ప్రవక్తలు - రాజులు
6 - చీలిన రాజ్యం
“సొలొమోను తన పితరులతోకూడ నిద్రించి, తన తండ్రియైన దావీదు పురమందు సమాధి చేయబడెను; తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయెను.” 1 రాజులు 11:43. PKTel 47.1
రెహబాము సింహాసనానికి వచ్చిన వెంటనే షెకెముకి వెళ్లాడు. అక్కడ అన్ని గోత్రాలనుంచి లాంఛనంగా గుర్తింపు పొందాల్సి ఉన్నాడు. “రెహబామునకు పట్టాభి షేకము చేయుటకై ఇశ్రాయేలీయులందరును షెకెమునకు” వెళ్లారు. 2 దిన వృ. 10:1. PKTel 47.2
హాజరైనవారిలో ఒకడు నెబాతు కుమారుడైన యరొబాము. సొలోమోను పరిపాలనకాలంలో “మహా బలాఢ్యుడు”గా పేరుపొందిన యరొబాము ఇతడే. ఇతడికి షిలోనీయుడైన అహీయా ప్రవక్త ఈ వర్తమానాన్ని అందించాడు, “సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి పదిగోత్రములు నీకిచ్చెదను.” 1 రాజులు 11:28,31. PKTel 47.3
రాజ్యాన్ని విడదీయాల్సిన అవసరాన్నిగూర్చి ప్రభువు తన ప్రవక్తద్వారా యరొబాముతో స్పష్టంగా చెప్పాడు. ఈ రాజ్య విభజన జరగాలని ప్రభువన్నాడు. ఎందుకంటే “జనులు నన్ను విడిచిపెట్టి అత్తారోతు అను సీదోనీయుల దేవతకును కామోషు అను మోయాబీయుల దేవతకును, మిల్కోము అను అమ్మోనీయుల దేవతకును మొక్కి సొలొమోను తండ్రియైన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దానిని చేయకయు, నా కట్టడలను నా విధులను ఆచరించకయు, నేను ఏర్పరచిన మార్గములలో నడవకయున్నారు.” 33వ వచనం. PKTel 47.4
సొలొమోను పరిపాలన సమాప్తం కాకముందు రాజ్యాన్ని విభజించరాదని యరొబాముని ఉపదేశించటం జరిగింది. ప్రభువిలా అన్నాడు, “రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించెను గనుక దావీదును జ్ఞాపకము చేసికొని అతని దినములన్నియు అతనిని అధికారిగా ఉండనిత్తును అయితే అతని కుమారుని చేతిలోనుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు పదిగోత్రముల నిచ్చెదను.” 34,35 వచనాలు. PKTel 47.5
దేవుని ప్రవక్త ముందే చెప్పిన క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోటానికి తన వారసుడైన రెహబాము మనసును సిద్ధం చెయ్యాలని సొలొమోను ఆశించినప్పటికీ అతడి చిన్న వయసులో ఇవ్వవలసిన శిక్షణను నిర్లక్ష్యం చెయ్యటంతో, కుమారుడి సత్ప్రవర్తన నిర్మాణానికి బలమైన పునాది వెయ్యలేకపోయాడు, రెహబాము తల్లి అమ్మోనీయు రాలు. ఆమెనుంచి రెహబాము ఊగిసలాడే ప్రవృత్తిని ప్రవర్తనను పొందాడు. కొన్నిసార్లు అతడు దేవునికి సేవ చెయ్యటానికి ప్రయత్నించేవాడు. అప్పుడు కొంత అభివృద్ధి సాధించేవాడు. కాని అతడు స్థిరమనస్సు కలవాడు కాదు. చివరికి చిన్నతనం నుంచీ తనచుట్టూ ఉన్న దుష్ప్రభావాలకు లొంగి పోయాడు. విగ్రహారాధక స్త్రీలతో సొలొమోను వివాహం తెచ్చిన భయంకర ఫలితాలు రెహబాము జీవితంలోని పొరపాట్లు, అతడి అంతిమ భ్రష్టతలో వెల్లడయ్యాయి. సొలొమోను కఠిన పరిపాలనలో ప్రజలు తీరని అన్యాయాలకు తీవ్ర బాధలకు గురి అయ్యారు. సొలొమోను భ్రష్టత చోటుచేసుకున్నకాలంలో అతడి పరిపాలన ప్రజలపై భారమైన పన్నుల విధింపుకు దారితీసింది. ప్రజలచే వెట్టి చాకిరీ చేయించు కోటం కూడా అవసరమయ్యింది. కొత్త రాజు పట్టాభిషేకం జరగకముందు ప్రజల భారాల్ని తగ్గించే ఉద్దేశం తనకున్నదోలేదో సొలొమోను కుమారుడినుంచి తెలుసు కోవాలని నిశ్చయించుకున్న గోత్రాల నాయకులు రెహబాముని కలిశారు. “యరొబామును ఇశ్రాయేలువారందరును కూడా వచ్చి నీ తండ్రి మా కాడిని బరువు చేసెను. నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మామీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులకన చేసినయెడల మేము నిన్ను సేవింతుమని రెహబాముతో మనవి చేశారు. PKTel 48.1
తన పరిపాలనా విధానాన్ని రూపకల్పన చెయ్యకముందు తన సలహాదారులతో సంప్రదించాలని చెప్పి రెహబాము వారితో “మారు మూడు దినములు తాళి మరల నా యొద్దకు రండని చెప్పెను గనుక జనులు వెళ్లిపోయిరి.” PKTel 48.2
“అప్పుడు రాజైన రెహబాము తన తండ్రియైన సొలొమోను సజీవియై యుండగా అతని సమక్షమున పిలిచిన పెద్దలను పిలిపించి - యీ జనులకు నేనేమి ప్రత్యుత్తర మియ్యవలెను? మీరు చెప్పు ఆలోచన ఏది అని అడుగగా వారు - నీవు ఈ జనము యెడల దయాదాక్షిణ్యములు చూపి వారితో మంచిగా మాటలాడిన యెడల వారు ఎప్పటికిని నీకు దాసులైయుందురని అతనితో చెమరి.” 2 దిన వృ. 10:3-7. PKTel 48.3
ఆ ఆలోచన రెహబాముకి నచ్చలేదు. తన యౌవనంలోను యుక్త వయసులోను సహవాసం చేసిన యువకుల్ని పిలిపించి వారిని ఇలా అడిగాడు, “మామీద నీ తండ్రి యుంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకొనిన యీ జనులకు ప్రత్యుత్తర మిచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు?” 1 రాజులు 12:9. అతడు తన రాజ్యంలోని ప్రజలతో కఠినంగా వ్యవహరించాలని, తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో వారు జోక్యం కలిగించుకోటం తాను సహించేదిలేదని ఆరంభంలోనే విశదం చేయటం మంచిదని సలహా చెప్పారు. PKTel 49.1
సర్వాధికారం చెలాయించవచ్చునని భావించి రెహబాము తనరాజ్యంలోని పెద్దలు ఇచ్చిన సలహాను తోసిపుచ్చి యువకుల్ని తన సలహాదారులుగా ఎంపిక చేసుకున్నాడు. తాను అనుసరించదలచుకున్న విధానం గురించి తెలుసుకోటానికి నియమిత దినాన “యరొబామును జనులందరును ... రెహబామునొద్దకు” వచ్చినప్పుడు అతడు “వారికి కఠినముగా ప్రత్యుత్తరమిచ్చి యిట్లు ఆజ్ఞాపించెను. - నా తండ్రి మి కాడిని బరువుగా చేసెనుగాని నేను మికాడిని మరి బరువుగా చేయుదును, నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెనుగాని నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును.” 12-14 వచనాలు. PKTel 49.2
ఇశ్రాయేలు విషయంలో దేవుని చిత్తాన్ని రెహబాము, అనుభవంలేని అతడి సలహాదారులు, అవగాహన చేసుకుని ఉంటే, పరిపాలన విధానంలో దిద్దుబాటు కోరూ ప్రజలు చేసిన మనవిని అంగీకరించేవారు. షెకెము సమావేశంలో తమకు కలిగిన అవకాశాన్ని వినియోగించుకుని కార్యకారణాల్ని హేతుబద్దంగా పరిశీలించటంలో, ఎక్కువమంది ప్రజల్ని ప్రభావితం చెయ్యకుండా వారిని బలహీన పర్చటంలో, రాజు అతడి సలహాదారులు ఈరకంగా విఫలులయ్యారు. సొలొమోను పరిపాలన కాలంలో ప్రవేశపెట్టిన కాఠిన్యాన్ని కొనసాగించటానికి దానికి మరింత కాఠిన్యాన్ని చేర్చటానికి వ్యక్తంచేసిన సంకల్పం, ఇశ్రాయేలు విషయంలో దేవుని ప్రణాళికకు విరుద్ధం. రాజు వ్యక్తంచేసిన ఈ తీర్మానం అతడి ఉద్దేశాల గురించి చిత్తశుద్ధి గురించి ప్రజల్లో సందేహాలు రేపింది. అధికారాన్ని చూపించుకోటానికి చేసిన బుద్ధిహీనమైన ఈ ప్రయత్నంలో రాజు అతడి సలహాదారులు అహంభావం, అధికార దర్పం కనపర్చారు. PKTel 49.3
రెహబాము ప్రకటించిన విధానాన్ని అమలు పర్చటానికి దేవుడు అనుమతించ లేదు. గోత్రాల్లో అనేకమంది సొలొమోను పాలనలో అమలుపర్చిన కఠిన విధానానికి తీవ్రంగా ప్రతిస్పందించారు. వీరిప్పుడు దావీదు వంశంపై తిరుగుబాటు చెయ్యటంకన్నా గత్యంతరం లేదని భావించారు. “ఇశ్రాయేలు వారందరును రాజు తమ విన్నపమును వినలేదని తెలిసికొని రాజుకీలాగు ప్రత్యుత్తరమిచ్చిరి - దావీదులో మాకు భాగమేది? యెషయి కుమారునియందు మాకు స్వాస్థ్యములేదు; ఇశ్రాయేలు వారలారా, మిమి గుడారములకు పోవుడి; దావీదు సంతతివారలారా, మి వారిని మిరే చూచుకొనుడి అని చెప్పి ఇశ్రాయేలువారు తమ గుడారములకు వెళ్లిపోయిరి.” 16వ వచనం. PKTel 49.4
రెహబాము దురుసు మాటలు అగాధాన్ని సృష్టించాయి. అది పూడ్చలేని అగాధం. అప్పటినుంచి ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాలు విడిపోయాయి. యూదా బైన్యామిను గోత్రాలు రెహబాము ఏలుబడికింద దిగువ యూదా లేక దక్షిణ యూదా రాజ్యమయ్యింది. ప్రవక్త ప్రవచించిన చీలిక ఈవిధంగా నెరవేరింది. “యెహోవా ఈలాగు జరిగించెను.” 15వ వచనం. PKTel 50.1
ఆ పదిగోత్రాలు తనకు మద్దతు ఉపసంహరించుకోటం చూసినప్పుడు రెహబాము కళ్లు తెరిచి చర్యలు చేపట్టాడు. తన రాజ్యంలో పలుకుబడిగల మనుషుల్లో ఒకడైన “అదోరామును పంపగా” అతడు ప్రజల్ని సముదాయించ టానికి ప్రయత్నించాడు. అయితే ఆ శాంతిదూతకు వారు చేసిన కార్యం రెహబాముపట్ల వారి భావోద్వేగాల్ని సూచించింది. “ఇశ్రాయేలు వారందరును రాళ్లతో అతని కొట్టినందుకు అతడు మరణమాయెను.” దీన్నిబట్టి తిరుగుబాటు బలం పుంజుకుంటున్నట్లు గ్రహించి “రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవలెనని తన రథముమీద త్వరగా ఎక్కెను.” 18వ వచనం. PKTel 50.2
“రెహబాము యెరూషలేమునకు వచ్చిన తరువాత ఇశ్రాయేలు వారితో యుద్దము చేసి, రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబాము అను తనకు మరల వచ్చునట్లు చేయుటకై యూదావారందరిలోనుండియు, బెన్యామాను గోత్రీయులలో నుండియు యుద్ధ ప్రవీణులైన లక్ష యెనుబది వేలమందిని పోగుచేసెను. అంతట దేవుని వాక్కు దైవ జనుడగు షెమయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను - నీవు సొలొమోను కుమారుడును యూదా రాజునైన రెహబాముతోను, యూదా వారందరితోను బెన్యామినీయులందరితోను శేషించిన వారందరితోను ఇట్లనుము - యెహోవా సెలవిచ్చునదేమనగా - జరిగినది నావలననే జరిగెను; మీరు ఇశ్రాయేలువారగు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్లక అందరును మిమి యిండ్లకు పోవుడి.” 21-24 వచనాలు. PKTel 50.3
తన పరిపాలన ఆరంభంలో కలిగిన విషాదపూరిత అనుభవం నుంచి గుణపాఠాలు నేర్చుకోటానికి రెహబాము మూడు సంవత్సరాలు ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో అతడు గొప్ప ప్రయోజనం పొందాడు. అతడు “యూదా ప్రదేశమందు ప్రాకారములను కట్టించెను.” “దుర్గములను బలపరచి, వాటిలో అధిపతులను ఉంచి, ఆహారమును, నూనెను, ద్రాక్షరసమును సమకూర్చెను. ఈ ప్రాకారపురాల్ని “బహు బలవంతమైనవాటిగా” చెయ్యటంలో శ్రద్ద వహించాడు. 2 దినవృ. 11:5,11,12. అయితే రెహబాము పరిపాలించిన తొలి సంవత్సరాల్లోని అభివృద్ధి రహస్యం అతడు చేపట్టిన ఈ చర్యల్లోలేదు. యూదా బైన్యామీను గోత్రాల్ని అభివృద్ధిపథంలో ఉంచింది వారు దేవుణ్ని తమ సర్వోన్నత పరిపాలకుడుగా ఎన్నుకోటమే. ఉత్తర గోత్రాలకు చెందిన అనేకమంది భక్తులు వారిలో చేరారు. ఆ దాఖలా ఇలా చెబుతున్నది, “ఇశ్రాయేలీయుల గోత్రములయందంతటను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు బలుల నర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి. దావీదును సొలొమోనును నడిచిన మార్గమందు మూడు సంవత్సరములు వారు నడచి, యూదా రాజ్యమును బలపరచి మూడు సంవత్సరములు సొలొమోను కుమారుడైన రెహబామునకు సహాయకులైరి.” 16,17 వచనాలు. PKTel 50.4
ఈ విధానాన్ని కొనసాగించటంపైనే రెహబాము పాత తప్పిదాన్ని నివారించుకోటం, తాను విజ్ఞతతో దేశాన్ని పరిపాలించగలడన్న నమ్మకం ప్రజల్లో పుట్టించగలగటం చాలామట్టుకు ఆధారపడి ఉంది. కాని సొలొమోను వారసుడు యెహోవాకు నమ్మకంగా ఉండటానికి ప్రజల్ని ప్రభావితం చెయ్యలేకపోయాడని పరిశుద్ధ లేఖనం దాఖలు చేసింది. స్వతసిద్ధంగా తలబిరుసుతనం, ఆత్మవిశ్వాసం, మంకుతనం, విగ్రహారాధనపట్ల మక్కువ కలిగి ఉన్నా, అతడు దేవున్ని సంపూర్తిగా నమ్మి ఉన్నట్లయితే అతడు పటిష్టమైన ప్రవర్తనను అచంచల విశ్వాసాన్ని కలిగి, దేవుని న్యాయవిధుల్ని ఆచరించటం సాధ్యపడేది. అయితే కాలక్రమంలో రాజు తన నమ్మకాన్ని అధికారహోదామిద తాను పటిష్టపర్చిన దుర్గాలమీద పెట్టుకున్నాడు. క్రమక్రమంగా పారంపర్య బలహీనతలకు తావిచ్చి చివరికి పూర్తిగా విగ్రహారాధనకు అంకితమయ్యాడు. “రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీయులందరును యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి.” 2 దినవృ. 12:1. PKTel 51.1
“అతడును ఇశ్రాయేలీయులందరును” అన్న మాటలు ఎంత విషాధభరితమైనవి! ఎంత ప్రాధాన్యం గలవి! (2 దిన వృ. 12:1) చుట్టూ ఉన్న జాతులకు వెలుగుగా నిలవటానికి దేవుడు ఎవరిని ఎంపిక చేసుకున్నాడో ఆ ప్రజలు సర్వశక్తికి ఆధారభూతుడైన ప్రభువునుంచి వైదొలగి తమ చుట్టూ ఉన్న జాతుల్లా నివసించటానికి తెగబడ్తున్నారు. సొలొమోనులాగే రెహబాముకూడా తన చెడ్డ మాదిరిద్వారా అనేకుల్ని తప్పుదారి పట్టించాడు. వీరిలాగే కొద్దిగానో గొప్పగానో తన్నుతాను దుష్టత్వానికి అప్పగించుకునే ప్రతీ వ్యక్తి దుష్టత అతడికి మాత్రమే పరిమితమై ఉండదు. ఎవరూ ఇతరులతో సంబంధం లేకుండా తమంతటతామే నివసించలేరు. తమ దుష్టత్వం వల్ల ఎవరూ తాము మాత్రమే నశించరు. ప్రతీ జీవితం ఇతరుల మార్గాన్ని కాంతితోనూ, ఆనందంతోనూ నింపే వెలుగుగానో లేక నిస్పృహను, వినాశాన్ని సృష్టించే చీకటిగానో ఉంటుంది. మనం ఇతరుల్ని ఉన్నత స్థితికీ, ఆనందానికీ నిత్య జీవానికో లేక అధోగతికీ, దుఃఖానికీ, నిత్య మరణానికో నడిపిస్తాం. మనం మన క్రియల ద్వారా మన చుట్టూ ఉన్న దుష్టశక్తుల్ని బలపర్చటంగాని లేక అవి క్రియాత్మక మవ్వటానికి ఒత్తిడి చెయ్యటంగాని చేస్తే వాటి పాపంలో మనం భాగస్వాములవుతాం. PKTel 51.2
యూదా రాజు భ్రష్టతను దేవుడు శిక్షించకుండా విడిచి పెట్టలేదు. “వారు యెహోవా యెడల ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క అయిదవ సంవత్సరమందు ఐగుపు రాజైన షీషకు వెయ్యిన్ని రెండువందల రథములతోను అరువదివేల గుట్టపు రౌతులతోను యెరూషలేము మీదికి వచ్చెను .... అతడు యూదాకు సమిపమైన ప్రాకార పురములను పట్టుకొని యెరూషలేము వరకు వచ్చారు. PKTel 52.1
“ప్రవక్తయైన షేమయా రెహబాము నొద్దకును ఓషకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడియున్న యూదావారి అధిపతులయొద్దకును వచ్చి - మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మును షీషకు చేతిలోపడనిచ్చి యున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను.” 2-5 వచనాలు. PKTel 52.2
ప్రజలు ఇంకా దేవుని తీర్పుల్ని తృణీకరించేంతగా మతభ్రష్ణులు కాలేదు. షీషకు దాడివల్ల కలిగిన నష్టాల్లో దేవుని హస్తమున్నదని గుర్తించి కొంతకాలం ప్రజలు అణిగి మణిగి ఉన్నారు. “యెహోవా న్యాయస్థుడని” ఒప్పుకున్నారు. PKTel 52.3
“వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షేమయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను - వారు తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనము చేయక షీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేముమీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసెదను. అయితే నన్ను సేవించుటకును, భూరాజులకు దాసులై యుండుటకును ఎంత భేదమున్నదో వారు తెలిసికొనునట్లు వారు అతనికి దాసులగుదురు. PKTel 52.4
“ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదికి వచ్చి యెహోవా మందిరపు బొక్కసపులన్నిటిని రాజనగరులోని బొక్కసములన్నిటిని దోచుకొని, సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసికొనిపోయెను. వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి వాటిని రాజనగరుయొక్కద్వారమును కాయు సేవకుల యొక్క అధిపతులకు అప్పగించెను.... అతడు తన్నుతాను తగ్గించుకొనినందున యెహోవా అతని బొత్తిగా నిర్మూలము చేయక యూదావారు కొంతమట్టుకు మంచితనము ననుసరించుట చూచి తన కోపము అతని మీదనుండి త్రిప్పుకొనెను.” 6-12 వచనాలు. PKTel 52.5
అయితే కష్టకాలం గడచిపోయాక దేశం మరొకసారి ప్రగతి పథాన పడగా అనేకులు తమ భయానికి స్వస్తిచెప్పి మళ్లీ విగ్రహారాధనకు దిగారు. వీరిలో ముఖ్యుడు రాజైన రెహబామే. తనకు కలిగిన ఆపదవల్ల దీనుడైనా ఆ అనుభవం తన జీవితాన్ని నిర్ణయాత్మకమైన మలుపు తిప్పటానికి ఉపకరించలేదు. దేవుడు తనకు నేర్పించటానికి ప్రయత్నించిన పాఠాన్ని మర్చిపోయి దేశంపై దేవుని తీర్పులు పడటానికి కారణమైన పాపాలు మళ్లీ చెయ్యడం మొదలు పెట్టాడు. “తన మనస్సు యెహోవాను వెదకుటయందు నిలుపుకొనక చెడుక్రియలు చేసెను.” అపఖ్యాతి గడించిన కొన్ని సంవత్సరాల పరిపాలన అనంతరం “రెహబాము తన పితరులతోకూడ నిద్రించి దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను.” 14-16 వచనాలు. PKTel 53.1
రెహబాము తొలినాళ్ల పరిపాలన కాలంలో సంభవించిన చీలికతో ఇశ్రాయేలు వైభవం క్షీణించనారంభించింది. అది మళ్లీ యధాపూర్వ మహిమను తిరిగి పొందలేదు. అనంతర శతాబ్దాల్లో కొన్నిసార్లు నైతిక యోగ్యత దూరదృష్టిగల వ్యక్తులు దావీదు సింహాసనంపై ఆసీనులై పరిపాలించారు. ఈ రాజుల ఏలుబడిలో యూదా ప్రజలకు కలిగిన దీవెనలు చుట్టపక్కల ఉన్న జాతులికి కూడా విస్తరించాయి. కొన్నిసార్లు యెహోవా నామం అబద్ద దేవతలకు పైగా హెచ్చించటం, ఆయన ధర్మశాస్త్రంపట్ల ప్రజలు భక్తి గౌరవాలు చూపించటం జరిగింది. రాజు హస్తాల్ని బలపర్చటానికి, నమ్మకంగా నివసించటానికి ప్రజల్ని ప్రోత్సహించటానికి అప్పుడప్పుడు ఉద్దండ ప్రవక్తలు ఉదయించారు. ఇలాగుండగా రెహబాము సింహాసనానికి వచ్చినప్పుడు మొలకెత్తిన చెడు విత్తనాల్ని పీకివేయటం ఎన్నడూ సాధ్యపడలేదు. కొన్నిసార్లు దేవుడు ఎంపిక చేసుకున్న ప్రజలు బొత్తిగా దిగజారిపోయి అన్యజనులమధ్య సామెతగా నిలవాల్సి ఉన్నారు. . PKTel 53.2
విగ్రహారాధనపట్ల మొగ్గు చూపినవారి వ్యతిరేకత ఉన్నప్పటికీ చీలిన రాజ్యం నాశనం కాకుండేందుకు తాను చేయగలిగినదంతా దేవుడు చేశాడు. కాలం గతిస్తున్నకొద్దీ సాతానుశక్తుల ప్రోద్బలంతో ఇశ్రాయేలు ముందుకు సాగలేని స్థితిలో ఉన్నట్లు కనిపించినప్పుడు తాను ఎన్నుకున్న జాతి ఉపకారార్ధమైన తన ఏర్పాట్లను బానిసత్వంద్వారాను, పునరుద్ధరణద్వారాను ఆయన బలపర్చుతూ వచ్చాడు. PKTel 53.3
రాజ్యం చీలిక ఒక అద్బుత చరిత్రకు నాంది. అందులో దేవుని దీర్ఘశాంతం ఆయన కృప ప్రస్పుటంగా కనిపించాయి. పారంపర్య బలహీనతల వల్ల ఇతరులనుంచి నేర్చుకున్న అభ్యాసాలవల్ల చెడుగు చేయటం మూలాన కలిగే శ్రమల కొలిమిలోనుంచి దేవుడు ఎవరిని తన ప్రత్యేక జనాంగంగాను, సత్రియలకు ఉత్సాహపడే ప్రజలుగాను తీర్చిదిద్దగోరుతున్నాడో వారు చివరికి ఈ అంగీకారాన్ని వ్యక్తం చెయ్యాల్సి ఉన్నారు: PKTel 54.1
“యెహోవా, నిన్ను పోలినవాడెవడును లేడు, నీవు మహాత్మ్యము గలవాడవు, నీ శౌర్యమునుబట్టి నీ నామము ఘనమైనదాయెను. జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోను వారి రాజ్యములన్నిటిలోను నీవంటివాడెవడును లేడు. “యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు.” యిర్మి. 10:6,7,10. PKTel 54.2
అబద్ధ దేవతలు ఉద్దరించటానికి రక్షించటానికి శక్తిహీనులని తుదకు విగ్రహారాధకులు గ్రహించవలసి ఉన్నారు. “ఆకాశమును భూమిని సృష్టింపని యీ దేవతలు భూమిమీద నుండకుండను ఆకాశముక్రింద ఉండకుండను నశించును.” 11వ వచనం. సమస్తానికీ సృష్టికర్త సమస్తాన్ని పరిపాలించేవాడు అయిన సజీవ దేవునికి విశ్వాసపాత్రంగా నివసించటంలోనే మానవుడికి విశ్రాంతి, శాంతి లభ్యమౌతాయి. PKTel 54.3
శిక్ష అనుభవించిన, పశ్చాత్తాపం పొందిన ఇశ్రాయేలు, యూదా ప్రజలు తమ తండ్రుల దేవుడు సైన్యాలకు అధిపతి అయిన యెహోవాతో చివరగా తమ నిబంధనను నవీకరించుకోవాల్సి ఉన్నారు. ఆయన్ని గురించి వారిలా వెల్లడి చేయాల్సి ఉన్నారు. PKTel 54.4
“ఆయన తన శక్తిచేత భూమిని సృష్టించెను
తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను
తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాల పరచెను.”
“ఆయన ఆజ్ఞనియ్యగా జలరాశులు ఆకాశమండలములో
పుట్టును
భూమ్యంతభాగములలోనుండి ఆయన ఆవిరి
ఎక్కజేయును
వరము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును
తన ధనాగారములోనుండి గాలిని రావించును.” “తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు
పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి
అవమానము నొందుచున్నాడు
అతడు పోతపోసినది మాయారూపము
అందులో ప్రాణమేమియు లేదు.”
“అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు
విమర్శకాలములో అవి నశించిపోవును
యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటివంటివాడు కాడు.”
“ఆయన సమస్తమును నిర్మించువాడు
ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము
సైన్యములకధిపతియగు యెహోవాయని ఆయనకు పేరు”
PKTel 54.5
12-16 వచనాలు.