క్రీస్తు యొద్దకు మెట్లు

4/14

3వ అధ్యాయం - పశ్చాత్తాపం

మానవుడు దేవునియందు న్యాయవంతుడిగా ఎలా నిలుస్తాడు? పాపి నీతిమంతుడు ఎలా అవుతాడు? క్రీస్తు ద్వారా మాత్రమే దేవునితో మనకు సమాధానం ఏర్పడుతుంది. పరిశుద్దత లభిస్తుంది. అయితే మనం క్రీస్తు వద్దకు రావడం ఎలా? పెంతెకొస్తు దినాన జన సమూహం అడిగిన ప్రశ్ననే ఈనాడు అనేకులు అడుగుతున్నారు. జనులు తాము పాపులమని గుర్తించి “మేమేమి చేతుము?” అని అడిగారు. పేతురు ఇచ్చిన జవాబులోని మొదటిమాట “మారుమనస్సు’ (ఆ.కా. 2:38) కొద్దికాలం తరువాత ఇంకోసారి పేతురు ఇలా అన్నాడు, “మీ పాపములను తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సునొంది తిరుగుడి” (అ.కా.3:20). SCTel 18.1

పశ్చాత్తాపములో, పాపం నిమిత్తం దుఖ:0 , పాపంనుంచి వైదొలగటం ఇమిడి ఉన్నాయి. పాపంలోని నైత్యాన్ని గుర్తిస్తేనే తప్ప దాన్ని విసర్జించం. పాపంనుంచి హృదయంలో వైదొలిగేవరకు జీవితంలో నిజమైన మార్పు చోటుచేసుకోదు. SCTel 18.2

యధార్ధమెన్ల పశ్చాత్తాపమంటే ఏమిటో గ్రహించేవారు బహుకొద్దిమందే. చాలామంది పాపం చేసినందుకు దుఖి:స్తారు బహిర్గతంగా దిద్దుబాటు కూడ చేసుకుంటారు. ఎందుకంటే తమ తప్పిదం వల్ల తమకు శ్రమ కలుగుతుందన్న భయం వారిని వేధిస్తుంది. బైబిలు ప్రకారం ఇది పశ్చాత్తాపంకాదు. అట్టివారు తమకు కలిగే శ్రమ గురించి విచారిస్తారేతప్ప పాపంగురించికాదు. తన జేష్టత్వంపోయిందని గుర్తించినప్పుడు ఏశావుకు కలిగిన దుఖ:ము అలాంటిదే. కత్తిదూసి తనదారి కడ్డంగా నిలబడ్డ దేవు దూతనును చూసి భయభ్రాంతుడై ప్రాణం దక్కించుకునేందుకు బిలాము తన అపరాధాన్ని ఒప్పుకొన్నాడే గాని తన పాపం నిమిత్తము అతనికి నిజమైన దుఖ:ము కలుగలేదు. ఉద్దేశంలో మార్పురాలేదు. దుర్మార్గతపట్ల ఏవగింపు పుట్టలేదు. తన ప్రభువును అప్పగించిన అనంతరం ఇస్కరియోతు యూదా ఇలా విలపించాడు, “నేను నిరపరాధరక్తమును అప్పగించి పాపమప చేసితిని”(మత్తయి 27:4) శిక్ష , రానున్న భయంకర తీర్పు దినం వీటిని గూర్చిన తీవ్ర ఆలోచనలో ఒత్తిడి వల్ల తన అపరాధ హృదయంనుంచి వచ్చిన ఒప్పుకోలు ఇది. తాను అనుభవిస్తున్న పర్యావసానాలు అతడి హృదయాన్ని భయాందోళనలతో నింపాయి. కాని కళంకంలేని దేవ కుమారుణ్ణి అప్పజెప్పేందుకు, పరిశుద్ధ ప్రభువును ఉపేక్షించినందుకు అతిడి ఆత్మలో గాఢమైన సంతాపంలేదు. దేవుని తీర్పుల ఫలితంగా బాధలను అనుభవిస్తున్న ఫరో ఇంకా తీవ్రమైన శిక్ష కలుగకుండేందుకు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. కాని ఆ తెగుళ్ళు ఆగగానే తన దేవ దూషణపంధానే తిరిగి అవలంభించాడు. వీరంతా పాప ఫలితాన్ని గురించి చింతించారేగాని పాపం గురించి దుఃఖించలేదు. SCTel 18.3

కాగా హృదయం దైవాత్మ ప్రభావానికి అనుకూలంగా స్పందించినప్పుడు మనస్సాక్షి ఉత్తేజమౌతుంది. పరలోకంలోనూ, భూలోకంలోనూ దేవుని ప్రభుత్వానికి పునాదియైన దైవ పరిశుద్ధ ధర్మశాస్త్రం లోతుపాతుల్ని, పరిశుద్ధతను పాపి కొంతవరకు అవ గాహన చేసుకొంటాడు. “లోకము లోనికి వచ్చు ... ప్రతి మనుష్యుని వెలుగించుచున్న” “‘వెలుగు” (యోహాను 1:9) హృదయం రహస్య కవటాల్ని వెలుగిస్తుంది. మరుగైన చీకటి విషయాలు వెలుగులోకి వస్తాయి. మనసులోను, హృదయంలోను తీర్మానం చోటుచేసుకుంటుంది. పాపికి యెహోవా నీతిని గూర్చిన తెలివి కలుగుతుంది. హృదయాలు పరిశోధించే దేవునిముందు అప్పుడప్పుడు తన అపరాధాల్తో, అపవిత్రతతో కనిపించడానికి భయకంపితుడౌతాడు. అతడు దేవుని ప్రేమను, ఆయన సౌందర్యాన్ని, పరిశుద్ధతలోని ఆనందాన్ని తిలకిస్తాడు. శుద్ధి పొందాలని, పరలోకంలో సంబంధాల పునరుద్ధరణ కావాలని తహతహలాడ్తాడు. SCTel 19.1

తన పాపం అనంతరం దావీదు చేసిన ప్రార్ధన పాపం విషయం యధార్ధ పశ్చాత్తాపానికి మంచి ఉదహరణ. దావీదు పశ్చాత్తాపం ప్రగాఢమైన, యధార్ధమైన పశ్చాత్తాపం. తన తప్పిదాన్ని సమర్ధించే ప్రయత్నం చేయలేదు. తాను పొందనున్న తీర్పు నుంచి తప్పించుకోవాలన్న కోరిక ఆయన ప్రార్ధనకు ప్రేరణ కాలేదు. దావీదు తన అతిక్రమ విస్తారతను గుర్తించాడు; తాను కాలుష్యాన్ని చూసాడు, తన పాపాన్ని తాను అసహ్యించుకొన్నాడు. క్షమాపణకోసమేకాదు తాను ప్రార్ధించింది, శుద్ది హృదయం కోసం కూడా పరిశుద్ధతకోసం ఆశతో ఎదురు చూసాడు. దేవునితో సాంగత్యం, సామరస్యాన్ని ఆకాంక్షించాడు. ఆయన హృదయ భాష ఇది: SCTel 19.2

“తన అతిక్రమములకు పరిహారము నొందివాడు
తన పాపమునకు ప్రాయశిత్తమునొందివాడు.
ధన్యుడు, యెహోవాచేత నిర్దోషిని ఎంచబడువాడు
ఆత్మలో కపటములేని ధన్యుడు”
“దేవా నీ కృచొప్పున నన్ను కరుణింపుము
నీవాత్సల్యబాహుళ్యము చొప్పున
నా అతిక్రమములను తుడిచివేయుము
నాదోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము
నాపాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము
నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి
నా పాపమెల్లప్పుడు నాయెదుటనున్నది
నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము
చేసియున్నాను
నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నాపాపము
పరిహరింపుము, హిమముకంటే నేను తెల్లగా
నుండునట్లు, నీవు నన్ను కడుగుము
దేవా నాయందు శుద్దహృదయము కలుగజేయుము
నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా
పుట్టించుము;నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము
నీ పరిశుద్ధాత్మనునాయొద్దనుండి తీసివేయకము
నీరక్షణానందము నాకు మరల పుట్టించుము
సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్నుదృఢపరచుము
రక్తాపరధాము నుండి నన్నువిడుపింపుము
అప్పుడు నా నాలుక నిన్ను గూర్చి ఉత్సాహగానము చేయును”
SCTel 20.1

(కీర్తనలు 32:1,2;కీర్తనలు 51:1-14)

ఇటువంటి పశ్చాత్తాపం మన స్వశక్తివల్ల కలిగేకాదు. పరలోకానికి ఎగసిన, మనుష్యులకు వరాలనిచ్చిన క్రీస్తు మనకిచ్చే వరం ఇది. SCTel 20.2

అనేకులు తప్పటడుగులు వేసి అకారణంగా యేసు ఇవ్వ గోర్తున్న ఆసరాను పొందలేకపోతున్న అంశం ఇక్కడొకటి ఉంది. క్రీస్తు వద్దకు రావాలంటే ముందు పశ్చాత్తాపం పొందాలని, పాప క్షమాపణకు తమను పశ్చాత్తాపం సిద్ధపర్చుతోందని వారి భావన. పాపక్షమాపణకు ముందు పశ్చాత్తాపం సంభవిస్తుందన్నది వాస్తవమే. ఎందుకంటే రక్షకుని అవసరాన్ని గుర్తించేది విరిగి నలిగిన హృదయమేకదా! అలాగని పాపి యేసు వద్దకు రావడానికి పశ్చాత్తాపం కలిగేవరకు ఆగాలా? పాపికి, రక్షకునికి మధ్య క్షమాపణ అడ్డంకిగా నిలవాలా ? SCTel 20.3

పాపీ యేసు ఆహ్వానానికి స్పందిచకముందు పశ్చాత్తాపం పడాలని బైబిలు బోధించడంలేదు. ‘’ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకురండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును” (మత్తయి11:28) క్రీస్తునుంచి బయలు వెడలే ప్రభావమే నిజమైన పశ్చాత్తాపాన్ని పుట్టిస్తుంది. ఇశ్రాయేలునకు మారు మనస్సును పాప క్షమాపణ దయచేయుటకై దేవుడాయనను అధిపతిని గాను, రక్షకునిగాను తన దక్షిణ హస్తము చేత హెచ్చించియున్నాడు. (అ.కా. 5:31) అని ఇశ్రాయేలు వారితో అన్నప్పుడు పేతురు ఈ అంశాన్ని స్పష్టం చేసాడు. మనస్సాక్షిని చెత్తన్య పర్చే క్రీస్తు ఆత్మ లేకుండా పశ్చాత్తపం ఎలా అసంభవమో, క్రీస్తులేకుండా క్షమాపణ అలాగే అసంభవం. SCTel 21.1

ప్రతీ సదాలోచనకు మూలం క్రీస్తే. హృదయంలో పాపం పట్ల వ్యతిరేకత పుట్టించగలవాడు ఆయన ఒక్కడే. సత్యం, పవిత్రత కోసం కలిగే ప్రతీ కోరిక. మేము పాపులం అన్న ప్రతీ గుర్తింపు యేసు ఆత్మ మన హృదయాల్లో పని చేస్తున్నాడనడానికి నిదర్శనం. నేను భూమిమీదనుండి పైకి ఎత్తబడిన యెడల అందరిని నాయొద్దకు ఆకర్షించుకొందును. (యోహాను 12:32) అన్నాడు యేసు. లోక పాపాల నిమిత్తం మరణించిన రక్షకునిగా పాపికి క్రీస్తును బయలు పర్చాలి. అప్పుడు కల్వరి సిలువపై వ్రేలాడుతున్న గొర్రెపిల్లను మనం వీక్షించినపుడు రక్షణ మర్మం మన మనస్సులకు గ్రాహ్యం అవడం మొదలుపెడుతుంది. అంతట దేవుని మంచితనం పశ్చాత్తాపానికి నడిపిస్తుంది. పాపులకోసం మరణంచటంలో క్రీస్తు మన అవగాహనకు మించిన ప్రేమను కనబర్చాడు. పాపి ఈ ప్రేమను పరిశీలించినపుడు అది పాపి హృదయాన్ని కరిగించి, మనస్సును ఆకర్షించి, ఆత్మలో దుఖ:0 పుట్టిస్తుంది. SCTel 21.2

మనుషులు కొన్నిసార్లు తమ పాప ప్రవర్తనకు సిగ్గుపడి, క్రీస్తు వద్దకు ఆకర్షితులమౌతున్నామన్న స్పృహ పొందకముందే కొన్ని దురభ్యాసాలు మానకొంటా రన్నది నిజమే. అయితే యధార్ధత కలిగి జీవించాలన్న కోరికతో దిద్దుబాటు కోసం వారు ప్రయత్నించినప్పుడెల్లా క్రీస్తు శక్తే వారిని ఆకర్షించుతుంది. తమకు గోచరమైన ప్రభావమొకటి వారిలో పనిచేసి వారి మనస్సాక్షిని ఉత్తేజపర్చుతుంది. అప్పుడు బహిర్గత జీవితములో మార్పు చోటు చేసుకుంటుంది. తన సిలువను చూడడానికి, తమ పాపాల నిమిత్తం సిలువపై వ్రేలాడిన ఆయన్ను చూడానికి క్రీస్తు వారిని ఆకర్షించగా మనస్సాక్షికి ఆజ్ఞ బోధపడుతుంది. తమ జీవితములో దుర్మార్గత, ఆత్మలో తిష్టవేసుకుని ఉన్న పాపం వారికి బయలుపర్చబడుతుంది. వారు క్రీస్తు నీతిని కొంతవరకు గ్రహించనారంభించి, పాప పీడితుల్ని విమోచించేందుకు అంత గొప్ప త్యాగం అవసరమవ్వడానికి, పాపం ఏపాటిది? మనం నశించక నిత్యజీవం పొందడానికి గాను ఇంత ప్రేమ, శ్రమ, ఇంత ఆత్మోపేక్ష అగత్యమయిందా? అని ఆశ్చర్యపడతారు. SCTel 21.3

పాపి ఈ ప్రేమను తృణీకరించవచ్చు. క్రీస్తు వద్దకు రావడానికి నిరాకరించవచ్చు. తృణీకరించకుండా ఉంటే యేసు వద్దకు ఆకర్షితుడౌతాడు. రక్షణ ప్రణాళికను గూర్చిన జ్ఞానం, దేవుని ప్రియ కుమారుని మరణానికి కారణమైన తన పాపాల్ని గురించి పశ్చాత్తాపపడి అతడు సిలువ చెంతకు వెళ్ళేటట్లు చేస్తుంది. SCTel 22.1

ప్రకృతి జాలంలో పనిచేస్తున్న ఆ దివ్య మేధస్సే మానవ హృదయాల్లో మాట్లాడి తమలో ఏదైతే లోపించిందో దానికోసం వారిలో తీవ్ర వాంఛను కలుగజేస్తుంది. వారు ఆకాంక్షిస్తున్నదాన్ని లోకం సంపదలు, వస్తువులు తృప్తి పర్చజాలవు. సమాధానం, విశ్రాంతి ఇవ్వగల వాటికోసమే అన్వేషించాల్సిందిగా దేవుని ఆత్మ వారితో విజ్ఞాపన చేస్తున్నాడు. అవి క్రీస్తు కృప, పరిశుద్ధతలోని ఆనందం. తృప్తినియ్యని పాప భోగాల నుంచి మనుషుల మనసుల్ని తిప్పి తనయందు లభించగల దీవెనలను వారిని ఆకర్షించేందుకు కనిపించే ప్రభావాలు, కనిపించని ప్రభావాల ద్వారా మన రక్షకుడు నిరంతరం కృషి చేస్తున్నాడు. ఈ లోకంలోని చితికిపోయిన తొట్లనుంచి త్రాగడానికి ప్రయత్నిస్తున్న ఈ జనులందరికీ ఈ దేవ వర్తమానం వస్తున్నది. “దప్పిగొనిన వారిని రానిమ్ము, ఇచ్చయించువానిని జీవ జలములను ఉచితముగా పుచ్చుకొననిమ్ము” (ప్రకటన 22:17) ఈలోకం ఇవ్వగలదాని కన్నా మెరుగైన దానికోసం తపన పడుతున్న మీరు, ఆ తపన మీ ఆత్మతో మాట్లాడుతున్న దేవుని స్వరమని గుర్తించండి. మీకు పశ్చాత్తాపాన్ని అనుగ్రహించమని, అనంత ప్రేమ, సంపూర్ణ పవిత్రత గల క్రీస్తును బయలు పర్చమనిఆయనను కోరండి. దేవుని పట్ల, మానవునిపట్ల ప్రత్మే అన్న దైవ ధర్మ శాస్త్రసూత్రాలు రక్షకుని జీవితములో క్రియా రూపం దాల్చాయి. దయాళుత్వం, స్వార్ధరహిత ప్రేమ ఆయన జీవిత పరమావధి. SCTel 22.2

మాది నీతివంతమైన జీవితం అని, మా ప్రవర్తన నెత్తికంగా పొరపాట్లు లేనిదని, అందువల్ల సామన్య పాపకీవలే దేవునిముందు మమ్మల్ని మేము కించపర్చుకోవల్సిన అవ సరం లేదని, నికోదేముకు వలే మనం గొప్పలకు దిగవచ్చుగాక. కాని యేసువద్దనుంచివచ్చే వెలుగు మన ఆత్మల్లోకి చొచ్చుకొని ప్రకాశించినట్లయితే, మనం ఎంత అనీతిమంతులమో మనకుబోధపడుతుంది. మన స్వార్ధపూరిత ఉద్దేశాల్ని, మన జీవితములోని ప్రతీ క్రియకు కళంకితం చేసిన దైవ వ్యతిరేకతను గ్రహించగలుగుతాము. మన నీతి మురికి పాతల వంటిదని, పాప కళంకంనుంచి క్రీస్తు రక్తం మాత్రమే శుద్ధుల్ని చేసి ఆయన పోలికకు మనల్ని మార్చగలదని అప్పుడు మనం తెలసుకొంటాం. SCTel 22.3

దేవుని మహిమా కిరణం ఒక్కటి. ఆత్మలోకి చొచ్చుకుపోయే క్రీస్తు పరిశుద్ధ క్రాంతి ఒక్క మెరుపు అపవిత్రత ఉన్న తావును స్పష్టంగా కనబర్చి, మానవ ప్రవర్తనలోని వైకల్యాన్ని, లోపాల్ని బట్ట బయలుచేస్తుంది. హృదయంలోని అపవిత్ర కొలతల్ని, వ్యభిచారాన్ని, పెదవుల కాలుష్యాన్ని బెట్టపెడుతుంది. దైవ ధర్మ శాస్త్రాన్ని నిరర్ధకంచేసి పాపి విద్రోహక చర్యలు ముందుకు వస్తాయి. దేవాత్మ ప్రభావమువల్ల అతడి వెళ్లిరిలో మార్పు కలుగుతుంది. పరిశుద్ధం, నిష్కళంకం అయిన క్రీస్తు చూసినప్పుడు అతడు తన్నుతాను అసహ్యించుకొంటాడు. SCTel 23.1

తన వద్దకు వచ్చిన పరలోక దూతను ఆవరించి ఉన్న ప్రభావాన్ని చూసినప్పుడు దానియేలు ప్రవక్తకు తన బలహీనత, అపరిపూర్ణత్వం గుర్తుకు వచ్చి దిగులు చెందాడు. ఆ చక్కని సన్నివేశ పర్యవసానాన్ని వర్ణిస్తూ ఇలా అంటున్నాడు- “నాలో బలమేముయు లేకపోయెను, నాసొగసు వికారమాయెను, బలము నాయందు నిలువలేదు “(దాని10:8) ఇలా ప్రభావితమైన ఆత్మ తన స్వార్ధ బుద్దిని ద్వేషిస్తుంది, స్వార్ధప్రేమను అసహ్యించు కుంటుంది. క్రీస్తు నీతి ద్వారా ధర్మశాస్త్రానుసారం క్రీస్తు ప్రవర్తనానుగుణం అయిన హృదయశుద్ధిని అన్వేషిస్తుంది. SCTel 23.2

“ధర్మ శాస్త్రమువలన నీతి విషయము ‘’బహిర్గత విషయంలో” అనింద్యుడైనయుంటిని’‘ (ఫిలిప్పీ 3:6) అంటున్నాడు పౌలు. అయితే ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక స్వభావం గురించి పరిగణిస్తే తన్నుతాను పాపిగా ఎంచుకొంటున్నాడు. మనుషులు అవలంభించే రీతిలో ధర్మశాస్త్ర నిబంధనలప్రకారము బాహ్య జీవితాన్ని విమర్శిస్తే పౌలు పాపం చేయలేదు. కాని ధర్మశాస్త్ర విధుల్ని నిశితంగా పరిశీలించి దేవుడు చూసేటట్లు తన్నుతాను చూసుకున్నప్పుడు సిగ్గుతో తలవంచి తాను అపరాధినని ఒప్పుకొన్నాడు. SCTel 23.3

“ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించియుంటినిగాని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను, నేనైతే చనిపోతిని”(రోమా 7:9) అంటున్నాడు. ధర్మశాస్త్రం యొక్క ఆధ్యాత్మిక స్వభావాన్ని చూసినప్పుడు, పాపం తన హేయమైన రూపంలో కనిపించింది. తన ఆత్మ గౌరవం ఆవిరైపోయింది. SCTel 23.4

దేవుడు అన్నిపాపాల్ని ఒకే గాటన కట్టడు. మానవుని దృష్టిలోను దేవుని దృష్టిలోను అపరాధం వివిధ పరిమాణాల్లో ఉంటుంది. కాగా మానవుడి దృష్టికి ఈ పొరపాటు లేక ఆ పొరపాటు ఎంత చిన్నదిగా కనిపించినా దేవుని దృష్టిలో ఏ పాపాము చిన్నదికాదు. మానవుడి అంచనా పాక్షికం, అసంపూర్ణం. అయితే దేవుడు అన్నింటిని యధాతథంగావాస్తవికంగా అంచనా వేస్తాడు. తాగుబోతును ద్వేషించి, అతడి పాపం అతణ్ణి పరలోకానికి దూరం చేస్తుందని తీర్పు చెప్పుతాం, కాని గర్వం, స్వార్ధం, దురాశలను పట్టించుకోము. అయితే ఈ పాపాలు దేవునికి మిక్కిలి హేయమైనవి. ఎందుకంటే కృపాబాహుళ్యంగల దేవుని శీలానికి, పాప పంకిలం లేని విశ్వానికి ఊపిరి అయిన నిస్వార్ధ ప్రేమకు ఈ పాపాలు బద్ద విరుద్ధాలు, ఇంతకన్నా కొన్ని పెద్ద పాపాల్లో పడ్డవ్యక్తి వాటి విషయమె సిగ్గుపడి దీన స్వభావంతో క్రీస్తు కృపావశ్యకతను గుర్తించవచ్చు. గర్వంమాత్రం ఏ అవసరాన్నీ గుర్తించదు. అందుచేత క్రీస్తుకు, ఆయన ఇవ్వనెంచుతున్న అపార దీవెనలకు తావు లేకుండా హృదయద్వారాన్ని మూసివేస్తుంది. SCTel 23.5

“దైవ పాపినైన నన్ను కరుణించుము”(లూకా 18:13) అని ప్రార్ధించిన సుంకరి తాను ఘోర పాపినని భావించాడు. ఇతరులుకూడ అతనిని పాపిగానే చూస్తారు. ఏది ఏమైనా తన అవసరాన్ని గుర్తించాడు. అపరాధభావంతో, సిగ్గుతో దేవుని ముందుకు వచ్చాడు. కృప చూపించమని మనవి చేసాడు. పరిశుద్ధాత్మ తన కృపాకృషిని చేయడానికి, అతణ్ణి పాపం శక్తినుంచి విడిపించడానికి అతడి హృదయం తెరుచుకుంది. ప్రగల్సాలు, స్వనీతితో కూడిన ఫరో ప్రార్ధన పరిశుద్దాత్మ ప్రభావానికి తన హృదయం మూతపడిందని సూచిస్తున్నది. దేవునికి దూరంగా ఉండడంతో తన దుర్నీతి ఏంటో ఆయన నీతితో పోల్చినప్పుడు తన దుర్నీతి ఎంతో అతడికి తెలిసిందికాదు. తనకు ఎలాంటి అవసరము లేదనుకున్నాడు. అందుకే ఏమీ లభించలేదు. మీరు మీ పాపిత్వాన్ని గుర్తిస్తే మీ పరిస్థితి మెరుగుపడే వరకు వేచి ఉండకండి. క్రీస్తు వద్దకు వచ్చేందుకు మేము మంచి వారం కామని సందేహించేవారు ఎందరో వున్నారు. మీరు మీ స్వప్రయత్నాలవలన ఉత్తేజితులుకావాలని నిరీక్షిస్తున్నారా ? ‘కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకోగలడా? చిరుతపులి మచ్చలను మార్చుకోగలదా? మార్చుకోగలిగిన యెడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరు మేలు చేయవల్లపడును”(యిర్మియా 13:23) దేవుడే మనకు సహాయం చేయగలడు. ఇంకా బలమైన నమ్మకాలకోసం, మెరుగైన అవకాశాలకోసం, ఇంకా పవిత్రమైన మానసిక స్థితి కోసం మనం కనిపెట్టకూడదు. ఉన్న రీతిగానే మనం యేసు చెంతకు రావలసిఉన్నాం. SCTel 24.1

ప్రేమాయముడు, కరుణానిధియైన దేవుడు తన కృపను తోసిన రాజనే వారిని కూడా రక్షిస్తాడు. అని తలంచి ఎవరూ మోసపోకుందురుగాక. పావం తీవ్రనెత్త్యం సిలువ వెలుగులోనే అంచనా వేయగలుతాం. దేవుడు మంచివాడు గనుక పాపిని విసర్జించండని భావించేవారుకల్వరీపై తమ దృష్టిసారించాలి. మానవ రక్షణకు వేరే మార్గంలేదు. కాబట్టి ఈ బలిదానం జరగకుండామానవ జాతి పాప కాలుష్యపు శక్తినుంచి తప్పించుకొని పరిశుద్దులతో మళ్ళీ సాంగత్యంనెరపడం అసాధ్యం. కాబట్టివారు మళ్ళీ ఆధ్యాత్మిక జీవనంలో పాలుపొందటం అసాధ్యం. ఈకారణం వలననే క్రీస్తు అవిధేయ జనుల అపరాధాన్ని తాను స్వీకరించి పాపి స్థానంలో తానే శ్రమలనుభవించాడు. దైవ కుమారుని ప్రేమ, శ్రమలు, మరణం, పాపంయొక్క భయంకరత్వాన్ని చాటి, దానిశక్తి నుంచి తప్పించుకునే మార్గం ఉన్నత జీవితానికి నిరీక్షణ. మనం క్రీస్తుకు ఆత్మను సమర్పించుకోవటం ద్వారా తప్ప, వేరే విధంగా లేదని ఘోషిస్తున్నాయి. SCTel 24.2

మారు మనస్సులేని ప్రజలు నామకార్ధ క్రైస్తవుల గురించి ఇలా వ్యాక్యానిస్తూ తమ్మును తాము సమర్ధించుకొంటుంటారు. “నేను వాళ్ళకన్నా చెడ్డవాణేమికాను” ఆత్మ, త్యాగం, స్థిరబుద్ధి, ప్రవర్తన విషయంలో జాగరూకత సందర్భంగా నాకన్నా వాళ్ళేమి అధికులుకారు. నాకు మాత్రం వాళ్ళు సుఖలాలసులే’. తమ విధి నిర్వహణ లోపాలకి వారు ఇలా ఇతరుల లోపాల్ని సాకులుగా చూపుతుంటారు. ఇతరుల దోషాలు, మోసాలు ఎవరికీ నిష్కృతి కలిగించలేవు. దోషపూరితమెన్ల మానవ దారిని మనకు ప్రభువివ్వలేదు. మన ఆదర్శం కళకంలేని పెద్ద కుమారుడు. నామ మాత్రపు క్రైస్తవుల దోషాల్ని వేలెత్తి చూపేవారంతా మెరుగైన జీవితాలు జీవిస్తూ ఉన్నతాదర్శాలుగా నిలవాలి. క్రైస్తవుడు జీవించాల్సిన జీవితం గురించి తమకంతటికి ఉన్నతాభిప్రాయముంటే వారి పాపం మరింత ఘోరమయిందికాదా? ఏది ఉత్తమమో అది వారికి తెలుసు. అయినా అది వారు చేయరు. SCTel 25.1

వాయిదా వేయడం విషయమే జాగ్రత్తగా ఉండండి. మీ పాపాన్ని విడిచిపెట్టి యేసు ద్వారా హృదయశుద్ధి కోరికను వాయిదా వేయకండి. ఈ విషయంలో వేలాది ప్రజలు తప్పటడుగువేసి నిత్య నాశనంకొని తెచ్చుకుంటున్నారు. SCTel 25.2

ఇక్కడ స్వల్పాయువు, అనిశ్చత, జీవితం గురించి ప్రస్థావించటం నాకిష్టంలేదు. కాకపోతే విజ్ఞాపన చేస్తున్న దేవాత్మ స్వరాన్ని వినిపించుకోకుండా పాపంలో జీవించేందుకు ఎన్నుకోడంలో భయంకర ప్రమాదం - ప్రజలు సరిగా అర్థంచేసుకోని ప్రమాదం ఉంది. అట్టివారికి ఈ జాప్యం, స్వల్పాయువు అనిశ్చత జీవిత ప్రమాదం వాస్తవమైందే. పాపం ఎంత చిన్నదిగా అనిపించినా అది నిత్య నాశనానికి నడిపించే ప్రమాదముంది. మనం దేన్ని జయించలేమోఅది మనల్నిజయిస్తుంది, మనల్ని నాశనం చేస్తుంది. SCTel 25.3

దేవుడు నిషేధించిన పండు తినడం లాంటి స్వల్ప విషయం, ఆయన ప్రక టించిన తీవ్ర పరిణామాలకు దారితీయదని ఆదాము, హవ్వ భావించారు. మరి ఈ చిన్న విషయం చిన్నదేమీకాదు. అది మార్పులేని దేవ ధర్మ శాస్త్రాన్ని అతిక్రమించటం. ఆ అతిక్రమణ మానవుణ్ణి దేవుని నుంచి వేరుచేసి ఈలోకంమీదికి దుఖ:0, మరణం, వరదలా విరుచుకుపడడానికి తలుపులు తెరిచింది. మానవుడి అవిధేయత ఫలితంగా సృష్టియావత్తు ప్రసవ వేదనతో చేస్తున్న ఆక్రందన యుగం వెంబడి యుగంలో భూమిమీదనుంచి పైకి లేస్తునే ఉన్నది. దేవునిపై మానవుడి తిరుగుబాటు పర్యవసానాలు పరలోకాన్నే కుదిపివేశాయి. దైవ ధర్మశాస్త్రం ఉల్లంగనకు ప్రాయశిత్తంగా అగత్యమైన మహత్తర బలయాగానికి కల్వరి స్మారక చిహ్నంగా నిలుస్తుంది. పాపం స్వల్ప విషయంగా పరిగణించుకుందాముగాక! SCTel 26.1

ధర్మశాస్త్రాన్ని అతిక్రమించటం, క్రీస్తుకృపను నిర్లక్ష్యం చేయడం లేదా నిరాకరించటం మీరు చేసిన ప్రతిసారి మీలో మార్పు కలుగుతుంది. అది హృదయాన్ని కఠినపర్చి, చిత్తాన్ని భ్రష్టం చేసి, అవగాహనను మందగిల్ల జేసి పరిశుద్ధాత్మ విజ్ఞాపల్ని విని ఆచరించేందుకు మీ ఆసక్తి తగ్గించడమేకాకుండా క్షీణింపజేస్తుంది. SCTel 26.2

తాము కోరుకున్నప్పుడు తమ దుర్వర్తనను మార్చుకోగలమని, కృప పొందడానికి వస్తున్న ఆహ్వానంతో ఆటలాడవచ్చునని, అలాంటి తరుణాలు మళ్ళీమళ్ళీ వస్తునే ఉంటాయని తలస్తూ అనేకమంది తమ అంతరాత్మల్ని శాంత పర్చుకుంటారు. ఆత్మ ఇచ్చే కృపను తోసివేసి సాతానుతో చేయి కలిపిన అనంతరం అత్యవసర పరిస్థితిలో తమ పంథాను మార్చుకోగలమని వారు భావిస్తారు. ఇది అంత సులభంగా జరిగే పని కాదు. జీవిత కాలంలో గడించిన అనుభవం, విద్య ప్రజల ప్రవర్తనను ఎంతగానో ప్రభావితం చేసిన కారణంగా యేసు స్వరూపం కావాలని ఆశించే వారు బహు కొద్దిమందే. SCTel 26.3

ప్రవర్తనలో ఒక్క చెడు గుణం, ఒక్క పాపేచ్చకు బానిస అయితే అది క్రమేపి సువార్త శక్తిని నిరుపయోగంచేస్తుంది. ప్రతీ పాపక్రియ ఆత్మలో దేవుని పట్ల ద్వేషం పెంచుతుంది. దేవుని పట్ల తీవ్ర అవిశ్వాసాన్ని లేదా దైవ సత్యమంటే తీవ్ర నిరాసక్తతను కనపర్చే వ్యక్తి తాను “ఏంపంటను విత్తాడో ఆ పంటనే కోస్తున్నాడు” దుష్టుని దోషములు వానిని చిక్కులో పెట్టును ‘’(సామెతలు5:22) అంటూదుర్మార్ధతతో చెలగాటమాడరా దన్న హెచ్చరికకన్నా భయంకరమైన్ల హెచ్చరిక బైబిలు అంతటిలోనూ మరొకటి లేదు. SCTel 26.4

మనకు శాపంనుంచి విముక్తి కలిగించడానికి క్రీస్తు సంసిద్ధుడు. అయినా మన చిత్తాన్ని ఆయన ఎన్నడు ఒత్తిడి చేయడు. పదే పదే అతిక్రమణ జరగటం వల్ల చిత్తం పూర్తిగా దుర్మార్గతకు అలవాటు పడగామనం పాప విముక్తిని కాంక్షించక, దేవునికృపను అంగీకరించకుండా ఉంటే, ఆయన ఇంకేమి చేయగలడు? ఆయన ప్రేమను ససేమిరా వద్దనడంద్వారా మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాము. “అనుకూల సమయ మందు నీ మొరాలకించితినీ, రక్షణ దినమందు నిన్ను ఆదు కొంటిని” నేడు మీ రాయన శబ్దమును వినిన యెడల, మీ హృదయములను కఠిన పర్చుకొనకుడి” (2కొరి6:2, హెబ్రి3:7,8). SCTel 26.5

“మనుష్యులు లక్ష్య పెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు”(1సాము16:7) అనగా సంతోషం, దుఖ:0 వంటి విరుద్ద భావోద్వేగాలతో నిండిన హృదయం; ఎంతో మోసానికి, కుళ్ళు కుట్రకు నెలవెన్ల సంచల, అవిధేయ హృదయం, దని ఉద్దేశాలు, ఆశలు, లక్ష్యాలు ఆయనకు తెలుసు. మరకలు పడ్డ మీ ఆత్మతో ఆయన వద్దకు వెళ్ళండి. ఈ రచయిత వలే మీ హృదయ ద్వారలు ఆయన చూసేందుకు తెరిచి ఇలా కోరండి, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. మీకాయాస కరమైన మార్గము నాయందున్నదేమోచూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము” (కీర్తనలు 139:23,24). SCTel 27.1

హృదయశుద్దిలేనప్పుడు అనేకులు పైకి భక్తిగా కనిపించే మానసిక మత తత్వాన్ని అంగీకరిస్తారు. ‘’దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము. నా అంతరంగములో స్థిరమైన్ద మనస్సును నూతనముగా పుట్టించుము” (కీర్తనలు51:10) ఇది మీ ప్రార్ధన కానివ్వండి. మీ సొంత ఆత్మ విషయములో యదార్థముగా వ్యవహరించండి. ప్రాణానికే ముప్పు వాటిల్లినప్పుడు ఎంత నమ్మకంగా, ఎడ తెరిపి లేకుండా కృషి చేస్తారో అలా వ్యవహరించండి. ఇది మీకు, దేవునికి మధ్య పరిష్కారం కావలసిన విషయం; నిత్య కాలానికి పరిష్కృతం కావలసిన సంగతి. ఊహజనిత నిరీక్షణ వల్ల నాశనం తథ్యం. SCTel 27.2

ప్రార్ధనా పూర్వకంగా దేవుని వాక్యం చదవండి. దేవుని ధర్మ శాస్త్రంలోను, క్రీస్తు జీవితములోను, పరశుద్ధతను గూర్చిన సూత్రాల్ని అది మీ ముందు పెడుతుంది. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభును చూడడు”(హెబ్రీ 12:14), అది పాపాన్ని గూర్చిన గుర్తింపు కలిగించి రక్షణ మార్గాన్ని బయలు పర్చుతుంది. మీ ఆత్మతో మాట్లాడుతున్న దైవ స్వరంగా దాన్ని గుర్తించండి. SCTel 27.3

మీరు పాపం యొక్క దుష్టత్వాన్ని గ్రహించినప్పుడు, మీరు మీ వాస్తవిక స్థితిని తెలుసుకొన్నప్పుడు, నిరాశ, నిస్పృహలకు లోను కావద్దు. పాపుల్ని రక్షించేందుకే ? యేసు వచ్చాడు. మనం దేవునిని మనతో సమాధాన పర్చుకోలేము. అదెంత గొప్ప ప్రేమ! దేవుడే క్రీస్తునందు “‘లోకమును తనతో సమాధాన పర్చుకొన్నాడు’‘ (2కొరి 5;19). తన కరుణా వాత్సల్యాలతో ఆయనే తప్పులు చేస్తున్న తన పిల్లలను వెదుకుచున్నాడు. తాను రక్షింపజూస్తున్న వారి తప్పిదాలు పొరపాట్ల విషయములో దేవుడు చూపిస్తున్న ఓర్పు సహనం ఈ లోకంలో ఏ తండ్రి తన బిడ్డల సందర్భంగా చూపించటం సాధ్యంకాదు. తప్పిదస్తునితో ఇంతకన్నా ఎక్కువ ప్రేమగా శతపోరే వారుండరు. దారితప్పి సంచరించే వారికి ఆయన చేసే విజ్ఞప్తుల కన్నా ఎక్కువ సుతిమెత్తని విజ్ఞప్తులు ఎవరూ చేయలేరు. ఆయన వాగ్దానాలు ఆయన హెచ్చరికలు ఎనలేని ప్రేమతో నిండివస్తున్నవి. SCTel 27.4

మీరు ఘోర పాపాలు చేసిన వ్యక్తింటూ సాతాను మీ వద్దకు వచ్చినప్పుడు మీ విమోచనకు యేసు వంక చూసి ఆయన గుణ శీలాన్ని గురించి మాట్లాడండి. ఆయన ప్రకాశతను తిలకిస్తే మీకు సహాయం దొరుకుతుంది. మీరు పాపి అని అంగీకరించండి. కాని “పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను’‘ (1తిమోతి 1:15) అని ఆయన అనున్య ప్రేమవల్ల మిమ్మల్ని రక్షిస్తాడని ఆ విరోధితో చెప్పండి. ఇద్దరు రుణస్తులను గురించి యేసు సీమోనును ఒక ప్రశ్న అడిగాడు. ఒకడు తన యజమానికి తక్కువ సొమ్ము ఇంకొకడు ఎక్కువ సొమ్ము అచ్చివున్నారు. యజమాని వారిద్దరిని క్షమించేశాడు. ఈ ఇద్దరిలో ఏ రుణస్థుడు తన యజమానిని ఎక్కువగా ప్రేమిస్తాడు? అని సీమోనును యేసు ప్రశ్నించాడు. “అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే’‘ (లూకా 7:43) అని సీమోను బదులు పలికాడు. మనం మహా పాపులం. మన పాపాలకు క్షమాపణ కలిగేందుకుగాను క్రీస్తు మరణించాడు. మన పక్షంగా తండ్రికి సమర్పించడానికి ఆయన చేసిన బలిదానిం యోగ్యతలు చాలు. ఆయన ఎవర్ని ఎక్కువ క్షమించాడో వారు ఆయనను ఎక్కువ ప్రేమించి, తన మహత్తర ప్రేమ, ఎనలేని త్యాగం నిమిత్తం ఆయనను కొనియాడడానికి ఆయన సింహాసనానికి అతి సమీపంగా నిలిచివుంటారు. మనం దేవుని ప్రేమను అవగతంచేసుకున్నప్పుడే పావం యొక్క నీచత్వాన్ని క్షుణ్ణంగా అర్ధం చేసుకో గలుగుతాము. మనకోసం క్రిందికి దించబడ్డ గొలుసు నివిడిని చూసినప్పుడు, మనపక్షంగా క్రీస్తు చేసిన మహా త్యాగాన్ని కొంతవరకుగ్రహించనప్పుడు ప్రేమతోనూ, పశ్చాత్తాపంతోను హృదయం కరిగిపోతుంది. SCTel 28.1