మహా సంఘర్షణ

35/43

అధ్యాయం 34—మృతులైన ఆప్తులు మనతో మాట్లాడ గలరా?

లేఖనాల్లో మనం చదువుతున్న పరిశుద్ధ దూతల పరిచర్య క్రీస్తు ను నమ్మే ప్రతి విశ్వాసికి ఎంతో ఆదరణకరమైన, ప్రశస్తమైన సత్యం. అయితే ప్రజాబోధకుల తప్పుడు వేదాంతం ఈ అంశంపై బైబిలు బోధనను వక్రీకరిస్తున్నది. స్వాభావిక అమరత్వ సిద్ధాంతం మొట్టమొదటగా అన్యమత తత్వం నుంచి వచ్చింది. తీవ్ర మతభ్రష్టత జరిగిన చీకటి యుగాల్లో ” చచ్చినవారు ఏమియు ఎరుగరు” అని లేఖనం స్పష్టంగా బోధిస్తున్న సత్యాన్ని మార్చివేశారు. మరణించినవారి ఆత్మలే “రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు” అని ఏవేల ప్రజలు నమ్ముతున్నారు. పరలోక దూతల ఉనికిని గూర్చి మానవ చరిత్రలో మానవ మరణానికి ముందు దూతల సంబంధాన్ని గూర్చిన లేఖన సాక్ష్యం ఉన్నప్పటికీ ఈ నమ్మకం ప్రబలుతున్నది. GCTel 519.1

మరణంలో మానవుడు స్పృహ కలిగి ఉంటాడన్న సిద్ధాంతం ప్రధానంగా మరణించిన వారి ఆత్మలు జీవించి ఉన్నవారికి పరిచారం చేస్తాయన్న నమ్మకం నవీన భూతమత ఆవిర్భావానికి నాంది పలికింది. మరణించినవారు దేవునితోను పరిశుద్ధదూతలతోను నివసించటం, పూర్వం తమకున్న జ్ఞానం కన్నా ఉన్నతమైన జ్ఞానాన్ని కలిగి ఉండటం జరిగితే జీవించి ఉన్న వారిని చైతన్య పర్చేందుకు వారు తిరిగి లోకంలోకి ఎందుకు రాకూడదు? ప్రజా బోధకులు ప్రబోధిస్తున్నట్లు మరణించిన వారి ఆత్మలు లోకంలో నివసిస్తున్న తమ ఆప్తుల చుట్టూ మసలుతూ ఉంటే దుర్మార్గత గురించి వారికి హెచ్చరిక లివ్వటం లేదా దుఃఖంలో ఉన్నప్పుడు వారిని ఓదార్చటం ఎందుకు చేయకూడదు? మరణంలో మానవుడికి స్పృహ ఉంటుంది అని నమ్మేవారు పరిశుద్ధదూతల ద్వారా తమకు వచ్చే దైవోపదేశాన్ని ఎలా నిరాకరించగలుతారు? ఇది పరిశుద్ధంగా పవిత్రంగా కనిపించే సాధనం. దీని ద్వారా సాతాను తన కార్యాన్ని సాధించటానికి చూస్తున్నాడు. సౌతాను ఆజ్ఞను తు.చ. తప్పకుండా పాలించే దుష్ట దూతలు ఆత్మల లోకం నుంచి వచ్చే దూతలుగా అవతరిస్తారు. జీవించి ఉన్నవారు మరణించిన వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపటం సాధ్యపర్చుతానంటూ ఆ నయవంచకుడు వారి మనసులపై తన మంత్రశక్తిని ప్రయోగిస్తాడు. GCTel 519.2

మరణించిన తమ ఆప్తుల రూపాలను మనుషుల ముందుకు రప్పించే శక్తి అతనికి ఉంది. అతను రూపొందించే నకిలీ ముమ్మూర్తుల ఆ చనిపోయిన వ్యక్తిలా ఉంటాడు. అదే రూపం మన ముందుంటుంది. అవే మాటలు, అదే స్వరం మళ్లీ వినిపిస్తాయి. అవి స్పష్టంగా స్వచ్ఛంగా ఉంటాయి. తమ ఆప్తులు పరలోకంలో ఆనందంగా నివసిస్తున్నారన్న హామీ విని అనేకులు ఆదరణ పొందుతారు. ముందున్న ప్రమాదాన్ని గ్రహించకుండా వారు” మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును” లక్షముంచుతారు. GCTel 520.1

తముతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపటానికి మరణించిన తమ ఆప్తులు తిరిగి వస్తారని వారిని నమ్మించి హఠాత్తుగా మరణించినవారు కనిపించేటట్లు సాతాను చేస్తాడు. తాము పరలోకంలో ఎంతో ఆనందంగా నివసిస్తున్నామని, అక్కడ ఉన్నత హోదాల్లో ఉన్నామని కూడా వారు చెబుతారు. నీతిమంతులకు దుర్మార్గులకు మధ్య భేదమేమీ లేదన్న తప్పుడు బోధ ఈ విధంగా సాగుతుంది. ఆత్మల లోకం నుంచి వస్తున్నట్లు నటించే ఆత్మలు నిజమయ్యే హెచ్చరికలను మెళకువలను కొన్నిసార్లు పలుకుతాయి. అనంతరం, నమ్మకం ఏర్పడే కొద్ది లేఖనాలపై ప్రజలకున్న విశ్వాసాన్ని హరించే సిద్ధాంతాలను బోధిస్తాయి. లోకంలో ఉన్న తమ మిత్రులపట్ల అమితాసక్తి ఉన్నట్లు చూపించుకొంటూ మిక్కిలి ప్రమాదకరమైన దుర్బోధలను ప్రవేశపెడ్తాయి. వారు కొన్ని సత్యాలు పలకటం, కొన్ని సార్లు భవిషత్ సంభవాలు ముందే చెప్పగలగటం వల్ల వారి మాటల్లో విశ్వసనీయత ఉన్నట్లు కనిపిస్తుంది. వారి తప్పుడు బోధల్ని వేలాది ప్రజలు అతిపవిత్ర బైబిలు సత్యాలుగా అంగీకరించి భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. దైవ ధర్మశాస్త్రాన్ని తోసిపుచ్చుతారు. కరుణ పుట్టించే ఆత్మను ద్వేషిస్తారు. నిబంధన రక్తాన్ని అపరిశుద్ధంగా పరిగణిస్తారు. ఆ ఆత్మలు క్రీస్తు దేవత్వాన్ని అంగీకరించవు. సృష్టికర్తను సైతం తమతో సమానుడుగా పరిగణిస్తాయి. ఈ తిరుగుబాటు దారుడు పరలోకంలో ప్రారంభించి దాదాపు ఆరువేల సంవత్సరాలుగా భూమిమీద దేవునికి వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటాన్ని ఈ కొత్త వేషంలో కొనసాగిస్తున్నాడు. GCTel 520.2

ఆత్మల ప్రదర్శనలు మోసంవల్ల, సంబంధిత వ్యక్తి హస్త లాఘవం వల్ల జరుగుతున్న పనులని చెప్పటానికి అనేకులు ప్రయత్నిస్తున్నారు. కాని దాని ఫలితాన్ని బట్టి ఆ మోసాన్ని నిజమైన ఆత్మల ప్రదర్శనగా జనులు అంగీకరిస్తుండగా మానవాతీత శక్తి ప్రదర్శనలు కూడా ఉన్నాయి. నవీన భూత మతానికి నాంది పలికిన మర్మపూరిత శబ్దాలు మోసం వల్లగాని జిత్తుల వల్లగాని కలిగినవి కావు. అవి దుష్టదూతల పని ప్రత్యక్ష ఫలితంగా కలిగినవి. ఈ విధంగా దుష్టదూతలు నాశనకరమైన మోసాల్లో ఒక దాన్ని ప్రవేశపెట్టారు. భూతమతం కేవలం మానవ వంచన ఫలితం అన్న నమ్మకం అనేకుల్ని మోసగిస్తుంది. మానవాతీత ప్రదర్శనలుగా కనిపించే ప్రదర్శనలు చోటుచేసుకొన్నప్పుడు అనేకులు మోసానికి గురి అయి దాన్ని దేవుని మహాశక్తిగా అంగీకరిస్తారు. GCTel 521.1

సాతాను అతని ప్రతినిధులు చేసే అద్భుతాల గురించి లేఖనాలు అందిస్తున్న వివరణను ఈ వ్యక్తులు విస్మరిస్తారు. ఫరో మాంత్రికులు దైవకార్యానికి ప్రతిగా నకిలీని సాతాను సహాయంతోనే సాధించగలిగారు. క్రీస్తు రెండోరాకకు ముందు ఇలాంటి సాతాను శక్తి ప్రదర్శనలు చోటుచేసుకొంటాయని పౌలు హెచ్చరిస్తున్నాడు. ప్రభువు రాకకు ముందు లోకం “నానా విధములైన సూచక క్రియలతోను, మహత్కార్యములతోను దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోను” నిండుతుంది. 2 థెస్స 2:9,10. చివరి దినాల్లో ప్రదర్శితం కానున్న సూచక క్రియలు చేసే శక్తిని గురించి ప్రస్తావిస్తూ అపోస్తలుడైన యోహానిలా అంటున్నాడు, “అది ఆకాశము నుండి భూమికి మనుషులయెదుట అగ్ని దిగివచ్చునట్లుగా గొప్ప సూచక క్రియలు చేయుచున్నది... అది తన కియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. “ప్రకటన 13:13,14. ఇక్కడ ప్రవచితమైనవి కేవలం మోసాలు కావు. సాతాను ప్రతినిధులకు సూచక క్రియలు చేసే శక్తి ఉంది. కేవలం నటించటం కాదు. వాటిని బట్టి మనుషులు మోసపోతారు. GCTel 521.2

తన వంచన కళాభివృద్ధికి దీర్ఘకాలంగా తన శక్తులన్నింటినీ ధారబోస్తున్న చీకటిరాజు అన్ని తరగతుల ప్రజలకు పరిస్థితులకు సరిపడే విధంగా నిపుణతతో తన శోధనలను మల్చు కొంటాడు. సంస్కృతి సంస్కారం గల వారికి భూతమతాన్ని సున్నితమైన, మేధకు ఆకర్షణీయమైన రీతిలో అందించి అనేకుల్ని తన ఉచ్చుల్లో జయప్రదంగా బంధిస్తాడు. భూతమతం కలిగించే జ్ఞానం అపోస్తలుడు యాకోబు వర్ణిస్తోన్న ఇలాంటి జ్ఞానం “ఈ జ్ఞానము పై నుండి దిగివచ్చినదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై యున్నది.” యాకోబు 3:15. గోప్యంగా ఉంచటం అవసరమనిపించినప్పుడు ఆ అపూర్వ వంచకుడు దీన్ని గోప్యంగా ఉంచుతాడు. అరణ్యంలో క్రీస్తు శోధన సమయంలో పరలోక దూతలా ప్రకాశిస్తూ తన ముందుకు రాగలిగిన అతను మానవుల వద్దకు వెలుగుదూతగా అత్యాకర్షణీయ రూపంతో రాగలడు. ప్రాధాన్యతగల అంశాల్ని స్పృశిస్తూ మేధావుల్ని ఆకట్టుకొంటాడు. ఆహ్లాదకర దృశ్యాల చిత్రనతో ఆలోచనా ధోరణిని అదుపుచేస్తాడు. GCTel 521.3

ప్రేమానురాగాల గురించి చక్కని వర్ణనలతో ప్రజల ఆదరాభిమానాల్ని చూరగొంటాడు. ఊహల్ని సమున్నత శిఖరాలకు చేర్చి తద్వారా మనుషుల్ని గర్వంతో మత్తెక్కించి వారు దేవున్ని ద్వేషించేటట్లు చేస్తాడు. లోక రక్షకుణ్ణి ఎతైన పర్వతం మీదకు తీసుకువెళ్లి ఈ లోక రాజ్యాల్ని వాటి ప్రాభవాన్ని ఆయన ముందుకు తేగలిగిన సాతాను దైవశక్తితో పరిరక్షితులు కాని మనుషుల్ని తన శోధనలతో వక్రమార్గం పట్టించగలగటం వాస్తవం. GCTel 522.1

పొగడ్త ద్వారా, నిషిద్ధ జ్ఞానాన్ని సంపాదించటానికి, ఆశ రగుల్కొల్పటం ద్వారా, ఆత్మ ఔన్నత్యానికి ఆ కాంక్ష పుట్టించటం ద్వారా, ఏదెనులో అలనాడు అవ్వను మభ్యపెట్టినట్లు నేడు సాతాను ప్రజల్ని మోసగిస్తున్నాడు. ఈ దుష్కృతాల పట్ల వాంఛ సాతాను పతనాన్ని కలిగించింది. వీటి ద్వారానే మానవుల నాశనాన్ని సాధించాలన్నది అతని ధ్యేయం. “మీరు మంచి చెడ్డలను ఎరిగినవారై దేవతలవలె ఉందురు” అన్నాడు సాతాను. “మానవుడు ప్రగతిశీల జీవి అని పుట్టిన నాటి నుంచి ప్రగతి సాధనే అతని కర్తవ్యమని త్రిత్వం స్థాయి సాధనకు నిత్యకాలం పొడవునా కృషి సల్పాలని” భూతమతం బోధిస్తుంది. “ప్రతీ మనసు తన్నుతాను విమర్శించుకోవాలి. ఇతరులెవరు కాదు.” “ఆ విమర్శే సవ్యమైంది. ఎందుకంటే అది ఆత్మవిమర్శ... సింహాసనం నీలోనే ఉంది” అని కూడా బోధిస్తుంది. ఆత్మల స్పృహ తనలో మేల్కొన్నప్పుడు ఒక భూతమత ప్రబోధకుడిలా అన్నాడు, “నా తోటిమానవులందరూ పతనంలేని దేవతలు” ఇంకొక ప్రబోధకుడిలా అన్నాడు, “న్యాయవంతుడు పరిపూర్ణుడు అయిన ఏ వ్యక్తి అయినా క్రీస్తే”. GCTel 522.2

ఇలా పూజార్హుడు నిత్యుడు అయిన దేవుని నీతి పరిపూర్ణతల స్థానే, మానవ క్రియలకు ప్రవర్తనకు యాథార్ధ ప్రమాణమైన పరిపూర్ణ నీతి ధర్మశాస్త్రం స్థానే, పూజనీయమైన ఏకైక వస్తువుగా, విమర్శకు ఏకైక నిబంధనగా లేదా ప్రవర్తనకు ప్రమాణంగా పాప పూరితం, దోషభరితం అయిన మానవ నైజాన్ని సాతాను నిలుపుతున్నాడు. ఇది ప్రగతే- పైకికాదు అధోగతికి. GCTel 522.3

వీక్షించటం ద్వారా మార్పు చెందుతామన్నది మానసికంగాను, ఆధ్యాత్మికంగాను పనిచేసే నియమం. మనసు ఏ అంశాలపై ధ్యానం నిలుపుతుందో క్రమేణ వాటికి అనుకూలంగా మారుతుంది. దీన్ని ప్రేమించటానికి, గౌరవించటానికి మనసు అలవాటుపడుతుందో దాని మాదిరిగా రూపాంతరం చెందుతుంది. పరిశుద్ధత లేదా మంచితనం లేదా సత్యం విషయంలో మానవుడు తనకున్న ప్రమాణాన్ని అధిగమించి పోలేడు. స్వార్ధం తన అత్యున్నత ఆశయమైతే అంతకన్నా ఉన్నతమైనది ఏమున్నా దాన్ని అతను సాధించలేడు. నిజం చెప్పాలంటే అతను నానాటికీ దిగజారిపోతాడు. మానవుడికి ఔన్నత్యాన్నిచ్చేది దేవుని కృపే. తనకు తానుగా వ్యవహరిస్తే మానవుడి గమనం పతన దిశగా సాగక తప్పదు. GCTel 523.1

సంస్కారవంతులు, మేధావులకన్నా స్వార్ధ ప్రియులు, వినోద కాముకులు, సుఖభోగలాలసులు భూతమతానికి ఎక్కువ ఆర్షితులవుతారు. దాని వివిధ అశ్లీల రూపాలు తమ రుచులు అభిరుచులకు సానుకూలంగా ఉన్నట్లు వారు కనుగొంటారు. మానవ నైజంలోని ప్రతీ బలహీనత సూచికను సాతాను అధ్యయనం చేస్తాడు. ప్రతీ వ్యక్తి చేయటానికి అవకాశమున్న పాపాల్ని గుర్తిస్తాడు. ఆ తర్వాత కీడు చేయటానికి కావలసిన అవకాశాలు కొరవడకుండా చూస్తాడు. న్యాయసమ్మతమైన కార్యాచరణలో అతిగా వ్యవహరించటానికి మనసుల్ని శోధించి మితానుభవాన్ని పాటించక పోవటం ద్వారా వారు శారీరకంగా, మానసికంగా ఆధ్యాత్మికంగా బలహీనపడేటట్లు చూస్తాడు. ఆవేశ కావేషాలను రెచ్చగొట్టి తద్వారా మానవుడికి క్రూరప్రవృత్తి అలవర్చి, వేలాది మందిని నాశనం చేశాడు, చేస్తున్నాడు. తన పనిని ముగించటానికి “నిజమైన జానం మనిషిని చట్టానికి అతీతుణ్ణి చేస్తుంది” అని దేవుడు “శిక్ష విధించడు” అని “చేసిన పాపాలు అమాయకంగా చేసినవే” అని అతను ఆత్మల ద్వారా ప్రకటిస్తాడు. కోరికే అత్యున్నత చట్టం అని స్వేచ్ఛకు అడ్డు ఆపులు లేవని మనిషి తనకు తానే జవాబుదారి అని మనుషులు నమ్మినప్పుడు అవినీతి దుష్టత్వం అన్నిచోట్లా ప్రబలటంలో ఆశ్చర్యం ఏముంది? తమ పాప హృదయ వాంఛల్ని అనుసరించి నివసించటానికి స్వేచ్ఛ కల్పించే GCTel 523.2

బోధనలను అంగీకరించటానికి వేలాది ప్రజలు ఆతృతగా ఉన్నారు. ఆత్మ నిగ్రహం పోయి కామేచ్ఛలు పెచ్చరిల్లుతున్నాయి. మానసిక, శారీరక శక్తులు జంతు ప్రవృత్తిని సంతరించుకొంటున్నాయి. క్రీస్తు అనుచరులమని చెప్పుకొంటున్న వేలాది ప్రజలను తన వలలో వేసుకొంటూ సాతాను ఉత్సాహంతో ఉప్పొంగుతున్నాడు. GCTel 523.3

అయితే భూతమతం చెప్పే అబద్దాల్ని నమ్మి ఎవరూ మోసపోనవసరంలేదు. సాతాను మోసాల్ని గుర్తించటానికి చాలినంత పరిజ్ఞానాన్ని దేవుడు లోకానికిచ్చాడు. ఇంతకు ముందే సూచించినట్లు భూతముతానికి పునాది అనదగిన సిద్ధాంతం సరళ లేఖన సత్యాలకు విరుద్ధంగా ఉన్నది. మరణించినవారు ఏమీ ఎరుగరని, వారి ఆలోచనలు నశిస్తాయని సూర్యుని కింద జరిగేవాటిలో వారికి పాత్రలేదని బైబిలు ప్రకటిస్తున్నది. భూమి మీద నివసిస్తున్న తమ ఆప్తుల సుఖదుఃఖాల గురించి వారికేమీ తెలియదు. GCTel 524.1

మరణించినవారి ఆత్మలతో కపట ఉత్తర ప్రత్యుత్తరాలు జరపటాన్ని దేవుడు ఖండితంగా నిషేధించాడు. హెబ్రీయుల కాలంలో ఒకతరగతి ప్రజలుండేవారు. నేటి భూతమత వాదుల వలె వారు కూడా మృతులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నట్లు చెప్పుకొనేవారు. ఇతర లోకాల నుంచి వస్తూ కర్ణపిశాచులు” అనే ఈ సందర్శకులను బైబిలు “దయ్యముల ఆత్మలు” అంటున్నది. సంఖ్యా 25:13; కీర్తనలు 106:28; 1 కొరింధి 10:20; ప్రకటన 16:14. కర్ణపిశాచాలతో వ్యవహరించటం హేయకార్యంగా ప్రకటించి, దానిని నిషేదించి ఆ నేరానికి మరణ శిక్ష విధించాడు దేవుడు. లేవీకాండం 19:31; 20:27. ఇప్పుడు మంత్రవిద్య అంటేనే ఎవరికీ ఇష్టముండదు. మనుషులు దురాత్మలతో సంబంధం కలిగివుండవచ్చునన్నది చీకటి యుగాల్లోని కట్టుకథ. అయితే వేలు లక్షల కొద్దీ విశ్వాసుల్ని ఆకర్షించి శాస్త్రవేత్తల మధ్యకు సంఘాలలోకి ప్రవేశించి విధాన సభలు, రాజాస్థానాల ఆదరాభిమానాలు సంపాదించిన భూతమతమే ఈ బృహత్తర వంచనకు పూర్వం ఖండన మండనలకు నిషేధానికి గురి అయి కొత్త వేషంలో పునరుజ్జీవం పొందిన నేటి మంత్ర తంత్ర శక్తి. GCTel 524.2

భూతమతం నిజ స్వరూపాన్ని బయలు పర్చే నిదర్శనం మరేదీ లేకపోతే నీతికి పాపానికి మధ్య, క్రీస్తు పవిత్రమైన, యోగ్యమైన అపొస్తలులకు అతిదుర్మారులైన సాతాను సేవకులకు ఆత్మలకు మధ్య ఏలాటి భేదము ఉండదన్న నిదర్శనమొక్కటే క్రైస్తవుడికి సరిపోవాలి. అతి దుష్టులు పరలోకంలో ఉన్నత స్థలంలో ఉన్నట్లు చిత్రించటం ద్వారా సాతాను ప్రపంచానికి ఈ వర్తమానం అందిస్తున్నాడు: “మీరు ఎంత దుర్మారులైన పర్వాలేదు. దేవున్ని గాని బైబిలునుగాని నమ్మినా నమ్మకపోయిన పోయిందేమీలేదు. మీ ఇష్టం వచ్చినట్లు నివసించండి. పరలోకం మీ గృహం.. భూతమత ప్రబోధకుల బోధ ఇలా ఉంటుంది. “దుర్మారులు యెహోవా దృష్టికి మంచివారు. వారియందు ఆయనకు సంతోషముండును; లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయెను? ” మలాకి 12:17. దైవ వాక్యం ఇలా అంటున్నది, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటిని ఎంచుకొనువారికి శ్రమ” యెషయా 5:20. GCTel 524.3

అబద్ధాలాడే ఈ అపవిత్రాత్మలు అపోస్తలుల వేషం ధరించి వారి వలె ప్రవర్తిస్తూ లోకంలో బతికి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణ వలన తాము రాసినదంతా అబద్ధమని చెప్పటానికి సాతాను వారిని ఉపయోగిస్తాడు. బైబిలు దేవుని మూలంగా కలిగింది కాదని వారంటారు. ఈ విధంగా వారు క్రైస్తవుడి నిరీక్షణకు పునాదిని కూలదోసి పరలోకరాజ్యానికి మార్గాన్ని చూపే సత్యజ్యోతిని ఆర్పివేస్తారు. బైబిలు కట్టుకథల గ్రంథమని లేదా అది మానవాళి ప్రారంభ దశకు సరిపడే పుస్తకం మాత్రమేనని దాన్ని ఇప్పుడు ప్రముఖ రచనగా పరిగణించరాదని లేదా ఉపయోగంలేని గ్రంథంగా దాన్ని కొట్టి పారేయటం ఉత్తమమని ప్రజల్ని నమ్మించటానికి సాతాను పాటుపడుతోన్నాడు. దైవవాక్యం స్థానాన్ని ఆక్రమించటానికి ఆధ్యాత్మిక ప్రత్యక్షతలను సృష్టించాడు. ఇది పూర్తిగా సాతాను అదుపులో వున్న సాధనం. దీని ద్వారా తాను ఏమనుకొంటే దాన్ని లోకం నమ్మేటట్లు చేయగలడు. తనకు తన అనుచరులకు తీర్పు తీర్చే గ్రంథాన్ని పక్కకు నెట్టి వేస్తాడు. అది అక్కడే ఉండాలన్నది అతని కోరిక. లోక రక్షకుణ్ని అతను సామాన్య మానవుడి స్థాయికి దిగజార్చుతాడు. యేసు సమాధికి కాపలా ఉన్న రోమా భటుడు యాజకులు, పెద్దలు తనకు చెప్పిన మాటల్ని బట్టి పునరుత్థానం వట్టిదని ప్రచారం చేసినట్లే రక్షకుని జీవితంలో అద్భుతాలుగా పరిగణించాల్సిన పరిస్థితులు ఏమీ లేవన్నట్లు చిత్రించటానికి ఆత్మల ప్రత్యక్షతల్ని విశ్వసించే వారు ప్రయత్నిస్తారు. ఈ విధంగా క్రీస్తును నేపథ్యంలో ఉంచటానికి ప్రయత్నించిన మీదట వారు తమ సూచక క్రియలకు ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ అవి క్రీస్తు మహత్కార్యాలకన్నా ఎంతో గొప్పవని ప్రచారం చేస్తారు. GCTel 525.1

ఇప్పుడు భూతమతం రూపురేఖలు మారుతున్నాయి. అభ్యంతరకరమైన కొన్ని అంశాల్ని మరుగుపర్చుతూ అది క్రైస్తవ రూపును దిద్దుకొంటున్నది. అయితే వేదికపై నుంచి, పత్రికాముఖంగా అది పలికే మాటలు ఎన్నో ఏళ్లుగా ప్రజల ముందు ఉంటూనే ఉన్నాయి. వీటిలో దాని యధార్ధ ప్రవర్తన బహిర్గతమవుతున్నది. ఈ బోధనల్ని కాదనలేరు, దాచిపెట్టనూ లేరు. GCTel 525.2

పూర్వంకంటే అదిప్పుడు ఒకింత సహనానికి నోచుకున్నదంటే ప్రస్తుత రూపంలో అదీలేదు. ఎందుచేతనంటే ఇప్పుడది మరెక్కువ సున్నితమైన మోసంగా రూపాంతరం చెందింది. క్రీస్తుని బైబిలుని క్రితం నిరాకరించగా ఇప్పుడు అంగీకరిస్తున్నట్లు చెప్పుకొంటున్నది. కాకపోతే మారుమనసు పొందని హృదయానికి నచ్చే విధంగా బైబిలుకి భాష్యం చెబుతూ అందులోని ముఖ్యమైన, గంభీరమైన సత్యాలను నిరర్ధకం చేస్తున్నది. ప్రేమే దేవుని ప్రధాన గుణ లక్షణమని నొక్కి చెబుతూ దాన్ని భావోద్రేకం స్థాయికి దిగజార్చి మంచికి చెడుకి మధ్య తేడాలేకుండా చేస్తున్నది. దేవుని న్యాయశీలత, పాపం పట్ల ఆయన ద్వేషం, ఆయన పరిశుద్ధ ధర్మశాస్త్ర విధులు ఎక్కడా కనిపించవు. ధర్మశాస్త్రంలోని పది ఆజ్ఞల చట్టానికి కాలం చెల్లిందని ప్రజలకు బోధిస్తున్నది. ఉల్లాసం పుట్టించి మంత్రముగ్ధుల్ని చేసే కాల్పనిక కథలు మనసును ఆకట్టుకొని బైబిలుని తమ విశ్వాసానికి పునాదిగా అంగీకరించకుండా మనుషుల్ని అపమార్గం పట్టిస్తున్నాయి. క్రితంలోలాగే ఇప్పుడు కూడ క్రీస్తును తృణీకరించటం జరుగుతుంది. కాకపోతే సాతాను మాయవల్ల అంధులైన మనుష్యులు ఆ మోసాన్ని పసికట్టలేని స్థితిలో వున్నారు. వంచించటంలో భూతమతానికున్న శక్తిని, దాని ప్రభావానికి లోనవడం వల్ల ఏర్పడే అపాయాన్ని గుర్తించే వారు బహు కొద్దిమంది. అనేకమంది అందులో ఏముందో తెలుసుకోవాలన్న ఉత్సుకత వల్ల దానితో దోబూచులాడున్నారు. వారికి భూతమతమంటే నమ్మకం ఉండదు. ఆత్మలు తమను అదుపుచేయటమన్న తలంపే వారికి కంపరం పుట్టిస్తుంది. అయినప్పటికీ నిషిద్ధ ప్రదేశంలో సంచరించేందుకు వారు చొరవ తీసుకొంటారు. అప్పుడు తమకు ఇష్టం లేకపోయినా ఆ విధ్వంసకుడు వారిపై తన పట్టును బిగిస్తాడు. ఒకసారి అతని ఆధిపత్యాన్ని అంగీకరించారో అతనికి బానిసలై పోతారు.అతని ప్రచండ మంత్రశక్తి నుంచి తమ సొంత శక్తితో తమ్మును తాము విడిపించుకోటం వారి తరం కాదు. విశ్వాస ప్రార్ధనకు ప్రతిఫలంగా లభించే దైవశక్తి మాత్రమే చెరలో ఉన్న ఈ ఆత్మలను విమోచించగలుగుతుంది. GCTel 525.3

ఈ గుణదోషాల్ని ప్రోది చేసేవారందరూ లేదా ఇష్టపూర్వకంగా పాపాల్ని ప్రేమించే వారందరూ సాతాను శోధనల్ని ఆహ్వానిస్తున్నారు. అట్టివారు దేవున్ని దూరంచేసుకొని ఆయన దూతల కాపుదలను పోగొట్టుకొంటారు. సాతాను తన శోధనల్ని వారి మీదికి పంపినప్పుడు తమకు సంరక్షణ లేనందువల్ల వారు పడిపోతారు. సాతాను శక్తి పరిధిలో తమ్మును తాము ఇలా ఉంచుకొనేవారు తమ అంతం ఏమిటో గ్రహించరు. వారిని పడగొట్టి వశపర్చుకొన్న మీదట ఇతరుల్ని ఆకర్షించి నాశనం చేయటానికి శోధకుడు వారిని ఉపయోగించుకొంటాడు. GCTel 526.1

యెషయా ప్రవక్త ఇలా హితవు పలుకుతున్నాడు: “వారు మిమ్మును చూచి - కర్ణపిశాచిగలవారి యొద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? ధర్మశాస్త్రమును ప్రమాణవాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని యెడల వారికి అరుణోదయము కలుగదు” యెషయా 8:19,20. మానవుడి స్వభావాన్ని గూర్చి, మరణించిన వారి స్థితిని గూర్చి లేఖనాల్లో ఎంతో వివరంగా ఉన్న సత్యాన్ని అంగీకరించటానికి మనుషులు ముందుకు వస్తే భూతమత ప్రబోధాల్లోను ప్రత్యక్షతల్లోను సాతాను శక్తిని అతని మోసపూరిత సూచక క్రియల్ని చూడగలుగుతారు. దుష్టత్వంతో నిండిన హృదయానికి ఎంతో ప్రియమైన స్వేచ్ఛను విడిచిపెట్టేది తాము అమితంగా ప్రేమించే పాపాల్ని విడిచి పెట్టేది పోయి వేలాదిమంది సత్యాన్ని గుర్తించకుండా హెచ్చరికల్ని లెక్కచేయకుండా తమ చుట్టూ సాతాసు అమర్చుతున్న ఉచ్చులోకి తిన్నగా నడిచి వెళ్ళి అతనికి ఎర ఔతున్నారు. “దుర్నీతియందు అభిలాష గలవారందరును శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు” 2 థెస్స 2:10,11. GCTel 527.1

భూతమత బోధల్ని వ్యతిరేకించేవారు మనుషుల్ని మాత్రమేగాక సాతానుని అతని దూతల్ని విమర్శిస్తున్నారు. వారు ప్రధానులతోను, అధికారులతోను ఉన్నత స్థానాలలో ఉన్న దురాత్మల సమూహాలతోను పోరాటంలో ప్రవేశిస్తున్నారు. పరలోక ప్రతినిధులు అతన్ని వెనక్కి నెట్టివేస్తేతప్ప సాతాను అంగుళం స్థలం కూడా విడిచి పెట్టడు. “అని వ్రాయబడియున్నది” అన్న మాటలతో రక్షకుడు సాతానును ఎదుర్కొన్న రీతిగా దేవుని ప్రజలు అతన్ని ఎదుర్కోవలసి ఉంది. క్రీస్తు దినాల్లో సాతాను లేఖనాల్ని వల్లించిన రీతిగానే ఇప్పుడూ లేఖనాల్ని ఉటంకిస్తాడు. తన మోసాల్ని కొనసాగించేందుకు లేఖన బోధనల్ని వక్రీకరిస్తాడు. ప్రమాదభరితమైన ఈ కాలంలో దేవునికి యధార్ధంగా నిలబడే వారందరూ లేఖనాలిస్తున్న సాక్ష్యాన్ని తమంతట తామే చదివి గ్రహించాలి. GCTel 527.2

దురాత్మలు మరణించిన ఆప్తులు లేదా మిత్రులవలె మారు వేషం వేసుకొని మిక్కిలి ప్రమాదకరమైన తప్పుడు బోధనల్ని ప్రబోధిస్తూ అనేకులకు కనిపిస్తాయి. ఈ సందర్శకులు తమ కపటనాటకాన్ని సాగించేందుకు సూచక క్రియలు చేస్తూ మన సానుభూతిని పొందుతారు. మృతులు ఏమీ ఎరుగరనీ ఈ రకంగా వచ్చి కనిపించేవారు దయ్యాల ఆత్మలని బోధించే బైబిలు సత్యంతో ఆ దురాత్మల్ని ప్రతిఘటించటానికి మనం సన్నద్ధంగా ఉండాలి. GCTel 527.3

“భూనివాసులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలము మన ముందే ఉన్నది” ప్రకటన 3:10. ఎవరి విశ్వాసం దైవ వాక్యంపై స్థిరంగా నిలిచి ఉండదో వారందరూ మోసపోయి సాతాను వశమైపోతారు. మనుషులపై పట్టు సాధించటానికి సాతాను “దుర్నీతి పుట్టించు సమస్త మోసముతో ” పని చేస్తాడు. అతని మోసాలు ఏనాటికానాడు ఎక్కువవుతాయి. కాగా మనుషులు అతని శోధనలకు స్వచ్ఛందంగా లోబడ్డప్పుడే అతని కార్యం సఫలమౌతుంది. సత్యాన్ని తెలుసుకోటానికి చిత్తశుద్ధితో లేఖన పరిశోధన చేసేవారు వాక్యానుగుణంగా జీవిస్తూ పరిశుద్ధత సాధించటానికి కృషిసల్పుతూ ఆ విధంగా సంఘర్షణకు సన్నద్ధమౌతున్న వారు దైవ వాక్యం నుంచి బలం పొందుతారు. “నీవు నా ఓర్చు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక...నిన్ను కాపాడెదను” (10 వ వచనం) అన్నది రక్షకుని వాగ్దానం. తన ప్రజల్ని కాపాడటానికి పరలోకంలోని ప్రతీ దూతనైన పంపుతాడుగాని తనను నమ్ముకొన్న ఒక్క ఆత్మను కూడా సాతాను వశం కావటానికి దేవుడు విడిచి పెట్టడు. GCTel 528.1

దుష్టులకు జరుగనున్న భయంకరమైన మోసం గురించి, అది చూసుకొని వారు దేవుని న్యాయ విమర్శల నుంచి తమకు భద్రత ఉన్నదని నమ్మటం గురించి యెషయా ప్రవక్త ఇలా అంటున్నాడు: “మేము మరణముతో నిబంధన చేసికొంటిమి. పాతాళముతో ఏకమైతిమి. ఉపద్రవము ప్రవాహమువలె వడిగా దాటునప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసికొంటిమి. మాయక్రింద దాగి యున్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే” యెషయా 28:15. ఈ వచనం వల్లిస్తున్న దుష్టులు పాపికి శిక్ష అంటూ ఏమీ ఉండదని, ఎంతటి పాపాత్ములైనా తన దూతలుగా ఉండేందుకు దేవుడు మానవులందరినీ పరలోకానికి కొనిపోతాడని తమ్మును తాము ఓదార్చుకొంటారు. అయినప్పటికీ శ్రమ కాలంలో నీతి మంతులకు బలం చేకూర్చేందుకు దేవుడు ఏర్పాటు చేసిన సత్యాలను తృణీకరించి వాటి స్థానే సాతాను అందించే మోసకరమైన భూతమతాన్ని అంగీకరిస్తారు. GCTel 528.2

ఈ తరం ప్రజల గుడ్డితనమే ఎంతో విభ్రాంతి కలిగిస్తుంది. వేలాది ప్రజలు దైవ వాక్యాన్ని నమ్మరుగాని సాతాను మోసాల్ని ఆతృతగా అంగీకరిస్తారు. ప్రవక్తలు అపోస్తలుల విశ్వాసం కోసం పోరాడేవారి మూఢభక్తిని నాస్తికులు అపహాసకులు తప్పుపడ్డారు. క్రీస్తును గూర్చి రక్షణ ప్రణాళికను గూర్చిన సత్యాన్ని గేలిచేయటం వారికి వినోదాన్నిస్తుంది. దేవుని అధికారాన్ని గుర్తించి ఆయన ధర్మశాస్త్ర విధుల్ని ఆచరించేవారి సంకుచిత మనసులు, మూఢనమ్మకాలు దుర్భలతల గురించి ఎంతో జాలి నటిస్తారు. వారు మరణంతో నిబంధనను పాఠాళంతో ఒడంబడికను చేసుకొన్నవారము, దేవుని ఉగ్రతకును, సమస్యకును మధ్య ఎవరూ చొరలేని అడ్డుగోడను నిర్మించుకొన్న వారము అన్న నిశ్చయతను చూపించుకొంటారు. వారికి భయం పుట్టించేది ఏదీ ఉండదు. వారు శోధకుడికి పూర్తిగా లొంగిపోయినవారు. అతనితో ఆత్మీయత పెంచుకొని ఒకటైనవారు. అతని స్వభావంతో నిండిన వారు. వీరు అతనితో వేరు పడలేరు. అతని ఉచ్చుల్లో నుంచి బైటపడలేరు. GCTel 528.3

లోకాన్ని మోసగించటానికి తన చివరి ప్రయత్నం కోసం సాతాను ఎంతో కాలంగా సన్నద్ధమవుతూ ఉన్నాడు. “మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరువబడును...మీరు మంచి చెడ్డలు ఎరిగినవారై దేవతలవలె ఉందురు” అంటూ ఏదెనులో తాను అవ్వకిచ్చిన హామియే సాతాను చేస్తున్న పనికి పునాది. ఆదికాండం 3:4,5. వంచన క్రియలో తన ఉత్తమ కళాఖండం అనదగిన భూతమత రూపకల్పనకు అతను క్రమక్రమంగా కొంచెంకొంచెంగా మార్గం సుగమం చేశాడు. అతని ఎత్తుగడలు ఇంకా పూర్తిగా సాఫల్యానికి రాలేదు. ఇక మిగిలి ఉన్న కొద్ది కాలంలోనే అవి సఫలమవుతాయి. ప్రవక్త ఇలా పలుకుతున్నాడు, “కప్పలవంటి మూడు అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగుచేయవలెనని వారి యొద్దకు బయలు” వెళ్తాయి. ప్రకటన 16:13,14. దేవుని వాక్యాన్ని విశ్వసించటం ద్వారా దేవుని కాపుదల గలవారు తప్ప ప్రపంచం యావత్తు వరదవలె పెల్లుబికే ఈ వంచనలో మునిగిపోతుంది. మరణానికి దారితీసే భద్రత దిశగా ప్రజలు పరుగులు తీస్తున్నారు. దేవుని ఉగ్రత కుంభవృష్టితో మాత్రమే వారు నిద్రవేస్తారు. GCTel 529.1

ప్రభువైన దేవుడిలా సెలవిస్తున్నాడు: “నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. వడగండ్లు మీ మాయాశరణ్యమును కొట్టివేయును. దాగియున్న చోటు నీళ్లచేత కొట్టుకొని పోవును. మరణముతో మీరు చేసికొనిన నిబంధన కొట్టివేయబడును. పాతాళముతో మీరు చేసికొనిన ఒడంబడిక నిలువదు. ప్రవాహము వలె ఉపద్రవము మీ మీదుగా దాటునప్పుడు మీరు దానిచేత తొక్కబడిన వారగుదురు” యెషయా 28:17,18. GCTel 529.2