్ని పటిష్ఠపర్చటానికి కృషిసల్పాడు. AATel 348.5
పౌలు భరించిన శ్రమలు ఆందోళనలు అతని ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీశాయి. పైగా వయసు పెరగడంతో దుర్బలతలు ప్రారంభమయ్యాయి. తాను ఇప్పుడు చేస్తున్న సేవ తన చివరిదని పౌలు భావించాడు. తన పని సమయం తగ్గేకొద్ది అతని కృషి తీవ్రత పెరిగింది. అతని ఉత్సాహానికి హద్దులేదు. సంకల్ప బలం, సత్యం, కార్యాచరణ, దృఢ విశ్వాసంతో అనేక ప్రాంతాల్లోని సంఘాల్ని సందర్శించి విశ్వాసుల్ని బలోపేతం చెయ్యటానికి శాయశక్తుల కృషిచేశాడు. యేసు పై విశ్వాసాన్ని పంచటంలో తాము నమ్మకంగా కృషిచేయాలని తామున్న సమయాల్లాంటి సమయాల్లో సువార్త సత్యంలో దృఢంగా నిలిచి ఉంటూ క్రీస్తును గూర్చి నమ్మకమైన సాక్ష్యం ఇవ్వాలని వారిని ఉద్బోధించాడు. AATel 349.1