మహా సంఘర్షణ

11/43

అధ్యాయం 10—జర్మనీలో సంస్కరణ ప్రగతి

లూథర్ అర్ధాంతరంగా కనిపించక పోవటం జర్మను ప్రజలందరికి దిగ్భాంతి కలిగించింది. ఆయనను గూర్చి ఆరాతీయటం అన్ని చోట్ల వినబడుతున్నది. రకరకాల పుకార్లు పుట్టాయి. ఆయన హత్యకు గురి అయ్యాడని పలువురు నమ్మారు. లూథర్ మిత్రులేకాక దిద్దుబాటును బాహాటంగా సమర్థించని వేలాదిమంది ప్రజలు బహుగా విలపించారు. ఆయన మరణానికి బాధ్యులైన వారిపై పగ తీర్చుకొంటామని అనేకమంది ఒట్టు పెట్టు కొన్నారు. GCTel 165.1

తమపై రేగుతున్న ప్రజాదరణను చూసి రోము నేతలు భయకంపితులయ్యారు. లూథర్ మరణించాడన్న వార్త విని మొదట్లో సంతోషించినప్పటికీ పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం నుంచి దాగి ఉండటానికి వారు ప్రయత్నించారు. తమ మధ్య ఉన్నప్పుడు ఆయన చేసిన అతిసాహస కార్యాల విషయంలో వారికి కలిగిన ఆందోళన ఇప్పుడు ఆయన లేనందువల్ల వారి మనసుల్ని తొలుస్తున్న ఆందోళనంత తీవ్రమైందికాదు. గుండె ధైర్యం గల ఈ సంస్కర్తను తమ కోపంలో మట్టుపెట్టజూసిన వారు ఇప్పుడాయన నిస్సహాయుడైన బందీ అవటంతో భయాందోళనలకు గురి అయ్యారు. “మనల్ని మనం కాపాడుకోటానికి ఒకే మార్గముంది. అదేంటంటే దివిటీలు వెలిగించుకొని లూథర్ కోసం ప్రపంచమంతా గాలించి ఆయన కావాలని కోరుతున్న ప్రజల ముందు ఆయనను నిలపటమే” అన్నాడొక వ్యక్తి- డి బెనీ, పుస్త 9, అధ్యా 1. చక్రవర్తి శాసనం అధికారం చచ్చిపడి ఉన్నట్లు కనిపించింది. లూథర్ క్షేమానికున్న ప్రాధాన్యం చక్రవర్తి శాసనానికి లేసందుకు పోపు ప్రతినిధులు ఆగ్రహంతో కుతకుతలాడుతున్నారు. GCTel 165.2

బందీగా ఉన్నా ఆయన క్షేమంగా ఉన్నాడన్న వార్త ప్రజల భయాంధోళనలను తొలగించింది. ఆయన పట్ల ప్రజల మక్కువను ఉత్సాహాన్ని పెంపుచేసింది. ఆయన రచనల్ని ప్రజలు మరింత ఆతృతతో ఆసక్తితో చదివారు. అన్ని భయంకర అననుకూల పరిస్థితులను ఎదుర్కొని దైవ వాక్యాన్ని పరిరక్షించిన వీరుడైన లూథర్ దిద్దుబాటు విశ్వాసాన్ని అనేకవుంది అంగీకరించారు. సంస్కరణ దినదిన ప్రవర్ధమానం చెందుతున్నది. లూథర్ నాటిన విత్తనాలు అన్ని చోట్లా మొలకలెత్తాయి. ఆయన ఉండటం వల్ల సాధించగలిగి ఉండే దానికన్నా ఆయన లేనందువల్ల ఎంతో ఎక్కువ సాధించటం జరిగింది. ఇప్పుడు తమ మహానేత లేడు గనుక ఆయన ఇతర సహచరులు కొత్త బాధ్యతను తమ భుజాలమీద వేసుకొన్నారు. GCTel 165.3

అంత ఉదాత్తాశయాలతో ప్రారంభమైన సేవకు ఆటంకాలు ఏర్పడ కుండేందుకుగాను శాయశక్తుల కృషి సల్పటానికి నూతన విశ్వాసంతో నూతనోత్సాహంతో వారు ముందుకు నడిచారు. GCTel 166.1

కాగా సాతాను మౌన ప్రేక్షకుడిగా ఉండిపోలేదు. ప్రతీ సంస్కరణోద్యమంలోనూ ఏమైతే చేసేందుకు ప్రయత్నించాడో, దాన్నే ఈ ఉద్యమంలోను చేయటానికి పూనుకొన్నాడు. అదేమిటంటే యధార్ధమైన దాని స్థానంలో నకిలీ ప్రజలకు అంటగట్టి తద్వారా వారిని మోసంచేసి నాశనం చేయటం. మొదటి శతాబ్దంలోని సంఘంలో అబద్ద క్రీస్తులు బయలు దేరినట్లు, పదహారో శతాబ్దంలో అబద్ద ప్రవక్తలు బయలుదేరారు. GCTel 166.2

మతపరంగా అమితోద్రేకం పొందిన కొందరు వ్యక్తులు దేవుని వద్ద నుంచి తాము ప్రత్యేక ఉపదేశాన్ని పొందామని ఊహించుకొని లూథర్ మొదలు పెట్టిన దిద్దుబాటు బలహీనంగా ప్రారంభమయ్యిందని దాన్ని కొనసాగించి ముగించటానికి తమకు దేవుడు ఆదేశమిచ్చాడని ఉద్ఘాటించారు. నిజానికి లూథర్ చేసిన పనిని వారు ధ్వంసం చేస్తున్నారు. విశ్వాసానికి ఆచరణకు దైవ వాక్యమే సమగ్రమైన ప్రమాణం అన్న సంస్కరణ సూత్రాన్ని వారు తోసిపుచ్చారు. నిర్దుష్టమైన పరిశుద్ధ గ్రంధం బడులు మార్పులకు చేర్పులకు అవకాశమున్న తమ మనోభావాలు అభిప్రాయాలతో కూడిన అనిశ్చత ప్రమాణాన్ని ప్రత్యామ్నాయంగా ఉంచారు. తప్పులను అబద్దాలను తెలిపే గొప్ప సాధనాన్ని పక్కన పెట్టడం ద్వారా మనసులను తన ఇష్టానుసారంగా అదుపు చేయటానికి ఇలా సాతానుకి మార్గం సుగమ మయ్యింది. GCTel 166.3

ఈ ప్రవక్తలలో ఒకడు గాబ్రియేలు దూతవద్ద నుంచి తనకు ఉపదేశం వచ్చిందని ప్రకటించాడు. అతడితో ఏకమైన ఒక విద్యార్ధి దైవ వాక్యాన్ని విశదీకరించటానికి దేవుడు తనకు వివేకాన్నిచ్చాడని ప్రకటించాడు. స్వాభావికంగా మతమూఢులైన మరికొందరు వారితో చేతులు కలిపారు. ఈ ఔత్సాహికుల కార్యకలాపాలు అంతులేని ఉద్రేకాన్ని సృష్టించాయి. లూథర్ బోధనల వల్ల ప్రజలు మేల్కొని దిద్దుబాటు ఆవశ్యకతను గుర్తించారు. ఇప్పుడు నిజాయితీ పరులైన కొందరు ఈ నూతన ప్రవక్తల టక్కరి బోధలు నమ్మి తప్పుదారి పట్టారు. GCTel 166.4

ఈ ఉద్యమ నాయకులు తిన్నగా విట్బెర్గ్ వెళ్లి మెలం తన్ ఆయన సహచరులను కలిసి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ‘మేము మీకు ఉపదేశించటానికి దేవుడు పంపగా వచ్చాం. మేము ప్రభువుతో సన్నిహిత సంభాషణలు జరిపాం. ఏమి సంభవించబోతున్నదో మాకు తెలుసు. మేము అపోస్తలులం, ప్రవక్తలం, డాక్టర్ కి మేము విజ్ఞప్తి చేస్తున్నాం” అన్నారు. అదే పుస్తకం, పుస్త 9, అధ్యా 7. GCTel 167.1

సంస్కర్తలు విస్మయం చెందారు. గాభరాపడ్డారు. ఇలాంటి పరిస్థితిని ముందెన్నడూ ఎదుర్కోలేదు. వారికి ఏం చేయాలో తోచలేదు. మెలంగ్ తన్ ఇలా అన్నాడు, “ఈ మనుషుల్లో అసాధారణ ఆత్మలున్నాయి. అయితే అవి ఎలాంటి ఆత్మలో... ఇకపోతే దేవుని ఆత్మను ఆర్పకుండా అదే సమయంలో సాతాను ఆత్మ మనల్ని తప్పుదారి పట్టించకుండా మనం ఆచితూచి వ్యవహరించాలి.” - అదే పుస్తకం, పుస్త 7, అధ్యా 7. GCTel 167.2

ఈ నూతన బోధన ఎలాంటిదో త్వరలోనే బయలుపడింది. ప్రజలు బైబిలుని అలక్ష్యం చేశారు లేదా పూర్తిగా పక్కన పెట్టారు. విద్యాలయాల్లో అస్తవ్యస్త పరిస్థితి రాజ్యమేలింది. విద్యార్థులు అడ్డు ఆపు లేకుండా వ్యవహరించి చదువు సంధ్యలు మాని విశ్వవిద్యాలయం విడిచి వెళ్లిపోయారు. సంస్కరణ కృషిని పునరుద్ధరించి అదుపుచేయగలమని భావించిన వ్యక్తులు ఆ కృషిని నాశనం అంచుకు తెచ్చారు. ఇప్పుడు రోము మతవాదుల్లో ఆత్మ విశ్వాసం వెల్లివిరిసింది. “ఒక చివరి పోరాటం. ఆ తర్వాత అంతామనదే” అంటూ భుజాలు చరుచుకొన్నారు. అదే పుస్తకం, పుస్త 9, అధ్యా 7. GCTel 167.3

వార్ట్ బర్గ్ లో ఉన్న లూథర్ ఏం జరిగిందోనని ఇలా వాపోయాడు, “సాతాను ఈ ప్లేగును మన మీదకు పంపుతాడని నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. ” అదే పుస్తకం, పుస్త 9, అధ్యా 7. ప్రవక్తలుగా నటిస్తున్న ఆ వ్యక్తుల నిజ స్వభావాన్ని దానివల్ల సత్యానికి ఏర్పడుతున్న ప్రమాదాన్ని ఆయన చూడగలిగాడు. పోపు చక్రవర్తి ఇద్దరూ తనను వ్యతిరేకించినప్పుడు సైతం ఇప్పుడు గురి అయినంత ఆందోళనకు సంతాపానికి ఆయన గురికాలేదు. దిద్దుబాటు మద్దతు దారులము అని చెప్పుకొనేవారిలో నుంచే బద్ద విరోధులు బయలుదేరారు. లూథర్ కి అమితానందాన్ని గొప్ప ఆదరణను తెచ్చిన సత్యాలే సంఘంలో కలహాలు గందరగోళం రేపటానికి ఉపయుక్తమవుతున్నాయి! GCTel 167.4

సంస్కరణ కృషిలో లూథర్ పురోగమించటానికి ప్రోత్సహించింది ఆయన అనంతరం ఆ స్ఫూర్తిని కొనసాగించింది దేవుని ఆత్మే. ఆ రీతిగా వ్యవహరించాలన్నదిగాని, లేదా అలాంటి తీవ్రమైన మార్పులు చేయాలన్నదిగాని ఆయన ఉద్దేశం కాదు. సర్వశక్తుని చేతిలో ఆయన కేవలం ఒక సాధనం మాత్రమే. అయినా తన కృషి ఫలితాన్ని గురించి తరచు భయపడూ వుండేవాడు. ఆయన ఒకసారి ఇలా అన్నాడు, “నా సిద్ధాంతం ఒక్క మనిషిని, ఒక్కడంటే ఒక్కణ్ణి, నొప్పించిందని నాకు తెలిస్తే - అది నొప్పించటం జరిగి ఉండదు ఎందుకంటే అదే సువార్త - దాన్ని ఉపసంహరించుకోకపోడమేగాక పదిసార్లు మరణించటానికైనా నేను సిద్ధమే.” - అదే పుస్తకం, పుస్త 9, అధ్యా 7. GCTel 168.1

సంస్కరణకు కేంద్రమైన విట్బెర్గ్ మత మౌఢ్యం, అశాంతి, ప్రాబల్యానికి సులభంగా లొంగుతున్నది. ఈ దారుణ పరిస్థితి లూథర్ బోధనల వల్ల ఏర్పడినది కాదు గాని, ఆయన ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నది మాత్రం అదే. ఆయన గొప్ప వేదనతో కొన్ని సార్లు ఇలా ప్రశ్నించుకోనేవాడు, ” ఈ దిద్దుబాటు మహాకార్యం, ఇలా అంతం కావటం సాధ్యమా?” - అదే పుస్తకం, పుస్త 9, అధ్యా 7. మళ్లీ దేవునితో ప్రార్థనలో పోరాడగా ఆయన హృదయంలో శాంతి నెలకొన్నది. “దేవా ఈ కార్యం నాది కాదు, నీది, ఇది మూఢనమ్మకం వల్ల, మత మౌడ్యం వల్ల భ్రష్టమవ్వటం నీవు సహించవు” అని ప్రార్ధించాడు. అయితే ఈ పోరాటానికి దూరంగా ఉండటమన్న ఆలోచన సమర్థనీయం కాదని నమ్మాడు. తిరిగి విట్బెర్గ్ కు వెళ్లాలని నిశ్చయించుకొన్నాడు. GCTel 168.2

ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రమాధభరితమైన ఆ ప్రయాణం మొదలు పెట్టాడు. ఆయనపై చక్రవర్తి నిషేధాజ్ఞ ఉన్నది. తన ప్రాణాల్ని తీయటానికి ఆయన శత్రువులకు స్వేచ్చ ఉన్నది. మిత్రులు ఆయనకు సాయమందించటంగాని ఆశ్రయ మీయటంగాని నిషిద్ధం. ఆయన బోధనలను అనుసరించే వారి సందర్భంలో సామ్రాజ్య ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టబోతున్నది. ఇలా ఉండగా సువార్త కర్తవ్యం ప్రమాద స్థితిలో ఉన్నదని లూథర్ గుర్తించాడు. సత్యం కోసం పోరాటం సల్పటానికి ప్రభువు నామాన నిర్భయంగా ముందుకు సాగాడు. GCTel 168.3

వార్ట్ బర్గ్ విడిచి పెట్టటంలో తన ఉద్దేశాన్ని వివరిస్తూ ఓటరుకి రాసిన ఉత్తరంలో లూథర్ ఇలా అన్నాడు, “సామంతరాజులు, ఓటర్ల పరిరక్షణను మించిన సంరక్షణ కింద నేను విట్బెర్గ్ కి వెళ్తున్నానని గౌరవనీయులైన మీకు ఇందుమూలంగా తెలియజేస్తున్నాను. తమరి మద్దతును నేను కోరటంలేదు. తమరి పరిరక్షణను ఆశించటంలేదు. ఆ మాటకొస్తే నేనే తమరిని కాపాడగలను. తమరు నన్ను పరిరక్షిస్తారని నాకు ముందే తెలిసివుంటే నేను విట్బెర్గ్ కి పయనమయ్యేవాణ్ణి కాదు. సంస్కరణ కార్యాన్ని పురోగమింపజేసే ఖడ్గం మరెక్కడాలేదు. మానవ సహాయంగాని మనుషుల సమ్మతిగాని లేకుండా దేవుడొక్కడే అంతా నిర్వహించాల్సి ఉన్నాడు. ఎవరికి గొప్ప విశ్వాస ముంటుందో అతడే సంరక్షించటానికి అతిసమర్దుడు” - అదే పుస్తకం, పుస్త 9, అధ్యా 8. GCTel 168.4

విటన్బర్గ్ వెళ్తున్నప్పుడు మార్గంలో లూథర్ మరోలేఖ రాశాడు. అందులో ఇంకా ఇలా అన్నాడు, “తమరి అసంతృప్తిని లోక ప్రజల ఆగ్రహాన్ని భరించటానికి నేను సిద్ధంగా ఉన్నాను. విట్బెర్గ్ ప్రజలు నా మంద కారా? వారిని దేవుడు నాకు అప్పగించలేదా? వారి నిమిత్తం అవసరమైతే నన్ను నేను బయలుపర్చుకొని మరణానికి సైతం తెగించాలికదా? పైగా మన దేశాన్ని శిక్షించేందుకు దేవుడు పంపే భయంకర విస్పోటం చూడటం నాకిష్టంలేదు.” - అదే పుస్తకం, పుస్త 9, అధ్యా 7. GCTel 169.1

గొప్ప జాగరూకత వినమ్రతలతో, కాని నిశ్చయత, దృఢత్వంతో ఆయన తన కార్యసాధనకు పూనుకొన్నాడు. ఆయన ఇలా హితవు పలికాడు, “దౌర్జన్యంతో నెలకొల్పిన దాన్ని మనం వాక్యంతో నాశనం చేయాలి. మూఢనమ్మకాలుగల వారిని విశ్వసించని వారిని లొంగదీసుకోటానికి నేను ఒత్తిడి ఉపయోగించను. ఎవర్నీ ఒత్తిడి చేయకూడదు. స్వేచ్ఛ విశ్వాసం సారాంశం. “. అదే పుస్తకం, పుస్త 9, అధ్యా 8. GCTel 169.2

లూథర్ తిరిగి వచ్చాడని ఆయన ప్రసంగించబోతున్నాడని విట్బెర్గ్ నగరంలో ప్రజలు మాట్లాడుకొంటున్నారు. ప్రజలు అన్ని చోట్ల నుంచి వచ్చారు. దేవాలయం శ్రోతలతో కిటికిటలాడింది. ప్రసంగ వేదిక ఎక్కి గొప్ప విజ్ఞతతో ఉపదేశాన్ని, హితవును, గద్దింపును లూథర్ సున్నితంగా అందించాడు. మాసను రద్దుచేసిన సందర్భంగా కొందరు దౌర్జన్యానికి దిగటం గురించి ఆయన ఇలా అన్నాడు: GCTel 169.3

“మాస్ మంచిదికాదు. దేవుడు దానికి వ్యతిరేకి. అది రద్దవటం మంచిదే. ప్రపంచమంతట దాని స్థానే సువార్త రాత్రి భోజనం అమలు కావాలని నా ఆకాంక్ష. అయితే దాన్ని విడిచిపెట్టుమని ఎవరినీ ఒత్తిడి చేయకూడదు. ఆ విషయాన్ని దేవుని చేతుల్లో ఉంచుదాం. ఆయన వాక్యమే పని చేయాలి. మనం కాదు. ఎందుకు అని మీరు ప్రశ్నించవచ్చు. ఎందుకంటే కుమ్మరి మన్నును తన చేతిలో ఉంచుకొన్నట్లు మనుషుల హృదయాల్ని నేను నా చేతిలో ఉంచుకోను. మనకు మాట్లాడే హక్కున్నది. సరిచేసేందుకు వ్యవహరించే హక్కులేదు. బోధించటమే మన పని. తక్కిన పని దేవునిది. ఒత్తిడి చేస్తే నాకు ఒరిగేదేమిటి? వెక్కిరింత, అమర్యాద, అనుకరణ, మానవ ఆచారాలు, కాపట్యమే కాని... చిత్తశుద్ధి, విశ్వాసం, దాతృత్వం ఉండవు. ఈ మూడు లో పిస్తే అన్నీ లోపిస్తాయి. అలాంటి ఫలితానికి పూచికపుల్ల పాటి విలువకూడా ఇవ్వను. నీవు నేను ప్రపంచ ప్రజలందరూ కలసి సాధించేదానికన్న అధికంగా తన వాక్యం ద్వారా దేవుడు సాధిస్తాడు. దేవుడు హృదయాన్ని కోర్టున్నాడు. హృదయాన్ని సంపాదించినప్పుడు సర్వాన్ని సంపాదించినట్లే... GCTel 169.4

నేను బోధిస్తాను, చర్చిస్తాను, రాస్తాను. కాని నేనెవ్వరినీ ఒత్తిడి చేయను. విశ్వాసం స్వచ్ఛంద కార్యం . నేను ఏం చేశానో చూడండి. నేను పోపుకు, పాపక్షమాపణలకు, పోపుమత వాదులకూ వ్యతిరేకంగా నిలబడ్డాను - దౌర్జన్యంగాని, అల్లరిగాని లేకుండా. దేవుని వాక్యాన్ని ప్రజల ముందు పెట్టాను. ప్రసంగం చేశాను. పుస్తకాలు పత్రికలు రాశాను. నేను చేసిందింతే. అయినా నేను బోధించిన వాక్యం నేను నిద్రిస్తూ ఉన్నప్పుడు పోపు అధికారాన్ని కూలదోసింది. అది సామంతరాజులు చక్రవర్తి ఎన్నడూ చేయలేనంత హాని. అయినా నేను చేసిందేమీలేదు. వాక్యమే అంతా చేసింది. నేను దౌర్జన్యం చేయాలని కోరి ఉంటే జర్మనీ దేశం యావత్తు రక్తసిక్త మయ్యేది. దాని ఫలితం ఏమై ఉండేది? శరీరానికి ఆత్మకు వినాశనం కలిగేది. కనుక నేను మౌనంగా ఉండిపోయాను. లోకంలో ఒంటరిగా సంచరించటానికి వాక్యాన్ని విడిచిపెట్టాను ” అదే పుస్తకం, పుస్త 9, అధ్యా 8. GCTel 170.1

వినాలని ఆశతో సమావేశమైన ప్రజలకు ఒక వారం పాటు లూథర్ ప్రసంగించాడు. ఛాందసవాద ఆవేశాన్ని దైవ వాక్యం నిర్మూలించింది. తప్పుదారి పట్టిన ప్రజలు సువార్త ప్రభావం వల్ల సత్య మార్గంలోకి మళ్లీ వచ్చారు. GCTel 170.2

తమ కార్య కలాపాల ద్వారా అమితమైన చెడుకు బాధ్యులైన మత మూఢులను నిలదీసే అభిప్రాయం లూథర్ కి లేదు. వారు విజ్ఞతలో కొరవడ్డవారు. అడ్డు ఆపు లేని ఆవేశపరులు. తమకు దేవుడు ప్రత్యేకమైన ఉత్తేజం అనుగ్రహించినట్లు చెప్పుకొంటున్న వారు, చిన్న ప్రతి కూలతను కూడా సహించరని, ప్రేమ పూర్వకమైన గద్దింపును గాని, హితవునుగాని స్వీకరించరని ఆయన ఎరుగును. తమకు సర్వాధికారం ఉన్నదని చెప్పుకొంటూ తాము చెబుతున్న దాన్ని ప్రజలందరూ ఎలాంటి ప్రశ్నలు లేకుండా అంగీకరించాలని వారు ఆదేశించారు. ఇలాగుండగా వారు తనతో సమావేశాన్ని కోరారు గనుక వారిని కలుసుకోటానికి లూథర్ అంగీకరించాడు. వారి మోసాలను కపటవర్తనను ఆయన విజయవంతంగా ఎండగట్టినందువల్ల ఆ వంచకులు విట్బెర్గ్ నుంచి వెళ్లిపోయారు. GCTel 170.3

మత మౌఢ్యం కొంత కాలం వరకు అదుపులో ఉన్నదిగాని కొన్ని ఏళ్ల అనంతరం మరింత దౌర్జన్యంతో, మరింత భయంకర పర్యవసానాలతో మళ్లీ దర్శనమిచ్చింది. ఈ ఉద్యమ నేతల గురించి లూథరిలా అన్నాడు, “వారికి పరిశుద్ధ లేఖనాలు గమ్యం చేరని ఉత్తరం లాంటివి. అయినా వారు ‘ఆత్మ, ఆత్మ’ అంటూ కేకలు పెట్టటం మొదలు పెట్టారు. ఇది మాత్రం ఖాయం. వారిని తమ ఆత్మ తీసుకువెళ్లే తాపుకి నేను మాత్రం వెళ్లను బాబో! పరిశుదులు తప్ప ఇంకెవరూ ఉండని సంఘం నుంచి ఆ కృప గల దేవుడే నన్ను కాపాడాలి. తమ పాపాలు గుర్తెరిగి హృదయవేదనతో దేవుని ఓదార్పు కోసం మద్దతు కోసం హృదయ పూర్వకంగా నిత్యమూ ప్రలాపించే దీనులు, బలహీనులు, వ్యాధిగ్రస్తులతో నివసించటానికి నేను కోరుకుంటున్నాను”. అదే పుస్తకం, పుస్త 10, అధ్యా 10. GCTel 171.1

తామస్ మస్టర్ క్రియాశీలక మతోన్మాది. అతడు సామర్థ్యంగల వ్యక్తి. ఆ సామర్థ్యాన్ని సరైన మార్గంలో ఉపయోగించి ఉంటే ఎంతో మంచి చేయటానికి అతడికి అది తోడ్పడి ఉండేది. కాని యధార్ధమైన మతం ప్రాథమిక సూత్రం అతడికి పట్టుబడలేదు. “లోకాన్ని సంస్కరించాలన్న ఆకాంక్ష అతడిలో బలంగా ఉంది. కాని ఇతర ఔత్సాహికులమల్లే అతడు కూడా సంస్కరణ తనతోనే ప్రారంభం కావాలన్న విషయం విస్మరించాడు.” అదే పుస్తకం, పుస్త 9, అధ్యా 8. అతడు హోదా కోసం, పలుకుబడి కోసం వెంపర్లాడూ ఆఖరికి లూథర్ తో కూడా రెండోవ్యక్తిగా పని చేయటానికి ఇష్టపడలేదు. పోపు అధికారానికి బదులు లేఖనాల అధికారాన్ని ప్రభోధించటం ద్వారా సంస్కరణ వాదులు వేరే రకమైన పోపు గిరిని స్థాపిస్తున్నారని మనర్ అభిప్రాయపడ్డాడు. నిజమైన దిద్దుబాటును ప్రవేశపెట్టేందుకు దేవుడు స్వయాన తననే ఎంపికచేసుకొన్నాడని అతడు చెప్పుకొన్నాడు. ” ఈ స్పూర్తి ఉన్న వాడు తన జీవితంలో ఎన్నడూ లేఖనాలను చూడకపోయినప్పటికీ నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉంటాడు.” అని మజర్ అనేవాడు. - అదే పుస్తకం, పుస్త 10, అధ్యా 10. GCTel 171.2

మతమూఢులైన ఈ ప్రబోధకులు తమ అభిప్రాయాలకే ప్రాధాన్యాన్నిచ్చారు. తమకు కలిగే ప్రతి ఆలోచన ప్రతి ఉద్వేగం దేవుని స్వరమని సమ్మారు. ఫలితంగా వారు తీప్రధోరణులకు ఆకర్షితులయ్యారు. “అక్షరం చంపుతుంది, ఆత్మ జీవింపజేస్తుంది” అంటూ కొందరు తమ బైబిళ్లను తగుల బెట్టారు. వింతలు, అద్భుతాలు కోరే ప్రజలను మస్టర్ బోధన ఆకట్టుకొని మానవ అభిప్రాయాలను భావాలను దైవ వాక్యం కన్న ఉన్నతంగా పరిగణించటం ద్వారా వారి అహంభావాన్ని తృప్తి పరచింది. వేలాదిమంది అతడి సిద్ధాంతాలను నమ్మారు. అతడు కొద్ది కాలంలో బహిరంగారాధనలో క్రమం అన్నది అవసరం లేదని సామంతరాజులకు విధేయత చూపటం దేవునికి బెలియాలుకు ఇద్దరికీ సేవచేయటమేనని ప్రబోధించాడు. GCTel 171.3

పోపు అధికార దాస్య బంధాన్ని తెంచుకోటానికి సిద్ధమౌతున్న ప్రజలు ప్రభుత్వ అధికారుల నియంత్రణతో కూడా విసిగిపోతున్నారు. దేవుడిచ్చాడంటూ మస్టర్ బోధించిన విప్లవాత్మక బోధనలు కట్టుబాట్లను తుంగలో తొక్కి తమ దురభిమానాలను దురహంకారాలను స్వేచ్చగా అవలంబించటాని ప్రజలను నడిపించాయి. అతిఘోరమైన విద్రోహ చర్యలు సంఘర్షణలు చోటుచేసుకొన్నాయి. జర్మనీ దేశం రక్తసిక్తమయ్యింది. మతోన్మాదం వేసిన వెర్రితలలు దిద్దుబాటు పర్యవసానమేనన్న నింద విన్నప్పుడు చాలాకాలం క్రితం ఎఫర్ట్ లో తాననుభవించిన తీవ్రమనస్తాపం కన్నా రెట్టింపు వేదనను లూథర్ అనుభవించాడు. తిరుగుబాటు లూథర్ సిద్ధాంతాలు ఫలించిన ఫలమేనని పోపుమతవాద సామంతరాజులు ఉద్ఘాటించారు. తామున్న మాటల్ని రుజువు చేసేందుకు తాము సిద్ధమని వారిలో చాలా మంది అన్నారు. ఇది నిరాధారమైన ఆరోపణ అయినప్పటికీ ఇది సంస్కర్తకు కలిగించిన వేదన అంతా ఇంతా కాదు. సత్యాన్ని అతి నికృష్టమైన మతమౌఢ్యంతో సమానం చేసి కించపర్చటం ఆయనకు భరించలేని బాధ అయ్యింది. మరో పక్క తిరుగుబాటు నేతలు లూథరిని ద్వేషించారు. ఎందుకంటే ఆయన వారి సిద్ధాంతాలను వ్యతిరేకించటం మాత్రమే కాక వారిని తిరుగుబాటు దారులుగా వర్ణించాడు. తిరిగి వారాయనను నికృష్ట వంచకుడన్నారు. అటు సామంత రాజుల పగను ఇటు ప్రజల వైరుధ్యాన్ని లూథర్ తనపైకి తానే తెచ్చుకొన్నట్లు కనిపించింది. GCTel 172.1

రోమను మత వాదులు ఉత్సాహంతో ఉప్పొంగిపోయారు. దిద్దుబాటు ఉద్యమం త్వరలోనే కుప్పకూలుతుందని నిరీక్షించారు. ఏ దోషాలను, ఏ దురాచారాలను సంస్కరించటానికి లూథర్ చిత్తశుద్ధితో కృషి సల్పాడో వాటికి కూడా లూథరే కారణమని వారు ఆయనపై నింద మోపారు. తమకు తీరని అన్యాయం జరిగిందని తప్పుడు ఆరోపణల ద్వారా మతోన్మాదుల పక్షంలోకి పెక్కుమంది ప్రజల సానుభూతి పొంది - తప్పులో ఉన్నవారి విషయంలో సాధారణంగా జరిగేటట్లు - ప్రజల దృష్టికి వారు హతసాక్ష్యులుగా కనిపించారు అన్నారు. GCTel 172.2

సంస్కరణను వ్యతిరేకించిన వారు ఇలా క్రూరత్వానికి తీవ్ర వ్యతిరేకతకు గురి అయిన బాధితులుగా ప్రజల దయాదరాలను పొందారు. ఇది సాతాను చేసిన పని. దీన్ని ప్రోత్సహించింది మొదట పరలోకంలో ప్రదర్శితమైన తిరుగుబాటు స్వభావమే. GCTel 173.1

మనుషుల్ని మోసగించటానికి సాతాను నిత్యము కృషి చేస్తున్నాడు. పాపాన్ని నీతి అని నీతిని పాపమని పిలవటానికి మనుషుల్ని నడిపిస్తున్నాడు. అతడు సాధిస్తున్న విజయం ఎంత అద్భుతంగా ఉంది! నమ్మకమైన దైవ సేవకులు సత్యాన్ని నిర్భయంగా కాపాడారు. కనుక వారు నిందలకు ఖండన మండనలకు ఎంత తరచుగా గురి అపుతారు! సాతాను ప్రతినిధులైన మనుషులు ప్రశంసలు పొగడ్తలు పొందుతారు. హతసాక్షులుగా కూడా పరిగణన పొందుతారు. అయితే దేవునికి మనసా వాచా కర్మణా సమ్మకంగా ఉన్నందుకు గౌరవాదరాలు మద్దతు పొందవలసిన వారు అనుమానాలు అపనమ్మకాల పడగనీడలో ఒంటరిగా నిలవటం జరుగుతుంటుంది. GCTel 173.2

నకిలీ పరిశుద్ధత కృత్రిమ పవిత్రత తమ వంచన కృషిని సాగిస్తూనే ఉన్నవి. లూథర్ దినాల్లో ప్రజల మనసుల్ని లేఖనాల నుంచి మళ్లించి ధర్మశాస్త్రాన్ని అనుసరించేకన్నా తమ సొంత అభిప్రాయాలను మనోగతాలను అనుసరించటం మేలని ప్రోత్సహించిన స్వభావమే వివిధ రూపాల్లో నేడూ కనిపిస్తున్నది. పవిత్రతను సత్యాన్ని అబాసుపాలు చేయటానికి సాతాను జయప్రదంగా ఉపయోగిస్తున్న పన్నుగడల్లో ఇదొకటి. GCTel 173.3

సువార్త పై అన్ని పక్కల నుంచి జరిగిన దాడుల్ని లూథర్ ధైర్యంగా తిప్పికొట్టాడు. ప్రతి సంఘర్షణలోను సువార్త శక్తిమంతమైన ఆయుధంగా నిరూపించుకొన్నది. దిద్దుబాటుతో జతకట్టజూచిన మతమౌఢ్యానికి వ్యతిరేకంగా బండల్లే స్థిరంగా నిల్చి, పోపు అన్యాయంగా కైవసం చేసుకొన్న అధికారాన్ని, విద్వాంసుల హేతువాదాన్ని వాక్యాయుధంతో ఆయన ప్రతిఘటించాడు. GCTel 173.4

ఈ అంశాల్లో ప్రతి ఒక్కటి తనదైన పద్ధతిలో పరిశుద్ధ లేఖనాల్ని పక్కన పెట్టి మతపరమైన సత్యానికి పరిజ్ఞానానికి మూలంగా మానవ వివేకాన్ని ఘనపర్చింది. హేతువాదం ప్రతిభకు ప్రాధాన్యానిచ్చి వాటిని మతానికి గీటురాయి చేస్తుంది. సర్వాధికారి అయిన తన మతాధినేతకు నేరుగా అపోస్తలుల నుంచి దైవావేశం దిగివచ్చిందని అది ఎన్నడు మారనిదని రోము మతవాదం చెబుతున్నది. ప్రతీ విధమైన దుర్వ్యయాన్ని అవినీతిని అపోస్తుల పవిత్రాదేశం అన్నది వీరికి గొప్ప అవకాశాన్నిస్తున్నది. తమకున్నదని మస్టర్ అతడి అనుచరులు చెప్పుకొంటున్న దైవావేశం. అధికారాన్ని అది మానవాధికారామేగాని, దైవాధికారమేగాని- కూలదోసే ప్రభావాన్ని ప్రసరిస్తుంది. దైవ వాక్యాన్ని ఆవేశపూరిత సత్యానికి నిలయంగా సకల ఆవేశాన్ని నిగ్గుతేల్చే పరీక్షగా క్రైస్తవ మతం స్వీకరిస్తుంది. GCTel 173.5

వార్ట్ బర్గ్ నుంచి తిరిగి వచ్చాక లూథర్ నూతన నిబంధన అనువాదాన్ని పూర్తి చేశాడు. కొద్ది కాలంలోనే జర్మనీ దేశ ప్రజలకు సువార్త తమ భాషలో లభ్యమయ్యింది. సత్యాన్ని ప్రేమించిన వారంతా ఈ అనువాదాన్ని అమితానందంతో అందుకున్నారు. కాగా మానవ సంప్రదాయాలను మనుపమాత్సల ఆదేశాలను ఎంపిక చేసుకొన్న వారు దాన్ని అవహేళనచేసి తిరస్కరించారు. ఇక సామాన్యులు దైవవాక్యాంశాలను తమతో చర్చించే సామర్థ్యాన్ని కలిగి ఉంటే, ఆ విధంగా తమ అజ్ఞానం బట్టబయలవుతుందన్నది ప్రీస్టుల గుండెల్లో గుబులు పుట్టింది. వారి ఐహిక వాదనాస్త్రాలు వాక్యమనే ఆత్మఖడ్గం ఎదుట శక్తిలేనివవుతాయి. లేఖనాలు ప్రజలకు అందకుండా చేయటానికి రోము తన సర్వాధి కారాన్ని వినియోగించి ప్రయత్నించింది. డిక్రీలు, నిషేధాలు, హింసాకాండ ఇవేమీ పనిచేయలేదు. రోమును మత వాదులు బైబిలును ఖండించి ఎంత కఠినంగా నిషేధిస్తే అందులోని బోధనలను తెలుసుకోవాలని అంత ప్రగాఢంగా ప్రజలు వాంఛించారు. చదువు వచ్చిన వారందరూ పరిశుద్య వాక్యాన్ని తమకైతాము చదువుకోవాలని ఆశించారు. దైవ గ్రంథాన్ని కూడా తీసుకొని వెళ్లి మల్లీ మళ్లీ చదివి దానితో తృప్తి చెందక లేఖన ఖండాలను కంఠస్థం చేసేవారు. నూతన నిబంధన పొందిన ప్రజాదరణను చూసి లూథర్ వెంటనే పాత నిబంధన అనువాదాన్ని మొదలుపెట్టి పూర్తి చేసిన భాగాలను ఖండికలుగా ప్రచురించాడు. GCTel 174.1

లూథర్ రచనలు పట్టణాల్లోను పల్లెల్లోను ఏకరీతిగా ఆదరణ పొందాయి. “లూథర్ ఆయన సహచరుల రచనల్ని ఇతరులు ప్రచురించారు. ఆశ్రమ నిర్భంధాలు న్యాయ సమ్మతం కావని గుర్తించిన సన్యాసులు తమ సోమరి జీవితాలకు కొంత పని కల్పించాలన్న కోరికతో వాక్యాన్ని ప్రకటించగల జ్ఞానం లేక గ్రామాల్ని, గృహాల్ని సందర్శిస్తూ లూథర్ ఆయన సహచరులు రాసిన రచనల్ని విక్రయిస్తూ పలురాష్ట్రాలు తిరిగారు. గ్రంధ విక్రేతలతో జర్మనీ నిండిపోయింది. GCTel 174.2

గొప్పవారు, బీదవారు, జ్ఞానులు, అజ్ఞానులు అందరూ ఈ రచనల్ని ఆసక్తితో పఠించారు. పల్లెల్లో ఉపాధ్యాయులు, రాత్రులు చలిమంటల చుట్టూ పోగుపడ్డ చిన్న చిన్న గుంపులకు ఆ రచనల్ని గట్టిగా చదివేవారు. ప్రతీ ప్రయత్నం ఫలితంగా కొందరు సత్యాన్ని తెలుసుకొని దాన్ని సంతోషంగా స్వీకరించటం వారు మళ్లీ ఆ శుభవార్తను ఇతరులకు పంచటం జరిగింది. GCTel 175.1

లేఖన వాక్యాల్లోని సత్యం నిరూపితమయ్యింది. “నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును.” కీర్తనలు 119:130. లేఖన పఠనం మనుషుల హృదయాల్లోను మనసుల్లోను గొప్ప మార్పు కలిగిస్తున్నది. పోపు పరిపాలన ప్రజల మీద కఠినమైన భారం మోపింది. ప్రజల్ని అజ్ఞానంలోను అధోగతిలోను ఉంచింది. ఆచారాల ఆచరణ మూఢభక్తితో నిష్టగా సాగేది. కాని ఆ ఆచారాల ఆచరణలో హృదయానికి గాని మనసుకుగాని పాత్ర ఉండేది కాదు. లూథర్ బోధలు దైవ వాక్యంలోని సత్యాన్ని తేటతెల్లం చేసేవి. అంతేగాక సామాన్య ప్రజల అందుబాటులోకి వచ్చిన వాక్యం ప్రజలలో నిద్రావస్థలోవున్న శక్తుల్ని మేలుకొలిపి తద్వారా వారి ఆధ్యాత్మిక స్వభావాన్ని పవిత్రం, ఉదాత్తం చేసి బుద్ధికి శక్తిని చేకూర్చింది. GCTel 175.2

దిద్దుబాటు సిద్ధాంతాలను సమర్ధిస్తూ అన్ని వర్గాల ప్రజల చేతుల్లోను బైబిలు కనిపించింది. లేఖన పఠనాన్ని ప్రీస్టులకు సన్యాసులకు వదిలేసిన పోపునేతలు ఇప్పుడు ఈ నూతన బోధనల్ని ఖండించటానికి ముందుకు రావలసిందిగా వారిని కోరారు. “లేఖన జ్ఞానంగాని, దైవశక్తిగాని లేని ప్రీస్టులు, సన్యాసులు అజ్ఞానులు. సిద్ధాంత వ్యతిరేకులుగా తాము కొట్టి పారేసినవారి చేతిలో పూర్తిగా ఓడిపోయారు. ఇది విచారకరం. లేఖనాల మీద తప్ప మరే యితర మాటలపైన విశ్వాసం ఉంచవద్దని లూథర్ తన అనుచరులకు ఉద్బోధించాడు.” అన్నాడొక కథోలిక్ రచయిత - డి అబినే, పుస్త 9, అధ్యా 11. ఎక్కువ చదువులేని వ్యక్తులు బోధిస్తున్న సత్యాలు వినటానికి, వారు విద్వాంసులు వాక్పటిమగల వేదాంత పండితులతో చర్చించటం వినటానికి ప్రజలు పెద్ద సంఖ్యలో సమావేశమయ్యేవారు. ఖ్యాతిగాంచిన ఈ పెద్ద మనుషుల వాదనలను దైవవాక్య సామాన్య బోధనలతో సమాధానం చెప్పటం జరిగినప్పుడు లజ్జాకరమైన వారి అజ్ఞానం బయలు పడేది. ప్రీస్టులు వేదాంత ఉద్దండుల జ్ఞానంకన్నా శ్రామికులు, సైనికులు, మహిళలు, బాలల లేఖన జ్ఞానం ఎంతో మెరుగుగా ఉండేది. GCTel 175.3

సువార్తను విశ్వసించి అనుసరించే వారికీ పోపుమత మూఢ విశ్వాసానుసారులకూ మధ్య ఉన్న విభిన్నతే సామాన్యుల మధ్య ఆమాటకొస్తే విద్వాంసుల మధ్య కనిపించింది. ప్రాచీన భాషల అధ్యయనాన్ని సాహిత్యకృషిని నిర్లక్ష్యం చేసిన రోము మతవాద ప్రముఖుల వలే కాక... లేఖనాలను అధ్యయనం చేసి పరిశోధించి ప్రాచీన కళా ఖండాలతో పరిచయమున్న యువకులున్నారు. చురుకైన ఆలోచన, ఉన్నతమైన ఆత్మ, వెరపెరుగని హృదయంగల ఈ యువకులు చక్కని పరిజ్ఞానం సంపాదించారు. వారితో ఎవరూ పోటీకి నిలువలేకపోయారు. సంస్కరణ వాదులైన ఈ యువకులు అజ్ఞానులైన రోము మత వాద విద్వాంసులను ఏదైనా సమావేశంలో కలిసినప్పుడు వీరు ఆ విద్యాంసుల్ని సునాయాసంగా అవలీలగా ఎదుర్కొని ఇబ్బంది పరచి అందరిముందు అభాసుపాలు చేసేవారు. ”- అదే పుస్తకం, పు,త 9, అధ్యా 11. GCTel 175.4

తమ సభలు క్షీణించిపోటం గుర్తించిన రోమీయ బోధక వర్గం మేజిస్ట్రేటుల సహకారం ఆర్ధించి వెళ్లిపోయిన సభ్యుల్ని తిరిగి తీసుకురావటానికి శాయశక్తులా ప్రయత్నించారు. అయితే ఈ నూతన బోధనల్లో తమ ఆత్మలు కోరినదాన్ని ప్రజలు పొందారు. ఎంతో కాలంగా ఉన్న మూఢనమ్మకాలిని విడిచి వెళ్లిపోయారు. GCTel 176.1

సత్యప్రబోధకులకు వ్యతిరేకంగా హింసాగ్నులు రగిలినప్పుడు క్రీస్తు చెప్పిన ఈ మాటలను వారు శ్రద్ధగా పాటించారు, వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి.” మత్తయి10:23. వెలుగు అన్ని చోట్లా ప్రవేశించింది. పారిపోయేవారికి ఎక్కడో ఒక అతిధి గృహం తలుపు తెరచుకొనేది. అక్కడ ఉంటూ వారు క్రీస్తును గురించి బోధించారు. కొన్నిసార్లు దేవాలయంలో లేదా అక్కడ ఆ తరుణం లభించక పోతే వ్యక్తిగత గృహాల్లో ఆరుబయట బోధించారు. వారు మాట్లాడటానికి ఎక్కడ తరుణం లభిస్తుందో అదే పరిశుద్ధ దేవాలయం. అంత శక్తితో, అంత నిశ్చయతతో బోధించిన సత్యం అప్రతిహత శక్తితో వ్యాప్తి చెందింది. GCTel 176.2

ఈ సిద్ధాంత వ్యతిరేక బోధనకు అడ్డుకట్ట వేయటానికి మతాధికారులు, రాజకీయ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చెరసాల, హింస, మంటలు, ఖడ్గం వారు ప్రయత్నించిన ఇవేవీ వారికి ఉపయోగపడలేదు. వేలాదిమంది విశ్వాసులు తమ నమ్మకాల కోసం ప్రాణాలు త్యాగం చేశారు. సువార్త కృషి ముందుకు సాగింది. సత్యం పురోగమించటానికి హింస దోహదపడింది. సత్యంతో మతమౌఢ్యాన్ని జోడించటానికి సాతాను చేసిన ప్రయత్నం సాతాను పనికి దేవుని పనికి మధ్యగల భేదాన్ని విస్పష్టం చేయటానికి తోడ్పడింది. GCTel 176.3