మహా సంఘర్షణ

29/43

అధ్యాయం 28—జీవిత చరిత్రకు జవాబుదారీతనం

(పాప పరిశోధక తీర్పు)

దానియేలు ఇలా అంటున్నాడు: “ఇంక సింహాసనములను వేయుట చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమమువలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొడ్డెబొచ్చువలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలలవలె మండుచుండెను. GCTel 450.1

దాని చక్రములు అగ్నివలె ఉండెను. అగ్నివంటి ప్రవాహము ఆయన యొద్దనుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్లకొలది మనుష్యులు ఆయన యెదుట నిలిచిరి. తీర్పుకై గ్రంథములు తెరువబడెను.” దానియేలు 7:9,10. GCTel 450.2

సర్వలోక న్యాయాధిపతి ముందు మనుష్యుల ప్రవర్తనలు జీవితాలు పరిశీలనకు ప్రతివారు తమ తమ క్రియల చొప్పున” ప్రతి ఫలం పొందే ఆ మహాదినాన్ని గూర్చిన దర్శనం ప్రవక్తకు ఈ విధంగా వచ్చింది. ఆ మహావృద్యుడు తండ్రి అయిన దేవుడు. కీర్తనకారుడిలా అంటున్నాడు, “పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టించక మునుపు యుగయుగములు నీవే దేవుడవు” కీర్తనలు 90:2. సకల ప్రాణులకు ఆధారభూతుడు, ధర్మశాస్త్ర మంతటికీ పునాది అయిన ఆ ప్రభువు నాయకత్వం కింద తీర్పు జరుగుతున్నది. సహాయకులుగాను సాక్షులుగాను “వేవేల దూతలు” తీర్పు సభకు హాజరయ్యారు. GCTel 450.3

” నేనింక చూచుచుండగా ఆకాశమేఘారూఢుడై మనుష్యకుమారుని పోలిన యొకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులును రాష్ట్రములును ఆయాభాషలు మాట్లాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. అదెన్నటికిని తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు.” దానియేలు 7:13,14. ఇక్కడ ప్రస్తావనకు వచ్చిన క్రీస్తురాక ఆయన రెండోరాక కాదు. ఆధిపత్యాన్ని మహిమను రాజ్యాన్ని స్వీకరించటానికి గాను ఆయన ఆ మహావృద్ధుని వద్దకు రావటాన్ని ఇది సూచిస్తున్నది. మధ్యవర్తిగా తన సేవ సమాప్తమైన తర్వాత ఆయన వీటిని అందుకొంటాడు. 1844 లో 2300 దినాలు సమాప్తి కావటంతో సంభవిస్తుందని ప్రవచనం సూచించింది, ఈ రాక గాని లోకానికి క్రీస్తు రెండోసారి రావటం గాని కాదు. పరలోక దూతలు తనవెంటరాగా మన ప్రధానయాజకుడు అతిపరిశుద్ధ స్థలంలో ప్రవేశించి మానవుల నిమిత్తం తాను నిర్వహించాల్సిన చివరి పరిచర్యను నిర్వర్తించటానికి దేవుని సముఖంలో నిలబడ్డాడు. పరిశోధక తీర్పు జరపటానికి, ఆ తీర్పు అందించే ఉపకారాలకు అర్హులైన వారి పక్షంగా ప్రాయశ్చిత్తం చేయటానికి ఆయన పూనుకొంటాడు. GCTel 450.4

భూలోక గుడారపు ఛాయారూపక పరిచర్యలో పాపపు ఒప్పుకోలుతోను, పశ్చాత్తాపంతోను దేవుని సముఖంలోకి ఎవరు వస్తారో, పాప పరిహారార్ధబలి రక్తం ద్వారా ఎవరి పాపాలు గుడారానికి బదిలీ అవుతాయో వారు మాత్రమే ప్రాయశ్చితార్థ దిన సేవలో పాలుపొందేవారు. అలాగే ఆ చివరి ప్రాయశ్చిత్తంలోను పరిశోధక తీర్పులోను దైవప్రజలమని చెప్పుకొనేవారి పేర్లు మాత్రమే పరిగణనలోకి వస్తాయి. దుర్మార్గుల తీర్పు నిర్దిష్టమైన ప్రత్యేకమైన వ్యవహారం. అది భవిష్యత్తులో జరుగుతుంది. “తీర్పు దేవుని యింటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చియున్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి యేమవును?” 1 పేతురు 4:17. GCTel 451.1

మనుషుల పేర్లు, వారి క్రియలు దాఖలై పరలోకంలో ఉన్న గ్రంథాలే తీర్పు తీరుతెన్నుల్ని నిర్ణయిస్తాయి. దానియేలు ప్రవక్త చెబుతున్న మాటలు గమనించండి. “తీర్పు ప్రారంభమయ్యింది గ్రంధాలు తెరిచారు”. ఇదే సన్ని వేశాన్ని వర్ణిస్తూ ప్రకటన రచయిత ఇలా అంటున్నాడు, “మరియు జీవ గ్రంథమను వేరొక గ్రంథమును విప్పబడెను, ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి” ప్రకటన 20:12. GCTel 451.2

ఎప్పుడైనా దేవుని సేవలో ప్రవేశించిన వారి పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి. “మీ పేరులు పరలోకమందు వ్రాయబడియున్నవని సంతోషించుడి.” అని యేసు తన శిష్యులకు చెప్పాడు. లూకా 10:20. తమ పేరులు జీవగ్రంథమందు రాయబడి యున్న” నమ్మకమైన పని వారిని గూర్చి పౌలు ప్రస్తావిస్తున్నాడు. పిలిప్పీ 4:3. “ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగు” కాలాన్ని దృష్టిలో ఉంచుకొని “గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు” విడుదల పొందుతారని దానియేలంటున్నాడు. “గొట్టెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడినవారే పరిశుద్ధ పట్టణంలో ప్రవేశిస్తారని ప్రకటన రచయిత యోహానంటున్నాడు. దానియేలు 12:1; ప్రకటన 21:27. GCTel 451.3

దేవుని సముఖంలో లిఖిత వుయ్యే “ జ్ఞాపకార్ధ గ్రంథము”ఉన్నది. “యెహోవాయందు భయభక్తులుగలిగి ఆయన నామమును స్మరించుచుండువారి” సత్కియలు ఆగ్రంథంలో దాఖలై వుంటాయి. మలాకీ 3:16. విశ్వాసంతోనిండిన వారి మాటలు ప్రేమతో కూడిన వారి కార్యాలు పరలోకంలో దాఖలవుతాయి. “నాదేవా...నన్ను జాపకముంచుకొని నా దేవుని మందిరమునకును దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము” నెహెమ్యా 13:14. దేవుని జ్ఞాపకార్ధ గ్రంథంలో ప్రతీ నీతి కార్యమూ చిరస్థాయిగా ఉంటుంది. ప్రతిఘటించిన ప్రతి శోధన, జయించిన ప్రతీ దుష్కార్యం, పలికిన ప్రతి దయగల మాట నమ్మకంగా నమోదవుతుంది. త్యాగ పూరితమైన ప్రతీ కార్యం, క్రీస్తునిమిత్తం భరించిన ప్రతీ శ్రమ, అనుభవించిన ప్రతీ దుఃఖం లిఖించబడుతుంది. కీర్తనకారుడిలా అంటున్నాడు, “నా పరిచారములను నీవు లెక్కించి యున్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడియున్నవి. అవి నీ కవిలె (పుస్తకము)లో కనబడునుగదా” కీర్తనలు 56:8. GCTel 452.1

మనుషుల పాపాల దాఖలాలున్నాయి. “గూఢమైన ప్రతి యంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదేగాని, చెడ్డదేగాని తీర్పులోకి తెచ్చును” “మనుష్యులు పలుకు వ్యర్ధమైన ప్రతి మాటను గూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసి యుండెను” రక్షకుడిలా అంటున్నాడు, “నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టి అపరాధివని తీర్పునొందుదువు” ప్రసంగి 12:14. మత్తయి 12:36, 37. నిర్దుష్టమైన ఈ దాఖలాల్లో రహస్య ఉద్దేశాలు లక్ష్యాలు బహిర్గతమవుతాయి. ఎందుకంటే దేవుడు ““అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి, హృదయములలోని ఆలోచనలను బయలుపర్చును” 1 కొరింథి 4:5. “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - నా యెదుట గ్రంథములో అది వ్రాయబడియున్నది... మీ దోషములను బట్టియు మీ పితరుల దోషములను బట్టియు. ప్రతికారము కొలిచి పోయుదును.” యెషయా 65:6,7. GCTel 452.2

ప్రతివాని క్రియలు అవి మంచివేగాని చెడ్డవేగాని దేవుని ముందు తీర్పుకు వస్తాయి. పరలోక గ్రంథాల్లో ప్రతి పేరుకు ఎదురుగా ప్రతీ తప్పుడు మాట, ప్రతీ స్వారక్రియ, అపనమ్మకంగా నిర్వహించిన ప్రతీవిధి వంచనతో రహస్యంగా జరిగించిన ప్రతీ పాపం నిర్దుష్టంగా నమోదవుతాయి. దేవుడు పంపిన హెచ్చరికలు లేదా పెడచెవిని పెట్టిన మందలింపులు వృధా పుచ్చిన ఘడియలు, దుర్వినియోగం చేసిన అవకాశాలు, మంచినో, చెడునో ప్రోత్సహించిన ప్రభావాలు, దీర్ఘకాలికమైన వాటి పర్యవసానాలు అన్నిటినీ దాఖలా- చేసే దేవదూత నమోదు చేస్తాడు. GCTel 453.1

తీర్పులో దైవ ధర్మశాస్త్ర ప్రమాణమే మనుషుల ప్రవర్తనను జీవితాన్ని పరీక్షించే గీటురాయి. జ్ఞాని ఇలా అంటున్నాడు, “దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలననుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శచేయునప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదేగాని చెడ్డదేగాని తీర్పులోనికి తెచ్చును” ప్రసంగి 12:13,14. అపోస్తలుడైన యాకోబు సహోదరులకు ఈ హితవు పలుకుతున్నాడు, “స్వాతంత్ర్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబోవు వారికి తగినట్టుగా మాటలాడుడి. ఆలాగుననే ప్రవర్తించుడి” యాకోబు 2:12; GCTel 453.2

దేవుని విమర్శలో యోగ్యులుగా ఎంపికైనవారు నీతిమంతుల పునరుత్థానంలో పాలు పొందుతారు. యేసు ఇలా అంటున్నాడు, “పరమును మృతులు పునరుత్థానమును పొందుటకు యోగ్యులని యెంచబడినవారు “పెండ్లి చేసికొనరు, పెండ్లికియ్యబడరు. వారు పునరుత్థానములో పాలివారైయుండి దేవదూత సమానులును దేవుని కుమారులునై యుందురు. గనుక వారికను చావనేరరు” లూకా 20:35,36. ఆయన ఇంకా ఇలా అంటున్నాడు, “మేలు చేసినవారు జీవపునరుత్థానమునకు బయటికి వచ్చెదరు” యోహాను 5;29. తాము “జీవపునరుత్థానమునకు” యోగ్యులని తీర్పు పొందిన తర్వాతే నీతిమంతులు పునరుత్థానం పొందుతారు. అందుచేత తీర్పులో తమ రికార్డుల తనిఖీలో తమ కేసుల తీర్మానం జరిగినప్పుడు వారి వ్యక్తిగత హాజరు ఉండదు. GCTel 453.3

దేవుని ముందు తమ పక్షంగా విజ్ఞాపన చేసేందుకు వారి ఉత్తరవాదిగా యేసు హాజరవుతాడు. “ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు.”1 యోహాను 2:1. “అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదుగాని, యిప్పుడు మన కొరకు దేవుని సముఖమునందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను”. “ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు.” హెబ్రీ 9:24; 7:25. GCTel 454.1

తీర్పుకు గ్రంథాలు తెరుస్తారు. యేసును విశ్వసించని వారందరి జీవితాలు పరిశీలనకు దేవుని ముందుకి వస్తాయి. విచారణ మొట్టమొదటగా భూమిపై నివసించిన వారితో ప్రారంభించి తరాల వారిగా కొనసాగించి జీవించి ఉన్నవారితో ముగిస్తాడు. మన ఉత్తరవాది యేసు. ప్రతీ పేరూ పరిశీలనకు వస్తుంది. ప్రతీ కేసు గురించి దర్యాప్తు జరుగుతుంది. పేరులను అంగీకరించటమో తిరస్కరించటమో జరుగుతుంది. పశ్చాత్తాపం ద్వారా క్షమాపణ పొందని వారి పాపాలేవైనా గ్రంథాల్లో మిగిలివుంటే వారిపేర్లను జీవ గ్రంధంలో నుంచి తొలగించటం, వారి సర్రియల్ని దేవుని జ్ఞాపకార్థ గ్రంధంలో నుంచి తుడిచివేయటం జరుగుతుంది. ” ప్రభువు మోషేతో ఇలా అన్నాడు, “ఎవడు నాయెదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచి వేయుదును” నిర్గమ 32:33; యెహెజ్కేలు ప్రవక్త ఇలా అంటున్నాడు, “అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయ క్రియలన్నిటి ప్రకారము జరిగించిన యెడల అతడు బ్రదుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రమును జ్ఞాపకములోనికి రావు” యెహేజ్కేలు 18:24. GCTel 454.2

నిజంగా పాపం గురించి పశ్చాత్తాపం చెంది క్రీస్తు రక్తమే తమకు ప్రాయశ్చితార్ధమైన బలి అని ఎవరైతే విశ్వసిస్తారో, పరలోక గ్రంథాల్లో వారందరి పేరులకు ఎదురుగా క్షమించబడ్డారు అని రాయబడి ఉంటుంది. క్రీస్తు నీతిలో వారు భాగ స్వాములయ్యారు గనుక వారి ప్రవర్తనలు దైవధర్మశాస్త్రానికి అనుగుణంగా ఉన్నట్లు తేలింది. కనుక వారి పాపాలు తుడుపు పడ్డాయి. నిత్యజీవాన్ని అందుకోటానికి వారు యోగ్యులవుతారు. యెషయా ప్రవక్త ముఖంగా ప్రభువిలా సెలవిస్తున్నాడు, “నేను, నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమములను తుడిచివేయుచున్నాను.” యెషయా 43:25. యేసు ఇలా అంటున్నాడు, ” జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనుచు జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపుపెట్టక, నా తండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.” ” మనుష్యుల యెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును ఎరుగనందును” ప్రకటన 3:5; మత్తయి 10:32,33. GCTel 454.3

ఈ లోక న్యాయస్థానాల తీర్పు పట్ల అమితాసక్తి ప్రదర్శితం కావటం తెలిసిందే. అయితే పరలోక గ్రంథాల్లో లిఖితమైన పేర్లు సకల ధరిత్రికి న్యాయాధిపతి అయిన దేవుని ముందుకు వచ్చినప్పుడు ప్రదర్శితమయ్యే ఆసక్తి అంతా ఇంతా కాదు. తన రక్తంపై విశ్వాసం ద్వారా విజయులైన వారి పాపాలు క్షమించాల్సిందని వారికి తమ ఏదెను గృహాన్ని తిరిగి ఇవ్వాలని “మునుపటిలాగు... ప్రభుత్వము” చేయటానికి తనతో సహవారసులుగా కిరీటాలు ధరింపజేయమని విజ్ఞప్తి చేస్తాడు. మీకా 4:8. మానవకోటిని వంచించి శోధించే ప్రయత్నంలో మానవ కృషి సందర్భంగా దేవుని ప్రణాళికను నిర్వీర్యం చేయాలని సాతాను యోచిస్తాడు. అయితే మానవుడు ఎన్నడూ పడిపోలేదు అన్నట్లుగా క్రీస్తు ఇప్పుడు ఆ ప్రణాళికను అమలుపర్చాల్సిందిగా కోరుతున్నాడు. తన ప్రజలకు క్షమాపణ, నీతిమంతులుగా తీర్పు మాత్రమేగాక తన మహిమలో పాలిభాగం తన సింహాసనంపై స్థానం కోరుతున్నాడు. GCTel 455.1

వారికి తన కృపను చూరగొన్న తన ప్రజల నిమిత్తం యేసు విజ్ఞాపన చేస్తుంటే వారు అపరాధులంటూ సాతాను దేవుని ముందు వారిపై నిందమోపుతున్నాడు. దేవునిపై తమకున్న విశ్వాసాన్ని కోల్పోయి, ఆయన ప్రేమానురాగాలకు దూరమై, ఆయన ధర్మవిధులను ఉల్లంఘించేందుకుగాను వారిని నాస్తికులు చేయటానికి పరమ వంచకుడైన సాతాను ప్రయత్నిస్తున్నాడు. అతను వారి గత జీవిత చరిత్రను ప్రస్తావిస్తాడు. వారి ప్రవర్తనలోని దోషాలను ఎత్తిచూపుతాడు. వారిలో క్రీస్తు పోలిక లేదంటూ అది తమ రక్షకుని అగౌరవ పర్చటమే అంటాడు. వారిని తాను ఏ యే పాపాల్లోకి నడిపించాడో వాటన్నిటిని ఏకరువుపెడ్తాడు. వీటన్నిటిని బట్టి వారు తన ప్రజలని వాదిస్తాడు. GCTel 455.2

యేసు వారి పాపాలు ఉపేక్షించడు, కాని వారి పశ్చాత్తాపాన్ని విశ్వాసాన్ని చూపించి వారికి పాపక్షమాపణ వేడుకొంటూ తండ్రిముందు పరిశుద్ధ దూతల ముందు గాయపడ్డ తన చేతులు పైకెత్తి “వీరు నాకు వ్యక్తిగతంగా తెలుసు. వీరిని నా అరచేతిలో చెక్కుకొన్నాను.” అంటాడు. “విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు.” దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు” కీర్తనలు 51:17. తన ప్రజలను నిందించేవారి నుద్దేశించి ఆయన ఇలా అంటాడు, “సాతానూ, యెహోవా నిన్ను గద్దించును. యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివివలెనే యున్నాడుగదా” జెకర్యా 3:2. నమ్మకంగా ఉన్న తన ప్రజలను కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను” తన తండ్రికి అందించేందుకుగాను క్రీస్తు వారిని తన నీతితో కప్పుతాడు. ఎఫెసీ 5:27. వారిపేర్లు జీవ గ్రంథంలో దాఖలై ఉంటాయి. వారిని గూర్చి ఇలా అంటాడు, “వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతోకూడ సంచరించెదరు” ప్రకటన 3:4. GCTel 455.3

ఇలా ఈ కొత్త నిబంధన వాగ్దానం పూర్తిగా నెరవేరుతుంది: “నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఎన్నడును జ్ఞాపకము చేసికొనను” “ఆ కాలమున ఆనాటి ఇశ్రాయేలు దోషమును వెదకినను అది కనబడకుండును. యూదా పాపములు వెదకినను అవి దొరకవు ” యిర్మీయా 31:34; 50:20. “ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమునగును. ఇశ్రాయేలులో తప్పించుకొనిన వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. సీయోనులో శేషించినవానికి యెరూషలేములో నిలువబడిన వానికి అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు.” యెషయా 4:2,3. GCTel 456.1

ప్రభువు రెండో రాకడ ముందు పాప పరిశోధక తీర్పు, పాపాల తుడిచివేత ప్రక్రియలు పూర్తికావలసి ఉన్నాయి. గ్రంథాల్లో లిఖితమైన వాటి ప్రకారం మృతులు తీర్పు పొందాల్సి వున్నారు గనుక నేర పరిశోధక తీర్పులో తమ కేసుల పరిశీలన జరిగేంతవరకు మనుషుల పాపాల తుడిచివేత జరగటం అసాధ్యం. అయితే “ప్రభువు సముఖమునుండి విశ్రాంతికాలములు వచ్చునట్లును మీ కొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపునట్లును” విశ్వాసుల పాపాలు తుడుపు పడ్డాయని అపోస్తలుడైన పేతురు స్పష్టంగా చెబుతున్నాడు. అ.ఐ. 3:19,20. నేర పరిశోధక తీర్పు సమాప్తి కాగానే క్రీస్తు వస్తాడు. వారి వారి క్రియలు చొప్పున ప్రతి వారికి ఇవ్వటానికి ప్రతిఫలం ఆయన వద్ద ఉన్నది. GCTel 456.2

ఛాయారూపక గుడార పరిచర్యలో ఇశ్రాయేలు ప్రజలకు ప్రాయశ్చిత్తం చేసిన అనంతరం ప్రధాన యాజకుడు సమాజాన్ని దీవించేవాడు. అలాగే తన మధ్యవర్తిత్వ సేవ సమాప్తి కావటంతో రక్షణ నిమిత్తము పాపములేకుండు” (హెబ్రీ 9:28.) నిరీక్షిస్తున్న తన ప్రజలను నిత్యజీవ ప్రదానంతో ఆశీర్వదించేందుకు క్రీస్తు ప్రత్యక్షమౌతాడు. గుడారంలో నుంచి పాపాల్ని తీసివేయటంలో ప్రధాన యాజకుడు వాటిని నింద మోసే మేక తలపై ఒప్పుకొన్న రీతిగా క్రీస్తు ఈ పాపాలన్నిటిని పాపానికి ఆద్యుడైన సాతానుమీద మోపుతాడు. నింద మోసే మేక ఇశ్రాయేలీయుల పాపాల్ని మోసుకొని “ఎడారి దేశమునకు”పోయేది. లేవీకా.16:22. అలాగే ప్రజలతో తాను చేయించిన పాపాలను సాతాను మోస్తూ వెయ్యి సంవత్సరాలు భూమిపై నిర్బంధంలో ఉంటాడు. అప్పుడు భూమిపై మనుషులెవరూ ఉండరు. చివరకు అతడు అగ్నిలో కాలి పాప పర్యవసానాన్ని పూర్తిగా అనుభవిస్తాడు. ఆ అగ్నిలోనే దుర్మార్గులందరు నాశనమౌతారు. పాపం చివరగా నిర్మూలనం కాపటం పాపాన్ని త్యజించటానికి సంసిద్ధత చూపుతు ఉన్న వారి విమోచన జరగటంతో రక్షణ మహత్తర ప్రణాళిక సాకారమవుతుంది. GCTel 457.1

తీర్పుకు ఏర్పాటైన సమయం అనగా 1844 లో 2300 దినాలు అంతమైనప్పుడు దోష నిర్ధారణ- నిర్మూలన ప్రక్రియ ప్రారంభమయ్యింది. క్రీస్తు నామం ధరించిన వారందరు నిశితమైన ఆ దర్యాప్తును ఎదుర్కోవలసి ఉన్నారు. “ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున ” జీవించి ఉన్న వారు మరణించిన వారు తీర్పు పొందవలసి ఉంది. GCTel 457.2

క్షమాపణ కోరకపోవటంవల్ల విడిచి పెట్టని పాపాలకు క్షమాపణ ఉండదు. వాటిని తుడిచివేయటం జరుగదు. దేవుని తీర్పు దినాన అవి పాపికి వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతాయి. పాపి తన పాపాల్ని పట్టపగలుగాని, రాత్రి చీకటిలోగాని జరిగించి ఉండవచ్చు. అయితే ప్రభువుముందు అవి స్పష్టంగా నిలుస్తాయి. అన్ని పాపాల్ని దేవదూతలు వీక్షించి ఏ పొరపాటు లేకుండా వాటిని పుస్తకంలో దాఖలు చేసి ఉంచారు. తండ్రి, తల్లి, భార్య, పిల్లలు, సహచరుల కన్నుగప్పి పాపం చేయవచ్చు. తప్పిదం చేసిన వారికి తప్ప దాన్ని గురించి ఇంకెవరికి అనుమానం కూడా రాకపోవచ్చు. అయితే పరలోక దూతలకు అది బట్టబయలే. రాత్రిపూట గాఢాంధకారమేగాని, పంచన విద్య నేర్పే మర్మమేదైనా నిత్యుడైన దేవునికి కనిపించకుండా ఒక్క ఆలోచనను కూడా మరుగుపర్చ జాలదు. ప్రతీ తప్పుడు లెక్కను ప్రతీ అన్యాయపు క్రియను గూర్చి దేవునికి నిర్దిష్టమైన దాఖలా ఉన్నది. పైకి భక్తిగా ఉన్న వారిని చూసి దేవుడు మోసపోడు. ప్రవర్తనను అంచనా వేయటం విషయంలో ఆయన ఎన్నడూ పొరబడడు. గుండెల్లో దుర్మార్గతను దాచుకొన్న వారిని చూసి మనుష్యులు మోసపోవచ్చు కాని దేవుడు అన్ని మోసాలు పసిగట్టగలడు. మనిషి అంతర్గత జీవితాన్ని ఆకళించుకోగలడు. GCTel 457.3

ఎంత గంభీరమైన ఆలోచన! గతంలో కలిసిపోతున్న ప్రతీరోజు పరలోక గ్రంథాల్లోకి ఎక్కే దాఖలాలు సమకూర్చుతుంది. ఒకసారి అన్నమాటను, ఒకసారి జరిగించిన క్రియను ఉపసంహరించుకోవటం సాధ్యం కాదు. మంచి చెడులు రెండింటినీ దేవదూతలు గ్రంథాల్లో దాఖలు చేస్తారు. లోకంలో అతిగొప్ప యుద్ధ శూరుడు ఒక్క దినం రికార్డును కూడా ఉపసంహరించుకోలేడు. మన క్రియలు, మన మాటలు, చివరికి మన అతిరహస్య ఉద్దేశాలు అన్నీ మన మేలుకో కీడుకో దోహదపడ్డాయి. వాటిని మనం మరచిపోయినా అవి మనం మంచి వారమనో చెడ్డవారమనో సాక్ష్యం చెబుతాయి. GCTel 458.1

చిత్రకారుడి కుంచె ముఖకవళికలను ఎలా నిర్దుష్టంగా చిత్రిస్తుందో అలాగే పరలోక గ్రంథాల్లో ప్రవర్తన చిత్రించబడుంది. అయినప్పటికీ పరలోకవాసుల దృష్టిని ఆకర్షించే రికార్డు విషయం మనం ఏమంత ఆందోళన కనపర్చం. కనిపించని వాటిని మరుగుపర్చే అడ్డుతెర తొలగిపోయి తీర్పు దినాన దేవుని బిడ్డలు మళ్లీ తెలుసుకొనున్న మాటల్ని క్రియల్ని దాఖలు చేస్తున్న దేవదూతను వారు వీక్షించ గలిగితే ప్రతి దినం వినిపిస్తున్న మాటలు వెలువడకుండా ఆగిపోతాయి. ఎన్నో క్రియలు జరగకుండా నిలిచిపోతాయి. GCTel 458.2

ఉపయుక్తమైన ప్రతీ ప్రతిభ తీర్పులో పరిగణనకు వస్తుంది. దేవుడిచ్చిన మూల ధనాన్ని మనం ఎలా వినియోగించాం? తనవారిని ప్రభువు తన రెండో రాకడలో వడ్డీతో సహా స్వీకరిస్తాడా? చేతులు, మనసు మేధ రూపంలో దేవుడు మనకిచ్చిన శక్తులను దేవుని మహిమార్ధం ప్రజాహితం నిమిత్తం ఉపయోగిస్తున్నామా? మన సమయాన్ని, కాలాన్ని, గళాన్ని, పలుకుబడిని మనం ఎలా ఉపయోగిస్తున్నాం? బీదలుగా, బాధితులుగా, అనాధలుగా లేదా విధవరాండ్రుగా మన వద్దకు వచ్చిన క్రీస్తుకు మనం ఏమి చేశాం? దేవుడు మనల్ని తన పరిశుద్ధ వాక్య నిధికి ట్రస్టీలుగా నియమించాడు. రక్షణ విషయంలో మనుషుల్ని చైతన్య పరచటంలో మనం ఏమిచేశాం? క్రీస్తును విశ్వసించానుని చెప్పటంలో అర్ధం లేదు. క్రియల్లో కనపర్చిన ప్రేమ మాత్రం నిజమైన భక్తి. ఏ క్రియకైనా దేవుని దృష్టిలో విలువను ఆపాదించేది ప్రేమ ఒక్కటే. ప్రేమతో చేసే ఏచిన్న కార్యానైనా దేవుడు అంగీకరిస్తాడు. దానికి ప్రతిఫలమిస్తాడు. GCTel 458.3

అంతర్గతంగా గూడు కట్టుకొని ఉన్న స్వార్ధం పరలోక గ్రంథాల్లో బట్టబయలవుతుంది. తోటి మనుషులపట్ల నిర్వహించని విధుల దాఖలా, దైవ కార్యాలను విస్మరించిన దాఖలా అక్కడుంటుంది. క్రీస్తుకు ఇవ్వాల్సిన సమయాన్ని శక్తిసామర్థ్యాల్ని తాము ఎంత తరచుగా సాతానుకు ఇచ్చారో వారు అక్కడ చూస్తారు. దేవదూతలు దేవునికి అందించే రికార్డు మిక్కిలి విచారకరమైంది. ఆలోచనాపరులం అని క్రీస్తు అనుచరులం అని చెప్పుకొనేవారు లోకసంపదను సమకూర్చటంలో లేదా లోకభోగాలు అనుసరించటంలో తలమునకలై ఉన్నారు. శరీరేచ్ఛలు తీర్చుకోటానికి ద్రవ్యాన్ని, శక్తి సామర్ధ్యాల్ని ధారపోస్తున్నారు. ప్రార్ధనలో, లేఖన పరిశోధనలో, ఆత్మార్పణలో, పాపపు ఒప్పుకోలులో కొద్దిపాటి సమయం కూడా గడపటం లేదు. GCTel 458.4

మసం ఎక్కువగా తెలుసుకోవలసిన అంశం గురించి అంతగా తలంచకుండా ఉండేందుకుగాను మన మనసుల్ని మళ్లించటానికి సాతాను ఎన్నెన్నో పన్నాగాలు పన్నుతాడు. ప్రాయశ్చితార్ధ బలిదానాన్ని సర్వశక్తిగల మధ్యవర్తిని ప్రచురపర్చే, దృష్టిని ఆకర్షించే సత్యాలను సాతాను ద్వేషిస్తాడు. యేసుమీద నుంచి ఆయన సత్యాల మీద నుంచి మనసుల్ని మళ్లించటం మీద సమస్తం ఆధారపడి ఉంటుందని అతడికి బాగా తెలుసు. GCTel 459.1

యేసుప్రభువు మధ్యవర్తిత్వ ఉపకారాన్ని అందుకొనే వారు తమ పరిపూర్ణ పరిశుద్ధతకు విఘాతం కలిగించేదేదైన వుంటే దాన్ని అనుమతించకూడదు. విలువైన సమయాన్ని వినోదాలకు, డంబం ప్రదర్శనలకు లేదా లాభార్జన ప్రయత్నాలకూ వ్యర్ధపుచ్చే బదులు లేఖన సత్యాల్ని చిత్తశద్ధితో ప్రార్ధన పూర్వకంగా అధ్యయనం చేయటానికి ఉపయోగించాలి. గుడారసేవ, పాపపరిశోధక తీర్పు అంశాల్ని దైవ ప్రజలు స్పష్టంగా అవగాహన చేసుకోటం అవసరం. మానవాళి మహోన్నత ప్రధాన యాజకుడైన క్రీస్తు హోదాను గూర్చి ప్రజలందరికీ వ్యక్తిగతమైన పరిజ్ఞానం అవసరం. అది లేకపోతే ఈ సమయంలో అగత్యమైన విశ్వాసాన్ని కలిగి ఉండటానికిగాని, దేవుడు తమకు ఉద్దేశించిన స్థానాన్ని ఆక్రమించటానికి గాని వారికి సాధ్యపడదు. రక్షకుని చెంతకు చేర్చటానికో లేదా నశించిపోనివ్వటానికో ప్రతి వ్యక్తికీ ఒక ఆత్మ ఉంటుంది. దైవ న్యాయ స్థానంలో ప్రతీవారు ఎదుర్కోవాల్సిన కేసు ఉంది. ప్రతీవారు మహోన్నత న్యాయాధిపతిని ముఖాముఖి కలవాల్సి ఉన్నారు. న్యాయస్థానం పని ప్రారంభమవుతుంది. గ్రంథాలు తెరుస్తారు. ఆ దినాలు అంతమొందిన తర్వాత దానియేలుతో పాటు ప్రతీవారు ఆ న్యాయపీఠం ముందు నిలబడాల్సి ఉంటుంది. ఆ గంభీర సన్నివేశం గురించి ప్రతీవారు ఆలోచించటం ఎంత ప్రాముఖ్యం! GCTel 459.2

ఈ అంశాలపై చైతన్యవంతులైన వారందరూ దేవుడు తమకు అందజేసిన గొప్ప సత్యాలను గూర్చి సాక్ష్యం ఇవ్వాల్సి ఉంది. మానవాళి పక్షంగా క్రీస్తు చేస్తున్న పరిచర్యకు గుడారసేవ కేంద్రబిందువు. అది లోకంలో నివసిస్తున్న వారందరికి సంబంధించిన సత్యం. గుడారసేవ రక్షణ ప్రణాళికను మన కళ్లకు కడుతుంది. అది మనల్ని లోకం చివరి సమయానికి తీసుకువచ్చి నీతికి పాపానికి మధ్య జరుగుతున్న సంఘర్షణలో నీతి సాధించే విజయాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ అంశాల్ని ప్రతి వారూ క్షుణ్ణంగా అధ్యయనం చేయటం తమకున్న నిరీక్షణకు కారణం తెలుసుకోగోరే వారికి సమాధానం చెప్పటానికి సిద్ధంగా ఉండటం ఎంతో ప్రాముఖ్యం. GCTel 460.1

మానవుడి పక్షంగా క్రీస్తు పరలోక గుడారంలో చేస్తున్న విజ్ఞాపన సేవ రక్షణ ప్రణాళికలో ముఖ్యమైన భాగం. సిలువ మీద క్రీస్తు మరణం ఎంత ప్రాముఖ్యమైన అంశమో అదీ అంతే ప్రాముఖ్యం గల అంశం. తన మరణం ద్వారా క్రీస్తు ఏ పనిని ప్రారంభించాడో దాన్ని తన పునరుత్థానం తర్వాత ముగించటానికి పరలోకానికి ఆరోహణ మయ్యాడు. “ప్రధానయాజకుడైన యేసు... మన పక్షమున ప్రవేశించిన తెరలోపలికి మనం విశ్వాసం ద్వారా ప్రవేశించాలి. హెబ్రీ 6:20. అక్కడ కల్వరి సిలువ నుంచి వెలుగు ప్రతిబింబిస్తుంది. రక్షణ మర్మాలపై విస్పష్టమైన వెలుగు అక్కడ మనకు లభిస్తుంది. మానవ రక్షణ నిమిత్తం పరలోకం గొప్ప మూల్యం చెల్లించింది. జరిగిన బలిదానం, మీరిన ధర్మశాస్త్రానికి దీటుగా ఉన్నది. యేసు తండ్రి సింహాసనానికి మార్గం తెరిచాడు. విశ్వాసం ద్వారా దేవుని వద్దకు వచ్చేవారి యదార్ధమైన కోరిక దేవుని ముందు పెట్టటానికి సాధ్యపడుతుంది. GCTel 460.2

“అతిక్రమములను దాచి పెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును” సామెతలు 28:3. తమ తప్పిదాలు దాచిపెట్టి వాటిని సమర్ధించుకోటానికి ప్రయత్నించే వారు, తమ విషయంలో సాతాను ఎంత ఉల్లాసంగా ఉంటాడో, తాము అనుసరిస్తున్న పంథాను గురించి క్రీస్తును ఆయన దూతలను ఎంతగా ఎగతాళి చేస్తాడో గ్రహించగలిగితే వారు త్వరపడి తమ పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేస్తారు. ప్రవర్తనలోని లోపాల్ని ఆసరా చేసుకొని మనసును నియంత్రించటానికి సాతాను ప్రయత్నిస్తాడు. వారు ఆ లోపాల్ని విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే తనకు విజయం తథ్యమని అతనికి తెలుసు. అందుచేత జయం అసాధ్యమన్న తప్పుడు సిద్ధాంతంతో క్రీస్తు అనుచరులను మోసగించటానికి అనుక్షణం కృషిచేస్తాడు. అయితే గాయపడ్డ తన చేతుల్ని శరీరాన్ని చూపిస్తూ వారి పక్షాన క్రీస్తు విజ్ఞాపన చేస్తాడు. తనను వెంబడించే వారికి ఈ హామీ ఇస్తున్నాడు, “నా కృప నీకు చాలును” 2 కొరింథీ 12:9. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నాకాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.” మత్తయి 11:29, 30. కనుక తమలోపాలు నివారింపలేనివని ఎవరూ భావించకూడదు. వాటిని అధిగమించటానికి దేవుడు విశ్వాసాన్ని కృపను అనుగ్రహిస్తాడు. GCTel 460.3

ఇప్పుడు మనం గొప్ప ప్రాయశ్చిత్తాత్ర దిన సమయంలో నివసిస్తున్నాం. ఛాయారూపక పరిచర్యలో ప్రధాన యాజకుడు ఇశ్రాయేలీయులకు ప్రాయశ్చిత్తం చేస్తున్న తరుణంలో అందరూ పాప పశ్చాత్తాపంతో దేవుని ముందు దీన స్వభావంతో తమ్మును తాము దుఃపర్చుకోవలసి ఉండేది. సమాజం నుంచి దూరం కాకుండా ఉండేందుకు వారు ఇది చేయాల్సి ఉండేది. అదే మాదిరిగా జీవగ్రంథంలో తమ పేర్లు ఉండాలని ఆకాంక్షించే వారందరూ కృపకాలంలో తమకుమిగిలి ఉన్న దినాల్లో నిజమైన పాపపశ్చాత్తాపంతో ఇప్పుడు తమ్మును తాము దుఃఖపర్చుకోవాలి. నిజమైన ఆత్మ పరీక్ష జరగాలి. క్రైస్తవనామం ధరించిన అనేకమందిలో కనిపించే చపల స్వభావానికి తెరపడాలి. ఆధిపత్యం కోసం విశ్వప్రయత్నాలు చేసే దుష్ప్రభావాలను అధిగమించాలని కోరుకొనే వారందరి ముందు గొప్ప పోరాటం వేచివుంటుంది. సిద్ధబాటు అన్నది వ్యక్తిగత కృషి, రక్షణ మనకు వర్గాల వారీగా రాదు. ఒకరి పరిశుద్ధత భక్తి తత్పరత ఇవి లోపించిన ఇంకొకరికి దోహదపడవు. సకల జాతుల ప్రజలు దేవునిముందు తీర్పుకు నిలబడవలసి ఉన్నారు. ఈ భూమి మీద మరోవ్యక్తి లేడో అన్నట్లు ఆయన ప్రతీ వ్యక్తిలోని ప్రేమను నిశితంగా పరీక్షిస్తాడు. ప్రతీవ్యక్తి మచ్చ అయినా ముడుత అయినా లేకుండా నిష్కళంకంగా ఉండేందుకుగాను ప్రతీ వారిని పరీక్షించటం అవసరం. GCTel 461.1

ప్రాయశ్చితార్ధ సేవ పరిసమాప్తికి సంబంధించిన గంభీర సన్నివేశాలు వాటితో మన ప్రగాఢాసకులు ముడివడి ఉన్నాయి. ఇప్పుడు పరలోక గుడారంలో తీర్పు జరుగుతున్నది. చాలా సంవత్సరాలుగా ఈ తీర్పు ప్రక్రియ కొనసాగుతున్నది. త్వరలో - ఎంత త్వరలోనో ఎవరికీ తెలియదు-అది జీవించి వున్నవారి కేసులను చేపడ్తోంది. గంభీరమైన దైవ సముఖంలో మన జీవితాలు పరిశీలనకు వస్తాయి. క్రితంకన్నా ఇప్పుడు మరెక్కువగా రక్షకుని హితవును ఆచరణలో పెట్టటం మనకు మంచిది. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్ధన చేయండి. ఆ కాలమెప్పుడు వచ్చునో మీకు తెలియదు” మార్కు 13:33. “నీవు జాగరూకుడవై యుండని యెడల నేను దొంగవలె వచ్చెదను, ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు” ప్రకటన 3:3. GCTel 461.2

పాప పరిశోధక తీర్పు ముగిసినప్పుడు అందరి భవిత నిత్యజీవానికో నిత్య మరణానికో నిర్ణయమవుతుంది. మేఘాలలో ప్రభువురాకడకు కొంచెం ముందు కృపకాలం అంతమొందుతుంది. ఆ సమయానికి ఎదురు చూస్తూ ప్రకటన గ్రంథంలో క్రీస్తు ఈ మాటలంటున్నాడు, “అన్యాయము చేయువాడు ఇంకను అన్నాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము, పరిశుద్దుడు ఇంకను పరిశుద్ధుడుగానే యుం డనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చున్నాను. వాని వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. ” ప్రకటన 22:11,12. GCTel 462.1

నీతిమంతులు దుర్మార్తులు తమతమ నైతిక స్థితిలో భూమిపై ఇంకా జీవిస్తుంటారు. పరలోక గుడారంలో తిరుగులేని అంతిమ తీర్మానం జరిగిన సంగతి గుర్తెరుగకుండా మనుషులు తోటలు నాటటంలో, ఇళ్లు కట్టుకోటంలో, తినటంలో, తాగటంలో నిమగ్నులై ఉంటారు. జలప్రళయానికి ముందు నోవహు ఓడలో ప్రవేశించిన అనంతరం నోవహును దేవుడు లోపల, దుష్టులను ఓడ వెలుపల ఉంచి ఓడ తలుపులు మూశాడు. తమ నాశనం ఖాయమయిన సంగతి ఎరుగని ఆ ప్రజలు ఏడు రోజులపాటు రానున్న తీర్పును గూర్చిన హెచ్చరికలను ఎద్దేవా చేస్తూ అజాగ్రత్తగా జీవిస్తూ సుఖభోగాల్లో మునిగితేలారు. “అలాగుననే మనుష్యకుమారుని రాక ఉండును” అంటున్నాడు GCTel 462.2

యేసు. ప్రతీవ్యక్తి భవితను నిర్ధారించటం, దుర్మార్గులకు చివరిగా కృప ఉపసంహరించటం మధ్యరాత్రిలో దొంగ రాకలా చడిచప్పుడు లేకుండా జరిగిపోతాయి. GCTel 462.3

“ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా వుండుడి” మార్కు 13:36. కనిపెట్టి కనిపెట్టి విసిగిపోయి లోక భోగాల వైపు తిరిగేవారి పరిస్థితి ప్రమాదకరమైంది. వ్యాపారస్తుడు లాభార్జనలో మునిగి ఉండగా సుఖభోగాలపై అనురక్తిగల వాడు తాగితందనాలాడుండగా, ఫ్యాషనను ప్రేమించే అమ్మడు ఆభరణాల అలంకరణలో తలమునకలై ఉండగా సర్వప్రపంచానికి తీర్పరి అయిన న్యాయాధిపతి ఈ తీర్పు చెప్పటానికి ఆ గడియనే ఎంపిక చేసుకోవచ్చు, “ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి” దానియేలు 5:27. GCTel 462.4