క్రీస్తు యొద్దకు మెట్లు
8వ అధ్యాయం - క్రీస్తు పోలికగా పెరుగుదల
హృదయ పరివర్తన వలన మనం దేవుని పిల్లలమౌతాం. ఈ పరివర్తనను బైబిలు జన్మ అంటుంది. ఇంకా ఇది వ్యవసాయదారుడు విత్తిన మంచి విత్తనం మొలక ఎత్తడాన్ని పోలి ఉన్నది. అలాగే క్రీస్తును కొత్తగా అంగీకరించినవారుక్రీస్తునందు స్త్రీ, పురుషులుగా ఎదుగు” నిమిత్తం “కొత్తగా జన్మించిన శిశువులు”ను పోలి ఉన్నారు. (ఎఫెసి 4:15;1వ పేతురు 2:2) పొలంలో చల్లిన మంచి విత్తనాల వలే వారు పెరిగి మంచి పంటనివ్వాల్సి ఉన్నారు. “యెహోవా తన్ను మహిమ పర్చుకొనునట్లు నీతి అను మస్తకి వృక్షములన్నియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరుపెట్టబడును” (యెషయా 61:3) అంటున్నాడు. SCTel 52.1
యెషయా మర్మ సత్యాన్ని గ్రహించడానికి మనకు తోడ్పడేందుకు ప్రకృతి నుంచి సాదృశ్యాలు ఎన్నో ఉన్నాయి. SCTel 52.2
మానవుడి విజ్ఞానం, నైపుణ్యం, ప్రకృతిలోని అతి సూక్ష్మ జీవికి ప్రాణం పోయలేవు. దేవుడిచ్చిన ప్రాణం మూలంగానే వృక్షంగాని, జంతువుగాని జీవించ గలుగుతున్నాయి. అలాగేదేవునివద్ద నుంచి వచ్చే జీవం ద్వారానే మానవ హృదయాల్లో ఆధ్యాత్మిక జీవితం పుడుతుంది. ఒకడు “పైనుండి జన్మించితేగాని” (1యోహాను 3:3) క్రీస్తు ఇవ్వడానికి వచ్చిన జీవంలో పాలిభాగస్తుడు కాజాలడు. SCTel 52.3
జీవం విషయంలో ఎలాగో, పెరుగుదల విషయంలోనూ అలాగే మొగ్గను పువ్వు, పువ్వును పండుచేసేది దేవుడే. ఆయన శక్తివల్లనేవిత్తనం ‘’మొదటి మొలకును, తరువాత వెన్నును అటు తరువాత వెన్నులో ముదురుగింజలను” (మార్కు4:28) ఉత్పత్తిచేస్తుంది. SCTel 52.4
ఇశ్రాయేలు గురించి హోషేయ ప్రవక్త ఇలా అంటున్నాడు, ‘’తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధినొందును ‘’ధాన్యము వలే తిరిగి మొలుతురు, ద్రాక్షచెట్టువలే వారు వికసింతురు’‘ (హో షేయ 14:5-7). “పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి” (లూకా 12:27) అంటున్నాడు యేసు. మొక్కలు పువ్వులు తమ సొంత శ్రద్ధ, చింత, కృషివల్ల పెరగవు. అవి బ్రతకడానికి దేవుడు ఏర్పాటు చేసిన పోషణను స్వీకరించటం ద్వారా జీవిస్తాయి. పసిపాప తన సొంత శక్తివల్ల, ఆలోచన వల్ల పెరుగుదల సాధించలేదు. అలాగే మీ సొంత కృషి చింతద్వారా మీరు ఆధ్యాత్మిక పెరుగుదలను సాధించటం సాధ్యంకాదు. తన పెరుగుదలకు దోహదపడే గాలి, సూర్యరస్మి, ఆహారంవంటి పోషకాల్ని పరిసరాల నుంచి పొందటం ద్వారానే మొక్కగాని, చంటిపాపగాని పెరగటం జరుగుతుంది. మొక్కలకి, జంతువులకు ఈ సదుపాయాలు సమకూర్చుతున్న ప్రకృతి ఎలాగో తనయందు విశ్వాసముంచే ప్రజల విషయంలో క్రీస్తు అలాగే. ఆయనే వారికి “నిత్యవెలుగు” (యెషయా 60:19) సూర్యుడు కేడెమును’‘ (కీర్తనలు 84:1) చెట్టునకు మంచుఉన్నట్లునేనతనికి (ఇశ్రాయేలు) ఉందును.’‘ (హోషేయా14:5) గడ్డికోసిన బీటి మీద కురియు వానవలె... అతడు విజయము చేయును” (కీర్తనలు 72:6) ఆయన జీవజలం. ‘’పరలోకమునుండి దిగివచ్చిన లోకమునకు జీవమునిచ్చు ఆహారము” (యోహాను 6:33). SCTel 52.5
సాటిలేని తన పుత్రదానంలో దేవుడు సర్వలోకాన్ని తన కృపావాతావరణంతో ఆవరించాడు. భూమండలాల్ని ఆవరించివున్న వాయువు ఎంత నిజమైందో అంత వాస్తవమైందో కృపావాతావరణం. ప్రాణధారమైన ఈవాతావరణాన్ని పీల్చుకోవడానికి ఈఎంపిక చేసుకునే వారందరూ జీవించి యేసుక్రీస్తును పోలిన స్త్రీ పురుషులుగా పెరుగుతారు. SCTel 53.1
ప్రకాశవంతమైన సూర్య కిరణాలు తన సౌందర్యాన్ని సౌష్టవాన్ని పెంపొందించేందుకు గానుపుష్పం సూర్యుడి తట్టు ఎలా తిరిగుతుందో అలాగే మన ప్రవర్తన క్రీస్తు ప్రవర్తనకు లాగే రూపుదిద్దుకునేందుకు మనం నీతి సూర్యుని తట్టుకు తిరగాల్సి ఉన్నాం. SCTel 53.2
“నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే యేలాగు ఫలింపదో అలాగేనాయందు నిలిచియుంటేనేగాని మీరు ఫలింపరు. నాకువేరుగావుండిమీరేమిచేయలేరు” (యోహాను 15:4,5) అన్నప్పుడు యేసు ఈ సత్యాన్ని బోధిస్తున్నాడు. SCTel 53.3
కొమ్మలు విరిగిన ఫలాలు ఫలించడానికి అవి చెట్టుమీద ఆధారపడడం ఎంత అవసరమో పరిశుద్దంగా జీవించడానికి మీరు క్రీస్తుమీద ఆధారపడడం అంతే అవసరం. ఆయనకు వేరుగావుండి మీరు జీవించలేరు. శోధనను జయించడానికి గాని కృపలో పరిశుద్ధంగా పెరగడానికి గాని మీకు శక్తి లేదు. ఆయన యందు నిలిచి ఉంటేనే మీరు పెంపారగలరు. ఆయనలో నుంచి జీవాన్ని పొందుతుంటే మీరు ఎండిపోవటంగాని, ఫలించటంగాని జరగదు. మీరు నీటి కాలువల ప్రక్కనాటిన చెట్టులా వృద్ధిచెందుతారు. SCTel 53.4
ఈ ప్రక్రియలో కొంత భాగం తాము ఒంటరిగా నిర్వహించటం అవసరమని భావించేవారు చాలామంది ఉన్నారు. క్రీస్తుద్వారా పాప క్షమాపణ కలుగుతుందని వారు విశ్వసిస్తారు. అయినాతమ సొంత కృషి వలన నీతి జీవితం జీవించడానికి ప్రయత్నిస్తారు. SCTel 54.1
అలాంటి ప్రతిప్రయత్నంవిఫలమౌతుంది. “నాకువేరుగావుండిమీరేమిచేయలేరు’‘ అంటున్నాడు యేసు. కృపలో మన పెరుగుదల, మన సంతోషం, మన ప్రయోజకత్వం క్రీస్తులో మన ఐక్యతమీద ఆధారపడివుంటాయి. ఆయనలో నిలిచివుంటూ ప్రతిరోజూ, ప్రతీఘడియ క్రీస్తుతో సహవాసం కలిగిఉండడంద్వారా మనం కృపలో పెరగ వలసిఉన్నాం. SCTel 54.2
మన విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడు ఆయనే. అన్ని సమయ సందర్భాలలోను మొదటివాడు, కడపటివాడు ఆయనే. మనపరుగుకి ఆదిలోను అంతములోను మాత్రమే గాక, మార్గంలో ప్రతీ అడుగున ఆయన మనతో ఉండాలి. ‘’సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శమందున్నాడు. గనుక నేను కదల్చబడను”(కీర్తనలు 16:8) అంటున్నాడు దావీదు. SCTel 54.3
“నేను క్రీస్తులో ఎలా నిలిచి ఉండాలి?” అన్న ప్రశ్న మీలో ఉత్పన్నమౌతుందా? ముందు ఆయనను ఎలా అంగీకరించాలో అలాగే ‘’మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా... ఆయన యందు నడుచుకొనుడి’‘ “నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును” (కొలస్స 2:6,: హెబ్రి10:38). పూర్తిగా ఆయనకు చెందియుండడానికి, ఆయనను సేవించి ఆయనకు విధేయుడే జీవించడానికి మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకొన్నారు. క్రీస్తును మీ స్వరక్షకునిగా అంగీకరించారు. మీ పాపాలకు మీరు ప్రాయశ్చిత్తం చెల్లించలేరు. మీ మనస్సును మీరు మార్చుకోలేరు అయితే మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకొన్నారు. గనుక దేవుడు క్రీస్తునుబట్టి ఇదంతా మీకోసం చేస్తాడని మీరు విశ్వసించారు. విశ్వాసమూలంగా మీరు క్రీస్తుకు చెందినవారు. విశ్వాసమూలంగా మీరు ఆయన పోలికలో పెరగాలి. ఇవ్వడం, పుచ్చుకోవడం ద్వారా మీరు మీకున్నదంతా ఇవ్వాలి. మీ హృదయంలో నివాసముండడానికి మీ బలమే ఉండడానికి మీనీతి, మీ నిత్య సహాయకుడు అయి ఉండ డానికి-ఆచరించేందుకు శక్తినివ్వడానికి-క్రీస్తును, ఆయనసకలదీవెల్ని అంగీక రించాలి. SCTel 54.4
ఉదయాన్నే మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి. ఇది మీ ప్రథమ విధిగా భావించండి. ఇలా ప్రార్ధన చేయండి, “దేవా, నన్ను పూర్తిగా నీవాడిగా స్వీకరించు. నా ప్రణాళికలన్నిటినీ, నీవద్ద పెడుతున్నాను. నన్ను ఈ రోజు సేవలకు ఉపయోగించుకో నన్నెడును ఎడబాయకు. నేను చేసే పనంతా నీద్వారానే జరగనీ” ఇదీ దినదినం జరగాల్సిన పని. ప్రతిదినం మిమ్మల్ని మీరు దేవునికి అంకితం చేసుకోండి. మీ ప్రణాళికలన్నీ ఆయనముందుపెట్టండి. ఆయన చిత్తాననుసరించి అవి కొనసాగడమో ఆగి పోవడమో జరగాలి. ఇలా రోజురోజుకు మీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తే మీరు క్రీస్తు పోలికకు క్రమక్రమంగా మార్పు చెందుతారు. SCTel 54.5
క్రీస్తులో ఉన్న జీవితం ప్రశాంత జీవితం, ఉద్రేకం, ఉద్వేగం ఉండకపోవచ్చు. కాని స్థిరమైన, శాంతికరమైన్ల విశ్వాసం అవసరం. మీ నిరీక్షణ మీలో లేదు. మీ నిరీక్షణ క్రీస్తులోవుంది. మీ బలహీనత ఆయన బలంతో, మీ అవివేకం ఆయన వివేకంతో, మీదుర్భలత ఆయన శక్తితో జత పడతాయి. గనుక మీరు మీపై ఆధారపడనక్కరలేదు. మీ మనసు స్వార్ధాలోచనలు మాని క్రీస్తుపై దృష్టి నిలపాలి. క్రీస్తు, ప్రేమ, సౌందర్యం, సంపూర్ణత, శీలంపే మనస్సు ధ్యానించాలి. తన్నుతాను ఉపేక్షించుకోవడంలో క్రీస్తు తన్నుతాను తగ్గించుకోవడంలో క్రీస్తు, పవిత్రత, పరిశుద్ధతలతో క్రీస్తు, సాటిలేని ప్రేమలో క్రీస్తు ఆత్మ ధ్యానించాల్సిన అంశం ఇదే. ఆయనను ప్రేమించటం, అనుకరించటం, ఆయనపైపూర్తిగాఆధారపడడం ద్వారానేమీరు ఆయన పోలికకు పరివర్తన చెందకలుగుతారు. ‘’నాయందు నిలిచియుండిడి’‘ అంటున్నాడు యేసు. ఈ మాటలను విశ్రాంతి, స్థిరత, విశ్వాసాన్ని సూచిస్తున్నాయి.” నాయొద్దకురండి, నేను మీకు విశ్రాంతినికలుగ జేతును’‘ (11:28) అంటూ ఆయన ఆహ్వానిస్తున్నాడు. కీర్తన రచయిత మాటలుకూడ ఇదే భావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. “యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుము’‘ (కీర్తనలు37:7). యెషయా ఈ నిశ్చయతను ఉద్ఘటిస్తున్నాడు. ‘‘మీరు మరలివచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు’‘ (యెషయా 30:15) ఈ విశ్రాంతి నిష్కియలో లేదు. రక్షకుని ఆహ్వానములో విశ్రాంతి వాగ్దానం, పనికి పిలుపుతో సంయుక్తమైయుంది: ‘’నాకాడి ఎత్తుకొని... నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును” (మత్తయి 11:29) క్రీస్తులో సంపూర్ణ విశ్రాంతి పొందేవారు ఆయన సేవలలో అత్యంత ఉద్రేకముగా, చురుకుగా నిమగ్నులైవుంటారు. SCTel 55.1
మనసు స్వార్ధంతో నిండినప్పుడు జీవానికి, శక్తికి నిలయమైన క్రీస్తుకు అది దూరమౌతుంది. అందుచేత మన గమనాన్ని రక్షకునిమీదనుంచి మళ్ళించి, క్రీస్తుతో ఆత్మకు సంబంధం లేకుండా చేయడానికి సాతాను నిర్వరామంగా కృషి చేస్తాడు. లోక భోగాలు, జీవితంలోని చింతలు, సమస్యలు దుఖాలు, ఇతర దోషాలు లేదా స్వీయ దోషాలు లోటుపాట్లు - వీటి పెక్తి లేక వీటిలో కొన్నింటి పెకై మనసు మళ్ళిస్తాడు. సాతాను వలలో పడవద్దు. మనస్సాక్షి కలిగి భక్తిగా నివశించగోరే అనేకుల్ని తమ తప్పిదాల గురించి, బలహీనతలగురించి ఆలోచించేటట్లు చేసి, ఇలా క్రీస్తుకి, వారికి మధ్య అగాధం, సృష్టించి జయంసాధించ జూస్తాడు. మనం స్వార్ధ ప్రయోజనాలకి పెద్దపీట వేయకూడదు. మాకు రక్షణ ఉన్నదా లేదా అన్నభయాందోళలకు లోనుకాకూడదు. ఇదంతా ఆత్మను దేవునికి దూరంగా ఉంచుతుంది. మీ ఆత్మను దేవునికి అప్పగించి ఆయనపై నమ్మకం ఉంచండి. యేసు గురించి మాట్లాడండి, ఆలోచించండి. స్వార్ధాలోచనలకు స్వస్థి పలకండి. సందేహాన్ని సాగనంపండి. భయాన్ని భర్తరఫ్ చేయండి. అపొస్తులుడు పౌలుతో గొంతుకలిపి ఇలా పలకండి,” ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు’‘ నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నాకొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను” (గలతీ 2;20) దేవునియందు విశ్రాంతి పొందండి, మీరు ఆయనకు అప్పగించినదాన్ని భద్రంగా ఉంచడానికి ఆయన సమర్థుడు. ఆయన చేతులకు మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే మిమ్మల్ని ప్రేమించిన క్రీస్తు ద్వారా మీకు ఆయన అత్యధిక జయం అనుగ్రహిస్తాడు. SCTel 55.2
క్రీస్తు మానవ స్వభావాన్ని స్వీకరించినపుడు మానవాళి తనతో ప్రేమ బంధంతో అనుసంధానం చేసుకున్నాడు. ఈ ప్రేమ బంధాన్ని ఏ శక్తీ ఎన్నడూ తెంచలేదు. మానవుడే తన సొంత నిర్ణయం చొప్పున దాన్ని తెంచుకోగలడు. ఈ బంధాన్ని తెంచివేసి క్రీస్తు తో తెగతెంపులు చేసుకోవడానికి మనల్ని ప్రేరేపించేందుకు సాతను మన ముందున్న ఎన్నో ఆశలు, ఆకర్షణలు ఉంచుతున్నాడు. మనం మెళుకువగా ఉండవలసింది ఇక్కడే. వేరొక ప్రభువును ఎంపిక చేసుకోవడానికి మనల్ని ఏ శక్తీ మోసపుచ్చకుండా మనం మెళుకువగావుండి, ప్రార్థించాలి. మన దృష్టి క్రీస్తుపై కేంద్రీకృతమైయుండాలి. అప్పుడు ఆయన మనల్ని లాగుకోగలిగేవారెవరూ లేరు. ఎలప్పుడు ఆయనను వీక్షించడంలో మనం ‘‘మహిమనుండి అధికమహిమనుపొందుచు, ప్రభువు ఆత్మచేత ఆపోలికగానే మార్చ బడుచున్నాము. “(2వకొరింథీ 3:18). SCTel 56.1
తొలి దినాల శిష్యులు తమ ప్రియతమ రక్షకుని పోలికను ఇలా సాధించారు. వారు యేసు మాటలు విని, తమ అవసరం ఏమిటో గుర్తించారు. ఆయనను అన్వేషించారు, కనుగొన్నారు, అనుసరించారు. గృహంలో, బల్లవద్ద, గదిల, పొలంలో వారు ఆయనతో ఉన్నారు. ఉపాధ్యాయుడితో విధ్యార్ధులుండే రీతిగా వారు ఆయనతో ఉండి, ప్రతిదినం ఆయన నోటి నుంచి సత్యమనే పాఠాలు నేర్చుకున్నారు. తమ వీధులేమిటో తెలుసుకోవడానికి సేవకులు తమ యజమానితో ఎలా మసులుకుంటారో, అలా ఆయనపట్ల మసులుకున్నారు ఆ శిష్యులు. “మనవంటి స్వభావముగల” మనుషులే (యాకోబు 5:17). మనలాగేవారుకూడపాపంతో పోరాడారు. పరిశుద్ధంగా జీవించేందుకు ఇదే కృప వారికీ అగత్యమయింది. రక్షకుని పోలికను మిక్కిలి సంపూర్ణంగా ప్రతిబింబించిన ప్రియ శిష్యుడు యోహానుకు సైతం గుణ సౌందర్యం స్వభావసిద్దంగా రాలేదు. ప్రతిష్టకోసం పట్టుదల, గాఢమైన వాంఛమాత్రమే గాకుండా హాని కలిగినప్పుడు దుందుడుకుతనం, ఆక్రోషం ప్రదర్శించాడు. కానీ దైవ ప్రదర్శనను తిలకించినపుడు తన కొరత ఏమిటో తెలుసుకొని వినయవంతుడయ్యాడు. దైవ కుమారుని దైనందిన జీవితంలో తాను చూసిన బలం, ఓర్పు, శక్తి, కనికరం, ఠీవి, అణుకువ యోహాను హృదయాన్ని ప్రేమాభినందనలతో నింపాయి. రోజురోజు తన హృదయం యేసుకు ఆకర్షితమయి చివరకు రక్షకుని ప్రేమలో తనస్వార్ధమంతా మటుమాయమయింది. ఆగ్రహం, దురాశలతో కూడిన తన మనస్తత్వం మార్పును కలిగించే క్రీస్తు శక్తికి సమర్పితమయింది. పరిశుద్ధాత్మ పునర్జీవప్రభావంఅతడి హృదయాన్ని నవీనం చేసింది. క్రీస్తు ప్రేమ శక్తి ప్రవర్తనలో పరివర్తన కలిగింది. ఇది యేసుతో ఏర్పడ్డ స్నేహం ఫలితమే. హృదయంలో యేసు నివశిస్తే స్వభావమే మారిపోతుంది. క్రీస్తు ఆత్మ, హృదయాన్ని ప్రేమతో నింపి, ఆత్మను వశపర్చుకొనిఆలోచనలు, కోరికల్ని పరలోకం వైపుకు త్రిప్పుతాడు. SCTel 56.2
క్రీస్తు పరలోకానికి ఆరోహణుడైనప్పటికీ ఆయన ఇంకా తమతో ఉన్నట్లే ఆయన శిష్యులు భావించేవారు. అది ప్రేమతో వెలుగుతో నిండిన వ్యక్తిగత సన్నిధి. తమతో నడిచిన, మాట్లాడిన, ప్రార్ధించిన యేసు తమ హృదయాలకు నిరీక్షణ, ఆదరణ చేకూర్చిన యేసు ఇంకా తనవారికి సమాధాన వర్తమానాన్ని అందిస్తుండగానే వారి మధ్య నుంచి పరలోకానికి వెళ్ళిపోయాడు. దూత బృందం ఆయనను స్వాగత పూర్వకంగా స్వీకరిస్తుండగా ఆయన మధుర స్వర ప్రతి ధ్వనులు శిష్యుల చెవులకు వినిపించాయి. SCTel 57.1
“ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను” (మత్తయి 28:20). SCTel 57.2
మనవ పోలికతోనే ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆయన పరలోకానికి వెళ్ళినట్లు వారికి తెలుసు. ఆయన ఇంకా తన మిత్రుడు, రక్షకుడని, ఆయన ప్రేమ, సానుభూతులు మారలేదని, బాధిత మానవజాతి తన అస్మదీయులని ఆయన పరిగణ అని వారికి తెలుసు. తాను విమోచించిన నరుల రక్షణార్ధం తాను చెల్లించిన మూల్యానికి గుర్తుగా గాయపర్చబడ్డ తన చేతులు, కాళ్ళు చూపిస్తూ యేను తన సొంత రక్తపు విలువను దేవునికి సమర్పిస్తున్నాడు. తమకు విలాసాలు సిద్ధం చేయడానికి యేసు పరలోకం వెళ్ళాడని తనవద్ద నివశించేందుకు తమను తీసుకువెళ్ళడానికి మళ్ళీ వస్తాడని వారికి తెలుసు. SCTel 57.3
క్రీస్తు ఆరోహణానంతరం శిష్యులు సమావేశమైనప్పుడు, తండ్రి తమ మనవుల్ని యేసు పేరిట సమర్పించటానికి ఆతృతగావున్నారు. ప్రజల భక్తి, గౌరవాలతో వంగి ఈ నిశ్చయతతో ప్రార్ధన చేసారు. ‘’మీరు తండ్రిని నాపేరిట ఏమి అడిగినను మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమి నాపేరిట అడుగలేదు. మీసంతోషము పరిపూర్ణమగునటులు అడుగుడి, మీకుదొరకును’ ‘(యోహాను16:23, 24). శక్తివంతమైన ఈ వాదనతో వారు విశ్వాస హస్తాన్ని ఉన్నతంగా, మరింత ఉన్నతంగా చాపారు. చనిపోయిన క్రీస్తుయేసే, అంతేకాదు, మృతులలోనుండి లేచిన వాడును దేవుని కుడి పార్శమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే”(రోమా 8:34) ఆయన “మీతోకూడానివశించును” (యోహాను 14:17) అని ఎవరిగురించి యేసు చెప్పాడో ఆ ఆదరణ కర్త సన్నిధికి వారికి పెంచుకొస్తు అనుగ్రహించింది. ఇంకా ఆయన ఇలా అన్నాడు, ‘’నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్ళిన యెడల ఆదరణ కర్త మీ దగ్గరకురాడు, నేను వెళ్ళిన యెడల ఆయనను మీయొద్దకు పంపుదును” (యోహాను 16:7) తన బిడ్డల హృదయాల్లో ఇక నుంచి క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా నిత్యమూ నివశిస్తాడు. తాను వ్యక్తిగతంగా వారితో ఉన్నప్పటిక న్న ఇప్పుడు ఆయనతోవారి సంబంధం మరింత సన్నిహితంగా ఉంటుంది. అంతరంగంలో నివశిస్తున్న క్రీస్తు వెలుగు, ప్రేమ, శక్తి వారి ద్వారా ప్రకాశించగా వారిని చూసిన వారందరూ ఆశ్చర్యపడి వారు యేసుతో కూడ ఉండిన వారిని గుర్తెరిగిరి” (అ.కా. 4:13). SCTel 57.4
శిషులు ఏకమైయుండడానికి యేసుఏమైతే చేసాడో అదే ఈనాడు తన పిల్లలకు చేయాలని క్రీస్తు ఆశిస్తున్నాడు. ఎందుకంటే చివరి ప్రార్ధనలో ఆ చిన్న అనుచర బృందం తన చుట్టూ సమావేశమైయుండగా యేసిలా అన్నాడు, “వారి కొరకు మాత్రమునేను ప్రార్ధించుటలేదు, వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరును ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్ధించుచున్నాను” (యోహాను 17:20) యేసు మనకోసం ప్రార్ధించాడు. తాను తండ్రితో ఏకమైయున్న లాగే మనంకూడ తనతో ఏకమై ఉండాలని ఆ ప్రార్ధనలో ఆకాంక్షిస్తున్నాడు. ఇది ఎంత ముచ్చటైన కలయిక! SCTel 58.1
రక్షకుడు తన్ను గురించి తాను ఇలా చెప్పుకొంటున్నాడు: “కుమారుడు... తనంతట తాను ఏదియు చేయనేరడు; “తండ్రి నాయందు నివశించుచు తనక్రియలు చేయుచున్నాడు” (యోహాను 5:19,14:10) అలాగేనప్పుడు, క్రీస్తు మన హృదయాల్లో నివశిస్తుంటే, “ఇచ్చయించుటకును, కార్యసిద్ధి కలుగజేయుటకును “(ఫిలిప్పీ2:13). ఆయన మనలో కార్య సిద్ధి కలుగజేస్తాడు. అప్పుడు ఆయన పని చేసినట్లు మనం పని చేస్తాం. ఆయన స్ఫూర్తిని ప్రదర్శిస్తాం. ఇలా ఆయనను ప్రేమిస్తూ, ఆయన యందు నివశిస్తూ “క్రీస్తువలే ఉండుటకు మనమన్ని విషయాలలో ఎదుగుదుము”(ఎఫెసి 4:15). SCTel 58.2