అపొస్తలుల కార్యాలు

5/59

4—పెంతెకొస్తు

ఒలీవ కొండ నుంచి యెరూషలేముకు శిష్యులు తిరిగి వచ్చినప్పుడు వారి ముఖాల్లో దు:ఖం, గందరగోళం పరాజయం కనిపిస్తాయనుకొన్నారు. ప్రజలు. కాని వారికి కనిపించింది ఆనందోత్సాహాలు, విజయమందహాసాలు. తమ ఆశలు అడియాసలయ్యాయని ఇప్పుడు వారు వాపోవడం లేదు. వారు తిరిగి లేచిన రక్షకుణ్ని చూశారు. వెళ్లిపోయేటప్పుడు ఆయన చేసిన వాగ్దానం వారి చెవుల్లో నిత్యము మోగుతున్నది. AATel 27.1

పరిశుద్ధాత్మ కుమ్మరింపును గూర్చి తండ్రి వాగ్దాన నెరవేర్పుకు క్రీస్తు ఆదేశం మేరకు శిష్యులు యెరూషలేములో వేచి ఉన్నారు. వారు ఊరకే కూర్చొని కనిపెట్టడం లేదు. ” ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయు చుండిరి” అని లేఖనం చెబుతున్నది. లూకా 24 : 53. యేసు పేర తండ్రికి తమ విన్నపాల్ని సమర్పించుకొనేందుకు కూడా వారు సమావేశమయ్యారు. పరలోకంలో తమకు రాయబారి ఉన్నాడని దేవుని సింహాసనం ముందు ఆయన ఉత్తరవాది అని వారికి తెలుసు. భయంతోను భక్తితోను ఈ వాగ్దానాన్ని పలుకుతూ వారు వంగి ప్రార్థన చేశారు: ” మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన నాకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరకును.” యోహాను 16 : 23, 24. “మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేయువాడును ఆయనే ” (రోమా 8 : 34) అన్నబలమైన వాదనతో తమ విశ్వాస హస్తాన్ని పైకి ఇంకా పైకి చాపారు. AATel 27.2

వాగ్దానం నెరవేర్పు కోసం వేచి ఉన్న తరుణంలో శిష్యులు దీనులై పశ్చాత్తాపం పొంది తమ అవిశ్వాసానికి క్షమాపణ వేడుకొన్నారు. తన మరణానికి ముందు క్రీస్తు తమతో చెప్పిన మాటలు జ్ఞప్తికి తెచ్చుకొన్నప్పుడు వాటి భావాన్ని మరెక్కువగా అవగాహన చేసుకొన్నారు. తాము మరచిపోయిన సత్యాలు వారి స్మృతి పదంలోకి మళ్లీ వచ్చాయి. వీటిని వారు పరస్పరం చెప్పుకొన్నారు. రక్షకున్ని సరిగా అవగతం చేసుకోనందుకు వారు తమ్మును తాము నిందించుకొన్నారు. అద్భుతమైన ఆయన జీవితంలోని దృశ్వాలు ఊరేగింపులా వారి ముందు కలిగాయి. పవిత్రమైన పరిశుద్ధమైన ఆయన జీవితంపై ధ్యానం నిలిపినప్పుడు తమ జీవితాల్లో క్రీస్తు ప్రవర్తన సౌందర్యాన్ని ప్రదర్శించ గలిగితే అందుకు ఎంతటి త్యాగం అగత్యమైన అది గొప్ప త్యాగం కాబోదని వారు భావించారు. తమ గత మూడు సంవత్సరాలూ తిరిగి జీవించడం సాధ్యపడితే వారు ఎంత వ్యత్యాసంగా వ్యవహరించేవారు! ప్రభువును తాము మళ్లీ చూడగలిగితే ఆయనను గాఢంగా ప్రేమిస్తున్నామని వ్యక్తం చేయడానికి వారు ఎంత తీవ్రంగా కృషి చేసేవారు మాట వలన గాని అపనమ్మకపు క్రియ వలనగాని ఆయనను దుఃఖపెట్టినందుకు ఎంత తీవ్రంగా పశ్చాతాపపడేవారు! ప్రభువు తమను క్షమించాడన్న తలంపు వారికెంతో ఆదరణ కలిగించింది. ప్రభువు గురించి నిర్భయంగా లోకానికి సాక్ష్యామివ్వడం ద్వారా తమ అవిశ్వాసానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని వారు కృతనిశ్చయులయ్యారు. AATel 27.3

మనుష్యుల్ని కలుసుకోడానికి తమ దినదిన జీవన సంబంధాల్లో పాపుల్ని క్రీస్తు వద్దకు నడిపించే మాటలు మాట్లాడడానికి సామర్థ్యం కోసం శిష్యులు చిత్తశుద్ధితో ప్రార్ధించారు. సమస్త విభేదాల్ని గొప్పతనం కోసం వాంఛను విడిచి పెట్టి క్రైస్తవ సహవాసంలో వారందరూ ఒకటయ్యారు. దేపునికి మరింత చేరువయ్యారు. ఈ ప్రక్రియలో తమకు క్రీస్తుతో సన్నిహిత సంబధం ఏర్పడడం తమకు ఎంత గొప్ప ఆధిక్యతో శిష్యులు గుర్తించారు. తమ అనగాహన మందగించినందువల్ల ఆయన తమకు బోధించడానికి ప్రయత్నించిన పాఠాల్ని గ్రహించకపోడం ద్వారా ఎన్నిసార్లు ప్రభువు హృదయాన్ని గాయపర్చామో అన్న ఆలోచన వారికి తీవ్ర సంతానం కలిగించింది. AATel 28.1

శిష్యులు సిద్ధపడున్న ఈ దినాలు వారు హృదయ పరిశోధన చేసుకొంటున్న దినాలు కూడా. శిష్యులు తమ ఆధ్యాత్మికావసరాన్ని గుర్తించారు. ఆత్మల రక్షణ పరిచర్యకు తమను యోగ్యులుగా తీర్చిదిద్దేందుకు ఆత్మాభిషేకం అనుగ్రహించ మని ప్రభువుకు మొర పెట్టుకొన్నారు. కేవలం తమను దీవించమనే వారు ప్రార్ధించ లేదు. ఆత్మల రక్షణ భారం వారిని కుంగదీసింది. సువార్త లోకానికి ప్రకటితం కావాలని వారు గుర్తించారు. క్రీస్తు వాగ్దానం చేసిన శక్తిని బహుగా ఆశించారు. AATel 28.2

పితరుల యుగంలో పరిశుద్దాత్మ ప్రభావం అతి స్పష్టంగా కనిపించిందిగాని సంపూర్తిగా ఎన్నడూ కనిపించలేదు. ఇప్పుడు రక్షకుని మాటను బట్టి శిష్యులు పరిశుద్ధాత్మ వరంకోసం విజ్ఞాపన సల్పారు. పరలోకంలో క్రీస్తు కూడా తన విజ్ఞాపన ద్వారా దాన్ని బలపర్చాడు. తన ప్రజలపై కుమ్మరించేందుకుగాను పరిశుద్ధాత్మవరం కోసం ఆయన విజ్ఞాపన చేశాడు. AATel 28.3

“పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరు ఒక చోట కూడి యుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొక ధ్యని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను.” AATel 28.4

ప్రతీ హృదయాన్ని చేరగలిగినంత సమృద్దిగా వేచి ప్రార్ధిస్తున్న శిష్యుల మీదికి ఆత్మదిగి వచ్చాడు. నిత్యుడైన ఆత్మ తన్నుతాను తన సంఘానికి ప్రత్యక్షపర్చు కొన్నాడు. ఈ ప్రభావం యుగాలకొద్ది అదుపులో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ కృపాసంపదను సంఘం పై కుమ్మరించిగలిగి నందుకు దేవుడు ఆనందించాడు. ఆత్మ ప్రభావం కింద పశ్చాత్తాపం పాపపు ఒప్పుకోలు చోటు చేసుకొన్నాయి. క్షమాపణ లభించినందుకు స్తుతిగానం పైకి లేచింది. కృతజ్ఞతా స్తుతులు ప్రవచన వాక్కులు వినిపించాయి. అవగాహనకు మించిన సాటిలేని ప్రేమను వీక్షించడానికి ఆ జ్ఞానానికి నమస్కరించడానికి పరలోకం కిందకు వంగింది. విస్మయంతో దిక్కుతోచని శిష్యులు. ” ఇందులో ప్రేమయున్నది” అని పలికారు. పరలోకం నుంచి వచ్చిన వరాన్ని ఆతృతగా అందుకొన్నారు. తర్వాత జరిగిందేమిటి? నూతన శక్తితో పదును బారి పరలోకపు మెరుపులో ప్రకాశిస్తున్న వాక్యఖడ్గం అవిశ్వాసాన్ని చీల్చుకొంటూ పురోగమించింది. ఒక్క రోజునే వేలాది ప్రజలు మారుమనసు పొందారు. AATel 29.1

క్రీస్తు తన శిష్యులతో ఇలా అన్నాడు: ” నేను వెళ్లిపోవుట వలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లని యెడల ఆదరణ కర్త మీ యొద్దకు రాడు; నేను వెళ్లిన యెడల ఆయనను మీయొద్దకు పంపుదును” ” అయితే ఆయన, ఆనగా సత్యస్వరూపియైన ఆత్మవచ్చినప్పుడు మిమ్మును సత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును” యెహాను 16 : 7, 13. AATel 29.2

క్రీస్తు అనుచరులు తమకు వాగ్దానం అయిన ఆత్మవరాన్ని పొందుతారన్నది క్రీస్తు పరలోకానికి వెళ్లటం ద్వారా రూఢి అయ్యింది. శిష్యులు తమ పరిచర్యను ప్రారంభించకముందు దీని కోసం కని పెట్టాల్సి ఉన్నారు. పరలోక ద్వారాల్లోనుంచి వెళ్లి దూతగణాల పూజల నడుము క్రీస్తు సింహాసనాసీనుడయ్యాడు. పూజా ప్రక్రియ ముగిసిన వెంటనే పరిశుద్ధాత్మ శిష్యుల మీదికి దిగివచ్చాడు. అనంత కాలం నుంచి తండ్రితో పాటు తనకున్న మహిమతో క్రీస్తు మహిమపర్చబడ్డాడు. పెంతెకొస్తు నాటి ఆత్మకుమ్మరింపు, రక్షకుని నీతి రాజ్య ప్రారంభానికి సూచికగా పరలోకం పంపిన సందేశం. పరలోకంలోను భూమి మీదను తనకు అధికారం ఉన్నదని తన ప్రజల్ని పాలించతడానికి తాను అభిషిక్తుడైన మెస్సియానని సూచించడానికి తన వాగ్దానం మేరకు శిష్యుల మీదికి ఆయన పరిశుద్ధాత్మను పంపించాడు. AATel 29.3

” మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడివారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ అందరు పరిశుద్దాత్మతో నిండినవారై ఆ ఆత్మవారికి వాక్ శక్తి అనుగ్రహించుకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.” పరిశుద్ధాత్మ అగ్నిజ్వాలల వంటి నాలుకలుగా దిగివచ్చి సమావేశమైన వారిలో ప్రతీ ఒక్కరి మీద వాలటం జరిగింది. శిష్యులు పొందిన వరానికి ఇది చిహ్నం. ఈ వరం పొందిన శిష్యులు ఇంతకు ముందు పరిచయంలేని భాషలు అనర్గళంగా మాట్లాడారు. అగ్నిజ్వాలలు అపోస్తలులు ఉత్సాహోద్రేకాలో పని చేయడాన్ని వారి సేవ శక్తితోనిండి సాగడాన్ని సూచిస్తున్నది. AATel 29.4

” ఆ కాలమున ఆకాశము క్రిందనుండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి.” ప్రజలు చెదిరిపోడం జరిగిన కాలంలో యూదులు లోకంలోని అన్ని ప్రాంతాలకు చెదిరి పోయారు. వారు స్థిరపడ్డ స్థలాల్లోని ఆయా భాషలు మాట్లాడడం నేర్చుకొన్నారు. ఈ సమయంలో అనేక మంది యూదులు యెరూషలేములో ఉన్నారు. అక్కడ జరుగుతున్న పండుగలో పాల్గొంటున్నారు. హాజరైన వారిలో అన్ని భాషలు మాట్లాడేవారు ఉన్నారు. ఈ భాషా వైవిధ్యం సువార్త ప్రకటనకు గొప్ప ప్రతిబంధకంగా పరిణమించేది. అపోస్తలుల్లో ఉన్న ఈ లోటును దేవుడు అద్భుత రీతిగా తీర్చాడు. జీవిత కాలమంతా పనిచేసిన వారు చేయలేని పనిని పరిశుద్ధాత్మ వారి పక్షంగా సాధించాడు. వారు ఏ ప్రజల మధ్యపనిచేస్తున్నారో వారి భాషలో ఇప్పుడు వారు సువార్త సత్యాన్ని బోధించగలిగారు. శిష్యుల సువార్తాదేశం దేవుని ఆధికార ముద్రతో వచ్చిందనడానికి అద్భుతమైన ఈ వరం నిదర్శనం. ఈ సమయం నుంచి శిష్యుల భాష వారు తమ మాతృభాషలో మాట్లాడినా పరభాషలో మాట్లాడినా - స్వచ్ఛంగా, సామాన్యంగా నిర్దుష్టగా ఉన్నది. AATel 30.1

“ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతట అందరు విభ్రాంతి నొంది ఆశ్చర్యవడి - ఇదిగో మాటలాడుచున్న వీరందరు గలిలయులుకారా? మనలో ప్రతివాడు తాను వుట్టిన దేశపుభాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే ఇదేమి?” AATel 30.2

ఆశ్చర్యకరమైన ఈ ప్రత్యక్షత యాజకులకు ఆధికారులకు ఆగ్రహం పుట్టించింది. కాని ప్రజలకు భయపడి వారు తమ దుర్బుద్ధిని కనపర్చలేదు. నజరేయుడైన యేసుని వారు చంపారు. అయితే విద్యలేని గలిలయులైన ఈ ఆనుచరులు ప్రభువు జీవితాన్ని గూర్చి ఆయన సేవను గూర్చి నాటి ప్రజల భాషలలో ప్రకటించారు. శిష్యుల అద్భుత శక్తికి స్వాభావిక కారణం చూపించే ప్రయత్నంలో విందుకు తయారు చేసిన కొత్త మద్యం సేవించారని వారు నిందవేశారు. అక్కడున్న వారిలో కొందరు యాజకుల నిందల్ని వాస్తవాలుగా నమ్మారు. అయితే జ్ఞానం గలవారిలో చాలామంది అది నిజం కాదని నమ్మారు. వివిధ భాషలు తెలిసిన వారు శిష్యులు ఆ భాషల్ని స్వచ్ఛంగా దోషరహితంగా మాట్లాడారని సాక్ష్యమిచ్చారు. AATel 30.3

యాజలకుల ఆరోపణలకు సమాధానంగా ప్రత్యేక పరిచర్యకు మనుషుల్ని యోగ్యులుగా తీర్చిదిద్దడానికి అలాటి శక్తి మనుషుల మీదికి వస్తుందని ప్రవచించిన యోవేలు ప్రవచన నెరవేర్పు ఇదని పేతురు వ్యక్తం చేశాడు. “యూదయ మనుష్యులారా యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, యిది మీకు తెలియుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించునట్టు వీరు మత్తులుకారు, ప్రొద్దుబిడిచి జామయిన కాలేదు, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతియిదే, ఏమనగా - అంత్య దినములందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను నా కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు ఈ యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్దులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కమ్మరించెదను గనుక వారు (ప్రవచించెదరు.” AATel 31.1

క్రీస్తు మరణం పునరుత్థానం గురించి పేతురు స్పష్టంగా శక్తిమంతంగా సాక్ష్యమిచ్చాడు: ” ఇశ్రాయేలు వారలారా, యీ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్వను చేయించి ఆయనను తనవలన మెప్పుపొందినవానిగా మీకు కనబరచెను; ఇది మిరే యెరుగుదురు... యీయనను మీరు దుష్టులచేత సిలువవేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదన తొలగించి ఆయనను లేపెను.” AATel 31.2

తన వాదనను సమర్థించుకోడానికి పేతురు క్రీస్తు బోధల్ని ప్రస్తావించలేదు. శ్రోతల దురభిమానం తనకు తెలుసు. ఆ అంశంపై తన మాటలను లెక్కచేయరని తనకు తెలుసు. అందుచేత తమ పితరుల్లో ఒకడిగా యూదులు పరిగణించే దావీదు గురించి వారితో మాట్లాడాడు. “ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను - నేనెల్లప్పుడు నా యెదుట ప్రభువును చూచు చుంటిని. ఆయన నా కుడిపార్శ్వమున నున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను; నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడ నిరీక్షణ గలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచి పెట్టవు నీ పరిశుద్ధుని కళ్లు పట్టనియ్యవు.... AATel 31.3

“సహోదరులారా! మూల పురుషుడగు దావీదును గూర్చి నాతో నేను ధారాళముగా మాటలాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను అతని సమాధి నేటివరకు మనమధ్య నున్నది.” “క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్లిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పేను. ఈ యేసును దేవుడులే పెను దీనికి మేమందరము సాక్షులము.” AATel 31.4

ఇది ఆసక్తికరమైన సన్నివేశం. శిష్యుల మాటల్ని వినడానికి అన్నిదిశల నుంచి వచ్చి ప్రజలు ఆయనయందలి సత్యం ఉన్నది ఉన్నట్టుగా సాక్ష్యం ఇవ్వడం చూడండి. వారు తోసుకొంటూ వచ్చి ఆలయాన్ని నింపుతున్నారు. యాజకులు ప్రధానులు అక్కడ ఉన్నారు. వారి ముఖాలపై క్రోధం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. క్రీస్తు పట్ల ద్వేషంతో వారి హృదయాలు నిండి ఉన్నాయి. హింస మరణాల నేపథ్యంలో అపొస్తలులు భయంతో వణుకుతారని వారు భావించారు. అయితే అపొస్తలులు నిర్భయంగా ఉన్నట్లు ఆత్మతో నిండిన వారై నజరేయుడైన యేసు దేవత్వాన్ని గూర్చి గొప్ప శక్తితో ప్రకటిస్తున్నట్లు వారు కనుగొన్నారు. ఇటీవల తాము అవమానించి ఎగతాళి చేసి క్రూరంగా కొట్టి సిలువ వేసింది. ఇప్పుడు దేవుని కుడి పార్శ్వాన ఉన్న జీవనాధుడు యేసునే అని శిష్యులు చెప్పడం వారు విన్నారు. AATel 32.1

అపొస్తలుల మాటలు వింటున్నవారిలో కొంతమంది క్రీస్తును తప్పుపట్టడం లోను చంపడంలోను పాలు పొందినవారున్నారు. ఆయనను సిలువ వేయమంటూ కేకలు వేసినవారితో వారుగళం కలిపినవారే. పిలాతు తీర్పు గదిలో క్రీస్తు బరబ్బాను తమ ముందునిలిపి ఉన్నప్పుడు “నేనెవనిని విడుదల చేయవలెనని వారు కోరు చున్నారు?” అని పిలాతు ప్రజల్ని అడగగా, “వీనిని వద్దు బరబ్బాను విడుదల చేయుము” అన్నారు. మత్తయి 27 : 17; యోహాను 18 : 40. ” ఆయన యందు ఏదోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను చేసికొనిపోయి సిలువవేయుడి.” “ఈ నీతిమంతుని రక్తమునుగూర్చి నేను నిరపరాధిని” అన్నప్పుడు “వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక” అన్నారు అ ప్రజలు. యోహాను 19 : 6; మత్తయి 27 : 24, 25. AATel 32.2

తాము సిలువవేసి చంపింది దేవుని కుమారుడు క్రీస్తునని శిష్యులు లయ్యారు. ప్రజల్లో దృఢవిశ్వాసం హృదయవేదన చోటుచేసుకొన్నాయి. ” వారు ....హృదయములో నొచ్చుకొని సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను” అడిగారు. శిష్యుల బోధ విన్నవారిలో భక్తి పరులైన చిత్తశుద్ధితో విశ్వసిస్తున్న యూదులున్నారు. ప్రసంగికుడి మాటల్లోని శక్తి యేసే నిజమైన మెస్సీయ అని వారిలో దృఢమైన నమ్మకం కలిగించింది. AATel 32.3

” పేతురు -మీరు మారు మనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసే క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మికును మీ పిల్లలకును దూరస్థులందరికిని అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికిని చెందునని చెప్పెను” AATel 32.4

తమను యాజకులు అధికారులు మోసం చేసినందువల్ల తాము క్రీస్తును విసర్జించామని, వారి సలహా కోసం చూసి వారు క్రీస్తును రక్షకుడుగా స్వీకరించాకే తాము క్రీస్తును అంగీకరించాలని వేచి ఉంటుంటే ఆయనను వారు అంగీకరించలేరని నమ్ముతున్న ప్రజల్ని పేతురు హెచ్చరించాడు. ప్రాబల్యంగల ఈ వ్యక్తులు భక్తిపరులుగా పైకి కనిపిస్తున్నప్పటికి లోక భాగ్యాలు లోక ప్రతిష్ఠ వారి ప్రగాఢవాంఛ. AATel 33.1

పరలోకం నుంచి వచ్చిన వెలుగు ప్రభావం కింద క్రీస్తు తన శిష్యులకు వివరించిన లేఖనాలు పరిపూర్ణ సత్యప్రకాశతతో వారి ముందు విశిష్టంగా నిలిచింది. రద్దు పడ్డవాటిని చూడకుండా వారికి అడ్డుగా నిలిచిన తెర తొలగిపోయింది. కనుక వారు క్రీస్తు పరిచర్యను ఆయన రాజ్యస్వభావాన్ని అతి స్పష్టంగా అవగతం చేసుకొన్నారు. రక్షకుని గురించి వారు గొప్ప శక్తితో మాట్లాడగలిగారు. వారు రక్షణ ప్రణాళికను తమ (శ్రోతలకు వివరించినప్పుడు అనేకులు మారుమనసు పొంది విశ్వసించారు. యాజకులు నూరిపోసిన సంప్రదాయాలు మూఢనమ్మకాలు వారి మనసుల్లో నుంచి చెరిగిపోయాయి. ప్రజలు రక్షకుని బోధనల్ని అంగీకరించారు. AATel 33.2

“అతని వాక్యము అంగికరించినవారు బాప్తిస్మము పొందిరి. ఆదినమందు ఇంచుమించు మూడువేలమంది చేర్చబడిరి.” AATel 33.3

క్రీస్తు స్థాపించిన సేవ ఆయన మరణంతో అంతమౌతుందని యూదు నాయకులు ఊహించారు. అది జరగకపోగా వారు ఆశ్చర్యకరమైన పెంతెకొస్తు దిన దృశ్యాన్ని వీక్షించారు. అంతకుముందు ఎన్నడూ బోధించనంత శక్తిమంతంగా శిష్యులు క్రీస్తును బోధించడం వారు విన్నారు. వారి మాటల్ని గుర్తులు మహత్కార్యాలు ధ్రువపర్చాయి. యూదు మతానికి కేంద్రమైన యెరూషలేములో వేలాది ప్రజలు నజరేయుడైన యేసును మెస్సీయాగా విశ్వసించారు. AATel 33.4

విస్తారమైన ఆత్మల పంట నిమిత్తం శిష్యులు విస్మయంచెంది బహుగా ఆనందించారు. ఈ గొప్పపంట తమ కృషి ఫలితమని వారు పరిగణించలేదు. తాము ఇతరుల సేవలో ప్రవేశిస్తున్నామని వారు గుర్తించారు. ఆదాము పాపంలో పడ్డనాటి నుంచి తన వాక్యవిత్తనాన్ని మానవ హృదయాల్లో విత్తడాన్ని తాను ఎంపిక చేసుకొన్న సేవకులకు క్రీస్తు అప్పగిస్తూ వచ్చాడు. ఈ భూమిపై ఆయన నివసించినకాలంలో క్రీస్తు సత్యవిత్తనం నాటి తన రక్తంతో దాన్ని తడిపాడు. పెంతెకొస్తు నాడు విశ్వసించి బాప్తిస్మం పొందినవారు ఈ విత్తనం పండిన పంటే. అది క్రీస్తు పండించిన పంట. ఆది ఆయన బోధలో ఉన్న శక్తిని వెల్లడిస్తున్నది. AATel 33.5

అపొస్తలుల వాదన స్పష్టంగా హేతుబద్ధంగా ఉన్నప్పటికీ ఎంతో నిదర్శనను ఎంతో కాలంగా తోసిపుచ్చుతూ కొనసాగుతున్న ప్రతికూలాభిప్రాయాన్ని అదొక్కటే తొలగించేది కాదు. అయితే ఆ వాదనలు మనసులకు గ్రాహ్యమయ్యేందుకుగాను పరిశుద్ధాత్మ వాటిని శక్తితో నింపాలి. అపొస్తలులు చెప్పిన మాటలు సర్వశక్తుని బాణాల్లా పనిచేసి మహిమ ప్రభువును విసర్జించి సిలువవేయడంలో తాము చేసింది నేరమన్న గుర్తింవు పశ్చాత్తాపం వుట్టించాయి. AATel 33.6

క్రీస్తు శిక్షణ నడుపుదల కింద ఉన్న శిష్యులు పరిశుద్ధాత్మ అవసరాన్ని గుర్తించారు. . పరిశుద్ధాత్మ బోధన ద్వారా చివరి అర్హత అందుకొని వారు తమ జీవిత కర్తవ్య నిర్వహణకు బయలు దేరారు. ఇకవారు అజ్ఞానులు సంస్కారం లేనివారు కాదు. ఇకవారు స్వతంత్ర సంస్థల సముదాయంగాని పరస్పర విరుద్ధభావాలు గల వ్యక్తుల కూటమిగాని కాదు. ఇకవారి ఆశలు లోక ప్రతిష్ఠపై లేవు. వారు ” ఏకమనస్కులై” ” ఏక హృదయమును ఏకాత్మగలవారై యుండిరి.” అ. కా. 2 : 46; 4 : 32. వారి మనసుల్ని తలంపుల్ని క్రీస్తే నింపాడు. ఆయన రాజ్యవ్యాప్త వారి ధ్యేయం. మానసికంగాను ప్రవర్తన విషయంలోను వారు తమ నాయకుణ్ని పోలిఉన్నారు. మనుషులు “వారు యేసుతోకూడ ఉండిన వారని గుర్తెరిగిరి.” అ. కా 4 : 13. AATel 34.1

పెంతెకొస్తు వారికి పరలోక కాంతిని తెచ్చింది. క్రీస్తు తమతో ఉన్న కాలంలో తాము గ్రహించ లేకపోయిన సత్యాన్ని ఇప్పుడు వారు గ్రహించారు. గొప్ప విశ్వాసం వారిలో చోటుచేసుకొంది. ప్రగాఢ భక్తితో పరిశుద్ధ వాక్యబోధల్ని వారు అంగీకరించారు. మానవరూపం ధరించినా నిజానికి ఆయన మెస్సీయా అని నమ్మారు. ఆ నమ్మకంతోను దేవుడు తమతో ఉన్నాడన్న దృఢ విశ్వాసంతోను తమ అనుభవాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రజలకు చాటారు. AATel 34.2

యేసును గూర్చి వారు నిశ్చయతతో మాట్లాడగలిగారు. ఆయన వారికి స్నేహితుడు సహోదరుడు గదా. క్రీస్తుతో ఆత్మీయత ఏర్పడగా ఆయనతో ప్రకృతిలోని సుందరమైన స్థలాల్లో కూర్చొనేవారు. ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు మంట రగిలించే భాషతో భావాలు వ్యక్తం చేసేవారు. వారి హృదయాలు ప్రగాఢమైన ఉదారతతో దయాళుత్వంతో నిండి క్రీస్తు రక్షణ శక్తిని గూర్చి సాక్ష్యమివ్వడానికి దిగంతాల వరకు వెళ్లడానికి వారికి బలవంతం చేశాయి. ప్రభువు ప్రారంభించిన పరిచర్యను కొనసాగించాలన్న ఆశ వారిలో ప్రబలమయ్యింది. దేవునికి తాము రుణపడి ఉన్నామని ఆయన సేవచేసే బాధ్యత తమ కున్నదని వారు గుర్తించారు. పరిశుద్ధాత్మ వరంతో బలో పేతులై సిలువ విజయాల్ని చాటించడానికి ఉత్సాహంతో ముందంజ వేశారు. పరిశుద్దాత్మ వారిని చైతన్యపరిచి వారి ద్వారా మాట్లాడాడు. వారి ముఖాల పై క్రీస్తు సమాధానం ప్రకాశించింది. ఆయన సేవకు వారు తమ్ముతాము అంకితం చేసుకొన్నారు. తాము ఎవరికి అంకితమయ్యారో ఆ ప్రభువుపోలికలు వారి ముఖాల్లో కనిపించాయి. AATel 34.3