క్రైస్తవ పరిచర్య

138/278

అధ్యాయం 13
ముద్రితవాక్య పరిచర్య

ప్రథమ ప్రాధాన్యంగల సేవ

ఒక సేవకన్నా ప్రాముఖ్యమైనది ఇంకొకటి ఉంటే, అది మన ప్రచురణల్ని ప్రజలముందుకు తెచ్చి, ఆవిధంగా వారిని లేఖన పరిశోధనకు నడిపించే సేవే అని చెప్పాలి. మన ప్రచురణల్ని కుటుంబాలకు పరిచయం చెయ్యటం, వారితో మాట్లాడటం, వారితో కలిసి వారి కోసం ప్రార్థించటం మంచి మిషనెరీ సేవ. ది కోలోపోర్టర్ ఇవేంజిలిస్ట్, పు. 80. ChSTel 169.1

సెవెంతుడే ఎడ్వెంటిస్టు అయిన ప్రతీవ్యక్తీ ఇలా ప్రశ్నించుకోవాలి : “మూడోదూత వర్తమానాన్ని ప్రకటించటానికి నేను ఏమి చెయ్యగలను?” ఈ వర్తమానాన్ని సంఘాలకు అందించేందుకు తన సేవకులికి ఇవ్వటానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దీన్నీ ప్రతీ జాతికి ప్రతీ వంశానికి ఆయా భాషలు మాట్లాడేవారికి ప్రతీ ప్రజలకు ప్రకటించాలి. దీన్ని మనం ఎలా అందించాల్సి ఉంది? మన సాహిత్య పంపిణీ ద్వారా ఈ వర్తమానాన్ని ప్రచురించటం ఒక మార్గం. ఈ దినాలకి దేవుడుద్దేశించిన వర్తమానంగల కరపత్రాలు, పత్రికలు, పుస్తకాల్ని ప్రతీ వివ్వాసీ వెదజల్లాలి. మన ప్రచురణల్ని అన్నిచోట్లా ప్రసారం చెయ్యటాకి గ్రంథ విక్రయ సేవకుల అవసరం ఎంతో ఉన్నది. సదర్న్ వాచ్ మేన్, జన. 5, 1904. ChSTel 169.2

ఈ కాలానికి దేవుని వర్తమానాన్ని నిత్యం ప్రజలముందు ఉంచటానికి పత్రికలు పుస్తకాలు ప్రభువు ఎంచుకున్న సాధనం. సత్యంతో ఆత్మల్ని చైతన్యపర్చి దృఢపర్చటంలో వాక్యపరిచర్య ఒక్కటే సాధించగలిగిన దాని కన్నా ప్రచురణలు ఎక్కువ సాధిస్తాయి. గ్రంథ విక్రయ సేవకులు ప్రజల గృహాల్లో ఉంచే మౌన దూతలు సువార్త సేవను అన్ని విధాలా బలపర్చుతాయి. ఎందుకంటే వాక్య బోధను వింటున్నప్పుడు ప్రజల హృదయాల్ని ప్రభావితం చేసినట్లే ఈ పుస్తకాలు చదివేటప్పుడు పాఠకుల హృదయాల్ని పరిశుద్ధాత్మ ప్రభావితం చేస్తాడు. వాక్య పరిచారకుడి సేవకు తోడ్పడే దూతల పరిచర్య సత్యంతో నిండిన పుస్తకాల పఠనం విషయంలోనూ తోడ్పడుతుంది. టెస్టిమొనీస్, సం. 6, పులు. 315, 316. ChSTel 169.3

గ్రంథ విక్రయ సేవను క్షీణించనివ్వకూడదు. నేటి సత్యం గల పుస్తకాల్ని ఎంత ఎక్కువమంది ప్రజలముందు ఉంచగలిగితే అంతమంది ముందుంచాలి. ఈ విషయంలో మన కాన్ఫరెన్సుల అధ్యక్షులు, బాధ్యతలు గల ఇతర స్థానాల్లో ఉన్నవారు నిర్వర్తించాల్సిన బాధ్యత ఉంది. సదర్న్ వాచ్ మేన్, ఏప్రి. 25, 1905. ChSTel 170.1

మన పుస్తకాలు పత్రికల సువార్త పరిచర్య ద్వారా లోకానికి సత్యపు వెలుగు అందాల్సి ఉంది. సమస్తానికి అంతం సమీపంలో ఉన్నదని మన ప్రచురణలు చూపించాల్సి ఉంది. ది కోపోర్టర్ ఇవేంజిలిస్ట్, పు. 100. ChSTel 170.2

తన ప్రజలు సోమరితనంగా, మందకొడిగా, ఉదాసీనంగా కాక జీవిస్తున్న మనుషుల్లా ప్రవర్తించటానికి దేవుడు తన ప్రజల్ని పిలుస్తున్నాడు. ప్రచురణల్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లి వాటిని అంగీకరించాల్సిందిగా వారిని కోరాలి. సదర్న్ వాచ్ మేన్, ఏప్రి. 25, 1905. ChSTel 170.3

ఇప్పుడు మన ప్రచురణలు సువార్త విత్తనాన్ని చల్లుతున్నాయి. వాక్యబోధ ఎన్ని ఆత్మల్ని క్రీస్తు రక్షణలోకి తెస్తున్నదో ఇవి అన్ని ఆత్మల్ని క్రీస్తుకి సంపాదిస్తున్నాయి. వీటి ప్ర సారం వల్ల సంవూలు స్థాపితమౌతున్నాయి. క్రీస్తు అనుచరుడైన ప్రతీవ్యక్తీ ఈ సేవలో ఓ పాత్ర పోషించవచ్చు. రివ్యూ అండ్ హెరాల్డ్, జూన్ 10, 1880.. ChSTel 170.4

పరలోకం నుంచి వచ్చిన ఓ దూత మా మధ్య నిలబడి హెచ్చరిక చేసి ఉపదేశం ఇచ్చాడు. ఈ రాజ్య సువార్త వర్తమానం లేనందువల్ల లోకం నశిస్తున్నదని, మన ప్రచురణల్లో - ప్రచురితమైన, ఇంకా ప్రచురితం కాని ఈ వర్తమానాన్ని దగ్గరలో ఉన్న వారికి దూరంలో ఉన్న వారికి అందించాలని అతడు మాకు స్పష్టంగా బోధపర్చాడు. టెస్టిమొనీస్, సం. 9, పు. 67. ChSTel 170.5

ఈనాటి పవిత్ర సత్యాన్ని లోకానికి త్వరితంగా అందించటానికి పుస్తక సేవ సాధనం కావాలి. టెస్టిమొనీస్, సం. 9, పు. 69. ChSTel 170.6

యువతను నైతికంగా దిగజార్చి, వారి మనసుల్ని విషకలితం చేసే సాహిత్యాన్ని వెదజల్లటం ద్వారా సాతాను చురుకుగా పనిచేస్తున్నాడు. దేశమంతటా నాస్తిక ప్రచురణల్ని వెదజల్లుతున్నాడు. ప్రజల మనసుల్ని సమున్నతంచేసి, సత్యాన్ని ప్రత్యక్షంగా వారి ముందుకి తెచ్చే ప్రచురణల్ని పంచటానికి ప్రతీ సంఘ సభ్యుడు ఎందుకు ఆసక్తి చూపించకూడదు? ఈ పత్రికలు కరపత్రాలు ప్రపంచానికి వెలుగునిచ్చే ప్రచురణలు. ఆత్మలకు మారుమనసు కలిగించటానికి ఇవి తరచుగా గొప్ప సాధనాలవుతాయి. రివ్యూ అండ్ హెరాల్డ్, జూన్ 10, 1880. ChSTel 171.1

సాహిత్యాన్ని తగిన రీతిగా తయారు చేసి ప్రసరణ చెయ్యటం ద్వారా సాధించాల్సిన సేవ విషయంలో మనం నిద్రపోతున్నాం. పత్మాసు దీవిలో యోహానుకి క్రీస్తు ఇచ్చిన వర్తమానాన్ని లోకం అవగాహన చేసుకునేందుకు ఇప్పుడు మనం పత్రికల్ని, పుస్తకాల్ని వివేకవంతంగా వినియోగించుకుని శక్తితో వాక్యం ప్రకటిద్దాం. ది కోలపోర్టర్ ఇవేంజిలిస్ట్, పు. 101. ChSTel 171.2

సంఘ సభ్యుల్లారా, మన సాహిత్య ప్రసరణల ప్రాముఖ్యాన్ని గుర్తించి ఈ సేవకు ఎక్కువ సమయం పెట్టండి. సువార్తను వివిధ రీతల్లో ప్రకటించే పత్రికల్ని, కరపత్రాల్ని, పుస్తకాల్ని ప్రజల గృహాల్లో ఉంచండి. ఇక సమయం లేదు. గ్రంథ విక్రయ సేవకులు తమను తాము అంకితం చేసుకుని ఎంతో అవసరమైన ఈ హెచ్చరికను అందించటానికి అనేకులు ఇష్టపూర్వకంగా, స్వార్ధరహితంగా ముందుకి రావాలి. తనకు దేవుడు నియమించిన సేవను సంఘం చేపట్టినప్పుడు అది “చంద్రబింబమంత అందముగలదై, సూర్యుని అంత స్వచ్చమును కళలును గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి” అయి ముందుకి సాగుతుంది. సదర్న్ వాచ్ మేన్, నవ. 20, 1902. ChSTel 171.3

మిషనెరీ సేవ ద్వారా ప్రకాశమానమైన సత్యపు వెలుగు లోకం మీద పడుతున్నది. సువార్త కృషి ద్వారా చేరటం అసాధ్యమైన ఆత్మల్ని చేరటానికి ప్రచురణ సేవ గొప్ప సాధనం. టెస్టిమొనీస్, సం. 5, పు. 388. ChSTel 171.4

శ్రమ రాత్రి దాదాపు గతించింది. తనకు ఎక్కువ సమయం లేదని గ్రహించి సాతాను తన అద్భుత శక్తిని ఉపయోగిస్తున్నాడు. దేవుని శిక్ష లోకం మీద ఉంది. సత్యం తెలిసిన వారందరూ చీల్చబడ్డ బండలోదాగి, దేవుని మహిమను వీక్షించాల్సిందిగా పిలుపు వస్తున్నది. ఇప్పుడు సత్యాన్ని కప్పిఉంచకూడదు. స్పష్టమైన మాటలు మాట్లాడాలి. కరపత్రాలు, కరపుస్తకాల రూపంలో పూత లేని సాదా సత్యాన్ని పలకాలి. వీటిని శరత్కాలంలోని ఆకుల్లా వెదజల్లాలి. టెస్టిమొనీస్, సం. 9, పులు. 230, 231. ChSTel 171.5

ఈ మౌన సత్య దూతల్ని ప్రజల వద్దకు తీసుకు వెళ్లటానికి గ్రంథ విక్రయ సేవకులు - ఆత్మల నిమిత్తం హృదయ భారం గల, వెలుగుకోసం వెదకుతున్న వారికి సమయోచితమైన మాటలు చెప్పగల గ్రంథ విక్రయ సేవకులు - అవసరం. “నేను బోధ కుణ్ని కాను; నేను ప్రజలకు బోధించలేను” అని కొందరనవచ్చు. మీరు బోధ చెయ్యలేకపోవచ్చు, కాని సువార్తికుడి సేవ చెయ్యవచ్చు. మీరు కలిసే ప్రజల అవసరాల్ని తీర్చవచ్చు. దేవుని సహాయక హస్తంగా మెలగుతూ శిష్యులు పనిచేసినట్లు పని చెయ్యవచ్చు. మీరు ఎవరిని కలుస్తారో వారిని “క్రీస్తుని ప్రేమిస్తున్నారా?” అని అడగవచ్చు. సదర్న్ వాచ్ మేన్, నవ. 20, 1902. ChSTel 172.1