అపొస్తలుల కార్యాలు

40/59

39—కైసరయలో విచారణ

పౌలు కైసరయ చేరిన అయిదు రోజుల తర్వాత అతని ప్రత్యర్థులు యెరూషలేమునుంచి వచ్చారు. తెర్తులు అనే వక్తను తమ న్యాయవాదిగా తీసుకువచ్చారు. ఆ కేసు సత్వర విచారణకు వచ్చింది. పౌలును సభముందుకి తీసుకువచ్చారు. తెర్తులు “అతనిమీద నేరము మోప” నారంభించాడు. సత్య ప్రకటన న్యాయ ప్రకటన కన్నా రోము పరిపాలకుడి పై పొగడ్త ప్రభావం బలంగా పనిచేస్తుందని భావించి ఆ జిత్తులమారి న్యాయవాది ఫేలిక్సుని ప్రశంసించటం మొదలు పెట్టాడు. “మహా మనత వహించిన ఫేలిక్సా, మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు, ఈ దేశ జనమునకు సంబంధించిన అనేకమైన కీడులు తమ పరామర్శచేత దిద్దుబాటవుచున్నవనియు ఒప్పుకొని, మేము సకల విధములను సకల స్థలములలోను పూర్ణకృతజ్ఞతతో అంగీకరించుచున్నాము.” AATel 297.1

ఇక్కడ తెర్తులు పచ్చి అబద్ధమాడున్నాడు. ఫేలిక్సు చెడ్డవాడు. అతడి ప్రవర్తన హేయమైంది. “కామ కార్యాలలోను క్రూరత్వంలోను అతడు రాజు అధికారాన్ని బానిస స్వభావాన్ని” ప్రదర్శించాడని ఫొలిక్సు గురించి చెప్పేవారు - టేసిటస్ హిస్టరి, అధ్యా 5, పేరా 9. తెర్తులు మాటలు విన్నవారు అతడి మాటలు నిజం కావని అది పౌలు పై దోషిగా తీర్పుపొందటానికే గాని సత్యంపట్ల తనకున్న ప్రేమను బట్టి కాదని ఎరుగుదురు. AATel 297.2

తన వాదనలో తెర్తులు పౌలు పై నేరాలు మోపి అవి నిరూపణ అయితే దేశద్రోహ నేరానికి అతనికి కఠిన శిక్షపడటం ఖాయమని ఉద్ఘాటించాడు. “ఈ మనుష్యుడు పీడవంటివాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడనైయున్నట్టు మేము కనుగొంటిమి. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడెను గనుక మేము అతని పట్టుకొంటిమి” అన్నాడు ఆ వక్త. పౌలును యూదులు తమ ధర్మశాస్త్రం ప్రకారం విచారించటానికి సిద్ధంగా ఉన్నప్పుడు యెరూషలేము సేన అధినాయకుడు లూసియ పౌలును వారి వద్దనుంచి బలవంతంగా తీసుకువచ్చినందున యూదులు ఆ విషయం తనముందుకు తెచ్చారని ఫేలిక్సుతో తెర్తులు చెప్పాడు. న్యాయాధికారి ఫేలిక్సు పౌలును యూదు న్యాయస్థానానికి విడిచి పెట్టటానికి ప్రోత్సహించేందుకు ఆ వక్త వలికిన మాటలివి. అక్కడున్న యూదులంతా తెర్తులు మోపిన నేరాల్ని గట్టిగా సమర్థించారు. వారు పౌలుపట్ల తమకున్న ద్వేషాన్ని దాచుకోటానికి ప్రయత్నించలేదు. AATel 297.3

పౌలు పై ఆరోపణలు సంధిస్తున్న వారి ప్రవృత్తిని ప్రవర్తనను ఫేలిక్సు పూర్తిగా గ్రహించాడు. ఏ ఉద్దేశంతో వారు తనను కీర్తించారో గ్రహించాడు. పౌలు పై మోపిన నేరాల్ని నిరూపించటంలో వారి వైఫల్యాన్ని కూడా గుర్తించాడు. నిందితుడి తట్టుకి తిరిగి తన సమాధానం చెప్పుకోమంటూ పౌలుకు సైగచేశాడు. పౌలు ప్రశంసలతో కాలయాపన చెయ్యక ఫేలికు ముందు తన్నుతాను నిర్దోషిగా నిరూపించుకోగలనని కారణమేంటంటే ఫొలిక్సు దీర్ఘ కాలంగా న్యాయాధికారిగా సేవ చేస్తున్నాడు గనుక అతనికి యూదుల చట్టాలు ఆచారాల పై మంచి అవగాహన ఉన్నదని చెప్పాడు. యూదులు తనపై మోపిన నేరాల్ని ప్రస్తావిస్తూ అందులో ఒకటి కూడా వాస్తవం కాదన్నాడు. యెరూషలేములో ఏ ప్రాంతంలోను తాను ఏ అల్లర్లూ లేపలేదని, ఏ విధంగాను ఆలయాన్ని అపవిత్రపర్చలేదని చెప్పాడు. “దేవాలయములోనేమి, సమాజ మందిరములలోనేమి, పట్టణములో నేమి, నేను ఎవనితోను తర్కించుటయైనను, జనులను గుమిగూర్చుట యైనను వారు చూడలేదు. మరియు వారిప్పుడు నామీద మోపు నేరములను తమరికి ఋజువుచేయలేరు” అన్నాడు పౌలు. AATel 298.1

“వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున” తన పితరుల దేవున్ని ఆరాధిస్తున్నానని ఒప్పుకొంటూ తాను ఎల్లప్పుడూ “ధర్మశాస్త్రమునందును ప్రవక్తల గ్రంథములయందును వ్రాయబడి యున్నవన్నియు” విశ్వసిస్తున్నానని, ఈ విధంగా విస్పష్టలేఖన బోధనకు అనుగుణంగా మృతుల పునరుత్థానాన్ని విశ్వసిస్తున్నానని పౌలు వివరించాడు. ఇంకా తన జీవిత పరమావధి “దేవుని యెడలను మనుష్యుల యెడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉండునట్లు” నివసించటమని చెప్పాడు. AATel 298.2

యెరూషలేము సందర్శనలో తన ఉద్దేశాన్ని తాను అరెస్టు అయి తీర్పుకు నిలిచిన పరిస్థితుల్ని అతడు స్పష్టంగా దాపరికం లేకుండా చెప్పాడు. “కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దానద్రవ్యమును కానుకలును అప్పగించుటకు వచ్చితిని. నేను శుద్ధి చేసికొనినవాడనై యీలాగు అప్పగించుచుండగా వారు దేవాలయములో నన్ను చూచిరి. నేను గుంపుగూర్చి యుండలేదు, నా వలన అల్లరి కాలేదు, ఆసియనుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి. నా మీద వారికేమైన ఉన్న యెడల వారే తమరి సన్నిధికి వచ్చి నామీద నేరము మోపవలసియుండెను. లేదా, నేను మహాసభ యెదుట నిలిచియున్నప్పుడు, మృతుల పునరుత్థానమును గూర్చి నేడు వారి యెదుట విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలువబడి నేను బిగ్గరగా చెప్పిన యీ యొక్క మాట విషయమై తప్ప నాయందు మరి ఏ నేరమైనను వీరు కనుగొనియుంటే నీవైన చెప్పవచ్చుననెను.” AATel 298.3

అపొస్తలుడు చిత్తశుద్ధితో యధార్థతతో మాట్లాడాడు. అతని మాటలు నమ్మకం పుట్టించేమాటలు. కౌదియ లూసియ ఫేలిక్సుకి రాసిన ఉత్తరంలో పౌలు ప్రవర్తనగురించి ఇలాంటి సాక్ష్యాన్నే ఇచ్చాడు. పైగా, యూదు మతం గురించి ఇతరులు తలంచేదానికన్నా ఫేలిక్సుకి మెరుగైన అవగాహన ఉంది. ఆ కేసులోని వాస్తవాలతో నిండిన పౌలు మాటలు అతనిపై తిరుగుబాటు దేశద్రోహ నేరాలు మోపి శిక్షించటానికి ప్రయత్నిస్తున్న యూదుల దురుద్దేశాన్ని ఫేలిక్సు మరింత స్పష్టంగా అవగాహన చేసుకోటానికి దోహదపడ్డాయి. ఒక రోమా పౌరుణ్ని అన్యాయంగా నేరస్తుడని తీర్పు చెప్పటంద్వారా వారిని తృప్తిపర్చటానికి గాని లేదా నిష్పక్షపాతమైన విచారణ జరుపకుండా అతణ్ని చంపటానికి వారికి అప్పగించటానికి గాని ఫేలిక్సు సమ్మతించలేదు. ఆలాగని ఫేలిక్సుకి స్వార్ధం లేదనలేం. ప్రశంసలపట్ల పదోన్నతిపట్ల ఆశ అతణ్ని అదుపుచేసింది. పౌలు నిరపరాధి అన్నది స్పష్టంగా తెలిసినప్పటికీ యూదుల ఆగ్రహానికి భయపడటం వల్ల అతడికి పూర్తి న్యాయం చేకూర్చలేక పోయాడు. కనుక ఈ మాటలు పిలికి లూసియ వచ్చేవరకు ఆ కేసును నిలుపుచేశాడు. “సహస్రాధిపతియైన లూసియ వచ్చినప్పుడు మీ సంగతినేను విచారించి తెలిసికొందునని” చెప్పాడు. AATel 299.1

అపొస్తలుడు ఖైదీగానే ఉన్నాడు. కాని అతణ్ని కావలికాయాటానికి నియుక్తుడైన శతాధిపతితో “అతని విడిగా కావలిలో ఉంచి అతనికి పరిచారము చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచవద్దని” చెప్పాడు. AATel 299.2

ఇది జరిగిన కొద్దికాలానికి ఫేలిక్సు అతడి బార్య ద్రుసిల్ల “క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి” వినటానికి పౌలును వ్యక్తిగత సమావేశానికి పిలిపించుకున్నారు. ఈ నూతన సత్యాల్ని వినటానికి వారు ఆతృతగా ఉన్నారు. ఆ సత్యాల్ని వారు మళ్ళీ వినకపోవచ్చు. వాటిని నిరాకరిస్తే దేవుని దినం వచ్చినప్పుడు వారికి వ్యతిరేకంగా సాక్ష్యంగా ఆ సత్యాలు నిలువవచ్చు. AATel 299.3

ఇది దేవుడిచ్చిన అవకాశంగా పౌలు పరిగణించాడు. ఆ అవకాశాన్ని నమ్మకంగా ఉపయోగించుకున్నాడు. తనను చంపటానికిగాని విడిచి పెట్టటానికిగాని అధికారం ఉన్న వ్యక్తిముందు తాను నిలబడి ఉన్న సంగతి పౌలు గుర్తించాడు. అయినా ఫేలిక్సుని ద్రుసిల్లను పొగడ్తల్లో ముంచి ఎత్తలేదు. వారికి తన మాటలు జీవపు వాసనగల మాటలో లేక మరణపు వాసనగల మాటలో అవుతాయని అతనికి తెలుసు. స్వప్రయోజనాల్ని గూర్చి మర్చిపోయి వారి ఆధ్యాత్మిక ప్రమాద స్థితిని గూర్చి వారిని మేల్కొల్పటానికి ప్రయత్నించాడు. AATel 299.4

తన మాటల్ని వినేవారందరికీ సువార్త దీవెనలు పొందే హక్కు ఉన్నదని ఒకనాడు వారు ఆ మహాశ్వేత సింహాసనం చుట్టూ ఉండే పరిశుద్ధ జనుల మధ్యనో లేక “అక్రమము చేయువారలారా, నా యొద్దనుండి పొండి” (మత్తయి 7:23) అని క్రీస్తు ఎవరితో అంటాడో వారితోనో ఉంటారని, అపొస్తలుడు గుర్తించాడు. AATel 300.1

ఫేలిక్సు విధానం దౌర్జన్యంతో క్రూరత్వంతో కూడింది. తన ప్రవర్తన దోషరహితం కాదని అతడికి చెప్పటానికి ఎవరూ సాహసించలేదు. అయితే పౌలుకి మానవుడి భయంలేదు. క్రీస్తు పై తన విశ్వాసాన్ని విస్పష్టంగా ప్రకటించాడు. ఆ విశ్వాసానికి కారణాల్ని వివరించాడు. ఆ రీతిగా క్రైస్తవ ప్రవర్తనకు అగత్యమైన గుణలక్షణాల్ని గూర్చి మాట్లాడాడు. అయితే తనముందున్న అహంకార పూరితమైన ఆ జంటలో అవి శూన్యం. AATel 300.2

ఫేలిక్సు ద్రుసిల్లలకు దేవుని ప్రవర్తనను పౌలు వర్ణించాడు. ఆయన నీతిని, న్యాయశీలతను, నిష్పాక్షికతను, ఆయన ధర్మశాస్త్ర స్వభావాన్ని వర్ణించాడు. మానవుడు సుబుద్ధి కలిగి, మితానుభవం పాటిస్తూ దైవ ధర్మశాస్త్రానుసారంగా తన ఆవేశాల్ని ఉద్రేకాల్ని అదుపులో ఉంచుకుని శారీరక మానసిక శక్తుల్ని ఆరోగ్యంగా ఉంచుకోటం అతడి విధి అని స్పష్టీకరించాడు. తీర్పు దినం ఒకటున్నదని ఆ దినాన అందరూ శరీరమందు తాము చేసిన క్రియల చొప్పున ప్రతిఫలం పొందుతారని, దేవుని అనుగ్రహాన్ని పొందటానికి లేదా మానవుణ్ని పాప పర్యావసానం మంచి విడిపించ టానికి భాగ్యంగాని హోదాగాని హక్కులుగాని ఉపయోగపడవని తేటతెల్లం చేశాడు. ఈ జీవితం మానవుడు భావి జీవితానికి సిద్ధపడే సమయమని చెప్పాడు. ఇప్పటి ఆధిక్యతల్ని అవకాశాల్ని నిర్లక్ష్యం చేస్తే విత్యనాశనం తప్పదన్నాడు. నూతన కృపకాలం అంటూ ఉండదన్నాడు. AATel 300.3

పౌలు ప్రధానంగా దైవ ధర్మశాస్త్రపు దీర్ఘకాలిక విధులపై ప్రస్తావన సాగించాడు. మానవుడి నైతిక స్వభావం లోతుల్లోని రహస్య విషయాలకు అది ఎలా విస్తరించి మానవ దృష్టినుంచి జ్ఞానం నుంచి మరుగై ఉన్నవాటిపై ప్రచండమైన వెలుగును ఎలా విరజిమ్ముతుందో సూచించాడు. చేతులు ఏమైతే చేస్తాయో లేదా నాలుక ఏదైతే పలుకుతుందో - భాహ్యజీవితం ఏదైతే బయలుపర్చుతుందో - అది మానవుడి నైతిక ప్రవర్తనను అసంపూర్ణంగా మాత్రమే బహిర్గతం చేస్తుంది. ధర్మశాస్త్రం మానవుడి ఆలోచనలు, ఉద్దేశాలు కార్యాల్ని వెదకుతుంది. అసూయ, ద్వేషం, మోహం, అత్యాశ, ఆత్మ చీకటి గుహల్లో రూపుదాల్చుకుంటూ అవకాశం లేక ఇంకా క్రియాత్మకంకాని దుష్కృతాలు - వీటన్నిటినీ దైవ ధర్మశాస్త్రం ఖండిస్తున్నది. AATel 300.4

పాపం నిమిత్తం అర్పితమైన గొప్ప త్యాగంపై పౌలు తన శ్రోతల మనసుల్ని నిలిపాడు. రానున్న మంచికి మేలుకి ఛాయారూపకమైన బలుల్ని ప్రస్తావించి అప్పుడు ఆ ఆచారాలన్నిటికీ నిజస్వరూపమైన క్రీస్తును వారిముందుంచాడు. పడిపోయిన మానవుడి జీవానికి నిరీక్షణకు మూలమైన క్రీస్తును ఆ ఛాయారూపక ఆచారాలు సూచించాయి. పూర్వకాలం పరిశుద్ధులు క్రీస్తు రక్తం పై విశ్వాసం వలన రక్షణ పొందారు. బలిపశువు మరణ వేదనను వీక్షించినప్పుడు వారు లోకపాపాన్ని తీసుకొని పోయే దేవుని AATel 301.1

గొర్రెపిల్లను యుగయుగాల అగాధం మీదుగా వీక్షించారు. దేవుడు తాను సృజించిన మనుషుల ప్రేమ విధేయతల్ని కోరటం న్యాయమే. మంచికి పరిపూర్ణమైన ప్రమాణాన్ని తన ధర్మశాస్త్రంలో ఆయన ఇచ్చాడు. కాని అనేకమంది తమ సృష్టికర్తను మర్చిపోయి దైవ చిత్రానికి విరుద్ధంగా తమ సొంతమార్గాల్ని ఎంపిక చేసుకుంటున్నారు. ఆకాశమంత ఎత్తు విశ్వమంత వెడల్పుగల ఆయన ప్రేమకు బదులుగా అనేకులు వ్యతిరేకతనే ఆయనపట్ల ప్రదర్శిస్తున్నారు. దేవుడు తన ధర్మశాస్త్ర విధుల్ని దుష్ట జనులకు అనుకూలంగా తగ్గించటం సాధ్యపడదు. పోతే మానవుడు తన సొంత శక్తి వల్ల ధర్మశాస్త్ర విధుల్ని ఆచరించటం సాధ్యం కాదు. క్రీస్తుపై విశ్వాసం మూలంగా మాత్రమే పాపి తన దోషిత్వం నుంచి శుద్ధిపొంది తన సృష్టికర్త ధర్మశాస్త్రానికి లోబడి నివసించటానికి శక్తి పొందుతాడు. AATel 301.2

ఈ విధంగా యూదులు అన్యజనులు దైవధర్మశాస్త్రానికి లోబడి నివసించాలని చెబుతూ నజరేయుడైన యేసు, దేవుని కుమారుడు అయిన లోక రక్షకుణ్ని పౌలు వారికి సమర్పించాడు. AATel 301.3

యూదురాలైన రాణి తాను నిర్లజ్జగా అతిక్రమించిన ధర్మశాస్త్ర పవిత్రతను అవగాహన చేసుకున్నది. కాని కల్వరి మానవుని పట్ల తనకున్న ద్వేషం ఆమె హృదయాన్ని కఠినపర్చటంతో దైవ వాక్యాన్ని విసర్జించింది. ఫేలిక్సు మాటకొస్తే అతడు సువార్త సత్యాన్ని వినిఉండలేదు. పరిశుద్ధాత్మ అతనిలో విశ్వాసం పుట్టించగా అతడు తీవ్ర ఆందోళనకు అలజడికి గురి అయ్యాడు. ఇప్పుడు నిద్రలేచిన అంతరాత్మ తన స్వరాన్ని వినిపించింది. పౌలు చెబుతున్న మాటలు నిజమని ఫేలిక్సు నమ్మాడు. తన అపరాధ పూరిత గతం జ్ఞాపకం వచ్చింది. భయంకర స్పష్టతతో తన గత విచ్చలవిడి అనైతిక వర్తన, రక్తపాతం, అనంతర సంవత్సరాల్లోని తన చీకటి చరిత్ర గుర్తొచ్చాయి. తన్ను తాను వ్యభిచారిగా, క్రూరుడిగా, హింసకుడిగా చూసుకున్నాడు. ఇంత స్పష్టంగా ముందెన్నడూ సత్యం తనముందుకి రాలేదు. అతడి ఆత్మ ముందెన్నడూ ఇలా భయంతో నిండలేదు. తన నేరపూరిత జీవిత రహస్యాలన్నీ దేవుని నేత్రానికి బట్టబయలే అన్న తలంపు, తన క్రియలచొప్పున తనకు తీర్పు వస్తుందన్న తలంపు అతణ్ని భయంతో నింపింది. AATel 301.4

అయితే తనలో కలిగిన భావాలు నమ్మకాల్ని పశ్చాత్తాపం పొందేందుకు ఉపయోగించుకునే బదులు అప్రియమైన ఆ తలంపుల్ని తోసిపుచ్చటానికి ప్రయత్నించాడు. పౌలుతో ఆ సమావేశాన్ని అర్థాంతరంగా ముగించాడు. “ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమున్నప్పుడు నిన్ను పిలువనంపింతును” అన్నాడు. AATel 302.1

ఫిలిప్పీలోని చెరసాల అధికారి స్పందనకూ ఫేలిక్సు స్పందనకు మధ్య ఎంత వ్యత్యాసముంది! పౌలును ఫేలిక్సు వద్దకు తీసుకువచ్చినట్లే దైవసేవకుల్ని చెరసాల అధికారి వద్దకు తీసుకొచ్చారు. తమను దైవశక్తి కాపాడూ నడిపిస్తుందనటానికి వారిచ్చిన నిదర్శనం, బాధలకు అవమానానికి గురి అయినప్పుడు వారు ఉల్లాసంగా ఉత్సాహంగా వ్యవహరించటం, భూకంపంతో భూమి దద్దరిల్లుతున్నప్పుడు వారిలో భయం ఏకోశానా లేకపోవటం, క్రీస్తు మాదిరిగా వారిలోని క్షమాగుణం చెరసాల అధికారిలో నమ్మకం పుట్టించాయి. అతడు వణుకుతూ తన పాపాల్ని ఒప్పుకుని క్షమాపణ పొందాడు. ఫేలిక్సు వణికాడు కాని పశ్చాత్తాపపడలేదు చెరసాల అధికారి దేవుని ఆత్మను తన హృదయంలోకి తన గృహంలోకి ఆహ్వానించాడు. ఫేలిక్సు దైవ రాయబారిని వెళ్ళిపొమ్మని ఆదేశించాడు. ఒక వ్యక్తి దేవుని కుమారుడు పరలోక వారసుడు అవ్వటానికి ఎంపికచేసుకోగా తక్కిన వ్యక్తి దురంతాలు దుష్క్రియలు చేసేవారితో చెయ్యి కలపటానికి ఎన్నుకున్నాడు. AATel 302.2

రెండేళ్ళుగా పౌలు విషయంలో ఏ చర్యా తీసుకోలేదు. అతడు చెరసాలలోనే మగ్గాడు. ఫేలిక్సు అనేక పర్యాయాలు పౌలుని సందర్శించి అతడి మాటలు శ్రద్ధగా విన్నాడు. అతడు ప్రదర్శిస్తున్న స్నేహభావం అసలు ఉద్దేశం లంచం పై కోరిక. పెద్దమొత్తంలో డబ్బు ముట్టజెప్పితే చెరనుంచి విముక్తి కలిగిస్తానని అతడు పౌలుతో అన్నాడు. లంచం పెట్టి విడుదల పొందటానికి ఉదాత్త స్వభావి అయిన అపొస్తలుడు ఒప్పుకోలేదు. పౌలు ఏ నేరానికి పాల్పడలేదు. విడుదల పొందటానికి ఏ తప్పుడు పని చేయడు. చెప్పాలంటే, అలాంటి పరిస్థితే ఏర్పడితే అలాంటి క్రయధనం చెల్లించలేనంత పేదవాడతడు. అంతేకాదు, తన నిమిత్తం విశ్వాసుల విరాళాలకు విజ్ఞప్తి చేయడుకూడా. తాను దేవుని చేతుల్లో ఉన్నానని తన పక్షంగా తాను దేవుని ఏర్పాట్లలో తలదూర్చరాదని భావించాడు. AATel 302.3

యూదుల విషయంలో తాను చేసిన ఘోర తప్పిదాలు అన్యాయాల నిమిత్తం ఫేలిక్సుని రోముకు రమ్మని ఆదేశం వచ్చింది. ఈ ఆదేశం మేరకు కైసరయకు ప్రయాణం చేయకముందు “యూదుల చేత మంచివాడనిపించుకొనవలెనని కోరి” పౌలును చెరలోనే ఉంచేశాడు. అయినా ఫేలిక్సు యూదుల విశ్వాసాన్ని తిరిగి సంపాదించలేకపోయాడు. అతడు పదవిని పోగొట్టుకొని తీవ్ర అవమానానికి గురి అయ్యాడు. అతడి వారసుడుగా పోర్కియు ఫేస్తు నియమితుడయ్యాడు. అతడి ప్రధాన కార్యాలయం కైసరయలో ఏర్పాటయ్యింది. AATel 302.4

నీతి, ఆశనిగ్రహం, రానున్న తీర్పును గూర్చి పౌలు ఫేలిక్సుతో చర్చిస్తున్న తరుణంలో ఫేలిక్సు మీద ఓ కాంతి రేఖ ప్రసరించటానికి దేవుడు అనుమతించాడు. తన పాపాల్ని గ్రహించి వాటిని విడిచి పెట్టటానికి అది ఫేలిక్సుకి దేవుడిచ్చిన అవకాశం. కొని అతడు “ఇప్పటికి వెళ్ళుము నాకు సమయమున్నప్పుడు నిన్ను పిలువంపింతును” అని దైవ సేవకుణ్ని పంపివేశాడు. తనకు వచ్చిన చివరి కృపావరదానాన్ని అతడు తృణీకరించాడు. దేవుని వద్ద నుంచి అతడికి మరో పిలుపు ఇక ఎన్నడూ రాలేదు. AATel 303.1