ప్రవక్తలు - రాజులు
3 - ప్రగతివల్ల గర్వం
సొలొమోను దైవ ధర్మశాస్త్రాన్ని ఘనపర్చినంతకాలం దేవుడు అతడితో ఉన్నాడు. ఇశ్రాయేలుని నిష్పాక్షికంగా, కరుణార్ధంగా పరిపాలించటానికి అతడికి వివేకాన్నిచ్చాడు. మొదట్లో సంపద, లోక ప్రతిష్ఠ వచ్చినప్పుడు దీనంగా వినయంగా ఉన్నాడు. అతడి ప్రభావం బలంగా ఉంది. “నది (యూఫ్రటీసు) మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు... సొలొమోను ప్రభుత్వము చేసెను.” “సొలొమోను దినములన్నిట ఇశ్రాయేలువారేమి యూదావారేమి ... తమతమ ద్రాక్షచెట్ల క్రిందను అంజూరపు చెట్లక్రిందను నిర్భయంగా నివసించుచుండిరి.” 1 రాజులు. 4:21,24, 25. PKTel 20.1
అయితే గొప్ప భవిష్యత్తు ఉన్నట్లు కనిపించిన ఒక ఉదయం అనంతరం మత భ్రష్టతవల్ల అంతా చీకటి అయ్యింది. యదీద్యా - యెహోవాకు ప్రియుడు - అని పిలువబడిన అతడు (2 సమూ. 12:25, మార్టీను) లోక వ్యాప్తంగా తనకు కీర్తి సంపాదించినంతగా దేవుని వలన వివేకం, నీతివర్తన పొందిన అతడు, ఇశ్రాయేలు దేవున్ని ఘనపర్చటంలో ఇతరుల్ని నడిపించిన అతడు, యెహోవా ఆరాధనకు స్వస్తి చెప్పి అన్యుల విగ్రహాలికి నమస్కరించటం మొదలుపెట్టాడు. PKTel 20.2
సొలొమోను సింహాసనానికి రావటానికి వందల సంవత్సరాలు ముందు, ఇశ్రాయేలీయులపై రాజులుగా ఎంపికయ్యేవారు ఎదుర్కునే ప్రమాదాల్ని ముందే చూసి ప్రభువు మోషేద్వారా వారికి మార్గదర్శక సూత్రాల్నిచ్చాడు. ఇశ్రాయేలు సింహాసనంపై ఆసీనుడు కావలసిన రాజు “లేవీయులైన యాజకుల స్వాధీనమందున్న గ్రంథమునుచూచి” యెహోవా కట్టడలు “ఒక ప్రతిని తనకొరకు వ్రాసికొనవలెను” అని ఆదేశించాడు. ప్రభువిలా అన్నాడు, “అది అతనియొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును, తన కుమారులును ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరులమీద గర్వించి, యీ ధర్మశాస్త్రమును విడిచిపెట్టి కుడికిగాని యెడమకుగాని తాను తొలగక యుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని యీ కట్టడలను ఆచరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రదుకు దినము లన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను.” ద్వితియో. 17:18-20. PKTel 20.3
రాజుగా అభి షేకం పొందే వ్యక్తి నుద్దేశించి “తన హృదయము తొలగిపోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసికొన కూడదు” అంటూ ప్రభువు ప్రత్యేకించి ఈ ఉపదేశం సందర్భంగా హెచ్చరించాడు (17వ వచనం). PKTel 21.1
ఈ హెచ్చరికలు సొలొమోనుకి తెలుసు. కొంతకాలం వాటిని పాటించాడు. సీనాయివద్ద దేవుడిచ్చిన కట్టడలకు అనుగుణంగా నివసించాలన్నదే అతడి ఆకాంక్ష. అతడి వ్యవహారశైలి ఆ కాలపు జాతుల్లోని ఆచారాలు అలవాట్లకన్నా భిన్నమైంది. ఆ జాతులు దేవునికి భయపడలేదు. వాటి రాజులు దేవుని పరిశుద్ద ధర్మశాస్త్రాన్ని కాలరాచారు. PKTel 21.2
ఇశ్రాయేలుకి దక్షిణంగా ఉన్న శక్తిమంతమైన రాజ్యంతో సంబంధాలు బలీయం చేసుకునేందుకు సొలొమోను నిషిద్ధ భూభాగంలో అడుగుపెట్టడానికి సాహసించాడు. విధేయత ఫలాలేంటో సాతానుకి బాగా తెలుసు. సొలొమోను పరిపాలన ప్రారంభ సంవత్సరాల్లో - రాజు జ్ఞానం, ఔదార్యం, నిజాయితీల్ని బట్టి అవి మహిమాన్వితమైన సంవత్సరాలు - సొలొమోను విశ్వాసపాత్రతను నియమబద్దతను నిర్వీర్యం చేసి దేవునినుంచి వేరు చెయ్యటానికి సాతాను ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో సాతాను విజయం సాధించాడన్నది ఈ దాఖలా వెల్లడి చేస్తుంది : “సొలొమోను ఐగుప్తురాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసికొని ... ఫరో కుమార్తెను దావీదు పురమునకు రప్పించెను.” 1 రాజులు 3:1. PKTel 21.3
ఈ వివాహం దైవధర్మశాస్త్ర బోధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ అదొక మేలుగా పరిణమించింది. ఎందుకంటే అన్యురాలైన ఆమె మారుమనసుపొంది భర్త సొలొమోనుతో కలిసి నిజదేవుణ్ని ఆరాధించింది. అంతేకాదు ఫరో గెజెరు పట్టణాన్ని పట్టుకొని “ఆ పట్టణమందున్న కనానీయులను హతముచేసి” దాన్ని “తన కుమార్తెయైన సొలొమోను భార్యకు కట్నముగా” ఇవ్వటంద్వారా ఇశ్రాయేలుకి గొప్ప సేవ చేశాడు. (1 రాజులు. 9:16). ఈ పట్టణాన్ని సొలొమోను తిరిగి నిర్మించాడు. ఇది మధ్యధరా తీరప్రాంతంలోని అతడి రాజ్యాన్ని బలోపేతం చేసింది. అయినా ఒక అన్యమతాన్నవలంబించే జాతితో సంబంధం ఏర్పర్చుకుని, విగ్రహారాధకురాలైన రాకుమారితో వివాహంద్వారా ఆ సంబంధాన్ని స్థిరపర్చుకోటంలో దేవుడు తన ప్రజల స్వచ్ఛతను కాపాడే నిమిత్తంచేసిన జ్ఞానయుక్తమైన ఏర్పాటును సొలొమోను నిర్లక్ష్యం చేశాడు. ఐగుప్తీయురాలైన తన భార్య క్రీస్తుని అంగీకరించవచ్చునన్నది పాపం చెయ్యటానికి ఒక బలహీన సాకు మాత్రమే. PKTel 21.4
కృపగల దేవుడు ఈ భయంకర తప్పిదాన్ని కొంతకాలం విస్మరించాడు. రాజు విజ్ఞత కలిగి తన బుద్దిహీనతవల్ల ప్రారంభమైన దుష్పరిణామాల్ని చాలామట్టుకు అదుపుచేసి ఉండాల్సింది. అయితే సొలొమోను తన శక్తికి, ప్రాభవానికి నిజమైన మూలాన్ని విస్మరించటం మొదలుపెట్టాడు. బుద్దికన్నా యిష్టం ప్రబలమవ్వటంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రభువు ఉద్దేశాన్ని తన సొంతమార్గంలో నెరవేర్చటానికి ప్రయత్నించాడు. చుట్టుపట్ల ఉన్న దేశాలతో రాజకీయ, వాణిజ్యపర బంధాలు ఈ దేశాలు నిజదేవుణ్ని తెలుసుకోటానికి దారితీస్తాయని సొలొమోను ఆలోచన. దేశం తర్వాత దేశంతో అతడు అపవిత్ర సంబంధాలు ఏర్పర్చుకున్నాడు. తరచు ఈ సంబంధాలు అన్యమత రాకుమార్తెలతో వివాహ బాంధవ్యాలకు దారితీశాయి. యెహోవా ఆజ్ఞల్ని పక్కనపెట్టి చుట్టుపట్ల ఉన్న ప్రజల ఆచారాల్ని స్వీకరించాడు. PKTel 22.1
తన జ్ఞానం, తన ఆదర్శ ప్రభావం తన భార్యలు విగ్రహారాధనను విడిచిపెట్టి నిజదేవుణ్ని ఆరాధించటానికి నడిపిస్తాయని, అలా ఏర్పడ్డ సంబంధాలు చుట్టుపట్ల ఉన్న జాతుల్ని ఇశ్రాయేలుతో మరింత సన్నిహితం చేస్తాయని సొలొమోను భావించి మురిసిపోయాడు. అది అడియాశే! అన్యమత బాంధవ్యాల ప్రభావాన్ని ప్రతిఘటించ టానికి తనకు శక్తి ఉన్నదని తలంచటంలో సొలొమోను పొరపాటు ప్రాణాంతక మయిన పొరపాటు. తాను దేవుని ధర్మవిధుల్ని నిర్లక్ష్యం చేసినా, ఆ పరిశుద్ద విధుల్ని ఆచరించి, పరిస్థితిని మార్చటానికి ఇతరులు ముందుకు రావచ్చునని సొలొమోను తలంచటం మరింత మోసకరం, ప్రాణాంతకం అయిన పొరపాటు. PKTel 22.2
అన్యమత దేశాలతో రాజు ఏర్పర్చుకున్న సంబంధాలు అతడికి ఐహికమైన ప్రఖ్యాతి, కీర్తి, సిరిసంపదలు సంపాదించాయి. అతడు ఓఫీరు నుంచి బంగారం, తరీషునుంచి వెండి సమృద్దిగా తేగలిగాడు. “రాజు యెరూషలేమునందు వెండి బంగారములను రాళ్లంత విస్తారముగాను, సరళ మ్రానులను షెఫేల ప్రదేశముననున్న మేడిచెట్లంత విస్తారముగాను సమకూర్చెను.” 2 దినవృ. 1:15. సొలొమోను దినాల్లో అధిక సంఖ్యాకులకు సిరిసంపదలు వాటితో వాటి శోధనలు వచ్చాయి. కాని ప్రశస్త ప్రవర్తన బంగారం కొడిగొట్టి నల్లబడింది. PKTel 22.3
సొలొమోను భ్రష్టత క్రమక్రమంగా జరగటంతో తాను గ్రహించకముందే అతడు దేవునికి దూరంగా వెళ్లిపోయాడు. దాదాపు తనకు తెలియకుండానే దేవున్ని నమ్మటం, దేవుని నడుపుదలమిద దీవెనలమీద ఆధారపడటం సన్నగిల్లి స్వీయ బలాన్ని, నమ్ముకోటం ఇంతలంతలయ్యింది. ఇశ్రాయేలీయుల్ని ఒక ప్రత్యేక, విలక్షణ జనాంగంగా రూపుదిద్దే అచంచల విశ్వాసాన్ని కొద్దికొద్దిగా దేవునిపై నుంచి నిలుపుచెయ్యటం, చుట్టుపట్ల ఉన్న దేశాల ఆచారాల్ని, అభ్యాసాల్ని అవలంబించటం ప్రారంభ మయ్యింది. తన విజయాలతోను, గౌరవప్రదమైన తన హోదాతోను వచ్చిన శోధనలకు లొంగి అతడు తన ప్రగతికి మూలమైన ప్రభువుని మర్చిపోయాడు. అధికారం, ఔన్నత్యం పరంగా తక్కిన రాజ్యాలకన్నా ఎత్తులో ఉండాలన్న దురాశ, ఇంతవరకూ దేవుని మహిమకు ఉపయుక్తమైన వరాల్ని, స్వార్థకోరికల నెరవేర్పుకు వినియోగించటానికి దారితీసింది. అర్హులైన పేదల సహాయార్థం, పరిశుద్ధ జీవిత నియామాల్ని లోకమంతటా వ్యాప్తి చేయ్యటంకోసం వినియుక్తం కావలసిన పరిశుద్ధ నిధుల్ని అత్యాశతో నిండిన పథకాలకి వినియోగించటం జరిగింది. PKTel 22.4
మంది మార్బలం హంగు ఆర్భాటాల ప్రదర్శనలో ఇతర రాజ్యాలకన్నా ఒక మెట్టు పైగా ఉండాలన్న తపనతో ఉన్న రాజు ప్రవర్తన సౌందర్యాన్ని, సంపూర్ణతను విస్మరించాడు. లోకంముందు స్వీయ ఔన్నత్యాన్ని చాటుకోటానికి ప్రయత్నించటంలో తన గౌరవాన్ని విశ్వసనీయతను అమ్ముకున్నాడు. పెక్కు దేశాలతో వాణిజ్యం ద్వారా అపార లాభాలు సంపాదించాడు. దానికి తోడుగా అధిక పన్నులు విధించాడు. ఈ రకంగా అహంభావం, అత్యాశ, దుర్వ్యయం, అతిలోలత్వం, క్రూరత్వం రూపంలోను, బలవంతపు వసూళ్ల రూపంలోను తమ ఫలాలు ఫలించాయి. అతడి పరిపాలన ప్రారంభ సంవత్సరాల్లో ప్రజలతో తన వ్యవహార శైలిలో ప్రదర్శితమైన దయార్ధత, సహృదయత ఇకలేవు. రాజలందరిలోను మిక్కిలి వివేకవంతుడు, దయార్ద హృదయుడు అయిన అతడు ఇప్పుడు కఠినాత్ముడైన నిరంకుశపాలకుడుగా దిగజారి పోయాడు. ఒకప్పుడు దయగల పరిపాలకుడు, దైవభక్తిగల ప్రజా సంరక్షకుడు అయిన అతడు హింసకుడుగా నిరంకుశ అధికారిగా వ్యవహరించాడు. విలాసవంతమైన ఆస్థానాన్ని కొనసాగించేందుకు ప్రజలపై పన్నుమిద పన్ను విధించాడు. PKTel 23.1
ప్రజలు ఫిర్యాదు చెయ్యటం మొదలుపెట్టారు. ఒకప్పుడు రాజుపట్ల తమకున్న గౌరవాభిమానాలు ఇప్పుడు విరక్తిగా ద్వేషంగా మారాయి. PKTel 23.2
మానవహస్తంపై ఆనుకొని ఉండటాన్ని నివారించటానికిగాను ఇశ్రాయేలుని పరిపాలించేవారు గుర్రాల సంఖ్య పెంచుకోకూడదని ప్రభువు హెచ్చరించాడు. కాని ఈ దైవాదేశానికి విరుద్దంగా “సొలొమోనుకుండు గుఱ్ఱములు ఐగుప్తునుండి తేబడెను.” “సొలొమోను రథములను, రౌతులను సమకూర్చెను; అతడు వెయ్యిన్ని నాలుగువందల రథములను, పండ్రెండువేల రౌతులును గలవాడైయుండెను. వీటిని అతడు రథములకై యేర్పడిన పురములలోను యెరూషలేమునందు రాజునొద్దను ఉంచ నిర్ణయించెను.” 2 దిన వృ. 1:16; 9:28; 1 రాజులు 10:26. PKTel 23.3
విలాస జీవితం, సుఖభోగాలు, లోకాభిమానం - రాజు వీటిని గొప్పతనం చిహ్నాలుగా పరిగణించనారంభించాడు. ఐగుపు, ఫొనీషియ, ఎదోము, మోయాబు దేశాలనుంచి అనేకమంది అందమైన స్త్రీలను రప్పించుకున్నాడు. వీరి సంఖ్య వందల్లో ఉంది. వారు విగ్రహారాధన చేసే స్త్రీలు. క్రూరమైన, నీచమైన ఆచారాలు కర్మకాండ నేర్చుకున్న స్త్రీలు. వారి అందచందాలకు దాసుడై రాజు దేవునిపట్ల, ప్రజలపట్ల తన బాధ్యతల్ని నిర్లక్ష్యం చేశాడు. PKTel 24.1
రాజు భార్యలు అతడిపై తమ దుష్ప్రభావాన్ని చూపటం మొదలు పెట్టారు. వారు క్రమక్రమంగా రాజుని తమ విగ్రహారాధనలోకి దింపారు. మతభ్రష్టతకు అడ్డుకట్టగా పనిచేయటానికి దేవుడిచ్చిన ఉపదేశాన్ని రాజు పక్కన పెట్టాడు. ఇప్పుడతడు అబద్దదేవుళ్ల పూజలో తలమునకలై ఉన్నాడు. “సొలొమోను వృద్దుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతట్టు త్రిప్పగా అతని తండ్రియైన దావీదు హృదయమువలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యధార్థము కాకపోయెను. సొలొమోను అప్తారోతు అను సీదోనీయుల దేవతను మల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను ఆరాధించి నడిచెను.” 1 రాజులు 11:4,5. PKTel 24.2
ఒలీవల కొండ దక్షిణ ఉన్నత స్థలంలో యెహోవా దేవాలయం నిలిచిఉన్న మోరీయా పర్వతానికి ఎదురుగా సొలొమోను విగ్రహారాధన నిమిత్తం ఆలయ సముదాయాల్ని నిర్మించాడు. తన భార్యల్ని సంతోషపెట్టటానికి గొంజి తోపుల్లోను, ఓలీవా తోపుల్లోను పెద్ద పెద్ద చెక్క విగ్రహాల్ని, రాతి విగ్రహాల్ని పెట్టించాడు. “కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకు, మొలకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును” సొలొమోను కట్టించిన బలిపీఠాలవద్ద హీనమైన, హేయమైన అన్యమతాచారాల్ని ప్రజలు ఆచరించారు (7వ వచనం).. PKTel 24.3
సొలొమోను నడతకు శిక్షావిధి తప్పలేదు. విగ్రహారాధకులతో కూటమివలన దేవునితో కలిగిన ఎడబాటే సొలొమోను భ్రష్టతకు దుర్గతికి కారణం. దేవునిపట్ల తన విశ్వాసపాత్రతకు నీళ్లు వదలటంతో అతడు ఆత్మ నిగ్రహాన్ని కోల్పోయాడు. అతడి నైతిక శక్తి నశించింది. అతడిలోని సున్నిత భావోద్వేగాలు మొద్దుబారాయి. అతడి అంతరాత్మ మూగబోయింది. తన రాజ్యపాలన ప్రారంభ సంవత్సరాల్లో గొప్ప వివేకాన్ని సానుభూతిని ప్రదర్శించి ఒక అభాగ్య మాతృమూర్తికి తన బిడ్డను తిరిగి ఇచ్చిన (1 రాజులు 3:16-28 చూడండి) సౌమ్యుడు ఇప్పుడు విగ్రహాల ప్రతిష్టాపనకు వాటికి పసికందుల్ని బలి ఇవ్వటానికి సమ్మతించే దుస్థితికి దిగజారి పోయాడు. కౌమార్యంలో గొప్ప వివేచనను వివేకాన్ని కలిగిఉన్న అతడు, తన యౌవనంలో “ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును” (సామె. 14:12) అంటూ ఆత్మావేశం వల్ల రాసిన అతడు పవిత్రతకు తిలోదకాలిచ్చి వ్యభిచారంతోకూడిన, హేయమైన కెమోషు, ఆషారోతు ఆరాధనను అనుమతించేటంతగా దిగజారిపోయాడు. ఆలయ ప్రతిష్ట చేసిన సమయంలో “మి హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై స్థిరముగా నుండునుగాక” (1 రాజులు 8:61) అని తన ప్రజలకు హితవు పలికిన అతడే తన హృదయంలోను, జీవితంలోను అపరాధి అయి తాను చెప్పిన మాటలు వట్టి మాటలని నిరూపించుకున్నాడు. విచ్చలవిడి ప్రవర్తనను స్వేచ్ఛఅని అపార్థం చేసుకున్నాడు. వెలుగును, చీకటిని, మంచిని, చెడుని, పవిత్రతను, అపవిత్రతను, క్రీస్తుని, బెలియాలుని కలపటానికి - ఎంత మూల్యంతో - ప్రయత్నించాడు! PKTel 24.4
రాజదండం ధరించిన గొప్పరాజుల్లో ఒకడుగా తన ఉన్నత స్థానంనుంచి పడిపోయి సొలొమోను నీతిబాహ్యుడుగాను ఇతరుల చేతుల్లో సాధనంగాను, బానిసగాను మారాడు. ఒకప్పుడు ఉదాత్తమైన మగసిరిగల అతడి ప్రవర్తన బలహీనంగా, పౌరుషహీనంగా తయారయ్యింది. సజీవ దేవునిపై అతడి విశ్వాసం స్థానే నాస్తిక సందేహాలు నెలకొన్నాయి. అపనమ్మకం అతడి సంతోషాన్ని హరించింది. అతడి నియమాల్ని బలహీనపర్చింది, అతడి జీవితాన్ని హీనపర్చింది. అతడి పరిపాలన తొలినాళ్లలో ప్రదర్శితమైన న్యాయశీలత, ఔదార్యం నిరంకుశత్వంగా క్రూర ప్రభుత్వంగా పరిణమించాయి. పాపం బలహీన మానవ స్వభావం! తనపై ఆధారపడాల్సిన అవసరాన్ని గుర్తించని మనుషులికి దేవుడు చెయ్యగలిగిందేమి లేదు. PKTel 25.1
మతభ్రష్టత సంభవించిన ఈ సంవత్సరాల్లో ఇశ్రాయేలీయుల ఆధ్మాత్మికత క్రమక్రమంగా క్షీణించింది. తమ రాజు తన ఆసక్తుల విషయంలో సాతాను ప్రతినిధులతో చెయ్యి కలిపినప్పుడు పరిస్థితులు ఇంకెలాగుంటాయి? ఏది నిజమైన ఆరాధన, ఏది తప్పుడు ఆరాధన అన్నదానిపై ఇశ్రాయేలీయుల మనసుల్ని గలిబిలి పర్చటానికి సాతాను అతడి అనుచరులద్వారా పనిచేశాడు. వారు సునాయాసంగా అతడి వలలో పడ్డారు. ఇతర దేశాలలో వాణిజ్యంవల్ల ఇశ్రాయేలు ప్రజలకు దేవుని ప్రేమించని జాతులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. దేవునిపట్ల వారి ప్రేమ సన్నగిల్లింది. దేవుని ప్రవర్తన సమున్నతమైంది, పరిశుద్దమయ్యింది అన్న స్పృహ నశించింది. విధేయత మార్గంలో నడవటానికి నిరాకరించి, వారు నీతి విరోధికి నమ్మిన బంటులయ్యారు. విగ్రహారాధకులతో ఇచ్చి పుచ్చుకోటం సాధారణమయ్యింది. విగ్రహారాధనపట్ల ఇశ్రాయేలీయులకి ఉన్న ద్వేషం, తిరస్కారం ఇకలేవు. బహు భార్యత్వాన్ని సహించటం జరిగింది. విగ్రహారాధక తల్లులు తమ బిడ్డలకి అన్యాచారాలు నేర్పి పెంచారు. దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధ దైవారాధన స్థానే అతినీచమైన విగ్రహారాధనను ప్రవేశపెట్టారు. PKTel 25.2
క్రైస్తవులు లోకంకన్నా వేరుగా ప్రత్యేకంగా ఉండాలి. వారి స్వభావం వారి ప్రభావాలు లోకం కన్నా వేరుగా ఉండాలి. మనల్ని లోకంలో ఉంచటానికి దేవుడు సమర్థుడు. కాని మనం లోకపువారం కాకూడదు. ఆయన ప్రేమ అనిశ్చితమైంది, చంచలమైంది కాదు. ఆయన నిత్యం తన బిడ్డల్ని పరిమితులు లేకుండా కాపాడాడు. అయితే ఆయన సంపూర్ణ భక్తి విశ్వాసాల్ని కోరుతున్నాడు. “ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగా నుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.” మత్త. 6:24. PKTel 26.1
సొలొమోనుకి అద్భుతమైన వివేకాన్నిచ్చాడు దేవుడు. కాని లోకం అతణ్ని ఆకర్షించి దేవుని నుంచి దూరం చేసింది. నేడు మనుషులు సొలొమోను కన్నా బలం కలవారుకారు. అతడి అధోగతికి కారణమైన ప్రభావాలకి వారుకూడా అతడిలా లొంగిపోవచ్చు. తనకు రాగల ప్రమాదం గురించి సొలొమోనును ఎలా హెచ్చరించాడో అలాగే లోకంతో సాన్నిహిత్యం పెంచుకోటంలో ఉన్న ప్రమాదం గురించి దేవుడు తన ప్రజల్ని ఈనాడు హెచ్చరిస్తున్నాడు. ఆయన ఇలా విజ్ఞాపన చేస్తున్నాడు. “మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడి ... మరియు నేను మిమ్మును చేర్చుకొందును; మీకు తండ్రినైయుందును. మీరు నాకు కుమారులు, కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పు చున్నాడు.” 2 కొరిం. 6:17,18. PKTel 26.2
ప్రగతి నడుమ ప్రమాదం పొంచి ఉంటుంది. యుగాల పొడవున సిరులు కీర్తి వెనక నమ్రతకు ఆధ్మాత్మికతకు అపాయం వేచి ఉంది. మనం మోయటానికి భారమయ్యేది ఖాళీ గిన్నెకాదు. అంచులవరకూ నిండి ఉన్న గిన్నె. దాన్ని తొణకకుండా జాగ్రత్తగా పట్టుకొని నడవాలి. శ్రమ ఆపద దుఃఖం పుట్టించవచ్చు. కాని ఆధ్మాత్మిక జీవితానికి మిక్కిలి ప్రమాదకరమైంది అభ్యుదయం. మానవుడు దైవ చిత్రానికి నిత్యం లొంగి ఉండకపోతే, సత్యంద్వారా శుద్ధి పొందకపోతే అభ్యుదయం అతడిలోని స్వాభావిక ప్రవృత్తిని మేల్కొల్పి దురభిమానాన్ని రెచ్చగొట్టటం ఖాయం. PKTel 26.3
అవమానం గౌరవభంగం భరించటంలోనే తులనాత్మకంగా క్షేమం ఉంది. మనుషులు అప్పుడు దేవునిమీద ఆధారపడి ఉంటారు. తమకు ఆయన నేర్పించాలని తమను ప్రతీ అడుగు నడిపించాలని కోరుకుంటారు. కాగా ఉన్నత శిఖరంపై నిలబడే మనుషులు తామున్న స్థితినిబట్టి తమకు గొప్ప వివేకం ఉన్నదని భావించేవారు గొప్ప ప్రమాదంలో ఉన్నారు. దేవునిపై ఆనుకొంటే తప్ప అట్టి మనుషులు పడిపోవటం తథ్యం. PKTel 26.4
గర్వం, అత్యాశ ప్రాబల్యం వహించినప్పుడు జీవితం నాశనమౌతుంది. ఎందుకంటే గర్వం తనకు ఎలాంటి అవసరంలేదని భావించి తన హృదయాన్ని మూసివేసుకుంటుంది గనుక దేవుని దీవెనలు లభించవు. ఆత్మ గౌరవమే తన గురిగా పెట్టుకునే వ్యక్తిలో దేవుని కృప ఉండదు. ఆ కృప చురుకుగా పనిచెయ్యటం మూలానే నిజమైన భాగ్యం తృప్తికరమైన ఆనందం లభిస్తాయి. తన్ను తాను క్రీస్తుకి సంపూర్తిగా సమర్పించుకుని సమస్తం క్రీస్తు నిమిత్తం చేసే వ్యక్తి ఈ వాగ్గాన నెరవేర్పును చూస్తాడు, “యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. నరుల కష్టముచేత ఆ ఆశీర్వాదము ఎక్కువకాదు.” సామె. 10:22. ఆత్మలోని అశాంతిని, అపవిత్రతను, దురాశను బహిష్కరించి శత్రుత్వాన్ని ప్రేమగా, అపనమ్మకాన్ని నమ్మకంగా రక్షకుడు సున్నితమైన కృపాస్పర్శతో మార్చుతాడు. “నన్ను వెంబడించుము” అని ఆయన ఆత్మను ఆదేశించినప్పుడు లోకం ఆకర్షణశక్తి భగ్నమౌతుంది. ఆయన స్వరం వినిపించగా దురాశ, అత్యాశలు హృదయంలోనుంచి పారిపోతాయి. విముక్తులైన మనుషులు ఆయన్ని వెంబడించటానికి పైకిలేస్తారు. PKTel 27.1